
ఋషభుడు భాగవత పురాణంలో ఇరవై రెండు విష్ణువు అవతారములలో ఒకడు. జైన మతముకు మూలపురుషుడైన ఋషభుడిని, అధినాధుడు అని కూడా అంటారు. కొంతమంది పండితులు ఈ అవతారం జైనమతపు మొదటి తీర్థంకరుడితో సమానమని పేర్కొన్నారు. రిషభుడి గురించి ప్రస్తావన మార్కండేయ, బ్రహ్మాండ, స్కంద, విష్ణు పురాణాలలో కూడా కనిపిస్తుంది.
ఋషభ అంటే సర్వోత్తమం, ధర్మం, నిగ్రహం, జ్ఞానం అని అర్థం. జ్ఞానముతో నిగ్రహమును సంపాదించి సర్వోత్తమ ధర్మమును తాను ఆచరించి ఆచరింపచేసిన అవతారమే ఈ ఋషభావతారం. యోగ మార్గం గురంచి ప్రపంచానికి తెలియజేశాడు. ఋషభుడు చేసిన ధర్మోపదేశంను ఋషభోపదేశం అని పిలుస్తారు.
ఆగ్నీధ్రుడు పెద్ద కుమారుడైన నాభి, మేరుదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనేక యజ్ఞాలు, యాగాలు చేశారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం ఇయ్యగా, నీవంటి కుమారుడిని ప్రసాదించమని నాభి విష్ణువును కోరాడు. విష్ణువు అంగీకరించి వారి సంతానంగా జన్మించాడు. ఆ దంపతులు తమ కుమారుడికి ఋషభుడు అని పేరు పెట్టుకున్నారు.
ఋషభుడు బాహ్యపూజలు చేయకపోడంతో ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేయగా, ఋషభుడు తన యోగబలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యంలో వర్షాన్ని కురిపించి, తన తండ్రిని సంతోష పరచాడు. దాంతో ఋషభుడికి పట్టాభిషేకం చేసి, తదనంతరం నాభి తపోవనంకు వెళ్ళిపోయాడు.
ఋషబునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు వందమంది కుమారులు, వారిలో భరతుడు పెద్దవాడు. రెండవ భార్య కుమారుడు బాహుబలి. ఋషభుడు తన కుమారులకు అన్ని ఆచారాలను ఉపదేశించి తన రాజ్యాన్ని కురువు, హిరణ్మయము, రమణకము, భాద్రశ్వము, ఇలావ్రుతము, కేతుమల్యము, హరివర్శము, భారతవర్షము, కిమ్పురుశము అను తొమ్మిది భాగాలుగా చేసి మొదటి తొమ్మిదిమందిని వాటికి రాజులుగా చేసి, మిగిలిన వారికి ప్రధాన బాధ్యతలను అప్పగించాడు. ఇందులో భరతుడు పాలించిన భారతవర్షముకు భారతదేశం అనేపేరు వచ్చింది.
తరువాతి జీవితం.
అవదూతగా మారిన ఋషభుడు అజగరవ్రతం (కొండచిలువ మాదిరిగా ఉన్నచోటు ఉండి కదలకుండా దొరికినపుడు దొరికినంత తినడం) ఆచరించాడు. ఈయన ఆచరించిన 9 ఆచారాలు వివిధ మతాలుగా మారాయి. అడవిలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చుట్టుముట్టగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయకుండా ఋషభుడు అందులోనే దహనమయ్యి చనిపోయాడు .
ద్వివుదుడు .
కిష్కింధాపురాధీశుడైన సుగ్రీవుని మంత్రులలో ఒకడైన మైంధుని సోదరుడు. ద్వివుదుడి నామార్థము ప్రకారము రెండు రకాల దృష్టి కలవాడని అర్థం. ఈ ద్వివుదుడు నరకాసురుని స్నేహితుడు. ద్వివుదుడి వృత్తాంతం భాగవతం దశమ స్కందము ఉత్తర భాగములో వస్తుంది.
నరకాసురుని మరణవార్త విన్న ద్వివుదుడు యాదవ వంశంపై పగతో యాదవ నగరాలు ధ్వంసం చేయసాగాడు. బలరాముడు రైవత గిరిపై కేళివిలాసాలలోనుండగా ద్వివుదుడు ఆ కొండ వృక్షశాఖలపై విహరిస్తూ వాటిని ధ్వంసం చేయసాగాడు. అప్పుడు బలరాముడు రాయి విసరగా, ద్వివుడు తప్పించుకొని దగ్గరలో నున్న సురాభాండం అందుకొని దాన్ని చెట్టు పైనుండి క్రిందకు విసిరాడు. వానర చేష్టలు ప్రదర్శిస్తూ, యాదవులు ఆరవేసుకొన్న బట్టలను చింపి, చీల్చి ముక్కలు చేయసాగాడు. బలరాముడు క్రోధోధిక్తుడై ముసలాయుధం ధరించి నిలబడగా ద్వివుదుడు పెద్ద చెట్టు విసిరాడు. బలరాముని ఆవేశం పెరిగింది. చేతిలో తన వద్ద ఉన్న సునంద అనే ముసలాయుధం ధరించి దానిని ద్వివుదుడి పైకి విసిరాడు. ఆ ఆయుధం ద్వివుదుడిని తల తాకగానే ద్వివుదుడి తల తాటి పండులా నేలపై పడింది. ఆవిధంగా దుష్టవానర సంహారం చూసిన యాదవులు బలరాముని అభినందించారు .