
శ్యామల వేసవి సెలవులకి అమ్మమ్మ గారి వూరెళ్లింది.అసలే వాగుడు కాయ పైగా దానికీ మధ్య పొడుపు కధల పిచ్చి బాగా పెరిగింది.పారంపర్యంగా వచ్చిన పాత పొడుపు కథలతో పాటు,నేటి కాలమాన వ్యవహారాలకు అనుగుణంగా స్వకపోల కల్పనతో క్రొత్త క్రొత్త పొడుపు కధలను సృష్టించి ఎదుటివారి మీదకి సంధిస్తుండేది.దానికి తాతగారి ప్రోత్సాహం మెండుగా వుండేది.
ఒకరోజు తాతయ్య కి బాగా తలపోటు వచ్చింది.శ్యామల అమ్మమ్మ తో,”ఇంట్లో వంకర టింకర సోము వున్నాడా?,వుంటే పట్రా వాణ్నిఅరగ దీసి తాతయ్య తలకి పట్టు వేద్దాం,” అన్నది.
అమ్మమ్మ కి అర్ధం కాక తల పట్టు కున్నది.అప్పుడు తాతయ్య,”శొంఠి కొమ్ము తెచ్చి అరగ దీసి తలకి పట్టు వెయ్యి.చిన్న పిల్లకున్న పాటి జ్ఞానం లేదు,” అని అమ్మమ్మ ని దెప్పి పొడిచాడు.శ్యామల నవ్వింది.అమ్మమ్మ ఉడుక్కుని ,”ఈ బోడి సామెతలు మీ ఇద్దరి కే చెల్లింది లెండి “,అని శొంఠి ని తెచ్చి తాతయ్య తలకి పట్టు వేసింది.అప్పుడు తాతయ్య అమ్మమ్మ తో “పొడుపు కథలన్నవి మన ఆలోచనా విధానాన్ని పెంపొందింప చేసి మానసిక వికాసాన్ని కలిగిస్తాయి,”అన్నాడు.తర్వాత విశ్రాంతి తీసుకోడానికి గదిలోకి వెళ్లి పోయాడు.
ఈ లోగా అమ్మమ్మ శ్యామలతో,”సాయంత్రం పక్కింటి పంకజంతో కలసి ఓ పేరంటానికి వెళుతున్నాను.వచ్చే సరికి ఆలశ్యం కావచ్చు,రాత్రికి వంట వండి నువ్వూ తాతయ్య భోంచేసేయండి”అన్నది. తర్వాత ఆమె గదిలోకెళ్లి ముస్తాబవడం ప్రారంభించింది.ఇంతలో పక్కింటి పంకజం పిలవడంతో అమ్మమ్మ బయలు దేరుతూ శ్యామలతో కుంపటిలో వేడి పాలు మరుగు తున్నాయి తాతయ్యకి వెండి లోటాలో పోసిఇవ్వు,”అని చెప్పి అంతే హడావుడిగా వీధి తలుపు దగ్గరికి వేయడం కూడా మరిచి పంకజంతొ కలసి పేరంటానికి వెళ్లి పోయింది.
శ్యామల వెండి లోటాలో పాలు పోసుకొచ్చి తాతయ్య పడుకున్న మంచం పక్కనున్న బల్లమీద వుంచి తిరిగి వంటగదిలోకి వెళ్లి పోయింది.
పట్టపగలు తలుపులు తెరిచివున్న ఇళ్లలో జొరబడి దొరికింది దోచుకెళ్ళే దొంగొకడు వీధిలో తచ్చాడుతూ అమ్మమ్మ తలుపు చేరవేయకుండా హడావిడిగా వెళ్లడం గమనించి ఇంట్లోకి తొంగి చూసాడు.వాడికి వీధి కి నేరుగా వున్న గదిలో ముసుగు దన్ని పడుకున్న తాతయ్య ,పక్కనే బల్ల మీదున్న వెండి లోటా కన పడ్డాయి.ఇంట్లో మరే అలికిడి లేక పోవడంతో వాడు నేరుగా తాతయ్య గదిలోకి ప్రవేశించాడు.ఇంతలొ వెనక ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు కావడం తో వాడు చప్పున గదిలోని తలుపు వెనక నక్కాడు.శ్యామల గదిలోకి వచ్చి,”నాలుగు వస్తువులు తనలో దాచుకున్న నంగనాచి కుర్రోడు నీ పక్కన వున్నాడు తాతయ్యా కాస్త చూసుకో,”అని తిరిగి వంట పని చూసు కోడానికి వంట గదిలోకి వెళ్లి పోయింది .
శ్యామల మాటలు విన్న దొంగకి పై ప్రాణాలు అమాంతం పైకెళ్లాయి.వాడు అంతకు ముందే ఒక ఇంట్లో నాలుగు విలువైన వస్తువులు దొంగిలించి తన దట్టీ లో దాచుకుని వున్నాడు,వాడు తనలో తను,ఈ పిల్లెవరో అసాధ్యురాల్లా వుంది.తను రావడం పసిగట్టడమే కాకుండా నాదగ్గరున్న నాలుగు వస్తువుల ఆచూకి కూడా కని పెట్టేసింది.ఇప్పుడు ఎలారా దేవుడా అని తలుపు వెనక చేరి కొట్టు మిట్టాడ సాగాడు.
శ్యామల అన్నమాటలు తాతయ్యకి మాత్రం బాగా అర్థం అయ్యాయి.ఆమె తన కోసం పాలు తెచ్చి పక్కన బల్ల మీద పెట్టిందని,ఎందు కంటె,పెరుగు,మజ్జిగ,వెన్న,నెయ్యి లాంటి నాలుగు రకాలను తనలో దాచుకుని ఒకటిగా కనిపించేది పాలే కదా!
తాతయ్య బధ్దకం వదిలించుకుని లేచి పాలు త్రాగాడు.తనూ మనమరాలికి ధీటుగా ఓ పొడుపు కధ వేయాలని ఆయనకనిపించింది.ఆయన వంట గదిలో వున్న శ్యామల కి వినిపించేలా ఇలా అన్నాడు,” సందుగు పెట్టెలో వున్న ఏడుగురు సక్రమంగా వున్నారా తల్లీ,”అందుకు శ్యామల వెంటనే,”వున్నారు తాతయ్య,మిడిగ్రుడ్లోడె కాస్త మొరాయిస్తుంటె రోకలితొ నాలుగు వాయించా,”అని గట్టిగా తాతయ్యకి వినపడేలా అన్నది.తాతయ్య మళ్లీ పడుకొని ముసుగు బిగించాడు.
ఇంతకీ వీళ్ళు మాట్లాడు కున్నదేమంటే,పోపుల డబ్బాలో జీలకర్ర,ఆవాలు లాంటి తదితర ఏడు వస్తువులు సక్రమంగా వున్నాయా అని తాతయ్య అడిగాడు. అర్ధంచేసుకున్న శ్యామల మిరియాలను చారు కాయడానికి రోట్లొ వేసి రోకలితొ దంచుతున్నట్లు సమాధానమిచ్చింది.
కాని ,తలుపు వెనక నక్కిన దొంగకి మాత్రం ఈ తాత మనవరాలి , మాటలు మరోలా అర్థం అయ్యాయి.వీళ్లు కాక ఇంట్లో మరో ఏడుగురు వున్నారన్నమాట .వాడికి నిలువునా వణుకు వచ్చింది .ఏక్షణం లో అయి నా ఆ పిల్ల ఆ ఏడుగురిని రోకలి తో సహ తీసుకుని వచ్చి తనమీద దాడికి దిగొచ్చు.అంతకంటే ముందు తనిక్కడ నుండి చల్లగ జారు కోవడం మేలు.ఉన్న ఆ నాలుగు వస్తువులైనా దక్కుతాయి.ఇలా ఆలోచించిన దొంగ ఒక్క ఉదుటన బైట పడి పారిపోయాడు.