
" ఓలె మంగా,, ఆటలు ఆపి ఆ పేడకల్లు ఈ తట్టలో ఎయ్యి " కూతుర్ని
గదమాయించింది నూకాలు.
అగ్రహారం గ్రామంలో నివాసం ఉండే నూకాలమ్మ ఊళ్లో పసువుల
పేడను తెచ్చి పిడకలు చేసి అమ్ముకుని కూతురు మంగను పోషిస్తోంది.
ఒకరోజు ఉదయం నూకాలమ్మ గుడిసె ముందు పిడకలు ఎండబెడుతుంటె
ఏడేళ్ల మంగ తల్లి దగ్గరకు వచ్చి " అమ్మా, నేను బడికి పోయి సదువుకుంటానె"
అంది.
" ఒల్లకుండు. కూలి పనులు సేసుకుబతికే మనకి సదువులెందుకె. దివాణం
గారింట్లో పాచిపనులు సెయ్యడానికి పిల్లను పంపమని కబురెట్టినారు.
అమాస్య పోయినాక పంపుతానన్నాను" చెప్పింది నూకాలమ్మ.
మంగ మాటలు విన్న పక్క గుడిసె లోని నర్సమ్మ " నూకాలు, గుంటది
బడికిపోతానని ముచ్చట పడుతోంది. బడిలో బట్టలు ఇచ్చి మద్యాహ్నం
పిల్లలకు బువ్వ పెడతారట. ఊళ్లోనే బడి కదా, పోనివ్వు " అంది.
" ఆ, సూద్దాం లే " అంది నూకాలమ్మ.
కొద్ది రోజుల తర్వాత ఆ ఊరి బడిలో పనిచేసే జానకి టీచర్
పని మీద పంచాయతీ ఆఫీసుకి వచ్చినప్పుడు అక్కడ తోటి పిల్లలతొ
ఆడుకుంటున్న మంగ, టీచర్ దగ్గరకెళ్లి తను బడికి వచ్చి చదువుకుంటానని,
అమ్మకి చెప్పమని బ్రతిమాలుకుంది.
నూని లేక ఎండిన చింపిరి జుత్తు, చిరిగిన లంగా జాకెట్టుతో అమాయకంగా
ఉన్న మొహం, ఆపిల్లకు చదువు మీద ఆసక్తి చూసి జానకి టీచర్ కు జాలి కలిగింది.
మర్నాడు నూకాలమ్మను పిలిపించి ఆడపిల్లలకు చదువు ఆవశ్యకత, ప్రభుత్వం
పిల్లల చదువుల కోసం చేస్తున్న సౌకర్యాలు తెలియచెప్పి బడికి పంపమని
నచ్చచెప్పింది.
జానకి టీచర్ మాటలు పనిచేసాయి. ఊళ్లోనే బడి కనుక మంగను
పాఠశాలకు పంపడానికి ఒప్పుకుంది నూకాలమ్మ.
చింపిరిజుత్తు, చిరిగిన లంగా జాకెట్టుతో బడికి వచ్చిన మంగను
చూసి జానకి టీచర్ మనసు కరిగింది. మంగకు సరిపడిన స్కూల్
యూనిఫామ్, పుస్తకాలు, పెన్ను బేగు సమకూర్చింది. పండగలకు
కొత్త బట్టలు కొని పెట్టేది.
మంగ నిరక్షరాస్య నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువంటే ఎంతో
శ్రద్ధ చూపుతోంది.చురుకైన పిల్ల. ఒకసారి విన్నది జ్ఞాపకం ఉంచుకుంటోది.
అది గమనించిన జానకి టీచర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని మంగను
తీర్చిదిద్దేది. తన తెలివి తేటలు చురుకుదనంతో జానకి టీచర్
ప్రొత్సాహంతో ప్రతి తరగతిలో మంచి మార్కులతో పాసవుతు
ఐదవ తరగతి పూర్తి చేసింది.
ఉన్నత పాఠశాలలో చదవాలంటే పక్క ఊరికి వెళ్లవల్సి ఉంటుంది.
నూకాలుకి కూతుర్ని హైస్కూలు చదువుకి పొరుగూరు పంపడం
ఇష్టం లేక చదువు మాన్పించి తనతో పాటు కూలి పనులకు
తీసుకెళ్లడానికి నిశ్చయించింది.
మంగకు మాత్రం పక్క ఊళ్లో కెళ్లి ఉన్నత పాఠశాలలో చదువు
కోవాలని ఉత్సాహంగా ఉంది. తల్లికి నచ్చచెప్పి ఎలాగైనా హైస్కూలుకి
పంపేలా చూడమని జానకి టీచర్ని వేడుకుంది.
చదువులో చురుకైన మంగను ఇలా మట్టిలో మాణిక్యంలా పల్లెటూర్లో
మరుగున ఉండకూడదనుకుంది జానకి టీచర్.
నూకాలమ్మకు నచ్చచెప్పి జిల్లా విద్యాధికారితో మంగ ఆర్థిక పరిస్థితులు
చదువులో ఆ అమ్మాయి తెలివితేటలు చురుకుదనం వివరించి చెప్పి పట్నం
ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించి ఉండటానికి వసతి గృహంలో
మంగకు కావల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది.
మంగ వినయవిధేయతలు, చురుకుదనం ,చదువు పట్ల చూపే శ్రద్ద
గమనించిన గురుకుల అధ్యాపకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు.
ఊరి నుంచి నూకాలమ్మ వీలున్నప్పుడల్లా పట్నం వచ్చి మంగను
ఆమె రూపురేఖలు చూసి మురిసి పోయేది. అలాగే జానకి టీచర్
ప్రోత్సాహం మంగను మరింత ఉత్సాహంగా ఉంచేది.
మంగ ప్రతి తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసవుతు పదవ తరగతి
పబ్లిక్ పరిక్షల్లో జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణి విద్యార్థినిగా వచ్చింది.
ఇప్పుడు మంగ రూపురేఖలు నడవడిక మారిపోయాయి.
విద్యతో పాటు వినయం నమ్రతతో చూసేవారికి సదభిప్రాయం
కలిగేలా ఉంది. జానకి టీచర్ ఆమెకు మార్గదర్సకంగా ఉంటూ
భవిష్యత్ తీర్చి దిద్దుతోంది.
మంగ జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణిలో టెన్తు పాసయినందున
కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వారి కాలేజీలో ఉచిత సీటుతో
పాటు ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ మంజూరైంది.
మంగ చదువులోనే కాకుండా ఆట పాటల్లో రాణిస్తూ మంచి
ర్యాంకుల్లో పాసవుతు జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీలో
చేరి డిగ్రీ ఫైనల్ స్టేట్ ఫస్టు ర్యాంకులో వచ్చి అందరి మన్ననలూ
పొందుతోంది.
నూకాలమ్మ కూతురి ఉన్నతి చూసి పొంగిపోయింది.టీచర్
జానకమ్మ మాట వినకపోయి ఉంటే కూతురు తనలాగే మట్టి
పనులు చేసుకుంటూ బతికేదని బాధపడసాగింది.
డిగ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంకులో పాసయిన మంగ జానకి టీచర్
సలహా మేరకు బి.ఎడ్ ఎంట్రన్స్ రాసి ట్రైనింగు పూర్తి చేసి
టీచర్ గా ఉద్యోగం సంపాదించి తనలాంటి వెనుకబడిన
గ్రామీణ యువత చదువుల కోసం కృషి చేస్తోంది.
మట్టిలో పడున్న తన జీవిత గమనాన్నే మార్చివేసిన జానకి
టీచర్ ఋణం తీర్చలేనిదని కృతజ్ఞతలు తెలియ చేసుకుంది
మంగ ఉరఫ్ మంగతాయారు.
* * *
సమాప్తం