పన్నీర్ గోల్మాల్ పెళ్లి!!! - హేమావతి బొబ్బు

Panneer Golmal Pelli

మా బామ్మర్ది నల్గొండ దగ్గర ఒక చిన్న పల్లెటూర్లో ఉండేటోడు. ఆడు చూడ్డానికి కాస్త పొట్టిగా, అమాయకంగా ఉంటడు. మాట కూడా పెద్దగా రాదు, ఎవరేం అడిగినా తల గోక్కుంటడు. అట్లంటి మనోడికి 'సీత' తో పెళ్లి కుదిరింది. సీత మాత్రం పట్నం పిల్ల, చూడగానే ఒళ్ళు జివ్వు జివ్వు మంటది, పిల్ల చురుకైనది. ఒకరికొకరు పెద్దగా పరిచయం లేదు, పెద్దలు చూసి కుదిర్చిన పెళ్లే అది. ఆ రోజు పెళ్లి మండపం కిటకిటలాడుతున్నది.... జనాలతోటి , ఇసుకవేస్తే రాలనంత ఉంటారు. అన్నీ మన పాత సంప్రదాయాల ప్రకారం జరుగుతున్నయ్. పంతులు గార్లు మంత్రాలు చదువుతున్నరు. మా బామ్మర్ది, సీత పక్కపక్కనే కూర్చున్నారు. ఇగ తాళి కట్టే సమయం వచ్చింది. అందరూ చూస్తున్నరు, ఉద్విగ్నంగా. సరే, అప్పుడే సీతకు మస్తు ఆకలి వేసింది. పొద్దున నుంచి ఏం తినలే, కడుపులో పేగులు పీక్కుంటున్నయ్. ఆమెకు పన్నీర్ టిక్కా అంటే ప్రాణం. ఆ ఆకలిలో అది గుర్తుకొచ్చింది. మా బామ్మర్ది తాళి పట్టుకుని, మెల్లగా సీత మెడ దగ్గరికి తీసుకొచ్చిండు. ఇగ తాళి కడతడు అనంగానే, ఆకలిలో ఉన్న సీత లోకంలోకి రాలేదు. పంతులు చదువుతున్న మంత్రాలు కూడా ఆమె చెవికి ఎక్కలే. ఒక్కసారిగా గట్టిగ అరిచింది: "నాకు పన్నీర్ కావాలె!" మండపంలో ఉన్న అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైండ్రు. అరెరె! ఏం జరిగింది? అనుకున్నారు. పంతులు గార్లు మంత్రాలు ఆపేసిండ్రు. మా బామ్మర్ది చేతిలో తాళితో బొమ్మలెక్క అట్లనే ఉండిపోయిండు. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా సైలెంట్‌గ సీతనే చూస్తున్నరు. సీత తల్లిదండ్రులకు ఒళ్ళు మండి, చెమటలు పట్టినయ్. "ఏమైంది పిల్లకి? పెళ్లి మండపంలో పన్నీర్ అంటావేంటి పిచ్చిపిచ్చిగ?" అని వాళ్ల అమ్మ గట్టిగ గిచ్చింది సీతను. అప్పుడు సీత కెవ్వున కేకవేసింది. సీత అప్పటికి కానీ లోకంలోకి రాలేదు. తను ఏం మాట్లాడిందో అర్థమై, సిగ్గుతో తల దించుకుంది. బుంగమూతి పెట్టుకుంది. ఇంతలో, మన బామ్మర్దికి మస్తు కోపమొచ్చింది. వాడు మాటలు రానివాడే గాని, కోపమొస్తే వాని ముఖం ఎర్రగా మారుతది. "ఏంటిటిటిది... సీత? నా పరువు తీసేస్తున్నావ్! పెళ్లి మండపంలో పన్నీర్ ఏంటిటి? ఇది నీకిష్టమైన బొమ్మ కొనిచ్చే బొమ్మల కొట్టు అనుకున్నావా?" అని నెమ్మదిగ, కానీ కోపంగా మాటల్ని లాగి అడిగిండు. సీతకు కూడా మండిపోయింది. "ఆకలి వేస్తాంది. పొద్దున నుంచి ఏం తినలే. నాకు పన్నీర్ టిక్కా అంటే ఇష్టం, గుర్తొచ్చింది చెప్పిన అంతే! ఇందులో తప్పేముంది?" అంది తెగేసి. "తప్పేముంది అంటావా? పంతులు గార్లు మంత్రాలు చదువుతుంటే, తాళి కట్టేటప్పుడు పన్నీర్ కావాలని అడుగుతావా? పెళ్లి ఆపేసినట్లేగా ఇది?" అని మా బామ్మర్ది గట్టిగ అరిచిండు. సీత గుండెలో మంటలు రేపిండు. ఇంతలో మా బామ్మర్ది తండ్రి అదే మా మామ కల్పించుకుని, "అబ్బాయి, ఆగురా. నువ్వు అంతెందుకు అరుస్తున్నావ్? ఆకలి వేసిందేమో పాపం బిడ్డకు" అన్నడు, కొడుకుని వారించి. సీత తండ్రి కూడా, "అవునవును, మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకున్నాం. ఆకలి వేస్తే అట్లనే అడుగుతది. అందులో తప్పేముంది?" అన్నడు, తన బిడ్డను సమర్థిస్తూ. ఇక చూడాలె! ఇరువైపులా కుటుంబ సభ్యులు గొడవపడడం మొదలుపెట్టిండ్రు. "అసలు మా అబ్బొడిని అవమానిస్తారా?" అని మా బామ్మర్ది పిన్ని గుర్రుపెట్టింది. "మా సీతకు ఆకలేస్తే అడిగింది, దానికేంటి ఇంత రంధి?" అని సీత మేనమామ అలిగిండు. మండపం మొత్తం కోడి పందెం లెక్క గలాభాగా మారింది. పంతులు గార్లు "ఓరి భగవంతుడా!" అని తల పట్టుకుని కూర్చుండు. ఈ గొడవ మధ్యలో మా బామ్మర్ది దోస్తు ఒకడు లేచి, "ఆపండి ఆపండి! దీనికి నేను పరిష్కారం చెబుతా!" అన్నడు. అందరూ సైలెంట్ అయ్యారు. "మనోడికి సీతంటే ఇష్టం కదా? సీతకు పన్నీర్ అంటే ఇష్టం కదా? ఇప్పుడే మన పెళ్లి భోజనాల్లో ఉన్న పన్నీర్ కూర తెప్పిద్దాం. సీతకు తినిపిద్దాం. ఆమె కడుపు నిండితే, పెళ్లి చేసుకుంటది," అన్నడు. వాడు అలాగ్గా చెప్పినందుకు అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టిండ్రు. పంతులు గార్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయిండు. సీత, మా బామ్మర్ది ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లకూ నవ్వు ఆగలేదు. ఇగ పంతులు చెప్పినట్టుగానే, పెళ్లి మండపంలోనే పన్నీర్ కూర తెచ్చి సీతకు పెట్టిండ్రు. ఆమె ఆకలిగా ఉన్నందున ఆబగా తిన్నది. మొత్తం లాగించేసింది. అప్పుడు బామ్మర్ది, "ఓకే, పన్నీర్ అయిపోయింది కదా, ఇప్పుడు తాళి కట్టనా?" అని నవ్వుతూ అడిగాడు. సీత సిగ్గుపడి, తల ఊపింది. పంతులు గార్లు మళ్లీ మంత్రాలు చదవడం మొదలుపెట్టిండ్రు. అందరి నవ్వుల మధ్య, ఆ చిన్నపాటి పన్నీర్ పంచాయితీ తర్వాత, మా బామ్మర్ది సీత మెడలో తాళి కట్టిండు. పెళ్లి ముగిసింది. ఆ పెళ్లి మా ఊర్లో అందరికీ గుర్తుండిపోయింది. "పన్నీర్ పెళ్లి" అని దాని పేరు మార్చేశారు. ప్రతీ పెళ్లిలోనూ, "పన్నీర్ కావాలా?" అని సీతను ఆటపట్టించేటోళ్లు. ఇంతకీ మా బామ్మర్ది పేరు ఏంటంటే???... పన్నీర్!!!

మరిన్ని కథలు

ASANGHIKAMU
అసాంఘికము!
- చెన్నూరి సుదర్శన్
Matru mamatha
మాతృమమత
- కందర్ప మూర్తి
podupu - jadupu
పొడుపు కధ తెచ్చిన జడుపు
- నిర్మలాదేవి గవ్వల
Sahasaveerudu merine bharat
సాహసవీరుడు మెరైన్ భారత్
- హేమావతి బొబ్బు
Nalupu
నలుపు
- Anisa Tabassum Sk
Dayyala Porugu
దెయ్యాల పొరుగు
- నిర్మలాదేవి గవ్వల
Oppandama/sampradayama
ఒప్పందమా / సాంప్రదాయమా
- మద్దూరి నరసింహ్మూర్తి