
‘‘ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే... ఉత్తిష్ట....నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం .. ’’ శ్లోకం రాములు వారి గుడి మైకులో శ్రావ్యంగా వస్తోంది.
శ్రావణి వడపప్పు, పానకం సిద్ధం చేస్తోంది.
ఇక కాసేపట్లో సీతమ్మ మాంగళ్యధారణ ఘట్టం కన్నుల పండువగా సాగనుంది. ప్రతి ఏడాది ఆ ఊరి రాముల వారి గుడిలో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సారి ఏర్పాట్లు అన్నీ ఘనంగా సాగుతున్నాయి.
శ్రావణి ఈ ఉత్సవాలకు తన కొడుకు, కోడలు, మనవళ్లను పిలిచింది. వాళ్లు అమెరికా నుండి వస్తారేమోనని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
శ్రావణి భర్త శ్యాం సుందరరావు టీచరు. ప్రభుత్వ బడిలో ముప్పై అయిదేళ్లు చదువు చెప్పి నెల క్రితం రిటరయ్యాడు.
శ్యాం సుందరరావుకి ఇల్లు, వాకిలి, పిల్లలు, తదితరాలు ఏమీ పట్టవు. రామ భక్తుడు.. రాముడు ధ్యాస తప్ప మరేదీలేదు.
అన్నీ తనే చూసుకుంటుంది శ్రావణి. పోయిన నెల రిటైరైనప్పుడు కూడా తనకొడుకు, కోడలు, మనవళ్లు రాలేదు. అందుకే వారిని చూడాలన్న ధ్యాస ఎక్కువైంది శ్రావణికి.
శ్యాం సుందరరావు దీన్ని గ్రహించాడు. మాన సంబంధ బాంధవ్యాలు తగ్గించుకుని భగవంతునిపై మనసు పెట్టమని సూచించేవాడు. అయినా శ్రావణి వినలేదు. కొడుకు, కోడలు, మనవళ్లు దూరమయ్యారు.. అందరూ ఇంట్లో వుంటే ఆ సందడే వేరు..’’ అని భర్త మీద కస్సు మంది శ్రావణి.
ఐహిక సుఖాలు పట్టని ఆనందరావు భార్య మాటలు పట్టించుకోలేదు . అనిర్వచ ఆనందాన్నిచ్చే ఆత్మజ్ఞానం వైపు దృష్టిపెట్టాడు. అందుకే ఆత్మజ్ఞానం లేని అజ్ఞానులకు ఏమి చెప్పినా అర్థం కాదులే..’’ అని లోలోన నవ్వుకుని మౌనంగా వుండిపోయాడు.
సీతారాముల కళ్యాణం రానేవచ్చింది. సీతమ్మ చూడ చక్కగా వుంది. రామయ్య పెళ్లి కొడుకులా ముస్తాబై మెడలో తాళి కడుతుంటే ఆ ఘట్టం చూసి ఆనందించింది శ్రావణి.
అయితే ఆ ఆనందం ఎంతో సమయం నిలువలేదు.
సీతారాముల కళ్యాణం చూసొచ్చిన శ్రావణికి ఇంటిగుమ్మం లోకి అడుగు పెట్టబోయి అవాక్కయింది. అప్పటికే ఇంట్లో కి వచ్చిన కొడుకు, కోడలు, మనవళ్లను చూసి కాస్త తేరుకుని ‘‘ ఎప్పుడొచ్చార్రా? అంతా క్షేమమేనా?’’ అని కుశల ప్రశ్నలు వేసింది శ్రావణి.
అప్పటికే తండ్రి శ్యామ సుందరరావు తనను పట్టించుకోలేదని ముఖం మాడ్చుకున్నాడు కొడుకు కోనేటిరాయుడు. కోడలు సైతం ముఖం ముడుచుకు కూర్చుంది. పిల్లలు ‘‘ ఆకలి..ఆకలి..’’ అంటూ అరవడంతో శ్రావణి భర్త శ్యామ సుందరరావు వద్దకు వెళ్లింది.
టిఫన్ చెయ్యడానికి కూడా సరుకులు ఏమీ లేవు. అంగట్లో తెచ్చిపెడదామనుకున్నా తనవద్ద పైసా లేదు.
శ్రావణిని చూడగానే శ్యామ సుందరరావు అర్థం చేసుకున్నాడు. జేబులోంచి రెండు వందలు తీసి భార్య చేతిలో పెట్టాడు.
రెండు వందలు తీసుకెళ్లి వీధి చివర అంకమ్మవ్వ కొట్లో పాతిక ఇడ్లీలు తెచ్చింది.
బాగా ఆకలితో వున్న కోనేటిరాయుడు వాటిని తిని ‘‘ ఇవేం ఇడ్లీలు పొగ వాసన.. నీళ్ల సాంబారు..అంతదూరం నుండి నాల్గు లక్షలు చార్జీలు పెట్టుకుని ప్లైట్‌లో వస్తే ఇదేనా మీరిచ్చే గౌరవ మర్యాద..కొంచెం కూడా సెన్స్‌లేదు.. నాన్సెన్స్..’’ అంటూ సాంబారు విసిరి కొట్టాడు. అది సరిగ్గా వెళ్లి శ్రావణి ముఖం మీద పడింది. . ఆ కారానికి కళ్లు భగ్గుమన్నాయి. అయినా భరించింది. పల్లెత్తు మా అన్లేదు. లేకలేక పుట్టిన కొడుకు..అందుకే చంకలో వేసుకుని గోరుముద్దలు తిన్పించి గారాబంగా పెంచింది చిన్నప్పట్నుంచి శ్రావణి. అందుకే పెద్దయ్యాక కూడా గారాబం తగ్గలేదు. ఇంకా కొడుకుని చిన్నపిల్లాడిలానే చూస్తోంది.
కోనేటిరాయుడు ఒక్కక్షణం కూడా ఆగలేదు. ‘‘ మాపై కొంచెమైనా ప్రేమలేదు..’’ అని తల్లిమీద కారాలు మిరియాలు నూరి కస్సుమని పైకి లేచాడు. ఎదురింటి ఫ్రెండ్‌కి కారు కోసం ఫోను చేశాడు. ఇక్షక్షణం కూడా ఆలస్యం కాకుండా కారు ఇంటిముందు ఆగింది. కోనేటిరాయుడు కారెక్కి దూసుకుపోయాడు.
శ్రావణికి కళ్లలో కారం ఇంకా తగ్గలేదు. కళ్లను నీళ్లతో కడుగుతూనే వుంది. కళ్లు ఎరుపెక్కాయి.
శ్యాం సుందరరావు చెంబుతో నీళ్లు తెచ్చి భార్య కళ్లు కడిగాడు. మెత్తని టవలుతో కళ్లు తుడిచాడు.
ఇప్పుడు కాస్తమంట తగ్గినట్లు అనిపించింది.
ఓ గంట దాటింది. అయినా శ్రావణి కళ్లు తెరవలేదు. తెరిస్తే కొడుకు ప్రేమకు నోచుకోలేకపోతున్నాననే బాధ కన్నీటి రూపంలో వరదలా వస్తోంది.
అది గ్రహించాడు శ్యాంసుందరరావు. భార్యను దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి రాములవారి గుడిలో ఎవరికెవరు ఈ లోకంలో.. ఎవరికి ఎరుక?ఎటు పోతుందో ఈ దేహం ఎవరికీ తెలియక
..’ అంటూ వస్తోంది పాట..
‘‘ మన జీవితం కూడా అంతే శ్రావణి.. జరిగేవన్ని మన మంచికే.. అనుకుని ఈ జీవితమనే నావను కష్ష్టాల కడలి నుంచి సవ్యంగా నడపాలి..’’ అన్నాడు శ్యామ సుందరరావు.
భర్త మాట అర్థం కాలేదు శ్రావణికి. ఇంత దు:ఖంలోనూ కొడుకు, కోడలు, మనవళ్లకోసం పరితపించి ఎదురుచూడసాగింది.
పైకి లేచి పొయ్యిమీద ఎసరుపెట్టింది. బియ్యం కుతకుత ఉడుకుతోంది. అది ఉడుకుతున్నట్లే కుతకుత ఉడుకుతోంది కోదండరాయుడి మనసు.. తండ్రిమీద పట్టరాని కోపం ప్రదర్శిస్తున్నాడు. తనకు ఆస్తులేవీ సంపాదించలేదన్న కోపం లేనే దాచుకుంటూ రయ్‌మని కారులో వచ్చి ఆగాడు కొడుకు కోనేటిరాయుడు.
అతడు ఇంట్లోకి వచ్చీరాకముందే కొడుక్కి ఇష్టమైన గుత్తివంకాయ కూరచేసింది శ్రావణి.
కొడుకుని కాళ్లు కడుక్కుని రమ్మంది శ్రావణి. ఇష్టమైన గుత్తి వంకాయ కూర వేసి పళ్లెంలో అన్నం వేసింది.
ఈ సారి కొడుకు నవ్వుతూ ‘‘ అమ్మా.. అమ్మా..మొన్న నాన్నకి వచ్చిన రిటైరుమెంటు డబ్బు ఏంచేశారు? అది ఇస్తే బ్యాంకులో వేసి మీకు రెట్టింపు వడ్డీ వచ్చేలా చేస్తా కదా..!’’ అన్నాడు.
ఇంటిలోపలే వున్న శ్యాం సుందరరావు నోరు తెరవలేదు. బయట కొడుకుతో మాట్లాడుతున్న భార్యను చూశాడు.
కొడుకు మాటలకు శ్రావణి ఉప్పొంగి పోయింది. ‘‘ ఆ ఎక్కువ వడ్డీ వచ్చేదేదో చూడరా..మీ నాన్న అసలు ఏమీపట్టించుకోడు..’’ అని చెప్పుకుపోతుంటే శ్యాంసుందరరావు స్థిత ప్రజ్ఞతో మౌనంగా వుండిపోయాడు. జరిగేది జరగకమానదు.. అని దైవాన్ని తలుచుకున్నాడు.
శ్రావణి వంటి నిండి కోరికలే అన్నట్లుగా భర్తకు రిటైరుమెంటులో వచ్చిన డబ్బు పాతిక లక్షలు తనపేరుతో బ్యాంకులో దాచిన సంగతి చెప్పేసింది.
ఇక కొడుకు తల్లి చుట్టూ తిరిగాడు. మరుసటి రోజు బ్యాంకుకు తీసుకెళ్లి తల్లి ఖాతాలో వున్న డబ్బంతా తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆనందంగా ‘‘ ఇక వస్తాం అమ్మా..!’’ అని పలికి రేపే ఈ మొత్తం నీ పేరున మరో బ్యాంకులో డిపాజిట్ చేస్తా.. నెలకు ముఫ్పై వేలు వడ్డీ వస్తుంది..తీస్కోండి’’ అని పలికి అంతా సర్దుకుని కారెక్కి రయ్‌మని దూసుకెల్లారు.
శ్రావణికి ఏం జరుగుతోందో తెలియలేదు. ఆశ మరింత అమాయకురాల్ని చేసింది.
ఆ సాయంత్రం కొడుకు వస్తాడేమో అని ఆశగా చూసింది. రాలేదు..మరుసటి రోజూ ఎదురుచూసింది.. రాలేదు.. ఇక వాళ్ల ఇంటికి వెళ్లిపోయారని నిర్థారించుకుంది.
ఫోన్ చేసింది. లైను కలవలేదు. శ్రావణికి డబ్బు ఏమవుతుందోనని తీవ్ర కలత చెందింది. తనచేయి దాటిన డబ్బు ఇక తనకు దక్కేదెలా?’’ అని దీర్ఘంగా ఆలోచించింది
‘‘ భార్య శ్రావణిని గమనించిన శ్యాంసుందరరావు ‘‘ నేను ముందే చెప్పాను.. డబ్బు చాలా తీపే అయినా అది ఇంకొకరికి ఇచ్చేసే చేదు అవుతుంది. ! నువ్వేం కంగారు పడకు..దైవబలం వున్నంత వరకు మనకే కష్టాలు రావు..’’ అన్నాడు.
శ్రావణికి దైవబలం అన్న పదమే నచ్చలేదు.
నెలనెలా వస్తున్న వడ్డీ చేతికి అందకపోవడంతో శ్రావణి ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఆలోచనలు తీవ్రమై పక్షవాతం వచ్చింది. కాళ్లు చేతులు రాలేదు. శ్రావణికి కొడుకు మీద ఆలోచనలు ఎక్కువయ్యాయి. మంచంమీద నుంచి లేవలేకపోయింది. శ్యాం సుందరరావు ఆటో తీసుకొచ్చి ఇరుగుపొరుగు సాయంతో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ముప్పై లక్షలు ఖర్చయ్యింది. శ్యాం సుందరరావు బ్యాంకులో దాచుకున్న డబ్బంతా ఖాళీ అయ్యింది. కొంచెం కూడా బాధపడలేదు.
శ్రావణికి ఆరోగ్యం కొంత కుదుటపడిరది. ఇంట్లో వుంటూ భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు శ్యాం సుందరరావు. కొద్ది రోజులకే శ్రావణి పూర్తిగా కోలుకుంది. భార్య భుజం, చేయి పట్టుకున్నాడు. అడుగుమీద అడుగు వేసింది. అన్నీ పనులుతనే స్వయంగా చేసుకోసాగింది.
ఇక శ్యాంసుందరరావుకి నిశ్చింత దొరికింది. ఆత్మజ్ఞానం మీద మనసు లగ్నం చేశాడు. తన మార్గంలో తాను నడిచాడు.
శ్రావణికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇంటి సరుకులు తేవడానికి డబ్బులు కనిపించలేదు. తను దాచుకున్న డబ్బులు కనుమరుగవడంతో మళ్లీ ఆవేదన మొదలైంది. ఈ సారి మెదడు నరాలు చిట్లి కంటిచూపు కన్పించలేదు. డబ్బులేక ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. శ్రావణి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించింది.
శ్యాం సుందరావు మిత్రుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పది లక్షలు ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చాడు. వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు శ్యాంసుందరరావు.
తను ప్రాణ మిత్రుడినని సాయం చేయకుండా వుండలేనని చేతిలో పెట్టి వెళ్లాడు. అతని కొడుక్కి ఫోను చేశాడు. అతను తీయలేదు.
వేసవి కావడంతో ఉదయం ఏడు గంటలకే సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. శ్యాం సుందరరావు ఉదయమే ఆటో తీసుకొచ్చి భార్యను ఎక్కించాడు.
శ్రావణికి నోటమాటరాలేదు. ఏదో సైగచేయబోయింది. ఇక దేహం ఈ లోకం విడిచివెళ్లిపోతుందని గ్రహించాడు. మరు క్షణంలోనే శ్రావణికన్ను మూసింది. అతని కొడుకు కోనేటిరాయుడు రాలేదు.
శ్యాంసుందరరావు భార్యకు తలకొరివి పెట్టాడు. ఐహిక సుఖాలు, బంధాలు ఏవీ పట్టని ఆయన అన్ని కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేశాడు. అన్ని ముగిసిన తర్వాత ఏకాకిగా మిగిలాడు. కుంగిపోలేదు. కొడుకు, కోడలు, మనవళ్లు, మనవరాళ్లు గరించి ఆలోచించలేదు.
అన్నీ బాంధవ్యాలు తొలగించుకున్నాడు. తినడానికి తనకుంటూ ఏమీ మిగలకున్నా చింతించలేదు.
ఎదురుగా వున్న రామాలయంలో అన్నదానంలో క్షుద్బాధ తీర్చుకుని ఆత్మజ్ఞానంపై దృష్టిపెట్టాడు. నిత్యం భగవన్నామ స్మరణతో జీవితం గడిపాడు.
ఓ ఏడాది తర్వాత శ్యాంసుదరరావు ఆరోగ్యం క్షీణించింది. నెమ్మదిగా మంచం పట్టాడు. ఇరుగుపొరుగు అతని కుమారుడు కోనేటిరాయుడుకి కబురు పంపారు.
వారం తర్వాత అతను వచ్చాడు. అప్పటికే శ్యాంసుందరరావు తనువు చాలించాడు. ‘‘ మంచి మనిషి ఎన్ని కష్టాలు భరించినా చూసేందుకు కన్న కొడుకు రాకున్నా బాధపడని ధన్యజీవి.. స్థిత ప్రజ్ఞడు’’ అని ప్రశంసించి కర్మక్రియలు ముగించారు.
అంతా అయిన తర్వాత అమ్మానాన్నలను చూడడానికి వచ్చిన కోనేటిరాయుడికి అమ్మ చనిపోయిందని తెలుసుకుని కుమిలిపోయాడు. కన్నతల్లిదండ్రుల్ని కూడా చూసుకోని కర్కశుడు అని నలుగురూ అంటుంటే చేసేదేమీ లేక అమ్మానాన్నల చిత్రపటాలకు దండంపెట్టి ‘నాన్నపేరుపై ఏయే ఆస్తులు వున్నాయి? బ్యాంకు బ్యాలెన్సు ఎంత ? ’ తెలుసుకోవడానికి ఇంట్లో ఆధారాల కోసం వెతికాడు వక్రబుద్ధి వీడని కోనేటిరాయుడు.