“ఏమిటో... అందరి ఇళ్లలోనూ పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మన ఇంట్లో మోగేదెప్పుడో?” ఎదురు వచ్చిన భరత్‌ని చూస్తూ, పెళ్లి నుంచి వచ్చి పట్టు చీరైనా మార్చుకోకుండా నిష్టూరంగా అంది కృష్ణవేణి. “పెళ్లి ఘడియ తోసుకొస్తే అదే అవుతుంది లే అమ్మ. పెళ్లి బాగా జరిగిందా? మీ ఫ్రెండ్స్ అందరూ కలిశారా?” తల్లిని పొదివి పట్టుకుని కుర్చీలో కూర్చోపెడుతూ అన్నాడు. “నీకు నీ పెళ్లి విషయం చాలా తేలికగా అనిపిస్తోంది రా. కానీ అది మాకు ఎంత భారంగా తయారైందో నీకేం తెలుసు? ఆడపిల్లల తల్లులందరూ గర్వంగా తలెత్తుకుని మరీ వచ్చారు రా పెళ్లికి. ఎందుకు రారు? అందరూ తమ బాధ్యతలు నెరవేర్చి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నారు.”ఆవేశంగా మాట్లాడినందుకు దమ్ముతో గొంతు జీరబోయింది. “ఈ మంచినీళ్లు తాగి నెమ్మదిగా చెప్పు అమ్మ. నీ బాధ నా పెళ్లి కానందుకా? లేక నీ ఫ్రెండ్స్ పిల్లలకి పెళ్లిళ్లు అయిపోతున్నందుకా?” చేతికి గ్లాస్ అందిస్తూ నవ్వాడు భరత్. “అది కాదురా బన్నూ! ఒక్కగానొక్క కొడుకువి. నీ ముద్దు ముచ్చట చూడాలని మాకు కూడా ఉంటుంది కదా!” కొంచెం బ్రతిమాలుతున్నట్టుగా అంది. “అమ్మా! పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది. అందుకే మనసుకి నచ్చినట్టుగా ఏ అమ్మాయి దొరుకుతుందా అని తెగ ఆరాటపడుతున్నాను . కానీ అమ్మ ఈ మధ్య పెళ్లయిన నా బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లిళ్లయ్యాక వాళ్ల జీవితాలు కూడా సజావుగా జరగడం లేదని బాధపడుతున్నారు.”భరత్ గొంతులో నిరాశ వినిపించింది. “నిజమే రా భరత్. నువ్వన్న మాట నిజమే. కానీ నీ ఫ్రెండ్స్‌కి అలా జరిగిందని నువ్వు పెళ్లి లేట్ చేసుకుంటావా?”ఎప్పుడు వచ్చాడో గమనించలేదు. విశ్వం మావయ్య భరత్ మాటలు వింటూ,“పెళ్లి భోజనం ఎలా ఉంది అక్కా? పనిలో పని అక్కడ పందిట్లో వీడికి నచ్చిన పిల్ల ఎవరైనా ఉందేమో చూడలేకపోయావా?” అంటూ మేళమాడేడు. “అత్తయ్యకి నచ్చిందనో, బావకి పెళ్లి వయసు దాటిపోతోందనో మనం తొందరపడినా, ఈ కాలంలో అమ్మాయిలు పెళ్లికి అంత తొందరగా రెడీగా లేరు నాన్న,” బైక్ పార్క్ చేస్తూ చెప్పాడు రవి. “నిజమేరా రవి. అబ్బాయిలకి పెళ్లి కుదరడమే గగనమైపోతోంది. మీ నాన్నకి పాతికేళ్లు నిండకముందే పెళ్లయింది. మూడు పదులు దాటకుండానే ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు. ఒక్క మీ నాన్న ఏమిటి? అప్పుడు అందరూ అంతే. ఇప్పుడే ఈ విపరీతాలన్నీ. పిదప కాలం... పిదప బుద్ధులు,” కాఫీ చేతికి ఇస్తూ అంది కృష్ణవేణి. “అవును అక్కా. సామాజికంగా, ఆర్థికంగా అందరూ ఉన్నత స్థాయిలో బతుకుతున్నాం. అన్నీ సజావుగా జరుగుతాయి అనుకుంటే ఇప్పుడు ఆడపిల్లలు ‘మాకు జీవితంలో పెళ్లి ముఖ్యం కాదు’ అంటున్నారు. ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి, కుటుంబ పరిస్థితులు చక్కదిద్ది, సమాజ అభివృద్ధిలో తమ వంతు సాయం చేస్తారు అనుకుంటే ఇప్పుడు ఈ కొత్త పోకడ మొదలైంది. రేపు ఈ రవికి ఎన్ని సంబంధాలు చూడాలో!” కప్పు కింద పెడుతూ అన్నాడు విశ్వం. “నిజమే అన్నయ్య! ఒకప్పుడు ఆడపిల్లల పెళ్లి సమయంలో ఇలాంటి మాటలు వింటూ ఉండేవాళ్లం. ఇప్పుడు మగపిల్లలు ఉన్న ఇళ్లల్లో వినపడుతున్నాయి.” “ఇప్పటి యువత కష్టాల గురించి ఏమి చెప్పమంటావులే అత్తయ్య. పెళ్లయింది అని సంతోషపడేలోపు విడాకులు అంటున్నారు. కొంత స్థిరపడితే పిల్లలు కలగడం లేదని IVF సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అది సక్సెస్ అయితే అడ్మిషన్లు దొరకక స్కూళ్ల చుట్టూ తిరుగుతున్నారు,” కొంచెం వాతావరణం తేలిక చేస్తూ అన్నాడు రవి.అందరూ నవ్వారు. కానీ భరత్ మాత్రం పెళ్లిళ్లు విఫల మవడానికి మూల కారణం గురించి ఆలోచిస్తున్నాడు . “నిన్న బజారులో నాగరాజు వాళ్ల నాన్నగారు కనిపించి చెప్పారు. ఈ మధ్య లండన్‌లో పెళ్లి చేసుకున్న మీ ఫ్రెండ్ నాగరాజు, నీరజ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. బాగానే ఉండేవాళ్లు కదరా? ఏమైంది ప్రాబ్లమ్?” మా మాటలు వింటున్న గోపాలంగారు గది నుంచి వస్తూ అడిగారు. “ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లమ్ లే నాన్న. ఎవరు తగ్గడానికి రెడీగా లేరు. సర్ది చెప్పడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకోవడం చాలా తేలిక అయిపోయింది నాన్న. పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఆ వ్యవస్థ మీద ఎవరికీ గౌరవం లేదు,” నాగరాజు తీరు తెలిసిన భరత్ అన్నాడు. “అవునురా బన్నూ! న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకుంటున్నారు. వాళ్లకి ప్రైవసీ ఉండాలి. కానీ కొంచెం బంధం బలపడే వరకు అన్ని విధాలా కుటుంబ సభ్యులు ఆసరాగా ఉంటే దంపతుల మధ్య అంత భేదాభిప్రాయాలకు తావుండదు,” ఉమ్మడి కుటుంబాలకు ప్రతీక అయిన విశ్వం మావయ్య అన్నాడు. “నిజం చెప్పావురా విశ్వం! మన కాలంలో కూడా భార్యాభర్తల మధ్య అంత సఖ్యత లేకపోయినా ఇరువైపు బంధువులు ఆ బంధం నిలబడటానికి తమ వంతు కృషి చేసేవారు. అంతే కానీ విడాకులు, విస్తరాకులు అనే వారు కాదు,” కొంచెం విసురుగానే అంది కృష్ణవేణి. భరత్ ఇంతవరకూ మౌనంగా విన్నాడు.“అమ్మా...పెళ్లి అనేది మన జీవితంలో ఒక వేడుకేనా?పెళ్లి అంటే నాలుగు రోజులు జరిగే వేడుకలా చూస్తున్నాం. కానీ ఆ నాలుగు రోజులు అయిపోయిన తర్వాతే అసలు జీవితం మొదలవుతుంది కదా!”అందరూ అతని వైపు చూశారు. గోపాలంగారు ఆసక్తిగా చూశారు.భరత్ తండ్రి పక్కన కూర్చుని"నాన్న నాకు తెలిసినంతవరకు పెళ్లి చేసుకోవడం అంటే నాకు నచ్చిన అమ్మాయి దొరికింది, అమ్మాయికి నేను నచ్చాను అని చెప్పడం మాత్రమే కాదు. ఆమె జీవితంలోకి నేను వస్తున్నాను. ఆమె కూడా నా జీవితంలోకి వస్తోంది. అంటే అప్పటి వరకు ‘నేను’గా ఉన్న మనం ‘మనం’గా మారాలి. ఆ మార్పుకి నేను సిద్ధంగా ఉన్నానా అనేదే నాకు ముందుగా తెలియాలి.మీరేమి అంటారు నాన్న? "కృష్ణవేణి కొడుకువైపు ఆశ్చర్యంగా చూసింది. “అంత ఆలోచించేవాడివైతే ఎప్పటికి పెళ్లి చేసుకుంటావురా?” నవ్వుతూ అడిగింది. “నేను సిద్ధమైనప్పుడు, అమ్మా.భార్యమాత్రమే కావాలని అనిపించినప్పుడు కాదు. నేను కూడా భర్తగా ఉండటానికి సిద్ధంగా ఉన్నానని అనిపించినప్పుడు.”గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. గోపాలంగారు మెల్లగా నవ్వారు.“అదే అసలు ధర్మం రా.మన పెద్దలు జీవితాన్ని దశలుగా చూశారు కదా,” అన్నారు. “బ్రహ్మచర్యంలో చదువుకోవడం, నేర్చుకోవడం. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని నడపడం, బాధ్యతలు తీసుకోవడం. తర్వాతి దశల్లో మిగిలిన బాధ్యతలను తగ్గించుకోవడం. దశ మారినప్పుడు మనిషి ధర్మం కూడా మారాలి. కానీ ఇప్పుడు హక్కులు మాత్రం వెంట తెచ్చుకుంటున్నారు... బాధ్యతలు మాత్రం దారిలో వదిలేస్తున్నారు.”అని లేచి కొడుకు భుజం మీద చెయ్యి వేసి "పెళ్లి మీద దాని వలన జీవితం లో జరిగే మార్పుల మీద నీకు సరైన అవగాహన ఉండటం సంతోషం కలిగి స్తోందిరా"అన్నారు . "మంచిమాట చెప్పావు బావ పెళ్లికావాల్సిన యువతి యువకులు తప్పక తెలుసుకొనే ల్సిన విషయాలు ఇవన్నీ "అంటూ "నాకు అనిపిస్తున్న ఇంకో కారణం పెళ్లయిన వెంటనే భార్య తనను అర్థం చేసుకోవాలి కానీ తాము భార్యను అర్థం చేసుకోనే అవసరం లేదు అన్నట్టు వుంటారు . పిల్లలు పుట్టిన తర్వాత తండ్రిగా ఉండటం అంటే కేవలం డబ్బు సంపాదించి ఇంటికి ఇవ్వడం మాత్రమే అనుకుంటారు. పిల్లలతో మాట్లాడటం, వాళ్లకి సమయం ఇవ్వడం, వాళ్ల ఎదుగుదలలో భాగం కావడం కూడా తండ్రి బాధ్యతే!” తన మనసులోని భావాన్ని కూడా బయట పెట్టారు విశ్వం. “అదే నేను మీకు అందరికి ఎప్పటినుంచో మా ఆఫీస్ లో కొత్తగా చేరినదీప్తి అనే అమ్మాయి గురించి చెప్పాలని అనుకొంటున్నాను , .తన మాటలు ప్రవర్తన చూ స్తే నా మనసులోని భావాలకు దగ్గరగా వుంది అనిపిస్తోంది .ఈ మధ్యనే మాటలు కలిసాయి .ఒకరిని ఒకరు అర్థం చేసు కోవటానికి ప్రయత్నిస్తున్నాము .సందర్భం వచ్చింది కదా అని చెప్పాను” అన్నాడు భరత్. రవి నవ్వుతూ"భలే న్యూస్ చెప్పావు బావ. నువ్వు పెళ్లి చేసుకోకముందే మంచి భర్త, తండ్రి గా బాధ్యతలు కూడా తెలుసుకున్నాను అని చెప్పు అప్పుడు నువ్వే కావాలి అంటుంది. ”ఆటపట్టిస్తున్నట్టు అన్నాడు . “అవి పెళ్లయిన తర్వాత నేర్చుకోవాల్సిన విషయాలు కావు రా. ముందే తెలుసుకోవాల్సిన విషయాలు ,పద నీతో కొంచెం మాట్లాడాలి "అని ఇద్దరు వెళ్లిపోయారు. ******************* పెళ్లి గురించి తొందరపడుతున్న తనకు, కొడుకు మాత్రం పెళ్లి గురించి ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడన్న విషయం కృష్ణవేణికి కొత్తగా అనిపించింది. తన కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆత్రుతలో, అతను ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడో తెలుసుకోవాలన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదేమో అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం భరత్ దీప్తి ని ఇంటికి తీసుకొచ్చాడు. “అమ్మా... ఈమె నా ఫ్రెండ్ దీప్తి. నీకు, నాన్నకి పరిచయం చేద్దామనిపించింది.” “నమస్కారం ఆంటీ,” అంటూ దీప్తి చిరునవ్వుతో పలకరించింది. కొద్దిసేపటికే దీప్తి ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. కృష్ణవేణి కాఫీ తెస్తానని లేవగానే,“ఆంటీ... మీరు కూర్చోండి. నేను తీసుకొస్తాను,” అంటూ చనువుగా వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసింది. భరత్ లోపల నుంచి కాఫీ తీసుకొచ్చి తల్లికి అందించాడు.అది చూసి దీప్తి చూపులో ఒక చిన్న మెచ్చుకోలు కనిపించింది. కృష్ణవేణి కొడుకు మొహంలోకి చూసింది. అతని మాటల్లో, చూపులో దీప్తి అంటే ఏదో ప్రత్యేకమైన భావం ఉన్నట్టు అనిపించింది. కొద్దిసేపటికి వాళ్లిద్దరూ బయటికి వచ్చారు. “దీప్తి... నీకు నాతొ పెళ్లి గురించి ఏం అనిపిస్తుంది?” అడిగాడు భరత్. దీప్తి కొద్దిసేపు మౌనంగా వుంది .“పెళ్లి తర్వాత మనిషి తన జీవితాన్ని ఇంకొకరితో పంచుకోవాలి. తన జీవితంలోకి ఇంకొకరిని మనస్ఫూర్తిగా ఆవహ్యానించాలి .” అంటూ కొంచెం దగ్గరగా నడిచింది. “ఇప్పటివరకు మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తాం. పెళ్లయ్యాక ఇంకొక మనిషి అభిప్రాయం, ఇష్టం, బాధ్యత... ఇవన్నీ మన జీవితంలో భాగమవుతాయి. వాటిని మీరు గౌరవిస్తారు అని మిమ్మలిని తెలుసుకున్నాక నమ్మకం కుదిరింది .”భరత్ భుజం పై తలవాల్చి నెమ్మదిగా చెప్పింది. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా నడిచారు. “పెళ్లి అంటే ఒకరికి ఇంకొకరు కావాల్సినవాళ్లం అనిపించడం మాత్రమే కాదు.ఒకరి జీవితానికి ఇంకొకరం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండటం కూడా.మనిద్దరి జీవితాలలో ఆ ఘడియ వచ్చింది .”అంటూ దగ్గరికి తీసుకొన్నాడు .ఆ రోజు వాళ్లిద్దరికీ పెళ్లి గురించి మనసులో ఒక స్పష్టత వచ్చింది. *********** భరత్‌కి తనకు నచ్చిన అమ్మాయి దొరికిందన్న సంతోషం కంటే, తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడమే కాకుండా, ఆ జీవితానికి తనతో పాటు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి ఎదురైందన్న నమ్మకమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన భరత్ నేరుగా తండ్రి దగ్గరకు వెళ్లాడు. “నాన్నా... “దీప్తి గురించిమీతో ఒక విషయం మాట్లాడాలి.”గోపాలంగారు పేపర్ పక్కన పెట్టారు. కృష్ణవేణి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. “అమ్మా.!నువ్వు ఇన్నాళ్లు నా పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నావు కదా. నాకు దీప్తి అనే అమ్మాయి నచ్చింది అని మాత్రమే చెప్పడానికి కాదు.ఎందుకు నచ్చిందో చెప్పడానికి ఈ రోజు వరకు ఆగాను .” కృష్ణవేణి కొడుకు వైపు చూస్తూ ఉండిపోయింది. “నాకు దీప్తి నచ్చింది. కానీ అది ఆమె అందంగా ఉంది, చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది అన్న కారణాల వల్ల కాదు. పెళ్లి గురించి ఆమె ఆలోచించే విధానం నాకు నచ్చింది. భార్యగా తనకి ఏం కావాలో , ఏం చెయ్యాలో, రేపుపిల్లలికి తల్లి అయితే వాళ్ళ భాద్యత, కుటుంబ భాద్యత నెరవేర్చే మానసిక స్తైర్యంగురించి కూడా ఆలోచిస్తుంది. ఒక్క క్షణం ఆగి అన్నాడు.“పెళ్లి తర్వాత బాధ్యతలు నేర్చుకుంటానని కాదు నాన్నా... ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అనిపించినప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము . ఇప్పుడు నాకు ఆ విషయంలో స్పష్టత వచ్చింది.” గోపాలంగారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కృష్ణవేణి కళ్లలో మాత్రం నీళ్లు తిరిగాయి. "అమ్మ.” “ నాన్న ఇంతకాలం ఎందుకు చెప్పలేదు?” “ఇన్నాళ్లూ నేను నీ పెళ్లి ఎప్పుడవుతుందా అని మాత్రమే ఆలోచించాను రా. నువ్వు మాత్రం ఎలాంటి పెళ్లి కావాలో ఆలోచించావు.”అంటూ కొడుకు తల నిమిరింది. “ముడి వేయడానికి ముందు... ఆ ముడి విలువ తెలిసిన మనిషి కావాలని చూసాను అమ్మ.” కృష్ణవేణి ఒక్కసారి కొడుకు వైపు చూసింది.“దీప్తి వాళ్లింటికి మనం వెళ్లాలి,” అంది.భరత్ నవ్వాడు. ఆ మాటలో తనకు సమాధానం దొరికింది. పెళ్లి చేసుకోవడానికి వయసు రావడం ఒక్కటే సరిపోదు. ఒకరి జీవితంలోకి మరొకరు అడుగుపెట్టే ముందు, ఆ జీవితానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకోవాలి. ముడి వేయడం రెండు చేతుల పని. ఆ ముడిని జీవితాంతం నిలబెట్టుకోవడం మాత్రం రెండు మనసుల బాధ్యత.

