పక్కింటి పెళ్ళి...మా ఇంటి హడావుడి - బి. సులేఖ రాణి

Pakkinti pelli maa inti hadaavidi

"అత్తయ్యా.. అత్తయ్యా మన పక్కన ఫ్లాట్ లో ఉండే వాళ్ళమ్మాయి కి పెళ్ళి కుదిరింది. వచ్చేనెలలోనే పెళ్లి ఆట"... అంటూ హడావుడి గా వచ్చింది మా మాలతి,నా కోడలు. "సరేలే, ఇంతకీ అబ్బాయి ది . ఏ ఊరు" అని విశేషాలు అడిగాను. ఇప్పటికీ రెండు,మూడు సంవత్సరాల నుండి సంబంధాలు వెతికీ వెతికీ వేసారి ఉన్నారు ఆ పిల్ల తల్లి తండ్రులు. మా కోడలు మాంచి ఊపు లో అన్ని సంగతులు చెప్పటం మొదలు పెట్టింది. మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో "అత్తయ్యా, మనమేమి చీరలు కట్టుకుందాం" అని సందేహం వెళ్ళబుచ్చింది."అదేమిటి, చీరలు ఉన్నాయిగా" అన్నాను." అది కాదు అత్తయ్యా, పెళ్ళి ఐదు రోజులాంట... ఎంగేజ్మెంట్, మెహంది, హల్దీ..... ఇంకా చాలా అన్నారే...అని మళ్ళీ గుర్తు తెచ్చుకుని.. సంగీత్ అని మంచి డాన్సులు చేస్తారట...వాళ్ళు అప్పుడే ఒక బ్యూటీషియన్ నీ,ఒక కొరియోగ్రాఫర్ నీ మాట్లాడేశారట....ఫోటోషూట్ లు ఉంటాయట, మనం అన్ని రోజులు వెళ్తాము కదా అత్తయ్యా,మరి అన్ని చీరలు ,మాచింగ్ నగలు ఎలా" అంటూ ముఖం వేలాడేసింది. "ఇంకా టైమ్ ఉంది కదా, అప్పటి కి ఇంట్లో చీరలు అవీ సరి చేసుకోవచ్చులే, అయిన పెళ్ళి వాళ్ళింట్లో కానీ,మన ఇంట్లో కాదు కదవే, నీ కూతురి పెళ్ళికి అన్ని హడావుడి లు చెయ్యొచ్చులే" అని ఏదో సర్ది చెప్పేశాను.కానీ మా కోడలు ఇంకా హైరానా పడి పోతుంది. "చిన్నదాని పట్టు లంగాలు పొట్టి అయ్యాయి, బాబు గాడేమో ఒకటి వేసుకోమంటే ఇంకొకటి వేసుకుంటాడు.....మరి అన్ని అకేషన్స్ కి ఎలా...నాకేమో ఈ మధ్య జాకెట్లు టైట్ అవుతున్నాయి...ఎలాగో ఏమిటో...టైమ్ చూస్తే ఇరవై రోజులు కూడా లేవు.." అని మొఖం అదొక లాగా పెట్టుకుంది.ఈ పిల్ల కి చెప్పలేము లే అని నేను వూరుకున్నాను.

రోజులు గడుస్తున్న కొద్ది నేను చూస్తూనే ఉన్నాను. మా మాలతి రోజూ బయటికి వెళ్ళడం, రావడం...జాకెట్ టైట్ అనో, లూజ్ అనో,పిల్ల దాని కి డ్రెస్ లేకపోతే బాగోదు అని ఒకటి, లెహంగా ఆట.. అదొకటి...ఇలా తిరుగుతుంది.....పిల్లల్ని పట్టుకుని ఈ డ్రెస్ వేసుకొని చూపించు,ఆ డ్రెస్ వేసుకొని చూపించు...ఆప్పటికప్పుడు నేను పడలేను.... అంటూ. పిల్లలు వాళ్ళ అమ్మ పిలిస్తే తప్పించుకోవటానికి చూస్తున్నారు. తను కూడా "అత్తయ్యా, ఈ చీరకి ఈ బ్లౌజ్ బాగుందా? వర్క్ చేయించాను.. మ్యాచింగ్ అని...ఈ చీరకి ముత్యాల గొలుసు వేసుకొనా? అన్ని మాచింగ్ నగలు లేవుకదా....ఒకటి , రెండు వన్ గ్రామ్ గోల్డ్ నగలు కొంటాను....అందరూ చాలా మాచింగ్స్ వేసుకుంటారు....మన అపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే చాలా,చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారటా..." ఇలా...రోజు ఏదో ఒక విషయం తేవటం అయోమయం, హైరానా పడి పోవటం. అక్కడికి మా వాడు అననే అన్నాడు." పెళ్లి మనింట్లో జరుగుతున్నట్లు, ఏమిటీ" అని. "మీరు ఊరుకోండి, మీకేమిటి, అన్నిటికి ఒక తెల్ల పైజామా,లాల్చీ వేసుకుంటారు,సరిపోతుందని..చీరలు,లేహంగాలు,జాకెట్లు...వేసుకుంటే తెలుస్తుంది, ఎంత కష్టమన్నది" అని వాడి నోరు మూయించేసింది. మధ్య లో నన్ను కూడా లాగబోయింది, షాపింగ్ ప్రపంచం లోకి "నా చీరలు బాగానే ఉన్నాయి లేమ్మా, నేను చూసుకుంటాను గా". అని తప్పించుకున్నాను. ఆఖరికి పెళ్లి ఫంక్షన్స్ మొదలయ్యాయి..

పొద్దున్న లేవడం, అరుచుకుంటూ పిల్లల్ని తయారు చెయ్యడం,తరవాత తను తయారవ్వడం....ఒక రోజు ముడి, ఒక రోజు జడ, ఒక రోజు పోనైటైల్..... ఇలా రక రకాలుగా తయారయ్యే వెళ్ళడం రావటం......ఆ ఐదు రోజులు ఈడ్చి ఈడ్చి కొట్టినట్లు తరయ్యింది ,పాపం మా కోడలు పని.ఒక్కోసారి పొద్దున్న ఒక చీర, సాయంత్రం ఒక చీర....మళ్ళీ జాకెట్లు కుట్లు విప్పుకోవడం, ఒక్కోసారి కుట్లు వేసుకోవడం...నాకు ఒక పక్క నవ్వు వచ్చేది, ఒక్కోసారి జాలి వేసేది.నేను ఏమైనా చెప్పినా బుర్రకి ఎక్కేది కాదు.పారిపోతున్న పిల్లల్ని పట్టుకొని , వాళ్ళకి బట్టలు మార్చడం,ఏదో ఒక క్రీములు పూయడం....మళ్ళీ తను మేకప్ వేసుకోవడం.......పక్కింట్లో పెళ్లి కాదు గాని, మా మాలతి హైరానా ఒక రకం కాదు. చూడగా,చూడగా నాకయితే అపార్ట్మెంట్ లో చాలా మంది ఇంచుమించు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని అనిపించింది. తిండి గురించి ఇబ్బంది లేకుండా,ఐదు రోజులు టిఫిన్, లంచ్ మళ్ళీ రాత్రి కి టిఫిన్స్.....అన్ని ఏర్పాటు చేశారు.పిల్లలు రెండు రోజులు స్కూల్ మానేశారు,ఒక రోజు సెలవు కలిసి వచ్చింది.....మొత్తానికి పెళ్లి అయిపోయింది.

మా ఇంట్లో ఒక గది మంచం మొత్తం విప్పేసిన చీరలు, తీసేసిన ఫాన్సీ నగలు,పిల్లల బట్టలతో నిండి పోయింది. ఆఖరికి మా కోడలు " అత్తయ్యా, పక్కింట్లో వాళ్ళం మనకే ఇలా అయిపోయాము కదా, అసలు పెళ్లి వాళ్ళకి ఎలా ఉంటుందో కదా " అని సందేహం వెళ్ళిపుచ్చింది. నేను నవ్వేసాను. " అది మనం అనుకున్న దానిని బట్టి, మన ఆలోచనలను బట్టి,మన ఇష్టాల్ని బట్టి ఉంటుందే తల్లీ, ఇంకొకరిని చూసి కాదు" అని అన్నాను. మరి మా మాలతి కి ఎంతవరకు అర్థమయిందో , ఏమో ....ఇంకొక పెళ్లి ఏదైనా వస్తే తెలుస్తుంది. అదండీ మరి .... పక్కింట్లో పెళ్ళికి,మా ఇంట్లో హడావుడి.

మరిన్ని కథలు

Betting bhootam
బెట్టింగ్ భూతం
- సూర్య. మండా (MS)
Nannamma manavadu
నాన్నమ్మ-మనవడు
- సంధ్య కార్తీక్
Devudu varamiste
దేవుడు వరమిస్తే !
- సంధ్య కార్తీక్
Pellichoopula padanisalu
పెళ్లి చూపుల పదనిసలు
- సంధ్య కార్తీక్
Vaikalyam
వైకల్యం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nachhina jeevitham
నచ్చిన జీవితం
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Lockdown lo Amma
లాక్ డౌన్ లో అమ్మ
- సంధ్య కార్తీక్