
"అమ్మ కి పక్షవాతం వచ్చి పడిపోయింది , అంబులెన్సు కి కాల్ చేశాను ,నువ్వు ఉన్నపళం గా రా అక్క,నాకు కంగారుగా వుంది "ఫోన్ లో చంద్రం గొంతు వణుకుతూ వినపడుతోంది . "అదేమిటిరా నిన్ననేగా యాత్రల నుండి వచ్చింది,ఇంతలో ఏమయిందిరా ? ఇప్పుడే వస్తున్నాను ,రజని కి నేను చెపుతాను ,నువ్వు అమ్మని చూసుకో "పౌర్ణమి కొంచెం ధైర్యం తెచ్చుకొంటూ తాళం వేసి ఆటో అంటూ బయటికి పరుగు తీసింది.
"రజని నువ్వు తొందరగా సీత నర్సింగ్ హోమ్ కి రా,అమ్మకి పక్షవాతం వచ్చింది అని చంద్రం ఫోన్ చేసాడు ,డబ్బు ఏమి అవసరం వస్తుందో ,వాడి దగ్గర అంత సొమ్ము ఉందొ లేదో నువ్వు వస్తూ ఏటిఎం కార్డు తీసుకొని రా, ఇది గో ఆటో అబ్బాయి కొంచెం త్వరగా పోనీ నాయన "ఆయాసం అనిపించి సీట్ లో కొంచెం వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది .
కళ్ళు మూసుకుంది గాని అమ్మ నాన్న చెల్లెలు తమ్ముడు అందరు కళ్ళలో మెదులుతుంటె మనసు గతం లో కి పరుగులు తీసింది.
నాన్న చిన్న ప్రైవేట్ కంపెనీ లో గుమస్తా గా చేసేవారు,అమ్మ చెల్లెలు వేడినీళ్లకు చన్నీళ్ళు తోడు అన్నట్టు ఇంటి దగ్గరే చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఇంటి ఖర్చులు సరిపడా కొంత డబ్బు సంపాదించేవారు.అమ్మ తన మంచితనం తో చుట్టు పక్కల వారికీ సాయం గా వుంటూ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది.
తాత,బామ్మా పోయాక ఊరి లో వున్న చిన్న పెంకుటిల్లు అమ్మి కొత్తగా వచ్చిన కాలనీ లో స్థలం తీసుకొని పైసా పైసా కూడా పెట్టి నాన్న సొంత ఇల్లు అమర్చుకో గలిగారు,అమ్మ మీద వున్న ప్రేమ తో ఇంటికి "అన్నపూర్ణ నిలయం" అని పెట్టారు .పేరు కి తగ్గట్టుగా మా ఇల్లు ఎప్పుడు వచ్చే పోయే చుట్టలతో కళ కళ ఆడుతూ ఉండేది.
నాన్నకి మా అందరితో కలిసిపైన డాబా మీద పడుకొని ,చందమామని చూస్తూ వెన్నెలలో పాత హిందీ పాటలు వింటూ సమయం గడపడం చాల ఇష్టంగా ఉండేది . .నాకు పౌర్ణమి అని ,చెల్లికి రజని అని,తమ్ముడు కి చంద్రం అని పేర్లు కూడా పెట్టు కొన్నారు. కాలం నవ్వుతు తుళ్ళుతూ ఎలా గడిచి పోయిందో తెలియనే లేదు. నా పెళ్లి చేసే నాటికి అమ్మకి కష్టం అంటె ఏమిటో తెలియ కుండా జరిగింది ,
వచ్చే నెలలో రిటైర్ అవుతారు అనగా నాన్న గుండెపోటుతో మరణించారు,నాన్న వీలునామా కూడా రాయ లేదు .ఒక్కసారి గా మా జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి ,నా పెళ్ళికి నాన్న కూడపెట్టిన సొమ్మంతా ఖర్చు పెట్టేసారు ,ప్రైవేట్ వుద్యోగం వలన నాన్న కి పెన్షన్ రాదు .చెల్లెలు రజని పెళ్ళికి ఎదిగి వచ్చింది, తమ్ముడు చందు డిగ్రీ చేసి చిన్న కంపెనీ లో చేరాడు. చెల్లి పెళ్ళికి డబ్బు అవసరానికి అమ్మ తన నగలు అమ్మగా వచ్చిన సొమ్ముతో రజని పెళ్లి చేసారు . చంద్రం పై చదువులకి విదేశాలకి వెళ్లడం కోసం వాడి పేరు మీద ఇల్లు ఉంటెనే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారని,నాన్న ఏంతో అపురూపం గా చూసుకునే ఇంటిని తమ్ముడు పేరు మీదకి మార్చి బ్యాంకు లో తాకట్టు పెట్టి సొమ్ము తీసు కొన్నారు .
కొంచెం మనసు మారుతుందని "నువ్వు యాత్రలు చేసి రా నువ్వు వచ్చాక నేను విదేశాలకి వెళతాను అని అన్న తమ్ముడి బలవంతం తో యాత్రలకి వెళ్లి వచ్చిన అమ్మ సడన్ గా ఇలా పడిపోయింది, "అమ్మ! గిదే మీరు చెప్పిన దవాఖాన "
ఆటోవాడి పిలుపు తో ఆలోచనల నుంచి తేరు కొని "ఎమర్జెన్సీ వార్డ్ ఎటువైపు ? వడివడిగా అడుగులు వేస్తూ లోనికి వెళ్ళింది పౌర్ణమి.
" ప్రాణం కిఏమి ప్రమాదం లేదు ,మాట త్వరగానే వస్తుంది .కొన్నాళ్ళు ఫీజియో థెరపీ చేయించు కొంటె కాలు ,చెయ్యి కూడా స్వాధీనం లోకి రావచ్చు "ఇంక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు .
" MS రెండేళ్లే కదరా, అమ్మని నేను రజని చూసుకొంటాము ,నువ్వు చదువు పూర్తి చేసుకొని రా అని మేము బలవంతం గాఒప్పిస్తే అన్య మనస్కం గానే లండన్ కి వెళ్ళాడు .
రెండేళ్లు అమ్మ చంద్రం కోసం చకోర పక్షి లా ఎదురు చూస్తూ గడిపింది .తిరిగి వచ్చాక చంద్రం లో చాల అనుకోని మార్పు వచ్చింది. లండన్ లో నాకు రోజా అని నా క్లాసుమేట్ పరిచయం అయ్యింది ఆ అమ్మాయి నే చేసుకొంటాను అని మంకు పట్టు పట్టి గుళ్లో పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చేసాడు .
వాడి పెళ్లి తర్వాత అమ్మ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యలో పడ్డ వైనం గా ఇంకా దిగజారి పోయింది . అస్తమాను అమ్మని చులకన చేసి మాట్లాడటం ,అమ్మ కదలలేనిమనిషి అని పని మనిషి ని పెడితె తన ముందే అమ్మని విసుక్కోవడం ,అమ్మ వల్లే తమ జీవితాలు నాశనం అయ్యాయి అని నిందించటం చేస్తున్నాడు . రోజా కూడా మాటల యుద్ధం మొదలు పెట్టింది .నన్ను , రజని ని ఇంటికి రా కూడదు అనిగొడవ చేసింది . అమ్మని చూద్దాము అని వచ్చిన మమ్మలిని మాటలతో కించపరిచేది .
కొత్త జంట కదా కొన్నాళ్ళు అమ్మని మాతో తీసుకొని వెళితె కొంత మార్పు రావచ్చు అని తీసుకొని వెళితె ,మాకు చెప్పకుండా ఇంటికి తాళం వేసి లండన్ కి వెళ్లి పోయారు .
" అదేంటి చంద్రం ఇలా చేసావు ?"అని ఫోన్లో అడిగితె ,మాకు ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు వున్నాయి ,అమ్మని చూసే అవసరం మాకు లేదు ,కావాలంటె నెలకి 5 వేలు పంపిస్తాను అంతె" అని ఫోన్ పెట్టేసాడు . అమ్మకి తెలిసి తన కన్నా కొడుకు ఇలా మాట్లాడతాడని నమ్మ లేక కన్నీరు మున్నీరు గా ఏడ్చింది . అమ్మని ఇంట్లో ఉంచి మేమైనా దగ్గర ఉండి చేసుకుంటాము ,మీరు ఎప్పుడు వస్తారు ?కనీసం చెప్పకుండా , తాళం కూడా ఇవ్వకుండా ఎలా వెళ్లావురా? ఫోన్ లోనే నా మాటకి అడ్డు వస్తు "అక్క ఆ ఇల్లు నాది ,నా పేరు మీద ఉండి .అందులో ఎవ్వరికి హక్కు లేదు,చూడగలిగితె మీరు చూసు కొండి ,లేదా ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఐన చేర్పించండి ,నేను మాత్రం ఎంత డబ్బు ఇవ్వగలను ,మందులకు ఒక్క ఐదు వేలు పంపిస్తాను , అది కూడా నువ్వు మందులు కొన్నాక బిల్లు పెడితె నేను షాప్ వాడికి పంపిస్తాను ."ఇంకా మీతో మాట్లాడ వలసిన పని లేదు అన్నట్టు విసురుగా ఫోన్ డిస్కోనెక్ట చేసాడు.
అమ్మ మానసికం గా చాల దిగులు పడిపోతోంది ,వాడు లేకపోతె ఏమైంది అమ్మ ,మేము వున్నాము కదా అని ఎన్ని సార్లు చెప్పినా,అల్లుళ్ళ పంచన జీవితం గడప వలసి రావటం ఎంత బాధగా ఉందొ అని విల విల ఆడిపోతోంది .ఎప్పుడు ఆ భగవంతుడు నా మోర విని తన వద్దకు పిలుస్తాడా అని విలపిస్తోంది .
"ఎందుకు ఆలా బాధ పడతారు అత్తయ్య ?ఇంటి గుట్టు రచ్చ కి ఎక్కించడం దేనికి అని,చిన్నవాడు కదా వాడే తెలుసు కుంటాడు కదా అని ఇన్నాళ్లు నేను కూడా ఓపిక పట్టాను, ఇంక మన వాడిని చట్ట రీత్యా వెనక్కి రప్పించి ,బుద్ధివచ్చేలా చేస్తే కానీ వినేలా లేడు" ఎప్పుడు వచ్చారో నా మాటలు అమ్మ మాటలు విని పౌర్ణమి భర్త రాఘవగారు.
నిజామా బావ ! చట్టరీత్య ఇది సాధ్య పడుతుందా ?అప్పుడే వచ్చిన రజని అమ్మ పక్కన కూర్చుంటూ అడిగింది.
"అవును మరదలా ,చంద్రం లాంటి ప్రభుద్దులు ఎక్కువ అయ్యారని వయో వృద్ధుల పోషణ ,సంక్షేమ చట్టం-2007 అమలు లోకి వచ్చింది.దీని ద్వారా వారసులు ,కుటుంబ సభ్యులు నిరాదరణ కారణంగా క్షోభకి గురి అవుతున్న ముసలి తల్లి తండ్రులకు ఇది రక్షణ కవచం లా పని చేస్తుంది."
" అంతే కాదు వారసులకు రాసి ఇచ్చిన ఆస్తి గిఫ్ట్ డీడ్ లను రద్దు చేస్తుంది,ఇంక పోషణ నిమిత్తం జీవన భృతి పొందే వీలు కూడా కల్పించింది. ఇంక చంద్రం
చట్టానికి లోబడి చేసిన తప్పు సరి దిద్దు కోవలిసిందే ,మీ లాగా బాధ పడే వారికీ గవర్నమెంట్ కలిపించిన గొప్ప సదవకాశం అత్తయ్య" బావగారి మాటలకూ బలమిస్తూ అత్తగారి కి ఊరట కలిగేలా చెప్పాడు రజని భర్త సాగర్ .
" ఈ చట్టం ద్వారా ఇప్పటి వరకు కిందటి ఏడాది 2,500 గిఫ్ట్ డీడ్ లు ,ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 800 గిఫ్ట్ డీడీలు రద్దు అయ్యాయి,చూసావా ఈ చట్టం వలన పిల్లలు చూడనప్పుడు 60 ఏళ్ళు దాటిన తల్లితండ్రులు ట్రిబునల్ను ఆశ్రయించ వచ్చు.
"ఇప్పుడు అమ్మ ఏమి చెయ్యాలి బావ!"వాడు ఇప్పుడు ఇక్కడ కూడా లేడు కదా?
" పరవాలేదు రజని ,అత్తయ్య కాస్త శక్తి ని కూడదీసుకుని ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేస్తే చాలు , ఒక తెల్ల కాగితం పై వాస్తవాలు రాసుకొని ట్రిబ్యునల్ కి పిటిషన్ దాఖలు చేస్తే చాలు,ఫీజు కూడా చెల్లించ నక్కర లేదు.
వాదనల తర్వాత 90 రోజులలో పరిష్కరిస్తారు.విచారణ తర్వాత వయోవృద్ధులు,తల్లితండ్రులు కోరిన ప్రకారం పిల్లల నుంచి జీవన భృతి,వ్యక్తిగత రక్షణ.పొందేందుకు వీలుంది.
"ఇంకెందుకు ఆలస్యం . అమ్మ !పదండి మీరు ,నేను రజని సాగర్ అందరం వెళ్లి ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసి వద్దాం" ఇలాంటి చట్టం వుంది అని తెలిసి తన తల్లి లాంటి వాళ్ళకి ఇది చట్టం కలిపించిన ఎంత సదావకాశమో అని పౌర్ణమి సంతోష పడుతూ అందరి నోళ్లు తీపి చేసింది.
చట్టం తన పని తానూ చేసుకు పోయిందని మళ్ళీతిరిగి అన్నపూర్ణమ్మగారు కూతుళ్లు ,అల్లుళ్ళ తో తిరిగి ఆ "అన్నపూర్ణ నిలయం" లో అడుగు పెట్టారని ఆశిద్దాము .