
నలుపు రంగు పేరుతో సమాజం చేసే హత్యలు, అన్యాయాలకు బాధింపబడ్డ ఒక ఆడపిల్ల జీవిత కథ ఈ నలుపు అనే కథ. అందమైన పల్లెటూరు, చల్లని గాలికి వయ్యారాలుపోతు ఊగే వరిచేన్లు.ఆ గాలికి,పక్షి పిల్లలకు ఆహరం కోసం వెళ్లే తల్లి పక్షులకు టాటా చెప్తూ ఊగే చెట్టుకొమ్మలు. పొద్దున్నే క్యారేజీలు కట్టుకొని నీల వాళ్ళ పొలంలో వరినాట్లు వేయడానికి వచ్చారు కూలీజనం.
నీల పూర్తిపేరు నీలవేణి, రాజన్న సోమమ్మలకు ఏకైక సంతానం,నీలకు వాళ్ళ నాయనమ్మ పోలికలు రావడంతో నల్లగా ఉంటుంది. అమ్మాయి నలుపేఅయినా ప్రత్యేక కళగల ముఖం.వాన వచ్చేముందు ఉండే నల్లని మేఘాలవలె ముచ్చటగా ఉంటుంది నీల.నెమలి పింఛాల్లాంటి పెద్ద కళ్ళు , నాగుపాములాంటి వాలుజడ. రంగుగల వారితో పోల్చిచూసిన నీల అందమే వేరు. నీల పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారుకానీ రంగుని సమస్యగా చూడలేదు నీల తల్లితండ్రులు. నీల పెద్దదయ్యేకొద్దీ జనాల మాటలు పెరుగుతూనే వచ్చాయి.
ఒకరోజు నీల చిన్నమ్మ ఇలా అంది "వదినా.. ఇలా అంటున్నానని ఏమనుకోకు.. పాపం!! మన నీలకి మంచి సంబంధాలు వచ్చే భాగ్యం లేదనుకుంటా, మన నీలకు ఏ లోపాలు ఉన్నోడో , కటిక పేదవాడో దొరుకుతాడేమో పాపం " అని అంది. ఇలాంటి మాటలు ఏ తల్లికైనా భరించలేని దుఖానిస్తాయి. వచ్చే దుఃఖాన్ని ఆపుకొని "మా నీలకేం తక్కువే, మనిషి నలుపేఅయినా మనసు బంగారాన్ని తీసిపోదు, దాన్ని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి . నువ్వు చూస్తుండు గొప్ప ఉద్యోగం చేసేవాడు నీలకి భర్తగా వస్తాడు " అని సమాధానమిచ్చింది నీల తల్లి.
అటుపక్క కిటికీలోంచి ఈ మాటలు విన్న నీల లోలోపల చాల బాధ పడింది. రంగు తక్కువ ఉండడంతో ఒక మనిషిని పనికి రాణి వస్తువును చూసినట్టు అసలు ఎలా చుస్తునారో అర్ధం కాలేదు నీలకి. నీల గుండె దుఖ్ఖముతో బరువెక్కింది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఇంకో స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది నీల. అప్పుడు నీల స్నేహితురాలి తల్లి ఇలా అంటూ " ఏమె నీల, వచ్చే వారం దీన్ని చూసుకోడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నువ్వు కొంచం దీనికి తోడుగా ఉండవె, అది ఇంకా అందంగా కనిపిస్తుంది అని మొఖమాటం లేకుండా, తాను ఎంత బాధపడ్తుందో అని కూడా ఆలోచించకుండ నీలతో అంది. తన స్నేహితుల ముందు అవమానపడ్డ నీలవేణి లోలోపల చాల బాధపడ్డ పైకి బలవంతపు నవ్వు పులుముకుంది. నీలకి ఈ బాధలు కొత్తేమికాదు..
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాక చందుకున్నా నీల తన స్కూల్ లో కాలేజీ లో ఇలాంటి చేదు సంఘటనలు ఎన్నో అనుభవించింది, ఒక్కోసారి ఎందుకీ జీవితం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి..నీలవేణి బాగా చదివే పిల్ల ,చదువుపట్ల ఎంత సరదాగా ఉండేది నీలవేణి. కాలేజీలో నీల రంగు పట్ల అపహాస్యం చేసేవారు పిల్లలు . తోటి విద్యార్ధులకి తెలియలేదేమో,అసలు అందం శరీరం పైన వుండే రంగు కాదు అని ,తోటి పిల్లలకు అర్ధం కాలేదు ఒక విషయంపై అపహాస్యం చేస్తే అది వారి జీవితాలపై ఎంత ప్రభావితం అవుతుందో అని , వారిని ఎంత బాధకు గురిచేస్తుందో అని. తన తోటి విద్యార్థులు ఇలా అవహేళన చేయడం తట్టుకోలేకపోయింది నీల,ఇంకా ఈ చదువు వద్దనుకుంది ,ఈ కారణంచేతనే నీల ఇంటర్ ఫస్ట ఇయర్ తోనే తన చదువుకి ఫుల్స్టాప్ పెట్టాల్సివచ్చింది.
నీలవేణికి పెళ్లి సంభందాలు చూస్తున్నపుడు, సూర్య సంబంధం వచ్చింది. సూర్య సోషల్ టీచర్ గా చేస్తున్నాడు, సూర్య వాళ్ళ అమ్మ నాన్న , చెల్లికి పెళ్లయిపోయింది, సొంత ఇల్లు కూడా ఉంది, సూర్య కి చెప్పుకోతగ్గ ఉద్యోగం, మంచి కుటుంబం అని ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు నీలవేణి తల్లితండ్రులు . కట్నకానుకలు కింద పది ఎకరాల భూమి , బంగారం ఇచ్చారు . పెళ్ళై బరువెక్కిన గుండెతో తల్లితండ్రులను విడిచి అత్తారింటికి వెళ్ళింది నీలవేణి. నీల అత్తారింటికి చేరుకొని లోపలికి వెళ్తున్నప్పుడు చూసింది. ఇంటి గోడమీద ఎవరిదో పేరు ఉంది."అదేంటి సొంత ఇల్లు అన్నారు...కానీ ఇక్కడ ఎవరిదో పేరు ఉంది " అని సందేహంగా అనుకుంది మనసులో. కొత్త కోడలికి జరగాల్సిన మర్యాదలు జరుగుతున్నాయి నీలకి.అది చుసిన తల్లితండ్రులు ఎంతగానో ఆనందించారు.
ఇది ఇలా ఉండగా, సరిగ్గా ఒక నెల తరువాత...ఇల్లు కొనడానికి తీసుకున్న లోన్ కట్టాలి , లేకపోతే అందరం రోడ్డున్న పడాల్సివస్తుంది అని మాయమాటలు చెప్పి నీల భర్త మరియు అత్త కలిసి నీల దెగ్గర ఉన్న బంగారం తీసుకున్నారు.ఇప్పుడు నీల ఒంటిమీద ఉన్న బంగారం తప్ప ఏమి మిగల్లేదు. నీల ఆ ఇంట్లో కేవలం పనులు చేసే యంత్రంగ మారడానికి ఎక్కు సమయమేమిపట్టలేదు.నీలని ఆ ఇంట్లో పనిమనిషిగా మాత్రమే చూస్తారు.వాళ్ళ అసలు స్వభావాలు తొందరగానే తెలిసిపోయాయి నీలకి. ఇంటి పనితోపాటు అత్త తిట్లు, తన రంగు మీద సూటిపోటి మాటలు కూడా పడాల్సివస్తుంది .
ఒకరోజు నీల అత్త ఇలా అంది "అత్త వట్టిచేతులతో తిరుగుతుందని కూడా లేకుండా , బంగారు గాజులు వెస్కొని తీరిది ఈవిడ. అయినా ఆ నల్ల చేతులకు ఆ బంగారు గాజులు ఎందుకో , ఎవరికి చూపించుకోడానికో " అని . ఆ మాటలు విన్న నీలవేణి ఏమి మాట్లాడకుండా అత్త మీద ఉన్న గౌరవంతో గాజులు కూడా ఇచ్చేసింది . భర్త ఎమన్నా మంచోడా అంటే అది లేదు, తల్లి ఎంత చెప్తే అంత అతనికి, తల్లి చెప్తుంది సరైందేనా కదా అని ఆలోచించాడు గుడ్డిగా అనుసరించడం తప్ప.కడదాకా తనకు తోడు నీడలా ఉంటాడు అనుకుంది, ఆమెను అర్ధం చేసుకున్నాడు అనుకుంది. కానీ సూర్య కూడా ఆమె రంగు వాళ్ళ ఆమెను అసహించుకుంటాడని, అగవురవిస్తాడని , తల్లితో కలిసి అపహాస్యం చేస్తాడని అనుకోలేదు,భర్త ప్రవర్తనని తట్టుకోలేకపోయింది నీలవేణి. నీలవేణి ఎంత సర్దుకుపోతున్న తన అత్త, భర్త పోరు పడలేకపోతుంది.
నీలవేణికి మానసిక క్షోభ , ఒత్తిడికి గురిచేసే వారు అత్త మరియు భర్త. ఒకరోజు నీలవేణి బయట వాకిలి తుడుస్తోంది. అత్త మామ, సూర్య బయటే కూర్చున్నారు.ఒకావిడ నీల అత్తని శుభకార్యానికి పిలవడానికి వచ్చింది .ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు .ఆవిడ చూపు ముగ్గేస్తూన్న నీలవేణి పైన పడింది. ఎవరపిల్ల ఇదివరకు చూడలేదు!! అని అడిగితే ..ప్రశ్న పూర్తికాకముందే "మా పనిపిల్ల,మొన్నే పనిలో పెట్టాం" అని చెప్పేసింది నీల అత్త. ఈ మాటలు విన్న నీల గుండె పగిలిపోయింది, ఆమెకళ్ళలో కనిపించని సముద్రం, వచ్చే దుఃఖాని ఆపుకోలేకపోయింది నీల. ఆవిడ వెళ్ళిపోగానే నీల భర్త , అత్త ఇద్దరు నీలని ఇంట్లోకి లాక్కెళ్లి, "కొత్తవాళ్లు వచ్చినపుడు ని దరిద్రపు మొఖంతో కనిపించకు అని ఎన్నిసార్లు చెప్పలేనికు, మహాగొప్ప అందం అనుకుంటున్నావానిది, ఈ ముఖంతో ఈ రంగుతో ఎవర్ని ఉద్దరించడానికి బతుకుతున్నవే. అయినా ని అందం చూసి నిన్ను చేస్కున్నాము అనుకుంటున్నావా , అసలు ఇన్ని అంటున్న మనిషన్నవాళ్ళు ఎవరన్నా బతుకుతార, నువ్వు చస్తే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేదాం అని చూస్తుంటే ఇక్కడే పాతుకుపోయేలా ఉన్నావ్ కాదే "అని చేయిచేసుకున్నారు నీలవేణిపై. నీలవేణికి బతుకుమీద ఆశ చచ్చిపోయింది,ఇంకెవరి కోసం బ్రతకాలి అనుకుంది.
అప్పటిదాకా తనకు జరిగిన అవమానాలను, అపహాస్యాలను తలుచుకొని ఎంతో బాధపడింది. జరుగుతుంది తన తల్లితండ్రులకు చెప్పే ధైర్యం లేకపోయింది, వాళ్ళు అక్కడ ఎక్కడ బాధపడ్తారో అని , ఒకవేళ తాను పుట్టింటికి వెళ్లిన ఊర్లోవాళ్ళు అనుకునే మాటలు గుర్తొచ్చాయి నీలవేణికి . ఇక ఈ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకుంది.సరిగ్గా అప్పుడే నీలకి ఈ ఆలోచన వచ్చింది,"నన్ను పనిమనిషి అని చెపింది, నా చావుకోసం ఎదురుచూస్తుంది,నేను పోతే నా ఆస్తి ఉంచుకొని, తన కొడుక్కి ఇంకో పెళ్లి చేసేందుకు సిద్ధపడింది, అంటే...అంటే నాకన్నా ముందే సూర్యకి పెళ్లి చేసిందా? తనను చంపి ఈ ఇల్లు తీసుకుందా??. నేను ఇలా చస్తే నా ఆస్తి కూడా వెళ్లే తీసుకుంటారు , ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నకు నేను మరో కష్టాన్ని ఇచ్చినదాన్ని అవ్వకూడదు. అలోచించి...తానులేకపోయిన ఆస్తి వాళ్ళ అమ్మానాన్నకు చేరేలా చేసి. రాత్రివేళ ఆ రాక్షస ఇంటి నుంచి అడుగు బయటపెట్టింది, దేగ్గర్లో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్ళింది . పట్టాలమీద నుంచొని రైలుకోసం ఎదురుచూస్తుంది, రైలు దెగ్గరికి వస్తున్నప్పుడు, కళ్ళుమూసుకొని పట్టాలమీద ఉన్న నీలవేణిని హటార్తుగా పక్కకి లాగేసారు .అది ఒక మగవ్యక్తి, ఆశ్చర్యపోతూ అతనినే చూస్తుండిపోయింది నీలవేణి. రైలు వెళ్ళిపోయాక...అదే ఆశ్చర్యంతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది నీలవేణి. చీకటి నుంచి వెలుగు వచ్చేవేళ....!! అందం!! అంటే ఏంటి అసలు...అందం అంటే కేవలం శరీరం మీద ఉండే రంగు ఒక్కటే కాదు. అందం అంటే స్వచ్ఛమైన మనసు, మంచి వ్యక్తిత్వం, సహాయాగుణం , మానవత్వం, ఎదుటివారిని గ్వరవించడం.ఇతరులతో మంచిగా మెలగడం , కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతతో ఉండడం కల్మషం లేని నవ్వు అందం అంటే ...ఇది అసలు అందం😊...