డే కేర్ - మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Day care

"రాధిక, అమ్మకి నాన్నకి లంచ్ బాక్స్ పెట్టావా?" అని అడిగాడు భాస్కర్, తను ఆఫీసుకు తయారవుతూ తన భార్య రాధికని. "పెట్టానండి. ఇద్దరూ స్నానాలు చేసేసి, డ్రెస్ మార్చుకుని, టిఫిన్ తినేసి, మందులు వేసుకుని రెడీగా కూర్చున్నారు," అంది రాధిక. "మరి ఇద్దరికీ సాయంకాలం టిఫిన్ కూడా రెడీ చేసావా?" అని అడిగాడు భాస్కర్. "అన్నీ రెడీగా ఉన్నాయి. నేను బట్టలు మార్చుకుని వస్తున్నాను, ఆఫీస్ దగ్గర దింపేయండి," అంది రాధిక. రాధిక బట్టలు మార్చుకుని వచ్చేలోగా తల్లిని, తండ్రిని కార్లో కూర్చోబెట్టి వచ్చాడు భాస్కర్. అందరూ కలిపి బయలుదేరి రామారావు పేటలో ఉన్న ఇంటి ముందు కార్ ఆపి హారన్ కొట్టాడు. ఇంతలో లోపలి నుంచి ఒక కేర్ టేకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి దంపతులను లోపలికి తీసుకెళ్ళింది. "బై నాన్న, బై అమ్మ" అంటూ భాస్కర్ కారులో కూర్చుని రాధికని ఆఫీస్‌లో దింపేసి తన ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఇది ప్రతిరోజు జరిగే పని. భాస్కర్, నారాయణమ్మ–రాఘవయ్య దంపతులకు ఏకైక సంతానం. చిన్నప్పటినుంచి తల్లి తండ్రి అంటే చాలా ప్రేమ భాస్కర్‌కి. రాఘవయ్య పల్లెటూర్లో టీచర్‌గా పని చేస్తూ ఉండేవాడు. రిటైర్ అయిన తర్వాత ఆ ఊర్లో ఉండలేక, కొడుకు దగ్గరికి వచ్చేసారు ఆ ముసలి దంపతులు. భాస్కర్, రాధిక ఇద్దరూ ఉద్యోగస్తులే. ఇంట్లో ఎవరు ఉండరు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ ముసలి దంపతులు ఒక్కళ్ళే ఇంట్లో ఉండాలి. ఆ ముసలి వాళ్ళిద్దర్నీ చూడడానికి పని వాళ్ళని పెట్టినవాళ్లు ఎక్కువకాలం ఉండేవాళ్లు కాదు. ఇంట్లో ఏదో ఒక వస్తువు మాయం చేసి, చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేవారు. రాను రాను, పాపం, కొడుకు–కోడలు తిరిగి వచ్చేవరకు అలా ఒంటరిగా కూర్చుని ఉండడం… ఈలోగా వాళ్లకు ఏదైనా అవసరమైతే, అతి కష్టం మీద వాళ్లే తీసుకోవడం… ఇవన్నీ చెప్పలేక, కళ్ళల్లో దిగులు కనబడుతుండడం చూసి భాస్కర్ చాలా బాధపడేవాడు రాధిక దగ్గర. ఒకరోజు, "పోనీ నేను ఉద్యోగం మానేయనా?" అని అడిగింది రాధిక. "గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మానేస్తాం? ఇంకా బోల్డంత సర్వీస్ ఉంది," అన్నాడు భాస్కర్. వాళ్లకు మాటకు ఏం తోస్తుంది? ఎంతసేపు టీవీ చూస్తారు? మాట్లాడే మనిషి ఉండరు. ఆ దంపతులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండాలి. పాపం, నిజంగా చాలా ఇబ్బంది అనుకునేవాడు భాస్కర్. ఒక రోజు ఈనాడు పేపర్‌లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా ఆనందపడ్డాడు. వెంటనే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా వెళ్లి వివరాలు కనుక్కుని వచ్చాడు. అది వృద్ధాశ్రమం కాదు. అనాధ శరణాలయం కూడా కాదు. ఉద్యోగస్తులైన వారి చిన్నపిల్లలను చూడడానికి నగరాల్లో డేకేర్లు ఉంటాయి. అలాగే అనేక కారణాలవల్ల పగలంతా వృద్ధులు ఒంటరిగా ఉండవలసి వస్తే, పగలంతా వారి బాధ్యతలను చూసే ఒక డే కేర్ లాంటిది. ఇది మంచం మీద ఉండి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను వీళ్ళు చేర్చుకోరు. తమ పని తాము చేసుకోగలిగిన వాళ్ళని మాత్రమే. ఇక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది, టీవీ ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. డైనింగ్ హాలు, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్, టైంకి మందులు–ఆహారం పెట్టే కేర్ టేకర్లు ఉంటారు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడానికి గార్డెన్లో చైర్లు ఉంటాయి. వాకింగ్ చేయడానికి వీలుంటుంది. అందుబాటులో ఒక డాక్టర్ గారు కూడా ఉంటారు అని ఆ నిర్వాహకురాలు సావిత్రి చెప్పిన మాటలు విని, అక్కడున్న పరిస్థితులు–వాతావరణం చూసి చాలా ఆనందపడ్డాడు భాస్కర్. ఉదయం ఇక్కడ దింపేసి సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకెళ్ళాలి, అదీ వాళ్ళ పద్ధతి. మధ్యాహ్నం పూట టీ–బిస్కెట్స్ పెడతారని చెప్పింది ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి. ఈ విధానం చాలా బాగుంది. అమ్మానాన్నల గురించి దిగులు లేదు. వాళ్లకి మిగతా వృద్ధులతో కాలక్షేపం అవుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్నట్లుగా ఉండదు. "ఇది చాలా బాగుంది" అనుకున్నాడు భాస్కర్. ఇంటికి వచ్చి తల్లికి, తండ్రికి, భార్యకి వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు భాస్కర్. ఎప్పుడూ అదే గది, అదే మంచం, అదే టీవీ చూసి చూసి బోర్ కొట్టిన రాఘవయ్యకి ఈ పద్ధతి బాగా నచ్చింది. మరుసటి రోజు నుంచి రాఘవయ్య–నారాయణమ్మ దంపతుల దినచర్యంతా మారిపోయింది. అక్కడ మనసుకు నచ్చిన వాళ్లతో మాటలు, కాసేపు వాకింగ్, మధ్యాహ్నం పడక, అందరూ కలిసి టీవీ చూడడం వలన ఒంటరితనం దూరమైంది. సాయంకాలం కొడుకు కార్ హార్న్ వినగానే గబగబా కారు దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్న ఆ దంపతులను చూసి ఆశ్రమ నిర్వాహకులు నవ్వుకునేవారు. అక్కడున్న వాళ్ళందరూ అలాంటి వాళ్లే. రోజు అదే దినచర్య. అది ఒక స్కూలు కాదు గాని, తల్లితండ్రులు లాగానే, స్కూలు పిల్లలు ఎలా పరిగెత్తి వెళతారో అలాగే తమ బిడ్డలు రాగానే ఉత్సాహంగా ఇంటికి వెళ్లిపోతున్న ఆ దంపతులను చూసి ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి తన ఒంటరి జీవితం ఈ రకంగా సార్ధకమైనందుకు ఆనందపడుతూ ఉండేది. ఎప్పుడు తెల్లవారుతుందా, వృద్ధులంతా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది. ఈ ఆశ్రమంలో చేరిన దగ్గర్నుంచి సాయంకాలం కొడుకుతో పాటు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కారులో ఆశ్రమం కబుర్లు తల్లి తండ్రి చెబుతున్న కబుర్లు విని ఆనందపడుతూ ఉండేవాడు భాస్కర్. "కాలం మారే కొద్దీ కొత్త కొత్త సమస్యలకి, కొత్త కొత్త పరిష్కారాలు వస్తున్నాయి" అని చెప్పి ఆనందపడిపోయాడు భాస్కర్.

మరిన్ని కథలు

Dhaniyalu raju heart story
ధనియాలు రాజు హార్ట్ స్టొరీ
- కలం పేరు: బామాశ్రీ రచయిత పేరు: మామిడిశెట్టి బాలాజీ
Rushabhudu Dwividudu
బుషబుడు - ద్వివిధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Karu chouka
కారుచౌక
- కర్లపాలెం హనుమంతరావు
Palletooru ammavodi
పల్లెటూరు అమ్మఒడి
- లక్ష్మీ కుమారి.సి
Annapoorna nilayam
"అన్నపూర్ణ నిలయం"
- ప్రభావతి పూసపాటి
Stita pragna
స్థి త ప్రజ్ఞ
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి