
సుబ్బమ్మ ఒక పట్టాన ఎవర్నీ నమ్మదు.ఇక కొత్త వాళ్లనయితే మరీనూ.సుబ్బమ్మ తమ్ముడు శివరాం ఆ మధ్య రామాపురం లో ఒక పెద్ద ఇల్లు కొనుగోలు చేశాడు.వీలు చూసుకుని సుబ్బమ్మ ని రామాపురం రావలసింది గా మనిషి తొ కబురు చేసాడు.పొలం పనులు అవి ఉండటంతో సుబ్బమ్మ అప్పటికి తత్సారం చేసింది.తరువాత ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని బాడుగబండి కట్టించుకుని రామాపురం బయలుదేరింది.శివరాం కబురు పంపిన మనిషి తొ రామాపురంలో తన ఇంటి ఉనికి గట్రా చెప్పి పంపివున్నాడు సుబ్బమ్మ ఆ మేరకు బండి వాడికి సూచనలిస్తూ ఎలా అయితేనేం రామాపురం చేరుకుంది.కానీ అక్కడ శివరాం ఇల్లు కనుక్కోవడం కాస్త కష్టమే అయింది.బండి వాడు వూరంతా ఒక చుట్టు చుట్టపెట్టేసి ఆఖరికి వూరికి పెడగా వున్నఒక పెద్దింటి వద్ద సుబ్బమ్మ ని దించి వెళ్లి పోయాడు.
శివరాం ,అతని భార్య రాణి సుబ్బమ్మ ని సాదరంగా ఆహ్వానించారు.
సుబ్బమ్మ ఇల్లంతా కలయతిరిగి పెదవి విరుస్తూ, “ఇల్లన్నాక కాస్త ఇరుగూ పొరుగూ వుండాలి. మరీ విసిరేసి నట్టు వూరికి పెడగా మంచి ఇల్లే కొన్నావురా..”అంటూ ఎద్దేవా చేసింది.ఆమె తత్వం తెలిసిన శివరాం నవ్వి తనపని మీద బయటికి వెళ్లి పోయాడు.ఇంతలొ రాణి సుబ్బమ్మ తో ,”వదినగారూ ఇలా ఒకసారి మేడమీదకి రండి,”అంటూ సుబ్బమ్మ నీ మేడ మీదకి తీసుకెళ్లి కాస్త దూరం లొ వున్న ఒక పెంకుటింటిని చూపిస్తూ ,”ఆ ఇంట్లో ఎవరో కాపురం వున్నట్టున్నారు చూడండి,”అన్నది.సుబ్బమ్మ తేరపార చూసి,”అవునేవ్ పెరట్లో బట్టలవీ ఆరేసి వున్నాయి ఎవరొ సాంప్రదాయస్తులె వున్నట్టున్నారు వుండు నేనెళ్లి వాళ్లెవరొ ఏంటో కనుక్కొని వస్తాను,”అంటూ హడావిడిగా అటువైపుచెట్ల మథ్య దారి చూసుకుంటూ బయలుదేరింది.
అదిపాత పెంకుటిల్లు ఇంటి చుట్టు దడి,ఇంటిముందు చక్కగా అలికి ముగ్గు వేసినట్టుంది ,పూలమొక్కలు ఏవో కూరగాయ మొక్కలూ వున్నాయి. ఇంటి తలుపు దగ్గరికి వేసివుంది.సుబ్బమ్మ దడి నెట్టుకొని లోనికిప్రవేశించి తలుపు తట్ట పోయింది ,ఇంతలో లోపల నుండి ఒక కర్ణ కఠోరమయిన మగ గొంతు,”ఏమే రంగీ,ఈ రోజు అమావాస్య అదీకాక మన నాయకుడి పుట్టినరోజు కూడాను.చీకటి పడక ముందే మనం అడవి చేరు కోవాలి.నీ ముస్తాబు త్వరగా తెముల్చు,”అన్న మాటలకి వెంటనే ఒక ఆడగొంతు ,”అవును మావా మన నాయకుడి పుట్టినరోజు ఈరాత్రంతా పాటలూ నాట్యాలు,ఆ పైన విందులు బహుమతులూను ,భలేగుంటుంది,”అనికిలకిలా నవ్వు..ఆనవ్వు డబ్బా లో గులకరాళ్ళు వేసి కుదిపి నట్లుంది.
అంతా విన్న సుబ్బమ్మకి ముచ్చెమటలు పోసి స్తాణువులా నిలబడి పోయింది.ఇంతలో తలుపు తెరుచుకుని తుమ్మ మొద్దులాంటి ఆడ మనిషి బయటి కొచ్చి సుబ్బమ్మ ని చూసి,”ఎవరు మీరు,”అన్నది.సుబ్బమ్మ గొంతు తడారి పోతుండగా మాటలు కూడ తీసుకుంటూ,”శివరాం ఇంటి వైపు చేయి చూపిస్తూ ,”ఆఇంట్లో వుంటున్నాం,మీతో పరిచయం చేసుకుందామని…”అంటూ వుండగా లోనుండి గడ కొయ్యలా అంతెత్తు వున్న మగ మనిషి బయటి కొచ్చి,”అలాగా అమ్మా సంతోషం.మాకూ ఇంతకాలం మాటా మంచికి ఇరుగున ఎవరూ లేక ఇబ్బంది పడ్డాం.ఇకనేం మీరొచ్చారుగా,” అంటూ గార పట్టిన పార పళ్లు బయటపెట్టి నవ్వుతూ అన్నాడు.సుబ్బమ్మ ఒక్కక్షణంఅక్కడ నిలబడ లేక పోయింది ఒక్క ఉదుటన ఇంటి కొచ్చి రాణి ముందు ఒగరుస్తూ కూలబడింది.
“కొంప మునిగిందే అమ్మాయి.వచ్చి వచ్చిదయ్యాల పొరుగు న చేరారే మీరు.మిమ్మల్ని ఇక ఆ దేవుడే కాపాడాలి.మీ సంగతేమో గాని నేనిక్కడ ఒక్క క్షణం కూడా వుండను.ఏడి నీ మొగుడు బండి కి పురమాయించమను”అంటూ గగ్గోలు పెట్ట సాగింది.అప్పుడే బయటనుండి వచ్చిన శివరాం,
సుబ్బమ్మ తో,”అసలేం జరిగింది ఎందుకింత కంగారు,”అన్నాడు.సుబ్బమ్మ ,ఒరే శివుడూ,మనుషులన్న వాళ్లెవరైన అమావాస్య అర్ధరాత్రి అడవులట్టక తిరుగుతారట్రా,అప్పుడెప్పుడో చిన్నతనంలో చందమామ కధల్లోతమ నాయకుడి చుట్టు నాట్యాలు చేసి బహుమతులు తెచ్చుకునే దయ్యాల గురించి చదివాం గుర్తుందా.ముమ్మాటికి వీళ్లు దెయ్యాలేరా బాబూ వాళ్లూ వాళ్ల వాలకం చూస్తే కంపరం పుట్టింది.ఇక నా వల్ల కాదు.మా వూరికి నన్ను తక్షణం పంపే ఏర్పాటు చూడు,అని పెంకుటింటి వద్ద జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పింది.అంతా విన్న శివరాం తేలిగ్గా నవ్వుతూ,” నీ అనుమానపు గుణం మానవు కదా. ఇంకా దెయ్యాలేమిటె నీ చాదస్తం కాకపోతే.తెల్లవారాక నేను వాళ్ల గురించి వాకబు చేస్చచేస్తాలే, భోంచేసి విశ్రాంతి తీసుకో.'”అన్నాడు
సుబ్బమ్మ కి ఆకలి నిద్ర ఆమడదూరం అయి పోయాయి .మేడ మీద కెళ్లి కిటికీలొ నుండి ఆఇంటి వైపు నిఘా పెట్టింది.కాస్త చీకటి పడ్డాక పెంకుటింటి దంపతులిద్దరూ చిన్న దీపం పట్టుకొనితుప్పల్లో పడి దూరంగా వున్న కొండ చరియల వైపు వెళ్లడం చూసింది.సుబ్బమ్మకి ఇక కంటి మీద కునుకు పడలేదు.
ఇంకా చీకట్లు తెరిపిన పడ లేదు.తూర్పున సన్నగా వెలుగు రేఖ కనపడవా వద్దా అన్నట్టు పొడచూపుతోంది.సుబ్బమ్మ తన సంచి చంకన పెట్టుకొని,రాణీని రహస్యంగా పిలిచి తను వూరెళుతున్నట్టు చెప్పింది.అందుకు రాణి,”అయ్యో ,అలా ఎలా వెళ్తారు,ఈయన లేచాక బండి కట్టించు కొస్తారులెండి,”అన్నది.అందుకు సుబ్బమ్మ,”వాడు ఏదో మాయమాటలు చెప్పి వెళ్లడం పడనివ్వడు.నేను వచ్చే టప్పుడు దారులన్నీ గుర్తు పెట్టుకున్నాలె.ఇలా పొలాల కడ్డం పడి వెళితే రహదారి వస్తుంది పోయే బండి వచ్చే బండ్లు ఏదో ఒక బండి పట్టుకుని మావూరెళతా.నువ్వు జాగ్రత్త తల్లీ.
అంటూ వడివడిగా పొలాల వైపు అడుగులు వేసింది. రాణి చేసేది లేక చూస్తూ వుండి పోయింది. నిద్ర లేచిన శివరాం విషయం తెలుసుకొని,ఈజన్మకి మారదు ఈవిడఅనుకున్నాడు.
తెలతెలవారుతుండగా స్పృహ లో లేని సుబ్బమ్మ ని భుజాల మీద మోసుకుంటూ పెంకుటింటి దంపతులు శివరాం ఇంటికి వచ్చారు.శివరాం,రాణీ కంగారు పడుతూ,”ఏంజరిగిందంటూ ప్రశ్నించారు.అందుకు వాళ్లు,”అమ్మగారు పొలంగట్టు మీద స్పృహ తప్పి పడి వున్నారు.ఏ నీరుగడ్డి పామొ ముట్టి నట్టుంది.మాకు తెలిసిన పసరు పిండాము.కాసేపట్లో తేరుకుంటారు మరేంభయంలేదు.మేము ప్రక్కనున్న పెంకుటింట్లొ వుంటున్నాము”అన్నారు
ఆ మాటలకు శివరాం కాస్త కుదుట పడి,”ఇంతకీ మీరు ఏంచేస్తుంటారు.ఎన్నాళ్లనుండి ఇక్కడు న్నారు,”అంటూ అడిగాడు.
అందుకు ఆ మగమనిషి,”నా పేరు రంగడు,దీని పేరు రంగి మేము దాపులో వున్న కొండ చరియల కిందనున్న పొలాల్లో కూలికి వెళుతుంటాము ఆ పొలాలన్ని వినాయకుడనే పేరున్న కొండ దొరవి.కొండకిఆవల నుండి కూడా చాలా మంది కూలీలు వస్తుంటారు.అసలే కోతల సమయం వన్యమృగాలు పంట పాడు చేయకుండా రాత్రుళ్ళు కాపలాకి వెళ్తంటాము.నిన్న మా నాయకుడి పుట్టిన రోజు ."ప్రతి ఏటా మేము ఇదొక పండగలా జరుపుకుంటాం.మా నాయకుడు కూడా మాకు మంచి విందు ఏర్పాటు చేస్తాడు నెగళ్లు వేసుకొని సరదాగా ఆడుతూ పాడుతూ రాత్రంతా గడిపేస్తాం.తగిన బహుమతి డబ్బు రూపంలో నాయకుడు మాకందిస్తాడు."అన్నాడు.
స్పృహ లోకి వచ్చిన సుబ్బమ్మ కళ్లు తెరవకుండా పడకుని సాంతం విన్నది.మీరు దెయ్యాలు కాదు నాపాలిట దేవతలు అని మనసులో అనుకుంది.కాని కళ్లు తెరిచి ధైర్యం చేయలేకపోయింది.ఇంతలో వాళ్లు శివరాం వద్ద శెలవు తీసుకొని వెళ్లి పోయారు.సుబ్బమ్మ మెల్లగా కళ్లు తెరిచి శివరాం వైపు చూస్తూ,”అంతా విన్నారా శివుడూ నాఅనుమానపు బుధ్ది కి సిగ్గు పడుతున్నా.”,అన్నది తల వంచుకొని.ఇక నుంచి అయినా నీ అనుమానపు బుద్ధి మానుకునిఎదుటి వాళ్లని నమ్మడం నేర్చుకో ,”అన్నాడు."చిన్నవాడి వయినా నాకు బుద్ధొచ్చేలా హితవు చెప్పావురా తమ్ముడూ " అంటూ సుబ్బమ్మ సంతోషంగా కొన్నాళ్లు గడిపి, ఈలోగా రంగడూ రంగికి తన చేతులతో నవకాయ పిండి వంటలు వండి విందు భోజనం పెట్టింది.వాళ్లతో మీలాటి పొరుగు , తపస్సు చేసినా దొరకదు .ఒకరి కొకరు మావాళ్లకి చేదోడు వాదోడుగా వుండండి అని చెప్పి బండెక్కి తన వూరు కి ప్రయాణమయింది.