
“బాబూ రెండు చేతులెత్తి దండమెడతన్నాను, మీకు మాత్రం నేను నా ఓటేలులో సాపాటు ఎట్టలేను”
“అదేంటోయి ఆలాగంటావు. నేను నీతో ఏమైనా అసభ్యకరంగా వ్యవహరించేనా, లేదే. ఇంతవరకూ ఏరోజైనా నేను తిన్నదానికి డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోయేనా, లేదే” భీమారావు భీకరంగా గర్జించేడు.
“మీరు సెప్పినవన్నీ నిజమే. కానీ, మీరు తినే తిండికి నాకు ఇచ్చే దుడ్డు సరిపోదు. రెండింతలిస్తానంటేనే నేను మీకు తిండి పెట్టేది. లేదంటే ఇక పెట్టేది మాత్రం లేదు”
“ఒక మనిషి తిన్నదానికి ఇద్దరు తినే తిండి ధర కావాలి అని అడగడం మరీ అన్యాయమోయ్”
“మీకు మరొక రోజు అంటే రేపోక్కరోజు మాత్రం ఎప్పటిలాగే తిండి ఎడతాను. ఎల్లుండినుంచి మీరు నేను సెప్పినట్టు రెండింతలిస్తానంటే నా ఓటేలుకి రండి, లేకపోతే మరోదారి సూసుకోండి”
ఓటేలువాడికి తెలుసు ఆ పల్లెటూరిలో మరో ఓటేలు లేదని.
ఆ పల్లెటూరిలో ఉన్న సర్కారువారి కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిలో ఒకరికి బదిలీ అయితే, అతని జాగాలో నూతనంగా నియమించబడిన గుమాస్తా భీమారావు. అతనితో కలిసి నలుగురూ తినే ఈ ఓటేలులో భోజనానికి పాతిక రూపాయలు. రెండు రోజులు భీమారావు చేసే భోజనం చూసిన ఓటేలువాడు చెప్పిన మాటలవి. ఒక మనిషి సాధారణంగా తినే తిండికి రెండింతలు పైన తింటాడు భీమారావు. అంతేకాక, అందరూ అన్నంలో కూర పచ్చడి పులుసు నంజుకొని తింటే, భీమారావు మాత్రం వాటిలో అన్నం నంజుకొని ఎక్కువ పరిమాణంలో తినే రకం. మస్తుగా తిండి తినగలిగిననాడే తనకు పెట్టిన పేరు సార్ధక నామధేయం అవుతుంది అనుకున్నాడేమో పాపం భీమారావు, పాండవ మధ్యముడి లెక్కన తినాలన్న నియమం పెట్టుకొని పెరిగేడు.
భీమారావు తండ్రి పేరుకి కుబేరరావు అయినా, అబ్బాయి పుట్టి పెరిగే కొద్ది పిల్లాడు తినే తిండి పరిమాణం కోసం ధనం ఆర్జించే ప్రయత్నాలలో, తరిగే ఆస్తిపాస్తులతో కుబేరుడు కాస్తా కుచేలుడిలా మారిపోతున్నాడనిపించేడు. దైవ కృపతో అతను పూర్తిగా అలా మారిపోకముందే, భీమారావుకి ఉద్యోగం వచ్చి ఈ పల్లెటూరికి ప్రయాణం కట్టడంతో ఆయన ఊపిరి పీల్చుకోనారంభించేడు.
అందరూ ఇచ్చేదానికంటే తాను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? అలా ఇవ్వడం కానీ ఇవ్వమని అడగడం కానీ చట్టవిరుద్ధం అన్యాయం అని నమ్మిన భీమారావు, తండ్రికి కారణం తెలుపుతూ, ఒక వంట మనిషిని వెంటనే పంపమని ఫోన్ చేసేడు. అలా పంపకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి కొడుకు తనమీదకు దండెత్తుతాడన్న భయంతో, కుబేరరావు రెండోరోజు ఉదయానికే, భీమారావుకి అత్తవరసతో వితంతువైన అమ్మాయమ్మను నెలకు సరిపడా సరకులతో భీమారావు దగ్గరకు పంపేడు.
భీమారావు తిండి భీముడి వ్యవహారం అని తెలియని అమ్మాయమ్మ రాగానే ఇద్దరికీ కలిపి ఇంత ఉప్మా చేసిపెట్టి మధ్యాహ్నం భోజనానికి పూర్తిగా వంట చేస్తానని చెప్పింది.
‘అలాగే’ అన్నట్టుగా తలాడించిన భీమారావు మొత్తం ఉప్మా తానొక్కడే తిని, టిఫిన్ గా తిన్నదే కదా అని మెల్లిగా వచ్చిన త్రేనుపుతో ఆఫీసుకు వెళ్లిపోయేడు. పిల్లాడు బాగా ఆకలిమీదున్నాడు కాబోలు మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి బాగా వండి పెట్టలనుకున్న అమాయకురాలు అమ్మాయమ్మ కొంచెం ఎక్కువగానే వండి పెట్టింది. ఎందుకైనా మంచిదన్న అంతరాత్మ ప్రభోదంతో, ఆమె ముందుగా భోజనం చేసేసి కూర్చుంది.
ఆవురావురంటూ ఆకలితో భోజనానికి వచ్చిన భీమరావు అప్పుడు కూడా వడ్డించినందంతా తానొక్కడే తినేసి, ఆమె వంటను మెచ్చుకొని, “అత్తా నువ్వు తినడానికి ఏమైనా మిగిలిందా” అని అడిగేడు.
ఏమీ మిగలకపోయినా -- మాటవరసకు ‘ఏదో కొంచెం మిగిలిందిలే’ అని చెప్దామనుకొన్న అమ్మాయమ్మ, అబద్ధమాడి వీడితో లేని పోని కష్టాలు తెచ్చుకున్నట్టుగా ‘ఆ మిగిలింది కూడా నాకే పెట్టు’ అంటాడనుకొని ఏమీ మిగల్లేదన్న నిజం చెప్పింది.
“పోనీలే, మిగలకపోతే నువ్వు మాత్రం ఏమి చేస్తావత్తయ్యా. రాత్రి నుంచి ఇంకొంచెం ఎక్కువగా వండు” అని ఉచిత సలహా ఇచ్చి ఆఫీసుకు వెళ్లిపోయేడు.
అమ్మాయమ్మకు అప్పుడు పూర్తిగా తెలిసివచ్చింది - మేనల్లుడు కేవలం తినడానికే పుట్టినట్టు తింటున్న సంగతి. అంతేకాక, వండిన దానిలో తనకోసం ముందునుంచీ తీసి వేరుగా ఉంచుకోకపోతే, తనకు ఏమీ మిగలదని కూడా తెలిసి వచ్చింది. అంతకన్నా, తాను ముందే తినేయడం ఉత్తమం అన్న ఆలోచన ఆమె అంతరంగాన్ని ఆవరించింది.
అలా అత్త వండిన వంట, మేనల్లుడు తిండి కలిసి నెలకు సరిపడా తెచ్చిన సరుకులు పది రోజులకే పూర్తిగా నిండుకున్నాయి.
“నాయనా భీమా, రేపుదయం వంటతో నేను తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి. కావలసిన సరకుల చిట్టా ఇస్తాను రేపు సాయంత్రం నువ్వు ఆఫీసునుంచి వచ్చేటప్పుడు కొని తీసుకొని రా”
“అలాగా అత్తా. అయితే, రేపు ఉదయం వంట చేసి నువ్వు బస్సులో ఊరికి వెళ్ళు. నాన్నకు ఈరోజే ఫోన్ చేస్తాను. సరకులు కొని ఉంచుతాడు. అవి పట్టుకొని వెంటనే మరునాటి బస్సులో వచ్చేసేయి” అని సలహా ఇచ్చేడు భీమారావు, తన జీతం డబ్బులతో సరకులు కొనడం ఇష్టం లేక.
“నీ ఇష్టం నీ నాన్న ఇష్టం నాయనా, నాదేముంది. తాడు బొంగరం లేని దాన్ని” అని – ఊరికి వెళ్ళిన అమ్మాయమ్మ, కుబేరరావు ఎంత మొత్తుకున్నా, తిరిగి భీమారావు దగ్గరకు వచ్చి వంట చేసి పెట్టే దుస్సాహసం మాత్రం చేయలేదు.