
“చైతన్యా! ఏదైనా ఇష్టపడి చదువాలి. కాని మనసు కష్టపెట్టుకుని కాదు. నేను బలవంతం చేయను. నువ్వు కోరుకున్న ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించుకున్నావు. ముందు శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్ పూర్తిచేయి” నుదురు నిమురుకుంటూ.. అన్నాడు రాఘవయ్య.
“అదేంటి నాన్నా.. నా మీద అనుమానమెందుకు వచ్చింది?” తలెత్తి ప్రశ్నించాడు చైతన్య.
“అలా నేను తల ఎత్తుకుని సమాజంలో తిరిగేలా నువ్వు చదువడం లేదని అనుకుంటున్నాను”
“ఎందుకనుకుంటున్నావు? నేను బాగానే చదువుతున్నాను. కాకపోతే కొన్ని పేపర్లు ఉండి పోయాయి. ఈ వేసవి సెలవుల్లో బాగా కష్టపడి చదివి తప్పకుండా అన్నీ క్లియర్ చేస్తాను” తన తప్పిదనానికి బాధపడ్తున్నట్టు తల దించుకున్నాడు చైతన్య.
“అదుగో అలా.. తల దించుకునే పనులు గూడా చేయొద్దు” అసలు విషయం చెబుతాడేమోనని చురక అంటించాడు రాఘవయ్య.
“నాన్నా.. మీరు ఏదో మనసులో పెట్టుకొని మరేదో మాట్లాడుతున్నారు. నేను బాగా చదువుతున్నాను నాన్నా.. ఎం.టెక్ గూడా చేస్తాను”
“నాకు అదే అనుమానంగా ఉందిరా.. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచడం సహజం. అది తప్పంటావా?” రాఘవయ్య ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
“తప్పెందుకవుతుంది నాన్నా.. అది వారి బాధ్యతకూడా”
“ఆ బాధ్యతతోనే అడుగుతున్నాను. ఈమధ్య అసాంఘిక శక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నట్లు గమనించాను”
“అలాంటిదేమీ లేదునాన్నా.. మీరు పొరబడుతున్నారు. నేను తప్పకుండా పై చదువులు చదువుతాను” విషయం పక్క దారి పట్టకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో అన్నాడు చైతన్య.
“అలా అయితే నాకన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళు లోకంలో ఎవరూ ఉండరు. బహుశః మీ అమ్మ బతికి ఉంటే సంతోషించేదేమో!” అనగానే రాఘవయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ.. “నాకు ఆ సంఘటన చూసాక భయం, భయంగా ఉందిరా..” ఇప్పటికైనా నిజం చెబుతాడేమోనని ఇంకాస్త ముందుకు కదిలించాడు రాఘవయ్య.
“ఏ సంఘటన చూసారో! ఏమో! నాకు చెప్పకుంటే ఎలా నాన్నా.. జాగ్రత్తపడతాను” లౌక్యంగా అడిగాడు చైతన్య.
ఇక లాభం లేదు.. చైతన్యను దారికి తెచ్చుకోవాలంటే ఈమధ్య నేను చూసిన దృశ్యం వివరించాల్సిందేనని, మనసులో నిర్ణయించుకుని.. గొంతు సవరించుకున్నాడు.
“చైతన్యా.. నువ్వు వేసవి సెలవుల్లో వచ్చినప్పటి నుండి ప్రతీ రోజు సాయంత్రం బయటకు వెళ్తున్నావు. అది సహజమే కదా అని అనుకున్నాను. కాని నామిత్రుల ద్వారా సూచాయగా తెలిసి.. గత శనివారం నిన్ను రహస్యంగా వెంబడించాను. అప్పుడు కనుమసగ అవుతోంది. నీ కోసమే ఎదురి చూస్తున్నట్టుగా ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చాడు” అంటూ తను చూసిన సంఘటన కళ్ళకు కట్టినట్టు చెప్పసాగాడు రాఘవయ్య,
***
“ఏంట్రా శేఖర్ అలియాస్ అంజయ్యా.. అల్లా పరుగెత్తుకుంటూ వస్తున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా?” చిరునవ్వుతో ప్రశ్నించాడు చైతన్య.
“తప్పదు కదరా!.. ప్రాక్టీసు చేయాల్సిందే” అంటూ చైతన్య చిరునవ్వులో నవ్వు కలుపుతూ.. ఇద్దరూ కలిసి నాలుగడుగులు నడిచి.. మర్రి చెట్టు కింద కూర్చున్నారు.
“చైతన్యా.. నీ విషయం మన లీడర్ లింగయ్యకు చెప్పాను. మన దళానికి కావాల్సింది నమ్మకస్తులు కాని వెన్నుపోటు పొడిచే వారు కాదు. కొందరు నమ్మకంగా చేరి ఇన్ ఫార్మలుగా మారి ద్రోహం చేస్తున్నారు. అలా కాకుండా చూసుకునే బాధ్యత నీదే అన్నాడు. నువ్వు అలాంటి వాడివి కావని.. మన దళం కోసం అహర్నిశలు శ్రమిస్తావని చెప్పాను. ఇక నీ నిర్ణయమే ఆలస్యం” చైతన్య ముఖంలోకి సూటిగా చూస్తూ.. అన్నాడు శేఖర్.
“ఆలోచిస్తున్నానురా.. ఇంకాస్త సమయం కావాలి” శేఖర్ చూపల ధాటికి తట్టుకోలేక అన్నట్టు కనురెప్పలు సగం మేరకు దించుకున్నాడు చైతన్య.
“ఇంకా ఎంత కాలంరా? ఏదైనా అనుకున్నామంటే అనుసరించాల్సిందే.. అదే నాపాలిసీ. మనసు దిటవుచేసుకో చైతన్యా.. నీకు కంప్యూటర్ మీద మంచి అవగహన ఉంది. లింగయ్యకు నీలాంటి వాడు అవసరం” తొందరగా నిర్ణయించుకో అనే ధోరణిలో అన్నాడు శేఖర్.
“కనీసం బి.టెక్. అయినా పూర్తిగాకుంటే ఎలారా? అని” సుతారంగా తల గోక్కుంటూ..” మరో మూడు నెలల్లో పరీక్షలన్నీ పూర్తవుతాయి. తప్పకుండా పాసవుతాను. డిగ్రీ చేతిలోకి రాగానే మన దళంలో చేరుతానని లింగయ్యకు చెప్పు శేఖర్. మా నాన్న కోరిక మాత్రం నేను ఎం.టెక్. చేయాలని”
“పాసై ఏం వెలగపెడ్తావు? ఉద్యోగం చేయాని ఉందా? అయినా అది వచ్చి చస్తే కదా!.. అందుకే అతివాదం పెరుగుతోంది. మనం చర్చించుకున్న విషయాలే కదా..!. ఇక నీ ఇష్టం. నేనేమీ బలవంత పెట్టను” అంటూ లేచి నిలబడ్డాడు శేఖర్.
చైతన్య కూడా లేచి.. “నేను సాధ్యమైనంత త్వరలో నీకు ఫోన్ చేస్తాను. దళంలో తప్పకుండా చేరుతాను. నా ఆశయాలు కూడా అవేనని నీకు తెలియంది కాదు. బాల్యం నుండి మనం స్నేహితులమైనా.. నీకు చదువు అబ్బక కాస్త ముందు చేరావు. అంతే తేడా.. నన్ను నమ్ము శేఖర్”
“నమ్మకం ఉండే కదరా.. నీ చుట్టూ తిరుగుతున్నాను. సరే అయితే .. బై” అంటూ చీకట్లో కనుమరుగై పోయాడు శేఖర్. చైతన్య భారంగా ఇంటి ముఖం పట్టాడు.
***
నిశ్చేష్టుడయ్యాడు చైతన్య.
“అప్పుడు నేను మర్రి చెట్టు వెనుకాలే ఉన్నానురా..” రాఘవయ్య గొంతులో కోపం ప్రస్ఫుటమయ్యే సరికి చైతన్య ఒంట్లో సన్నగా వణుకు పుట్టింది. తన రహస్యం బట్టబయలయ్యాక ఇక తన నిర్ణయం చెప్పక తప్పదని ధైర్యం తెచ్చుకున్నాడు.
“నాన్నా..! నేను దళంలో కలిస్తే తప్పేంటి?” కళ్ళెగరేస్తూ అడిగాడు చైతన్య.
“దళంలో కలిస్తే లాభమేంటిరా?” ప్రశ్నకు ప్రశ్న రూపంలోనే సంధించాడు రాఘవయ్య.
“స్వలాభం కోసం కాదు నాన్నా.. సంఘం కోసం. ఎంత చదివినా ఉద్యోగాలు రావడం లేదు. యువత నిరుద్యోగులై విసిగి పోయి నేరాల బాట పడుతున్నారు. ప్రభుత్వం సరియైన ప్రణాళికలు లేక ఉచితాలతో ప్రజలను సోమరులను చేస్తున్నారే తప్ప సంస్కరించడం లేదు. ఇది సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందే. మీకు తెలుసు. బళ్ళు, గుళ్ళు ఆదాయాలకు నిలయమయ్యాయి.. ధనవంతులు బీదలను దోచుకు తింటూనేన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయాలి. సంఘ సంస్కరణ కోసం నేను దళంలో చేరక తప్పదు” తన నిర్ణయానికి మార్పు లేదన్నట్టుగా ఆవేశంతో తన నిర్ణయం చెప్పాడు చైతన్య.
“సంఘ సంస్కరణ కోసం.. ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలంటే దళంలో చేరి అజ్ఞాతం లోకి వెళ్ళడం అవివేకం. ప్రజలతో మమేకమై చైతన్యవంతులుగా మార్చడం వివేకం. బాగా ఆలోచించు చైతన్యా.. నేను ఒక ఉపాధ్యాయునిగా చెబుతున్నాను. గౌతమ బుద్ధుడు ప్రజల మధ్య ఉండి బోధనలు చేశాడే కాని అజ్ఞాతం లోకి వెళ్లి కాదు”
“ఆ కాలం వేరు. ఈ కాలం వేరు నాన్నా.. మీరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు. లోకజ్ఞానం ఉన్నవారే కాదనను. కాని నేటి సంఘం తీరుతెన్నులు చూడు. అంతా అవినీతిమయం. మనం వారితో కలిస్తే మనల్ని కూడా వారి తోవ లోకి లాక్కుంటారు. అందుకే అజ్ఞాతంగా ఉండి తగిన గుణపాఠం చెబితే గాని సంఘం బాగు పడదు”
“నీ దృక్పథం సరియైనది కాదు చైతన్యా.. సరే! అజ్ఞాతం లోకి వెళ్తానంటావు. తుపాకి చేత పడతానంటావు. మరి అజ్ఞాతంలో ఎలా సంపాదిస్తావు? ఎలా కడుపు నింపుకుంటావు? తుపాకులు, మందు గుండు సామానులు ఎలా కొంటావు.. డబ్బు కోసం మీరనుకునే దొరలను దోచుకుంటావు. అవునా?” తన స్వగ్రామంలో జరిగిన సంఘటనలను రంగరించి అడిగాడు రాఘవయ్య. అప్పుడు చైతన్య బాలుడు. ఊళ్ళో జరిగిన ఘోరాలేవీ తెలియవు.
“తప్పదు కదా నాన్నా!.. డబ్బు లేకుండా ఎలా మనుగడ సాధించగలం? ఆయుధాలు లేకుంటే ఎవరు భయపడతారు?” తనంత విజ్ఞాన వంతుడు లేనట్టుగా సమాధానమిచ్చాడు చైతన్య.
“ఇప్పుడు దారిలోకి వచ్చావు చైతన్యా.. దొరల వద్ద ఉన్న డబ్బంతా ప్రజల వద్ద దోచుకున్నదేనని మీరెలా నిర్థారిస్తారు? వారి వద్ద మీరు దోచుకోవడం నేరం కాదా? ఒకవేళ వారు అన్యాయంగా సంపాదించిన డబ్బే అయితే సాక్ష్యాలతో కోర్టులో నిరూపించాలి కాని చట్టాన్ని మీరెలా చేతుల్లోకి తీసుకుంటారు? వారు అన్యాయంగా సంపాదించకుండా అడ్డుకోవాల్సింది వారి కుటుంబ సభ్యులే. అలా చైతన్యం తీసుకు రావాలంటే మనం ప్రజల్లోనే ఉండాలి కాని అడవుల్లో కాదు. నీకొక ముఖ్య విషయం చెప్పాలి చైతన్యా..” అంటూండగా గొంతు పొర మారింది.. కాసిన్ని మంచి నీళ్ళు తాగి తిరిగి చెప్పసాగాడు రాఘవయ్య,
“మా నాన్న పోలీసు కానిస్టేబుల్ గా పని చేసే వాడు. అన్యాయంగా లారీ డ్రైవర్ల వద్ద డబ్బు వసూలు చేసి మత్తు పానీయాలు సేవించే వాడు. అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. నాన్నను ఎలాగైనా మార్చాలని పథకం వేసాను”
ఏంటా పథకం? అన్నట్టు ఆశ్చర్యంగా చూడసాగాడు చైతన్య. అతని చూపులను అర్థం చేసుకున్న రాఘవయ్య.. “ఒకరోజు నాన్న బాగా తాగి రోడ్డు ప్రక్కన పడిపోతే, మాకు తెలిసిన కూరగాయలు అమ్మే ఆసామి తన నాలుగు చక్రాల బండి మీద నాన్నను పడుకోబెట్టి మా ఇంటికి తోసుకు వచ్చాడు. వీధిజనం, నా మిత్రులు చూసి నవ్వుకోవడం నాకు తల తీసేసినట్టుగా అనిపించింది. ఆ రాత్రి నేను భోజనం చేయలేదు. మరునాడు తెల్లవారుఝామునే లేచి ఇంటి నుండి పారిపోయాను. అమ్మ నాకోసం ఏడుస్తూ.. పెడబొబ్బలు పెట్టేసరికి ఇంటి ముందు జనం గుమిగూడారు. నాన్న దిగ్గున లేచి నా కోసం పరుగులు తీసాడు. నేను చెరువు దిక్కు పరుగెత్తడం గమనించిన ఒకరు నాన్నకు చెబితే అమ్మా, నాన్న నా అడుగులు పసిగడుతూ పరుగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనుకాలే మా కాలనీ జనం. అప్పుడు నేనొక చింతచెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను. అమ్మ నన్ను బతిమాలుతుంటే.. ససేమిరా అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ.. నా నిర్ణయం చెప్పాను. మరో సారి నాన్న అలా అన్యాయంగా డబ్బులు సంపాదించి తాగితే మరెక్కడికైనా పారిపోతాను లేదా ఆ చెరువులో పడి చచ్చి పోతానని బెదిరించాను.
నాన్న భయపడి పోయాడు. ఇకముందు లంచాలు తీసుకోనని.. మద్యం ముట్టనని నా తల మీద చెయ్యి వేసి అందరి ముందు ప్రమాణం చేసాడు. నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఆ రోజు నుండి నాన్న మళ్ళీ ఆ పాపపు పనులు చేయలేదు మందు ముట్టలేదు. నిజాయితీగా పని చేసాడు. మరుసటి సంవత్సరం ‘జిల్లా ఉత్తమ పోలీసు కానిస్టేబుల్’ అవార్డు వరించింది. అదే స్ఫూర్తి నాకు”
చైతన్య తన తాతగారి గురించి ప్రథమంగా వినడం ఆశ్చర్య పోయాడు. చైతన్య ముఖ కవళికలు గమనిస్తూ.. హితబోధ చేయసాగాడు. “చూడు చైతన్యా.. మా నాన్న స్ఫూర్తితో నేనే కాదు.. మా కాలనీలో మరో అన్నయ్య ఉత్తమ ఉద్యోగిగా, నా విద్యార్థి ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డులు సాధించారు. కాలనీలో అందరూ నీతీ, నిజాయితీగా, ఊళ్ళోని వారందరికీ ఆదర్శప్రాయులుగా జీవనం కొనసాగించారు. అది నాకెంతో తృప్తినిచ్చింది. అది చాలదా? ఇంకా జీవితానికి కావాల్సిందేముంది? డబ్బు శాశ్వతం కాదు. మన మంచితనం శాశ్వతం.
ప్రతీ కుటుంబంలో పిల్లలు ప్రక్క దారిన పడితే పెద్దలు.. పెద్దలు ప్రక్కదారిన పడితే పిల్లలు సరిదిద్దుకునేలా మనం జనం లోనే ఉండి హితవు చెప్పాలి. సాధ్యమైనంత వరకు పోలీసులకు, కోర్టులకు పని తగ్గించేలా పాటుపడాలి. ఇది నా జీవితానుభవంతో చెబుతున్నాను. దళంలో కలిసి తరువాత లొంగిపోతావో! లేక పోలీసుల తుపాకి గుళ్ళకు బలి అవుతావో! నీ ఇష్టం” అంటూ రాఘవయ్య తన పడక గదిలోకి దారి తీసాడు. ‘పిల్లలను కన్నాం కాని.. వారి రాతలను కన్నామా! యువత ఇలా ప్రక్క దారి పట్టొద్దు. చైతన్య తన నిర్ణయం తప్పకుండా మార్చుకుంటాడు’.. అనే ధీమా అతని నడకలో కనబడసాగింది.
చైతన్యకు ఆ రాత్రి నిద్ర కరువయ్యింది. మదిలోని ఆలోచనలు తనను ఉక్కిరి, బిక్కిరి చేసాయి. తెల్లవారు ఝామున ఒక కునుకు తీసిన చైతన్య మనసును ఉషోదయ కిరణాలు తాకాయి. చైతన్య ముఖం విచ్చుకుంది. అందులో దళంలో చేరాలనే నిర్ణయం మచ్చుకైననూ కనిపించడం లేదు. *