
చెన్నయి విమానాశ్రయం.
ప్రయాణీకుల లాంజ్ లోనికి ప్రవేశించిన ఉదయ్ కొద్ది దూరంలో ఖరీదైన సూటులో వున్న యువతిని చూసి, రాణీ!అని పిలిచాడు. అతడిని చూస్తూనే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
“హాయ్! ఉదయ్! ఎన్నాళ్లకు”అంటూ ఆమె అతడిని స్నేహపూర్వకంగా కౌగలించుకుంది .
“అమెరికా నుంచి వచ్చేసి వారం రోజులైంది. నువ్వు మంచి వుద్యోగంలో వున్నావని తెలిసింది. కంగ్రాట్స్.’
“ ఆహా!నీ దయవల్ల సియ్యే అయిన తర్వాత, ఒక కన్సల్టన్సీలో చేరాను. నా సామర్ధ్యం నచ్చి నన్ను ఇందూ ఇండస్ట్రీస్ యెండీ తన ఎక్సిక్యూటివ్ అసిస్టెంట్ గా తీసుకున్నాడు.” అని చెప్పింది రాణీ సంతోషంగా.
“గుడ్. అవకాశాలను అందిపుచ్చుకోవడమే కదా సామర్ధ్యం?”
“మా ఆడపిల్లల విషయంలో, అందుకోవడం కాదు, పోరాడి గెలుచుకోవడమే. పోరాడే ఆడదాన్నిఇంగ్లీషులో డెవిల్ అంటారు, పురుషుడిని మొనగాడంటారు.”
“నువ్వు మారలేదు. అదే ధైర్యం, అదే పోరాట స్పూర్తి.”
“థాంక్స్. బహుశా ఈ కార్పొరేట్ ప్రపంచంలోకి రాకుండా వుంటే వేరేలా వుండేదాన్నేమో?”
“నిజమే, ఇది పోటీ ప్రపంచం. ఎవరి స్వార్ధం వారిది. ఇంతకీ నీవుండేది యెక్కడ.?”
“చెన్నయి. కానీ ఎక్కువ రోజులు టూరులో వుంటాను.”
ఇంతలో బెంగళూరు విమానం బోర్డింగ్ అనౌన్స్ చేసారు. మళ్ళీ కలుద్దామని చెప్పుకుని ఫోన్ నంబర్లు ఒకరికొకరు యిచ్చిపుచ్చుకున్నారు. డిల్లీకి వెళ్ళే విమానంలో కూర్చున్న ఉదయ్ కి కాలేజి రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. పెంకి పిల్ల, పోట్ల గిత్త, రౌడీ లాంటి పేర్లతో చలామణి అయ్యే రాణి తో తను నెరపిన స్నేహం, గుర్తుకొచ్చి అతని పెదవులపై చిరు దరహాసం మెరిసింది. అతని మనసు గతంలోకి పరుగు తీసింది.
@@@
ప్రభుత్వ సైన్సు & ఆర్ట్స్ కళాశాల.
బీ కాం మొదటి సంవత్సరం. విద్యార్ధినీ విద్యార్ధులు కలిసీ కూర్చునే పద్దతి వుండడం వల్ల ఆడ పిల్లలతో పరిచయాలు సులభంగా అయ్యేవి. ఆడపిల్లలందరిలో రాణీని రౌడీ అనేవారు. ఆమె మిగిలిన ఆడపిల్లలతో పోలిస్తే భిన్నంగా వుండేది. సాధారణంగా, జీన్స్ ధరించి, ఎటువంటి మేకప్ లేకుండా వచ్చేది. అలా వున్నా కూడా, ఆమె చూపులకు అందంగా, ఆకర్షణీయంగా వుండేది. ఆమె మగపిల్లలతో స్వేచ్చగా ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడేది. ఒక నెలరోజులు పాటు, ఆమెను గమనించిన తర్వాత, ఒక రోజు ఉదయ్ ఒంటరిగా వున్న రాణీని అడిగాడు.
“నిన్ను కొందరు ఎందుకు రౌడీ అంటున్నారు?”
“వాళ్ళకలా అనిపించింది.” అంటూ రాణి నవ్వేసింది. ఆమే స్వచ్చమైన నవ్వు ఉదయ్ కి నచ్చింది.
“కాదులే! చెప్పరాదూ, నాకు తెలుసుకోవాలని వుంది.” అన్నాడు ఆసక్తి కనబరుస్తూ
“ఇంకెప్పుడైనా”, అంటూ రాణి రివ్వున పరిగెత్తి మాయమైంది.
అక్కడే కొద్దిదూరంలో వున్న హరిణి, “నన్నడుగు చెప్తాను”, అంది ఉదయ్ తో.
“సరే! చెప్పు” అన్నాడు ఉదయ్.
హరిణి వచ్చి అతని ప్రక్కన కూర్చుని యిలా చెప్పింది.
“ దాన్ని రౌడీ అని ప్రేమగా అనేది మా వూరిపిల్లలే. రాణిది మావూరే. ఆమె తండ్రి త్రాగుబోతు. రోజూ త్రాగొచ్చి, తల్లిని తిట్టడం, కొట్టడం చేస్తూంటే, ఒక రోజు రాణి అతనికి యెదురు తిరిగింది. తల్లి వంటి మీద దెబ్బ వేస్తే చంపిపాతరేస్తానని బెదిరించింది. ఆ రోజునుంచి పూర్తిగా ఆయన మాట వినడం మానేసి. తనకు నచ్చినట్లు చదవడం, ఆటలాడడం చేసేది. తనను గాని, తన అక్కను గాని మగపిల్లలు హేళనగా ఒక మాట అంటే చాలు పరుగెత్తించి కొట్టేది. అలా దానికి పెంకి ఘటం, రౌడీగా పేరు వచ్చింది. ఒక్క సారి వాళ్ల అక్క చెయ్యిపట్టుకుని ఒకడు అల్లరి చేయబోతే, రాణి వాడి చెయ్యి విరగ్గొట్టింది. ఆ అబ్బాయి తండ్రి వూరిపెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు. రాణి ఎంతమాత్రం భయపడకుండా, వారి ముందు నిలబడింది. ఇది తెలిసిన వెంటనే మా వూళ్ళో ఆడవారు వచ్చి అల్లరి మూక చేష్టలను యెండగట్టి, రాణి చర్యను సమర్ధించారు. చేసేది లేక ఆ అబ్బాయి తండ్రి, వెళ్ళిపోయాడు. అలా రాణీ మా వూరి రుద్రమ గా పేరుతెచ్చుకుంది. తను కరాటే నేర్చుకుంది. మంచి బాడ్మింటన్ ప్లేయర్. చదువులో ముందుంటుంది. అదీ రాణి కథ” అని హరిణి చెప్పడం ముగించింది.
రాణీ గురించి తెలిసాక, ఉదయ్ కు ఆమె పట్ల ఒక గౌరవభావమేర్పడింది. ఆమెతో స్నేహం చేసి, ఆమెకు చదువులో తోడ్పడాలనుకున్నాడు.
పలకరిస్తే “హాయ్” అని వెళ్ళిపోతున్న ఆమెను ఒక రోజు “ఏమిటి? నన్ను చూసి పారిపోతున్నావు?” అని వెక్కిరించాడు. అంతే. అతననుకున్నట్లే ఆమె ఆగింది
“అలా అనిపించిందా నీకు! నేనింకా పని లేని వారితో పెత్తనాలెందుకనుకున్నా. విషయమేమిటి?” అని నిలదీసింది.
“ఇలా రా! ఒక నిమిషం,” అంటూ కళాశాల ఆవరణలో తనకు దగ్గరలో వున్న చెట్టు క్రిందికి వెళ్ళాడు. ఆమె వచ్చి అతని కభిముఖంగా నిలబడింది.
“నీ గురించి తెలుసుకున్నాను. నీ ధైర్యానికి , పోరాట పటిమకు నా అభినందనలు. నీ చదువుకు లక్ష్యమేమిటొ తెలుసుకుందామని నిన్ను ఆపాను.”
రాణి అనుమానంగా చూస్తూ, “నీ కెందుకు?” అని పుల్లవిరుపుగా అంది.
‘యిష్టం లేకుంటే చెప్పకు. తోటి విద్యార్ధిగా అడిగాను,’ అన్నాడు ఉదయ్ నవ్వుతూ.
ఒక నిమిషం మౌనంగా వుండి, “ సియ్యే చేయాలని నా కోరిక” అంది నెమ్మదిగా.
“మా పెదనాన్న ప్రాక్టీస్ చేస్తున్నచార్టర్డ్ అకౌంటెంట్. ఈ వూళ్ళోనే. నేను చెప్తే ఆయన నీకు గైడెన్సు యిస్తారు. ఈ ఆదివారం వుదయం వెళ్దామా?”
రాణి సందేహంగా అడిగింది. “నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు?”
‘నీకు మంచి స్నేహితుడిగా వుండాలని. ఇష్టం లేకుంటే బలవంతం లేదు’ అన్నాడు ఉదయ్. నిర్వికారంగా వున్న అతని వదనాన్నిచూసి రాణి, “నమ్ముతున్నాను” అంటూ చేయి చాచి కరచాలనం చేసింది.
అలా మొదలైన వారి స్నేహం, కలిసి చదువుకోవడంవల్ల , ఒకరి అభిప్రాయలను, మరొకరు గౌరవించడం వల్ల, బలపడింది. అలా సాగుతున్న వారి స్నేహ బంధానికి ఒకనాడు చిన్న పరీక్ష యెదురయ్యింది.
రాణి తరచుగా, ఆ కళాశాల పాలిటిక్స్ మాస్టారు రఘుతో మాట్ల్లాడడం గమనించిన ఉదయ్, ఆమెనొక రోజు “ఏం జరుగుతోంది?” అని ప్రశ్నించాడు. రాణికి అతనలా ప్రశ్నించడం నచ్చలేదు.
ఆమె ముఖ కవళికలను గమనించిన ఉదయ్ వెంటనే, “సారీ! నీ వ్యక్తిగతమైతే చెప్పకు” అని మాట మార్చాడు. అతనలా అపరాధ భావం ప్రకటించడంతో, రాణి నొచ్చుకుని, స్నేహపూర్వకంగా యిలా చెప్పింది.
“సారీ! నీకు చెప్పివుండాల్సింది. ఆయన, మా అక్క సుజాత ప్రేమించుకున్నారు. మా నాన్నను కలిసి ఆయన, తమ ప్రేమ విషయం చెపితే, వీలు కాదని చెప్పి, మా నాన్న మొన్న వేసవిలో అక్కనొక గవర్నమెంట్ వుద్యోగికిచ్చి పెళ్ళి చేసాడు. అదే చెప్పి రఘుగారు బాధ పడుతున్నారు.”
“పాపం! మీ అక్క యెలా వుందో! భర్త మంచి వాడైతే ఈ ప్రేమను మర్చిపోగలుగుతుంది.” అన్నాడు ఓదార్పుగా.
రాణీ మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయింది. ఆమె మనసులో అగ్ని పర్వతాలున్నాయని, అవి ఒక రోజు పేలతాయని ఆనాడు అతడికి తెలియదు.
దాదాపు నెలరోజుల తర్వాత ఒక వార్తతో ఆ వూరూ, కళాశాల అట్టుడికిపోయాయి.
రాణీ అనే అమ్మాయి ఆమె బావ పురుషాంగం కొరికేసిందని, రాత్రి నిద్రపోతున్న సమయంలో మృగంలా మీద పడి అత్యాచారం చేయబోయిన అక్క భర్త నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో ఆమె యిలా చేసిందని టీవీలో మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. రాణి యెలాగుందో, పోలీసుల అదుపులో వుందా అని ఉదయ్ భయపడిపోయాడు.
ఇంతలో హరిణినుంచి ఫోన్ వచ్చింది.
“రాణి ని ఆస్పత్రిలోచేర్చారు. గాయాలకు చికిత్స జరుగుతోంది. తనకేం పరవాలేదు. మన ప్రిన్సిపాల్ కూడా యిక్కడే వున్నారు. నిన్నుగాభరా పడవద్దని చెప్పింది”. .
ఆమె క్షేమ సమాచారం తెలిసాక, ఉదయ్ మనసు కుదుటపడింది. మరునాటికే ఆ సంఘటన మరుగున పడింది. పది రోజుల తర్వాత రాణి క్లాసులకు హాజరయ్యింది. మెల్లగా ఒక రోజు, రాణి ఉదయ్ కి అసలేం జరిగిందో వివరంగా చెప్పింది.
“బావ ఒక సెక్స్ సైకో. శోభనం రాత్రి ఆ దరిద్రుడు మాఅక్కకి వూహించని షాక్ యిచ్చాడు. అతడు మా అక్కతో, ఈ ప్రపంచంలో అన్నింటికన్నాయెక్కువ తృప్తినిచ్చేది సెక్స్. ఈ సొసైటీ దానినొక పాపంగా చూడడం మన దురదృష్టం. అందుకే నేను, నా స్నేహితులం కలిసి ఒక ఒప్పందానికి వచ్చాము. అదే భార్యల మార్పిడి. రాత్రి నువ్వు నా స్నేహితుడితో గడిపితే, అతని భార్య నాతో గడుపుతుంది. నచ్చిందా! ఇది అదృష్టం కదూ! అని వుత్సాహంగా చెప్పాడు.
బావ మాటలకు అక్క అదిరిపడింది. ఏదో గుట్టుగా బ్రతుకుదామనుకుంటే ఈ గోల యేమిటి అని తల్లడిల్లిపోయింది. బావతో కరాఖండిగా, ఇది నా వల్ల కాదు. మీరెలా వూరేగినా మీ యిష్టం. నా జోలికి రాకం డని చెప్పింది. బావ కోపంతో వూగిపోతూ అక్కను గొడ్డును బాదినట్టు బాదాడు. అప్పట్నుంచి అక్కను మానసికంగా హింసించడ మొక పనిగా పెట్టుకున్నాడు. శని, ఆదివారాలు అమ్మాయిలను ఇంటికి తెచ్చి అక్కను హేళన చేస్తూ వాళ్ళతో సరసాలాడేవాడు”.
‘వినడానికి అసహ్యంగా వుంది. మీ అక్క యెలా కాపురం చేస్తోందో ? ‘ అని సానుభూతి చూపాడు ఉదయ్.
“అవును. నిజానికి మా అక్క ఈవిషయం దాచింది. తను చేస్తోంది గొప్పపని అని నమ్మిన మా బావే నాకీ విషయం చెప్పి, నన్ను తనతో గడపమని కోరాడు. తన స్నేహితులకు పరిచయం చేస్తానన్నాడు. అక్కలా జడ పదార్ధంలా వుండడం అవివేకమని హితవు చెప్పాడు. అప్పుడే బావకి శాస్తి చేసి, ఆక్కకు విడాకులిప్పించాలని పధకం వేసాను. రఘు మాస్టారును కలిసి అక్క పరిస్థితి చెప్పి, విడాకులు తీసుకుంటే పెళ్ళి చేసుకొంటారా? అని అడిగాను. ఆయన తప్పక చేసుకుంటానని మాటయిచ్చారు.”
‘”పులి నోట్లో తలబెట్టి, పులిని చావగొట్టిన వీర నారీ మణివన్న మాట”, అన్నాడు ఉదయ్ ప్రశంసాపూర్వకంగా.
“అవును. ఒక రోజు మా బావని కాస్త రెచ్చగొట్టేలా ప్రవర్తించాను. అంతే, ఆ నాటి రాత్రి, మా బావ త్రాగి వచ్చి నామీద పడ్డాడు. ముందు జాగ్రత్తలో వున్న నేను వాడిని గాయపరిచాను. అంతే! నా దెబ్బకి గాయ పడి హాస్పిటల్ పాలయ్యాడు. కేసు దెబ్బకి పరువెలాగో పోయింది, వుద్యోగమైనా నిలబెట్టు కుందామని రాజీ కొచ్చాడు. లంచాలతో పొలీసుని, మీడీయాను సైలెంట్ చేసాడు. అక్కకు విడాకులు త్వరలో వస్తాయి.”
ఆనందంతో చెప్తున్న రాణి ని చూసి ఉదయ్ నవ్వుకుంటూ,“ నీవు సామాన్య స్త్రీవి కావు, ఒక యోధవి ”అని అభినందించాడు.
@@@
బెంగళూరు చేరిన వుదయ్, వుద్యోగంలో జాయినయ్యాడు. ఒక చక్కని అపార్టుమెంట్ అద్దెకు తీసుకున్నాడు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వుంది. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళనక్కరలేదు. ఈ విషయం రాణీకి చెబుదామని మరుసటి రోజు ఉదయమే ఫోన్ చేసాడు.
వెంటనే ఫోన్ అందుకున్న, రాణి అడిగింది.”‘ఎక్కడనుండి? ఎలా వున్నావు?”
“బెంగళూరులో వున్నాను. ఇక్కడే వుద్యోగం. నువ్వెక్కడ?”
“కంగ్రాట్స్. నేనిప్పుడు బెంగళూర్లో హోటల్ గదిలో వున్నాను.”
“అక్కడెందుకు? ఇంటికి వచ్చెయ్యి?”
“జలుబూ దగ్గు. గత వారం నుంచి చంపేస్తున్నాయి. నీకు కూడా అంటుకుంటాయి.”
“వంట్లో బాగోలేనప్పుడు హోటలెందుకు? లొకేషన్ పంపుతున్నాను. వెంటనే బయలుదేరి రా! రాగలవా, నేను రానా?” అని ఆదుర్దాగా అడిగాడు ఉదయ్.
అతని పిలుపులో ధ్వనించిన ఆప్యాయతని అర్ధం చేసుకున్న ఆమె మనసు ఆర్ద్రమైంది.
“వద్దు. లొకేషన్ వచ్చింది. దూరం పది కిలోమీటర్లే. నేనే వస్తాను,” అని జవాబిచ్చింది.
ఒక గంట తర్వాత రాణి తన సామానుతో వచ్చింది. తన వెంట వచ్చిన యువతిని తన సహోద్యోగి స్వాతి యని, ఉదయ్ కి పరిచయం చేసింది.
ఉదయ్ ఇద్దరినీ ఆహ్వానించి, యిల్లు చూపించాడు. టీ త్రాగి, కాసేపు కబుర్లు చెప్పి స్వాతి వెళ్ళిపోయింది. ఈ కొద్ది సమయంలోనే రాణి నాలుగైదు సార్లు దగ్గడం చూసి,”మందులు వాడుతున్నావా, డాక్టరేం చెప్పాడు?” అని అడిగాడు.
“ఎగువ శ్వాసకోశ సంక్రమణ, ఇదొక వైరల్ వ్యాధి అన్నాడు. టాబ్లెట్స్ యిచ్చాడు కానీ, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, యూకలిప్టస్ తో ఆవిరి పట్టడం, ఉప్పు నీటితో పుక్కిలించడం వగైరా వుపశమనాలు చెయ్యాలన్నాడు. రెండు వారాలకు పైగా వుంటుందట. ఒక వారమైంది.”
“అయితే రా! పడుకుని విశ్రాంతి తీసుకో”అంటూ ఆమె చేయి పట్టుకుని పడకగదికి తీసుకెళ్ళాడు.
“త్రాగడానికి గోరు వెచ్చని నీరు, వుమ్మి వేయడానికో పాత్ర, యిక్కడున్నాయి,” అని చూపించాడు. ఆమె పడుకున్నాక, పల్చని దుప్పటి కప్పి,”ఏం కావాలన్నా పిలు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.
రాణి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంది.
@@@
స్వాతి ప్రతి రోజూ యేదో ఒక సమయంలో వచ్చి వెడుతోంది. ఒక రోజు స్వాతి, రాణి నడిగింది.
“మీకు ఉదయ్ అంటే యిష్టం , ఆయనకి కూడా మీరంటే ఇష్టమే కదా! మీరెందుకు పెళ్ళి చేసుకోరు?”
రాణి దిగులుగా బదులిచ్చింది.”ఉదయ్ నాకున్న ఒకే ఒక ఆప్తమిత్రుడు. నా శ్రేయోభిలాషి. అందుకే నేను నా ప్రేమను చెప్పలేక పోతున్నా” .
“ఆయనకు కూడా అదే భావన అనుకుంటా. బహుశా మీ కెరీర్ కి తను అడ్డుకాకూడదని ఆయన మీకు ప్రపోజ్ చేయలేదు. మీరే ముందు ప్రపోజ్ చెయ్యాలి” అని సలహా యిచ్చింది స్వాతి,
“నా గతం తెలిస్తే, నువ్వీ సలహా యివ్వవు. ఇంట్లో తాగుబోతు తండ్రిని, వూళ్ళో అల్లరి మూకని యెదిరించిన రౌడీ పిల్లని. ఒక సైకోని గాయపరిచిన నేరస్తురాలిని. కార్పొరేట్ పోటీ ప్రపంచంలో మగరాయుడిలా తిరిగే, నన్నెవ్వరూ పెళ్ళి చేసుకోవడానికి యిష్టపడరు.” అని తన మనసులోని బాధను వ్యక్త పరిచింది.
ఆమె బాధని చూసి, యేమనాలో అర్ద్ధం కాక స్వాతి కొద్ది సేపు మౌనంగా వుండిపోయింది. ఆ తర్వాత మృదువయిన స్వరంతో నవ్వుతూ అంది.
“ఎవరి సంగతో మనకెందుకు? ఉదయ్ మిమ్మల్నే కోరుకుంటున్నాడని నా నమ్మకం.”
@@@
నాలుగు రోజుల తర్వాత రాణి కి దగ్గు తగ్గింది. ఆమె హోటలుకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని ఉదయ్ తో యిలా చెప్పింది.
" మేమొక కంపనీ కొనుగోలు విషయంగా వచ్చాం. మూడు రోజుల్లో మా యెండీ వస్తున్నాడు. ఈ టైములో నేనక్కడ వుండడం అవసరం. ఈ డీల్ పూర్తయ్యాక నేను ఉద్యోగం వదిలేస్తాను. మా బాస్ నా స్థానంలో తన మేనల్లుడిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు . నిజానికి, నేను అతని కోరిక తీర్చనందుకు యెప్పుడో వుద్వాసన చెప్పాలి. కానీ, నా అవసరం వుండబట్టి నన్ను వదులుకోలేదు. గౌరవంగా నేనే రాజీనామా చేస్తాను." అంది రాణి నిర్విచారంగా.
“అలాగా! మరి వేరే వుద్యోగం చూసుకున్నావా? .
" లేదు. కొన్నాళ్ళు ఇంట్లో వుందామనుకుంటున్నా. అమ్మా,నాన్నా పెళ్ళి చేసుకోమని గోల పెడుతున్నారు. కానీ నా బయోడేటా తెలిసిన వాడేవడూ నన్ను చేసుకోవడానికి సాహసించడం లేదు."
“అది నా అదృష్టం. ఆ దేవుడు నిన్ను నాకోసమే పుట్టించాడు."
ఉదయ్ మాటలకు రాణి వులిక్కి పడింది
"ఏమంటున్నావు? నీ తల్లి దండ్రులు ఒక రౌడీ పిల్లని యిష్టపడతారా?”
"వాళ్ళకి ఎప్పుడూ ఇష్టమే. ఒక ధీర వనిత కోడలుగా రావాలన్నది వారి కోరిక. రేపు వాళ్ళు వస్తున్నారు, మనల్ని ఆశీర్వదించడానికి"
"నిజమా?" ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొనగా అడిగింది రాణి.
"మీ అక్కా, బావా, అమ్మా నాన్నా కూడా వస్తున్నారు. ఎల్లుండి మన నిశ్చితార్ధం"
చిరునవ్వుతో ఉదయ్ చెబుతున్న మాటలకు రాణి కళ్ళప్పగించి ఉదయ్ ని చూస్తూ స్థాణువులా నిలిచిపోయింది.
ఒక నిమిషం తర్వాత తేరుకుని, " నాతో ఒక్క మాటైన చెప్పకుండా."
ఆమె మాటలకు అడ్డుపడుతూ, "నా రాణి మనసు నాకు తెలియదా? నిన్నింక ఎక్కడికీ పోనివ్వను. నువ్వు నా భార్యగా నాతోనే వుండాలి"అంటూ ఉదయ్, ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరకి తీసుకున్నాడు . " నేనెంత అదృష్ట వంతురాలిని. " అంటూ రాణి అతడిని కౌగలించుకుంది.
@@@@@