అమలిన ప్రేమ - పోరండ్ల సుధాకర్

Amalina prema

టేబుల్ పైన వున్న మొబైల్ రింగ్ కావడం తో టీవీ లో వార్తలు వింటున్న ఆనందరావు ఎవరా అని మొబైల్ తీసి ఒకసారి చూసి చారి "గుడ్ మార్నింగ్ చారి ఏంటి ఈ రోజు వాకింగ్ రాలేదు" అని ప్రశ్నించాడు ఆనందరావు, "కాళ్ళు నొప్పిగా వున్నాయి రావు అరవై సంవత్సరాలు దాటాయి కదా, ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఏంచేద్దాం, భరించక తప్పదు కదా అని బదులిచ్చాడు చారి" "అవుననుకో ఎందుకు ఉదయమే ఎందుకు కాల్ చేసావు? అని ప్రశ్నించాడు ఆనందరావు" "అసలు విషయం చెప్పడం మరిచాను, ఈ వయస్సులో ఒంటరిగా వుండలేకపోతున్నా, ఒక్కొక్కసారి మంచం దిగాలంటేనే భయమేస్తుంది, అనారోగ్య కారణాల వల్ల మనస్సు స్థిమితంగా వుండడం లేదు, మా ఆవిడ గుర్తు వస్తుంది, తాను వున్నపుడు మారాజులా బ్రతికాను కాని ఇప్పుడు భద్రత లేకుండా పోయింది, అమెరికా లో వున్న పిల్లలు రమ్మంటున్నారు, ఇంతకు ముందు ఒకసారి వెళ్లి నెల కూడా వుండలేక పోయాను, తమ దగ్గరికి రాలేకపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోమంటున్నారు, ఇప్పుడు తప్పనిసరై నాకు తోడుకోసం ప్రయత్నం చేస్తున్న అని గద్గద స్వరంతో బదులిచ్చాడు చారి", "సరే సరే బాధపడకురా చారి, ఇన్నాళ్లు పూర్తిగా మా చెల్లాయి పై ఆధారపడడం వల్ల నీకు ఆలా అనిపిస్తుంది, నేను మొదటి నుండి ఒంటరిని కదా! అందుకే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు" అని నిర్వేదంగా అన్నాడు ఆనందరావు". "నీవు రెడీ అయి వుండు బయటికి వెళ్దాం, నేను వస్తున్న" అని ఫోన్ ఆఫ్ చేసాడు చారి. ఇప్పుడు పెళ్లి ఏంటి ? ఈ వయస్సులో అవసరమా? అసలు బుద్ధి ఉందా చారికి? టీచర్ గా రిటైర్మెంట్ అయి ఐదు సంవత్సరాల అవుతుంది, మూడు సంవత్సరాల క్రితం చారి భార్య చనిపోవడంతో దిగాలు పడిపోయాడు, ఇక్కడుంటే పూర్తిగా పిచ్చివాడు అవుతాడని US లో సెటిలైన ఇద్దరు కొడుకులు US కు తీసుకువెళ్లారు చారిని, కొడుకులు, కోడళ్ళు ఉద్యోగాలకు, పిల్లలు స్కూల్ కు వెళ్లడంతో పొద్దస్తమానం ఒంటరిగా ఉండలేక నెలరోజులకే ఇండియా కు వచ్చేసాడు చారి, కాని కాటిక కాలుజాపే వయస్సులో పెళ్లి అంటున్నాడు ఏమిటి? ఆలోచనలో పడిపోయాడు ఆనందరావు. డోర్ బెల్ మ్రోగడంతో ఉలిక్కిపడి లేచి తీసాడు ఆనందరావు." ఏంట్రా రావు నిన్ను తయారు అయి వుండమన్నాను కదా! ఇంకా అలాగే కూర్చుండి పోయేవేం అని ప్రశ్నించాడు చారి". "ఏం లేదురా నీ గూర్చే ఆలోచిస్తూ ఉండిపోయాను, ఒక్క నిమిషంలో తయారు అవుతాను కాని, ఇప్పుడు మనం పెళ్ళిచూపులకి వెళుతున్నామా? ఎవరింటికి, ఎక్కడికి, ఏ వూరు అని ప్రశ్నలవర్షం కురిపించాడు ఆనందరావు". "మనం వెళ్ళే మార్గమధ్యలో అన్ని చెప్తాను ముందు తయారు అవురా బాబు" అంటూ మొబైల్ చూడ్డంలో మునిగిపోయాడు చారి. టవల్ భుజాన వేసుకొని బాత్రూం లో దూరాడు ఆనందరావు. .*** సిటీ శివారులో ఉన్న పంక్షన్ హల్ ముందు కారు ఆపి " దిగరా మనం వెళ్లాల్సిన చోటు వచ్చింది అన్నాడు చారి" కారు దిగుతూ " ఇక్కడేం పెళ్ళి చూపులురా ఫంక్షన్ హాల్ లో నాకంత అయోమయంగా ఉంది అన్నాడు ఆనందరావు" కారు పార్క్ చేసి "ఇక పదరా అంటూ భుజం మీద చెయ్యివేసి ముందుకు దారి తీసాడు చారి. లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాత ఆనందరావు స్టేజ్ కేసి చూసాడు, అక్కడ... ముఖ్యఅతిథిగా వచ్చిన ఒక స్త్రీ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. "జీవితం చరమాంకంలో పెళ్ళి అంటారేమిటి? ఇది అవసరమా? కృష్ణ, రామ అనుకుంటు మూలకు కూర్చోక అంటూ వుంటారు, నిజమే వృద్యాప్యపు వయస్సులో తాము కన్న పిల్లలు వారి పిల్లలవలే తల్లిదండ్రులను చూసుకుంటే వారికి మళ్ళీ పెళ్ళి అనే ఆలోచనే రాదు, కాని తాము కన్న పిల్లలను చూసుకునే సమయమే లేదు ఇప్పటి జనరేషన్ కు, ఇక తల్లిదండ్రులను చూసుకునే సమయం ఎక్కడిది, పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడే తీరికలేదు వారికి, ముసలోల్లకు వయస్సు ఉరకలెత్తుతున్నట్టు ఉంది, అందుకే పెళ్ళి చేసుకుంటున్నారు అనేవారు ఉన్నారు, కాని ఈ వృద్ధాప్యంలో వారికి కావాల్సింది శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కాదు, వారికి కావాల్సింది చిన్న ఓదార్పు, కాసేపు మనస్సు విప్పి మాట్లాడే స్నేహితులు, అది కరువై ఎంతో మంది తమ జీవితచరమాంకంలో నరకయాతన అనుభవిస్తున్నారు అలా జరగకుండా ఉండడానికై వారికి ఒక తోడు నివ్వడానికి ఏర్పడిన ఈ సంస్థను మనః స్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మిగతా కార్యక్రమం జరపవలసిందిగా కోరుతున్నాను అని తన ఉపన్యాసాన్ని ముగించారు. కార్యనిర్వహకురాలు మైక్ తీసుకొని మాట్లాడుతూ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు తము స్టేజి మీదకి వచ్చి తమ పూర్తి వివరాలు, తమకు వచ్చే నెలసరి ఆదాయ వివరాలు తెలియచేస్తూ తమకు ఎలాంటి భాగస్వామి కావాలో తెలియచేయవాల్సిందిగా కోరుచున్నాము, అవసరం అనుకుంటే స్టేజి ఫియర్ ఉన్నవారు మరొకరితో కల్సి వచ్చి వివరాలు తెలియచేయాల్సిందిగా కోరు చున్నాను". ఒక్కొక్కరుగా వెళ్ళి తమ పరిచయాన్ని తమ వివరాలను తెలియచేస్తూ స్టేజి దిగి వస్తున్నారు, చారి అని పిలవగానే తాను లేచి "రారా రావు నాకు ఎందుకో సిగ్గనిపిస్తుంది నాతో రా అనగానే ఆనందరావు లేచి తనతో పాటు స్టేజి మీదకు వెళ్ళి చారి పరిచయం అయిపోయాక కాసేపు ఉండి పంక్షన్ హల్ నుండి ఎవరింటికి వారు వెళ్ళారు చారి, ఆనందరావులు. *** మొబైల్ రింగ్ అవుతుండడం చూసి ఇంత ఉదయం ఎవరు ఫోన్ చేసారా అని మొబైల్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి " అరే చారి పది రోజుల క్రితం పెళ్ళికని వెళ్ళి ఇప్పటివరకు ఫోన్ చేయలేదు ఇప్పుడు గుర్తుకు వచ్చానారా! "అన్నాడు ఆనందరావు. "అరే రావు నేను ఈ రోజే వచ్చాను నీకో శుభవార్త నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కాని నాకోసం ఎవరు ఫోన్ చేయలేదు కాని నీకో మంచి సంబంధం వచ్చిందిరా ఆవిడను పేరు చెప్తే నీవు కాదనవులే, తాను ఇప్పుడే ఫోన్ చేసింది, మనం వివాహ పరిచయ వేదికకు వెళ్ళాం చూడు ఆరోజు తన ఫ్రెండ్ కోసం వచ్చిందట, తాను నిన్ను చూసిందట, తన భర్త చనిపోయి రెండు సంవత్సరాల అవుతుందట, నిన్ను చూసాక నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుంది నీవు అంగీకరిస్తే తన పిల్లలకు చెప్పి వారు అంగీకరించినా, అంగీకరించకపోయినా వారితో తెగతెంపులు చేసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకోసం వచ్చిందిరా రావు" కొద్ది సేపట్లో నేను తనని వెంటబెట్టుకొని వస్తాను అన్నాడు చారి. " అరేయ్ చారి ఆమె పేరు చెప్పకుండా ఏందిరా ఏదో వాగుతున్నావు" అన్నాడు రావు. "ఆమె ఎవరో కాదురా ఇన్నాళ్లు ఎవరి కారణంగా బ్రహ్మచారి గా ఉండిపోయావో సునంద నీకోసం వచ్చిందిరా రావు" అని సంతోషంగా బదులిచ్చాడు చారి. ఆ మాట వినగానే ఏం మాటాడాలో నోటి మాటరాక "ఆ అవునా" అని నిర్వికారంగా అంటూ మొబైల్ ఆఫ్ చేసాడు ఆనందరావు. ఆలోచనలు గతంలోకి పరుగెత్తసాగాయి ఆనందరావు...తన బ్రహ్మచర్యానికి కారణమైన వ్యక్తి నాడు నరకయాతనకు గురిచేసి చీ నీతో పెళ్ళి అవసరం లేదని మొహం మీద తలుపు లేసిన వ్యక్తి సునంద...... ఆ రోజు చివరిసారి తనతో మాట్లాడినరోజు ..... ఆనందరావు ,సునందలు ఇద్దరు డిగ్రీ క్లాస్ మేట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే క్లాస్ లో కూర్చొని తనవైపు అదే పనిగా చూస్తూ ఉండేవాడు ఆనందరావు, నందు తన వైపు చూడకపోయినా, పట్టించుకోక పోయినా తనని ఆరాధనగా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఆటపట్టించే వారు, తనది నందుది ఒకే గ్రామం కావడంతో ఏరోజైన తాను క్లాస్ కు రాకపోతే వారి ఇంటి ముందు నుండి వెళుతూ తాను అవుపడే వరకు వారి ఇంటి ముందు తచ్చాడేవాడిని, డిగ్రీ రెండవ సంవత్సరం ప్రారంభంలో క్లాస్ లో ఒక్కతే సునంద ఉండడంతో ధైర్యం తెచ్చుకొని ఒక పేపర్ పై "ఐ లవ్ యు నందు" అని వ్రాసి పేపర్ మడిచి మెల్లిగా వెళ్ళి సునంద వద్దకు వెళ్ళి నిలబడ్డాను, ఏమిటి అన్నట్లు చూసింది సునంద, లెటర్ తీసుకో అన్నట్లు చెయ్యి ముందుకు చాపాడు ఆనందరావు, "ఏమిటో నోటితో చెప్పు నిర్లక్ష్యంగా అంది సునంద" ఐ లవ్ యు నందు అన్నాను," లెటర్ తీసుకొని చించి వేసి ఆ పేపర్లను ఆనందరావు మొహం మీద విసిరివేసి లాగి చెంప మీద కొట్టింది సునంద, ఎన్నడు ఎవరితో దెబ్బలు తినని ఆనందరావు చెంపపై దెబ్బ తగలడంతో చెయ్యిని చెంపపై వ్రాసుకుంటూ కండ్లలో నీరు తిరుగుతుండగా " నా తల్లిదండ్రులకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను" సారీ అంటూ బుక్స్ ను సైతం క్లాస్ లో వదిలి ఇంటికి వచ్చాడు ఆనందరావు, ఆనందరావు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు ఉదయం పనులకు వెళితే సాయంత్రం కాని వచ్చేవారు కాదు, రెండు రోజులు అన్నం సహించక కాలేజీ కి వెళ్ళడానికి ఇష్టపడక పీక్కు పోయిన మొహంతో ఇంట్లో పడుకున్నాడు ఆనందరావు. మూడవరోజులుగా క్లాస్ లో ఆనందరావు కనబడకపోయే సరికి మధ్యలో క్లాస్ నుండి నేరుగా ఆనందరావు ఇంటికి వచ్చి తలుపు తట్టింది సునంద, మంచంలో నుండి లేచి వచ్చి తలుపు తీసి సునందను చూసి రెండు అడుగులు వెనక్కి వేసాడు ఆనందరావు, తాను రెండు అడుగులు ముందుకు వేసి చెయ్యి చాపి ఆనందరావు కుడి చెయ్యిని పట్టుకొని పెదాల దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది సునంద, "థాంక్స్ నందా" నీవు నన్ను ప్రేమిస్తూన్నావు కదూ! అంటూ సునందని దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెట్టుకుని " సారీ నందు" అంటూ దూరం జరిగాడు ఆనందరావు, " సరే సరే అంటూ నవ్వుతూ ఇక రేపటి నుండి కాలేజీ కి రా అబ్బాయ్" అంటూ ఆనందరావు ముక్కును చిన్నగా మెలివేసి బయటికి నడిచింది సునంద... అప్పటి నుండి 3 సం. లు చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు ఆనందరావు, సునందలు, ఏమైందో, ఎమో కాని గత ఆరు నెలలనుండి ఆనందరావును కలవకుండా దూరం పెడుతుంది, సునందని చూడకుండా ఉండలేని ఆనందరావు తాను కనిపిస్తుందేమో నని సునంద ఇంటి చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతూ, అన్నం సహించక నిద్ర పట్టక పిచ్చివాడిలా తయారయ్యాడు ఆనందరావు, ఎప్పుడన్న ఆనందరావుకు సునంద కనిపించినా మోహం తిప్పుకొని అసలు పరిచయమే లేనట్లు ప్రవర్తించేది సునంద. ఒక్కసారైనా మాట్లాడాలని వారి ఇంటిలో ఎవరు లేనిది చూసి వెళ్ళి తలుపు తట్టాడు ఆనందరావు, ," ఎవరు" అంటూ తలుపు తీసింది సునంద, ఎదురుగా ఉన్న ఆనందరావును చూసి "నువ్వా? ఎందుకు వచ్చావు" అని నిర్లక్ష్యంగా ప్రశ్నించింది సునంద, "నీతో పరిచయం అయ్యాక ఇప్పటి వరకు నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా, నన్ను ప్రేమించి నన్ను ఇలా దూరం పెట్టడం నీకేమైనా బావుందా నందా" అని బాధగా ప్రశ్నించాడు ఆనందరావు. " ఏ రోజైన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పనా, నీకు నీవే ప్రేమిస్తుంది అనుకున్నావు, నేను వేరే అతన్ని పెళ్ళి చేసుకోబోతున్నాను, నీవు కూడా పెళ్ళి చేసుకో, ఇక ముందెప్పుడు నాతో మాట్లాడాలని, కలవాలని ప్రయత్నం చేయవద్దు అలాగని నాకు మాటివ్వు అని అంటూ చెయ్యి ముందుకు చాపింది సునంద, సరే అని తల వూపుతూ సునంద చేతిలో చెయ్యి వేసి, కండ్లలో నీరు సుడులు తిరుగుతుండగా, "నాతో ఈ మూడు సంవత్సరాలు నావెంబడి ఉండి, నాతో తిరుగుతూ ఉంటే, నీవు నన్ను ప్రేమించవావనే అనుకున్నాను, నీతో ఏడడుగులు వేసి, ఏడేడు జన్మలు కల్సి వుండాలని, నీ ఉచ్వాస, నిశ్వాసలో నేనుండాలని, ఎన్నో కలలుకన్నాను, "మన మూడు సంవత్సరాల మురిపాన్ని మూడు ముక్కల్లో ముక్కలు చేసావు", ఈ ఆరు నెలలుగా నీవేమిటో, నీ మనస్సు ఏమిటో, నాకు కనిపించకుండా నీవాడిన దాగుడుమూతల వల్ల నేను పడ్డ నరకయాతన ఏమిటో అది అనుభవించిన వాడికే తెలుస్తుంది, నాలాంటి పరిస్థితి పగవాడికికూడా రాకూడదు, ఆ "నేను నిజంగా పెళ్ళి చేసుకుంటే అది ఆమెతో చేసేది సంసారం కాదు మానసిక వ్యభిచారం అవుతుంది, నీలాంటి వారి వల్ల ఎంతోమంది యువతీ,యువకులు నేడు మనసోకచోట, మనువు ఒకచోట ఉండి, మానసిక వ్యభిచారంనకు అలవాటు పడ్డవారు ఈ లోకంలో కోకొల్లలు, ఇది కాదనలేని సత్యం" "మనిషి సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే కాని సంతోషంగా ఉండడానికి మాత్రం కాదు, అది నీ అనుభవంలోకి తప్పకుండా వస్తుంది, ఆరోజు మనచేతిలో ఏముండదు అదే జరుగుతుంది నందా, ఇక సెలవ్" అని చేతులెత్తి నమస్కరించి ధారాళంగా కారుతున్నా కన్నీటిని తుడుచుకుంటూ చర, చర బయటికి నడిచాడు ఆనందరావు, తాను పెళ్ళిచేసుకోకుండా బ్రహ్మచారి గా ఉండి పోవడానికి కారణమైన నాటి సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకు రావడంతో దిండులో మొహం దాచుకొని తనివితీరా ఏడ్చాడు ఆనందరావు. మొబైల్ రింగ్ కావడంతో "మొబైల్ ఎత్తి హలో" అని సమాధానం ఇచ్చాడు ఆనందరావు, "అరే రావు నేను చారి ని మాట్లాడుతున్నానురా, ఒక పది నిమిషాల్లో నేను సునంద మీ ఇంటిలో ఉంటాము" అని కాల్ కట్ చేసాడు చారి. భారంగా లేచి బాత్రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కొని తెల్లటి లాల్చీ, పైజామా వేసుకొని వచ్చి హాల్ లో సోఫాలో కూర్చొని ఒకరకమైన ఆతురతతో సునంద, చారిల రాకకై ఎదురుచూస్తున్నాడు ఆనందరావు. ఆనందరావు ఇంటి ముందు కారు ఆపాడు చారి, కారు ఆపగానే కారు వెనక డోర్ తీసుకొని బయటికి అడుగుపెట్టింది సునంద, ముప్పై అయిదు సంవత్సరాల తరువాత సునంద ను చూసాడు ఆనందరావు, వన్నె తరగని అందం తనది, కొద్దిగా ఒళ్ళు చేసి, కాస్త ముడతలు పడ్డ శరీరంతో, మొహంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టు కనబడ్డాయి ఆనందరావుకు, ఎవరో తరుముకొస్తున్నట్లు చర చర లోపల అడుగు పెట్టి ఏడుస్తూ ఆనందరావు కాళ్ళ దగ్గర కూర్చొని తలని అతని ఒళ్ళో పెట్టి చేతులతో ఆనందరావును గట్టిగా పట్టుకొని ఏడ్వసాగింది సునంద, కొద్దిసేపు ఏడ్వనిచ్చకా సునంద తలపై కుడిచేతిని వేసి " బావున్నావా నందా" అన్నాడు ఆనందరావు, " హ " అంది సునంద, "ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావ్, నేను బాగానే ఉన్నాను కదా!, మీ ఆయన పోయారని తెలిసింది, ఇంకా బ్రతకాల్సింది పాపం, నీవు కోరుకున్న జీవితం లభించిందికదా, జీవితం సుఖంగా, సంతోషంగా గడిచిందా సునంద" అని నిర్వేదంగా ప్రశ్నించాడు ఆనందరావు, చివ్వున అతనికేసి చూసి కాస్త ప్రక్కకు జరిగి ఆనందరావు చేతిని తన చేతిలోకి తీసుకుని పెదాలపై ఆనించుకుని, " నిన్ను దూరం చేసుకున్నాకే తెలిసింది నీ విలువెంటో, ఒంటికి సుఖంగా వున్నాను, కాని సంతోషంగా లేను, నావల్ల నీజీవితం ఎడారిలా మోడువారి పోయింది, నీవు మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని సుఖంగా ఉంటావని ఆశించాను, కాని ఇలా ఒంటరిగా ఉంటావని ఊహించ లేకపోయాను" అంది సునంద. " నాడు నాపై నీకు నమ్మకం లేదు, నీ ప్రేమ లో నిజాయితీ లోపించింది, నా జీవితం గూర్చి నీవేలా ఊహిస్తావు, పరిస్థితులకు రాజీపడిన ఎందరో భగ్నప్రేమికులు తాము పెళ్లిచేసుకున్న వారిలో తమ ప్రేమించిన వారినే చూసుకుంటూ, అందులోనే ఆనందాన్ని వెదుక్కుంటు ఉన్నారు, ఇది కాదన లేని సత్యం, నేను అది చేయలేకపోయాను అంతే" నందా అని బాధగా అన్నాడు ఆనందరావు, "అయ్యిందేదో అయిపోయింది, ఇక ఈ అవసానదశలో నీ దగ్గర సంతోషంగా ఉందామని వచ్చాను, ప్లేజ్ రావు నన్ను పెళ్ళిచేసుకో, నీవు పెళ్ళి చేసుకున్న చేసుకోకపోయినా నీ కాళ్ళదగ్గరే పడివుంటాను", అంటూ ఆనందరావు కేసి చూసింది సునంద, "లేదు నందా, లేదు ఇప్పుడా అవకాశం లేనేలేదు, అప్పుడు నీవు నన్ను కాదన్నావ్, ఇప్పుడు నేను నిన్ను కాదంటున్నాను, "తెగులు సోకిన జీవితం నాది ఇక ఎప్పుడు చిగురించదు", ఎప్పుడు తిన్నావో ఏమో, లేచి కుర్చీలో కూర్చో" అని సునంద చెయ్యి పట్టుకొని లేపి కుర్చీలో కూర్చో బెట్టి, కిచెన్ లోకి వెళ్ళి వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కొని పళ్ళెంలో అన్నం ,పప్పు వేసుకొని వచ్చి సునంద కెదురుగా కూర్చొని అన్నం కలిపి చేతిలో అన్నం తీసుకొని సునంద నోటిలో అన్నం పెడుతూ "తిను నందా మళ్ళీ నీకు అన్నం తినిపించే అవకాశం వస్తుందో రాదో నాకు" అన్నాడు ఆనందరావు. ప్రశ్నార్థకంగా ఆనందరావు కేసి చూసింది సునంద. "ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి లో మనం కలవడం కుదరదు, అన్యదా భావించొద్దు, నాడు నీవు నన్ను తిరస్కరించినరోజు నేను పడ్డ భాదేంటో, ఇపుడు నీవు పడుతున్న బాధేంటో నాకు తెలుసు, నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దానికో అర్ధం ఉంటుంది, అది నీకు ఇప్పుడు తెలియదు, ముందు ముందు నీకు తెలుస్తుంది లే అని" అన్నం తినిపించడం అయిపోయాక పళ్ళెంలో లో చెయ్యి కడిగి సునంద నోటిని శుభ్రం చేసి పళ్ళెంను టీపాయ్ మీద పెట్టి అక్కడ ఉన్న టవల్ తో తాను చెయ్యి తుడుచుకొని సునంద నోటిని టవల్ తో శుభ్రం గా తుడిచి, ఇలా ప్రతిరోజు నీకు అన్నం తినిపించాలని ఎన్నో కలలు కన్నాను, "ఆ ఆశలన్నీ నీటి బుడగలుగా ఆవిరి అయిపోయాయి, జరిగిందేదో జరిగిపోయింది, నీవు నాకు చేయగలిగిన సాయం ఒక్కటే నేను, నీకు గుర్తుకు వచ్చినపుడల్లా ఫోన్ చేసి మాట్లాడు నాజీవితానికి ఇది చాలు" అన్నాడు ఆనందరావు, " నీవు ఒంటరిగా ఉండిపోవడానికి కారణం అయ్యానని నా మీద ఇంకా కక్ష సాధిస్తూన్నావు కదూ! ఒకింత ఉక్రోషంగా, బాధగా అంది" సునంద, సోఫాలో నుండి లేచి సునంద తలని తన పొట్టకు గట్టిగా అదుముకొని, "నందా నాకోసం వచ్చావు, నాజన్మకు ఇది చాలు, నీమీద నాకెలాంటి కోపంలేదు, నీవు ఎక్కడ ఉన్నా సుఖంగా, సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను, కోరుకుంటున్నాను, ఇక వెళ్ళు నందా నీవు ఎక్కువ సమయం ఇక్కడ ఉండడం మంచిది కాదు, నీ పిల్లలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళు నందా" అని సునంద నుదుటి మీద ముద్దు పెట్టుకొని దూరంగా జరిగి నిల్చున్నాడు ఆనందరావు. "ఇదే నీ నిర్ణయం అయితే అలాగే కానివ్వు, ఇక వెళుతున్న, మళ్ళీ ఇకరాను," ఒకింత తీక్షణపు చూపుతూ, బాధాతప్త హృదయంతో, కళ్లలో నీరు బయటికి వస్తుండగా పమిట చెంగుతో తుడుచుకుంటూ బయటికి అడుగుపెట్టింది సునంద. నిర్వికారంగా వెళుతున్న సునంద కేసి చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు. & & @ రెండు సంవత్సరాల తరువాత విజయనగరం లోని గంట స్తంభం దగ్గర చారికి దాహం వేసి రోడ్ ప్రక్కన ఉన్న షాపు వద్ద ఆగి వాటర్ బాటిల్ కొనుక్కొని త్రాగి రోడ్ పైకి వెళ్ళుటకు మెట్లు దిగుతుండగా చేతి సంచి పట్టుకొని ఎదురైంది సునంద, "ఏమ్మా బావున్నావా " అని పలకరించాడు చారి, "ఓ చారీ ఆన్నయ్య బావున్నాను, ఇక్కడికి ఎప్పుడొచ్చావు, " రావు ఎలా ఉన్నాడు" ఆతృతగా ప్రశ్నించింది సునంద, " నీకోసమే రావు పంపగా వచ్చాను, నీకో లెటర్ ఇచ్చాడు అది ఇద్దామనే వచ్చాను, నీ అడ్రస్ తెలియక రెండు గంటల నుండి తిరుగుతున్నాను, ఇదిగో అమ్మ" అని తన పాకెట్ లోని గులాబీ రంగు కవర్ తీసి సునంద చేతికి ఇచ్చి సునందను ఒకసారి తీక్షణంగా చూసి "నాకు ట్రైన్ టైమ్ అవుతుందిరా నందా ఇక వెళ్తున్నాను", మరో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎదురుగా వస్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కి కూర్చొని రైల్వే స్టేషన్ కి పోనిమ్మని డ్రైవర్ కి చెప్పి కండ్లు మూసుకున్నాడు చారి. *. ** డియర్, నందా ఇలా పిలవడానికి నేను అర్హుడను కాదేమో, ఆ అర్హత నాకు ఉంటే నాతో ఒక్కసారైనా ఫోన్ లో మాట్లాడే దానివి, నా ప్రేమలోని నిజాయితీ నన్ను దహించి వేసింది, నీవు నన్ను కోరుకొని వచ్చినరోజు, నేను త్వరలో చనిపోతానని డాక్టర్లు నిర్ధారించారు, అందుకే నిన్ను నేను కాదన్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకొని నేను చనిపోతే నీవు ఒంటరి అయిపోతావు, నీ అనే వారు నిన్ను ఇంతకు ముందు చూసినట్లు చూడకపోవచ్చు, నీవారి ముందు నీవు దోషిగా, సర్వం కోల్పోయిన దానిలా నిల్చిపోవాల్సి వస్తుంది, నా నందా కు అటువంటి పరిస్థితి రాకూడదు, అందుకే నీ మంచి కోరి నేను నిన్ను దూరం చేసుకున్నాను, నేను దూరం అయినా నీవు సంతోషంగా వుంటావని ఆలోచించాను. నందా మన పరిచయం అయిన మొదటి నుండి ఒక్కరోజు కూడా నాతో కలిసి జీవితం పంచుకునేలా వరం ఇమ్మని ఏరోజు నీవు ప్రార్థించి ఉండవు, వాస్తవం కదూ! నీవేమి ఆలోచిస్తావో, నీ ఆలోచనలు మునుముందు ఎలా ఉంటాయో తెలిసినవాడినిరా నందు, నేను కావాలి అనుకుంటే నిన్ను బలవంతంగా నా దాన్ని చేసుకునే వాన్ని, కాని నీ ఆలోచనలు నాకు తెలుసు, ఇప్పుడు కూడా కేవలం బ్రహ్మచారి గా ఉండి పోయావనే నాదగ్గరికి వచ్చావు తప్పా నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఇది చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను ఇక చాలు నీకు, నీ ప్రేమకో దండం, మళ్ళీ జన్మంటూవుంటే ఈ మానవ జన్మనాకొద్దు అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను, ఇక సెలవు రా నందు. నీకు ఏమికాని నీ ఆనందరావు. ఉత్తరం చదవడం ముగించి నిర్వికారంగా, నిర్వేదంగా, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది సునంద. **అయిపోయింది**

మరిన్ని కథలు

Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Dhaniyalu raju heart story
ధనియాలు రాజు హార్ట్ స్టొరీ
- కలం పేరు: బామాశ్రీ రచయిత పేరు: మామిడిశెట్టి బాలాజీ
Rushabhudu Dwividudu
బుషబుడు - ద్వివిధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Karu chouka
కారుచౌక
- కర్లపాలెం హనుమంతరావు
Palletooru ammavodi
పల్లెటూరు అమ్మఒడి
- లక్ష్మీ కుమారి.సి
Annapoorna nilayam
"అన్నపూర్ణ నిలయం"
- ప్రభావతి పూసపాటి
Stita pragna
స్థి త ప్రజ్ఞ
- - బోగా పురుషోత్తం, తుంబూరు.