
కోనసీమలోని పచ్చని పంటచేలు పరుచుకుని ఉన్నాయి. వాటి మధ్యలోంచి పారే చల్లటి నీటితో మెరిసే కాలువ, పక్కన ఎర్ర కంకర రోడ్డు. ఆ కాలువ కాలువని ఆనుకుని రామాలయం, రామాలయం పక్కనే మట్టితో చేసిన ఇల్లు—అదే ధనియాలు రాజు ఇల్లు. ధనియాలు రాజు అసలు పేరు పూర్ణయ్య. చిన్నతనం చదువు అంతగా రాలేదు. తర్వాత అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యి తన పేరు డేనియల్ రాజ్ అని పేరు మార్చుకున్నాడు. తన యాస, మాట తీరు, పలకడం సరిగా రాక ధనియాలు రాజు అని చెబుతూ ఉండేవాడు. అలా ధనియాలు రాజు అయ్యాడు. ఏ మాటా సూటిగా పలకడు, వినేవాళ్ల పొట్ట చెక్కలయ్యేలా మాట్లాడుతాడు. అతని ఇంటికి నాలుగు ఇల్లు అవతల మస్తాన్ ఇల్లు. మస్తాన్ ముస్లిం. కానీ వీరి స్నేహం మీద మతాలకి ఎప్పుడూ తాకే అవకాశం రాలేదు. ఒకరికీ కష్టం వచ్చినా మరొకరు తోడు. ఎక్కడికి వెళ్లినా కలిసి, తిరిగి కూడా కలిసి. వ్యవసాయం చేస్తారు. గేదెలను మేపుతారు. సైకిల్ మీద పాలను అమ్మి జీవనం సాగిస్తారు. ఒక చల్లని రాత్రి. గాలిలో కొద్దిగా తేమ. ఇళ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ధనియాలు రాజు ఒక్కసారిగా మంచం మీద నిట్టూర్పు వదిలాడు—ఛాతీలో మంటలా నొప్పి. బిగువైన మోకాళ్లతో నెమ్మదిగా లేచి, రాత్రి చీకట్లో మస్తాన్ ఇంటి తలుపు తట్టాడు. "ఓరే మస్తాన్… నా చాతీలో ఏదో గుద్దేస్తున్నట్టుంది రా!" అని నొప్పిని మరచి మాట్లాడే తన తీరుతో చెప్పాడు. మస్తాన్ నిద్రలేచి గుర్తు చేసుకున్నాడు—"అయ్యా, మొన్న నాకు ఇలానే నొప్పి వచ్చి, పట్నం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆయన ఒక బిళ్ళ ఇచ్చి ‘నాలుక కింద పెట్టుకో’ అన్నాడు. ఇది పెట్టుకో, తగ్గిపోతుంది" అని చెప్పి తన దగ్గర ఉన్న మాత్ర ఇచ్చాడు. ధనియాలు రాజు మాత్ర వేసుకుని ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున మళ్లీ అదే నొప్పి. మళ్ళీ మస్తాన్ దగ్గరికి. మస్తాన్ ఇంకో మాత్ర ఇచ్చాడు. తర్వాత గేదెల పాలను పిండి, బిందెల్లో వేసుకుని అమ్ముకోవడానికి సైకిల్ మీద పట్టణానికి బయలుదేరారు. పట్టణానికి చేరిన తరువాత, "ఏదైనా మంచిదే" అనుకుని వారు ఎప్పుడూ వెళుతూ ఉండే హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ పరీక్షించి, "ఇతనికి ఏదో తేడాగా ఉంది. వెంటనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి" అని రిఫర్ చేశాడు. పెద్ద ఆసుపత్రి హాళ్లలో కాసేపు ఆగిన తరువాత ECG తీయాలి అన్నారు. ధనియాలు రాజు గందరగోళంగా, "ఏమంటారు? సీజీ తీయాలా? ఇక్కడ చలి వేసిందా?" అని అడిగాడు. నర్సు నవ్వు ఆపుకుంటూ, "అది చలి కాదు గారూ, హార్ట్ టెస్ట్" అంది. తర్వాత ఈ సిగ్గు తీశారు. ఈ సి సి రిపోర్ట్ లో హార్ట్ ఎటాక్ అని తేలింది. వెంటనే అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ మృదువైన వెలుగుతో, మెల్లిగా మోగుతున్న యంత్రాల శబ్దాల మధ్య, ఒక వారం ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా చూసి, తర్వాత రూముకి షిఫ్ట్ చేశారు. అప్పటికి ఈ వార్త ధనియాలు రాజు బావమరిది బంగారయ్యకు తెలిసింది. వెంటనే బయలుదేరి ఆసుపత్రికి గదిలోకి అడుగుపెడుతూ, "బావా, ఏం అయ్యింది అసలు?" అన్నాడు. ధనియాలు రాజు ఛాతీపై చెయ్యేసుకుని, "బావమరిదీ… నా హార్ట్‌లోకి కరెంట్ వదిలారురా! పటాకా లా మరిగిపోయింది. కానీ నేను ఒక్క క్షణం కూడా కళ్ళు మూయలేదు. వీరుడిలా బతికిపోయాను" అన్నాడు. మస్తాన్ పక్కన కూర్చుని, "హా, నేను పక్కన లేకుంటే నువ్వు అప్పుడే యమునీట్లో కాలు పెట్టేసేవాడివి" అన్నాడు. బంగారయ్య నవ్వుతూ, "అయ్యో బావా, యముడు టికెట్ ఇస్తే నువ్వు ఏమన్నావు?" ధనియాలు రాజు, "ముందు నా బావమరిదినే తీసుకెళ్ళు' అని" అన్నాడు. బంగారయ్య, "ఓయ్, నీ వల్లే యముడు నన్ను చూసి, ‘ఇవన్నీ తీసుకెళ్ళాలి అంటే నాకు పెద్ద వాహనం కావాలి’ అంటాడురా!" మస్తాన్ పంచ్ వేస్తూ, "అవును… బంగారయ్యతో పాటు గేదెలు కూడా వస్తే బాగుంటుంది" అన్నాడు. ముగ్గురూ కాసేపు నవ్వులు చిందించారు. నవ్వుల మధ్యలోనే ధనియాలు రాజు, "ఏరా మస్తాన్, నిన్ను చూసి బంగారయ్య అనుకుంటున్నాడు—నీ మాత్ర వల్లే నేను ఇలా అయ్యానని" అన్నాడు. మస్తాన్ వెంటనే, "అయ్యా, నాదేమీ తప్పు లేదు! నేను డాక్టర్ చెప్పినట్లు మాత్ర ఇచ్చా. నువ్వు మాత్ర వేసుకున్న వెంటనే పాల బిందె మోసుకుని సైకిల్ తొక్కడం మొదలుపెట్టావు. అది ఏంటి?" అన్నాడు. బంగారయ్య కళ్ళు గీకి, "హా… ఈ ఇద్దరూ పాలు అమ్మకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టున్నారు" అన్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని, "అయ్యా… పాలు అమ్మకుంటే డబ్బు ఎలా వస్తుంది?" అని ఒకేసారి సమాధానం ఇచ్చారు. ముగ్గురూ మళ్లీ పెద్దగా నవ్వేశారు. నవ్వులు పంచుకున్నాక బంగారయ్య సీరియస్ అయ్యి, "బావా, జోకులు పక్కన పెడితే… హార్ట్ నొప్పి, చెమటలు, ఊపిరి సడలడం కనిపిస్తే వెంటనే నిపుణుడైన డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. మతం, చదువు, డబ్బు—ఏదీ ప్రాణం కంటే పెద్దది కాదు" అన్నాడు. మస్తాన్ తల ఊపుతూ, "స్నేహం అన్నది కులమతాలకు అతీతం. మనిషి బతికేలా కాపాడటమే అసలు పెద్ద మతం" అన్నాడు. ధనియాలు రాజు తన స్టైల్లో, "అవును రా… హార్ట్ కాపాడితేనే హార్ట్ ఫుల్‌గా జీవించొచ్చు" అన్నాడు. రూములో మరోసారి నవ్వులు మార్మోగాయి.