
"అన్నయ్య సాయంత్రం వదిన ని తీసుకొని గుడి కి రా ,మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి " ఫోన్లోరజని గొంతు కొంచెం కంగారుగానే వినిపించింది."ఎమ్మా ! ఏదైనా ఆందోళన కలిగించే విషయమా ?పోనీ ఇంటికి రాకూడదు "కొంచెం ప్రశాంతంగా వుంటూ అడిగాను."లేదు అన్నయ్య ఇంట్లో మాట్లాడటానికి కుదరదు.సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వదిన ని తీసుకొని డైరెక్టుగా అక్కడికి వచ్చేయి, నేను కూడా రవీందర్ తో కలిసి వస్తాను "అంటూ హడావుడిగా ఫోన్ డిస్కోనెక్ట చేసింది.
రజని నాకు చెల్లెలు అనడం కన్నా నా అరోప్రాణం అనటం సబబేమో, బహుశా అలా అవడానికి కారణం మేము పెరిగిన వాతావరణమేమో.మాకు ఊహా తెలిసినప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా వున్న అమ్మ నాన్న నాకు పదిహేనేళ్ల వయసు రజని కి పన్నెండేళ్ళు వయసు వున్నప్పుడు విడిపోయారు. అప్పుడు ఆలా ఎందుకు విడిపోయారా అడిగేంత వయసు లేదు,ఆలా విడిపోతే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసేంత అనుభవం కానీ లేవు.అమ్మ మాత్రం అప్పటినుంచి అమ్మ నాన్న అంతా తానే అయ్యి పెంచింది.ఎన్నడూ నాన్న గురించి తప్పుగా మాట్లాడటం గాని అయన మీద వ్యతిరేక భావం మాలో కలిగేలా ప్రవర్తించటం కానీ చెయ్యలేదు,విడిపోయాక కూడా తాత బామ్మా తమతో కలిసి ఉండమని ఎన్నాళ్ళో అడిగారు కానీ అమ్మ ససేమిరా రానంది. తాను వుద్యోగం చేస్తూ నన్ను రజని ని ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసింది. మేమిద్దరం మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాము.రజని మంచితనం చూసి రవీందర్ ఇష్టపడి పెళ్లి చేసుకొన్నాడు.నా పెళ్లి మేనమామ గారి అమ్మాయి వసుధ తో జరిగింది.వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అమ్మ నా దగ్గర ప్రశాంతమైన జీవితం గడుపుతోంది, ఇప్పుడు సడన్ గా ఏమైందో రజనికి రవీందర్ కి మధ్య ఏమైనా గొడవలు..ఆలోచించ డానికే మనసు రాలేదు.
అటెండర్ ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పి గంట పర్మిషన్ తీసుకొని వసుధ ని కూడా బయలుదేరమని చెప్పి కారు తీసుకొని బయలుదేరాను.సిగ్నల్ దగ్గర పక్కనే స్కూటర్ పై ఒక జంట ఇద్దరు పిల్లలతో ముచ్చటగా కనపడ్డారు.వాళ్ళనలా చూస్తుంటే మనసు గతం లోకి పరుగులు తీసింది.
నాన్న అమ్మ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం .అమ్మపెళ్ళికి ముందునుంచి మంచి వుద్యోగం చేస్తోంది,పెళ్లి అయ్యాక నాన్న అమ్మని వుద్యోగం మాని వేయమని ఎన్నో సార్లు అడిగారు కానీ అమ్మ తాను సమర్ధవంతం గా ఇల్లు ,పిల్లలు,ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించ గలుగుతానని ,పైగా స్త్రీ ఆర్థికంగా స్వతంత్రు రాలైతే ఇంటిని ఇంకాఅందం గా చక్కదిద్దుకోవచ్చని అభిప్రాయ పడేది.నాన్నకి అమ్మలో అన్ని గుణాలు నచ్చినా అమ్మకి వుద్యోగం వల్ల కలుగు తున్న ఆర్థికబలం ,అమ్మలో పెంచుతున్న స్వాభిమానం ఆయన లో వున్న పురుష అహంకారానికి సవాలుగా అనిపిస్తూ ఉండేది.అది చల్లార్చు కోవడానికి లేని పోనీ చిన్న చితక విషయాలు వెదికి గోరంతలు కొండంతలు గా చేసి అమ్మ ని నానా మాటలు అని అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకున్నాక అవి చూసి శాంత పడేవారు.
చాలా ఏళ్ళు మమ్మలిద్దరిని మనసులోపెట్టుకొని సర్దుకుపోవటానికి ప్రయత్నించేది.అమ్మ మెత్తబడటం నాన్నకి గెలుపులా తోచి తన మాటల వాడి రోజు రోజుకి పెంచి తాను ఒక మంచి మనసున్న వ్యక్తి అని,ఒక ఉన్నతమైన స్థానంలో వున్నానని ,ఇద్దరి పిల్ల తండ్రి అని,భాద్యత కలిగి మెలగాలి అన్న ఇంగితం కూడా మరచిపోయి అమ్మని చెయ్యి చేసుకునేంత వరకు దిగజారిపోయారు.
ఆ రోజు నాకు ఇంకా లీలగా గుర్తు వుంది అమ్మ కి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అని తెగ సంబర పడిపోతూ ఇంటికి వస్తే నాన్న చేసిన రాద్ధాంతం
ఇంత అంతా కాదు.అమ్మ తన కింద అణిగి మణిగి మామూలు ఇల్లాలి గా మాత్రమే అంగీకరిస్త్తాను గాని ,ఇలా తన సామర్ధ్యం తో ,స్వతంత్రం గా ఎదగటం సహించలేకపోయారు.సగటు మగాడికి వుండే హీన మనస్తత్వం తనకి ఉందని తెలియపరిచేలా అరుస్తూ అమ్మని నిర్బందించ పోయారు.
అంత వరకు ఎన్ని సార్లో ఓర్పు కి మారు పేరు అన్నట్టు వుండే అమ్మ మొదటి సారి ఎదురు తిరిగి స్వతంత్రంగా తను బ్రతకగలదు అని నిరూపిస్తూ తమ ఇద్దరినీ తీసుకొని నాన్న జీవితం లో నుంచి తప్పుకొంది.
సిగ్నల్ క్లియర్ అయ్యిందని హార్న్ చప్పుడు తో ఉలిక్కిపడి స్టీరింగ్ ని గుడి వైపుకి తిప్పాను.నేను వెళ్ళేటప్పటికి ముగ్గురు నాకోసం ఎదురు చూస్తున్నారు.దైవ దర్శనం చేసుకొని గుడి కి దూరంగా వున్న మంటపం లో కూర్చున్నాము.
" నేను ఈ రోజు నాన్న ని చూసాను " త్రొటుపాటు లేకుండా నెమ్మదిగా చెప్పింది రజని. ముగ్గురం ఒకేసారి అవునా అని ముక్త కంఠం తో అడిగాము.
" అవును మీకు తెలుసు కదా! మా కంపెనీ నిర్వహిస్తున్న NGO తాలూకు ఆశ్రమం అడ్మిషన్స్ అన్ని నేనే చూస్తానని. ఈ రోజు పొద్దున్న ఓ వ్యక్తి వివరాలు తెలుపుతూ అడ్మిషన్ కోసం నా వద్దకు ఒక అప్లికేషన్ వచ్చింది.వివరాలు చదివి ఆశ్చర్య పోయాను ఇంకా నమ్మకం కలగక అక్కడికి వెళ్లి చూసాను .అక్కడ బెంచ్ మీద మాసిన గడ్డం తో విషాద వదనం తో వున్న వ్యక్తిని నేను అనుకున్నట్టు సరిగానే పోల్చు కొన్నాను. ఆయన మన నాన్న ప్రభాకర్ రావు గారు.తను ఇక్కడ చేరడానికి కారణం ఒంటరి వాడినని.జీవితంలో ఓడిపోయానని మానసిక ప్రశాంతత కోసం వెదుకుతున్నానని,ఇక్కడ ఈ సంస్థ పేరు విని వచ్చానని చెప్పారుట.వయసు ప్రభావం వల్లొ,నేను అక్కడ వస్తానని అనుకోకో అయన నన్ను గుర్తు పట్టలేదు.నన్ను నేను సంభాళించుకొని ముందు నీకు ఫోన్ చేశాను .ఆయన్ని చాలా ఏళ్ళకి చూసాను కదా ఆయన్ని ఆ స్థితి లో ఆలా చూసాక ముందు చాల కోపం వచ్చింది తరువాత జాలి వేసింది". .గుక్క తిప్పుకోకుండా చెప్పింది.
" దాదాపు ఇరవై ఏళ్ళ పైనే అయ్యింది" స్వగతంగా అన్న అనుకొన్న గాని అనుకోకుండా బయటికి అనేసినట్టు వున్నాను.
". అది సరే ఇప్పుడు ఏమి చేద్దామని" తేరుకొని అడిగాడు రవీందర్.
" అత్తయ్యగారు ఎలా రియాక్ట్ అవుతారో" ఆదుర్దాగా అంది వసుధ.కొంత సేపు ఎవ్వరం మాట్లాడలేదు."రేపు నువ్వు రా అన్నయ్య.మనిద్దరం ఆయన్ని కలుద్దాం.ఆయనతో మాట్లాడదాము"కొంత ఆత్రంగా అంది రజని.
" ఆయన్ని కలిసే ముందు అమ్మ కి ఈ విషయము చెప్పాలి కదమ్మ్డ. వాళ్ళు విడి పోయేటప్పటికీ మనల్ని సంప్రదించేత వయసులు కావు మనవి ,కానీ అమ్మ తను తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఎంతో ధైర్యంగా అన్ని రకాల ఆటుపోట్లకు తట్టుకొని మనల్ని పెంచి పెద్ద చేసింది.ఎన్నో ఏళ్ళ తరువాత లేడు అనుకొన్న తండ్రి కనపడితే పిల్లలుగా మనం సంతోష పడవచ్చు తప్పులేదు కానీ అమ్మ కి అంగీకారం అయితేనే మనం ఆయన్ని కలవాలని నా అభిప్రాయం " నెమ్మదిగానే అయినా కొంచెం గంభీరంగానే పలికింది నా గొంతు.
" నిజం ఇన్నాళ్లు అమ్మ మనకోసం తన సర్వస్వాన్ని మనకి ధారపోసింది ,కానీ ఈ మధ్య కాలం లో తను ఎదో వెలితిగాను,ఒంటరిగాను ఉండటం నేను చాలా సార్లు గమనించాను.వయసు బిగి వున్నప్పుడున్నంత పౌరుషం బిగువు తగ్గడం వల్ల కాబోలు మనిషి కొన్ని సమయాల్లో తన తొందరపాటుకు పశ్చాత్తాపం పడుతున్నట్టు మాటల్లో ధ్వనిస్తోంది" మెల్లగా చెప్పింది వసుధ.
" మనం ఎంత ప్రేమగా చూసినా కొంత వయసు మళ్లాకా,పిల్లల భాద్యత తీరాక భార్యకైనా ,భర్తకైనా సరైన తోడు తమ భాగస్వామియే. బహుశా అమ్మ కి కూడా అలాంటి భావం మొదలై ఉండవచ్చు,తనకి ఈ వయసులో ఉండాల్సిన తోడుని తానే కోల్పోయేలా చేసుకున్న అన్న భావం తనని బాధ కి గురిచేస్తేందేమో,ఇప్పుడు నాన్న సంగతి తెలిస్తే తను ఎలా స్పందిస్తుందో, అమ్మకి నాన్న గురించి తెలియపరచవలసిన భాద్యత మనది . తుది నిర్ణయం అమ్మది,మీరు కూడా నాతొ ఏకీభవిస్తారనుకొంటాను" అన్నాను నెమ్మదిగా బయలుదేరటానికి సన్నద్ధమవుతూ,తధాస్తు అన్నట్టు గుడిలోని ఘంట మ్రోగింది.
రేపు నువ్వు,నేను నాన్నని కలుద్దాం కానీ మనమెవ్వరమో తెలియపరచకుండా.కొన్నాళ్ళు అయన తో సాన్నిహిత్యం పెంచుకుందాం.అయన మనసు తెలిసాక అమ్మకి ఈ విషయం తెలుపుదాం .అంతిమ నిర్ణయం అమ్మకి ఆ పై భగవంతునికి వదిలేద్దాము. రాబోయే రేపు ఎప్పుడు తీయగానే ఉంటుంది అన్న ఆశ భావం తో ఇంటికి బయలుదేరాము..
గదిలో కూర్చొని రామకోటి రాసుకొంటున్న అమ్మకి మా నలుగురి రాక కొంత సంతోషాన్ని, కొంత సందేహాన్ని కలిగించింది.అమ్మ కి దగ్గరగా వెళ్లి కూర్చొని చేతులు పట్టుకొని నాన్నని ఎక్కడ ఎలాంటి పరిస్థితి లో చూసామో వివరించాము.ముందు నివ్వెర పోయి విన్న అమ్మ ఒక్కసారిగా కట్టలు త్రెంచుకొన్న నదిలా వల వల ఏడ్చింది.కొంత తేరుకున్నాక పూర్తి వివరాలు అడిగింది.
"ఈ రోజే కదా రజని నాన్నని చూసింది.నీకు కూడా ఈ విషయం తెలిపి నీ అనుమతి తో ఆయనని రేపు కలుద్దామనుకొన్నాము" అని అనక ముందే అమ్మ నా మాటకు అడ్డువస్తు "తప్పులు ప్రతివాళ్ళు చేస్తాము, అది తెలుసుకొని దిద్దుకొనేవాళ్లే దేముళ్ళతో సమానం.నేను కూడా తప్పు చేసాను,భగవంతుడు సరిదిద్దుకొనే అవకాశం నాకు కూడా ఇచ్చినట్టు వున్నాడు.అది తెలిసి నన్ను నేను దిద్దుకోకపోతే నా అంత పాపాత్మురాలు ఇంకొకరుండరు. అప్పట్లో నేను కూడా కొంత మొండితనం,సంపాదిస్తున్నాను నన్ను నేను పోషించుకోగలను అన్నఅహంభావం తో మీ ఇద్దర్ని తండ్రి ప్రేమకి దూరం చేసాను.ఇప్పుడు ఈ మలిపొద్దు వయసులో నేను చేసిన తప్పుకు ఆయనని కలిసి క్షమించమని అడిగి కొద్దిగానైనా మనశాంతి పొందాలని ఆ దేముని తో ఎన్నోసార్లు మొరపెట్టుకొంటున్నాను.ఇన్నాళ్ళకి నా మోర ఆలకించినట్టువున్నాడు" అని అంటూ దుఃఖంతో నెల మీద ఒరిగిపోయింది.
అమ్మ మనసు తెలిసాక ఎప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా తామందరం ఎప్పుడెప్పుడు తన తండ్రిని కలుస్తామా అన్న ఆత్రం తో రాత్రి మా కెవ్వరికి నిద్దర పట్టలేదు.పొద్దునే ఆశ్రమం చేరేటప్పటికి నిన్నటి కన్నా కొంచెం మెరుగ్గా ,ఉతికిన బట్టలతో ప్రశాంతం గా కనిపించారు .మొదట నేను దగ్గరికి వెళ్లి నన్ను పరిచయం చేసుకొని నెమ్మదిగా ఇక్కడ చేరడానికి కారణము అడిగాను..
ముందు చెప్పటానికి తడబడినా నేను కనపరుస్తున్న అభిమానానికి లోబడి నెమ్మదిగా చెప్పటం ప్రారంభించారు."మాది చిన్న ముచ్చటైన సంసారం ,నా భార్య చదువుకున్నది ,అనుకూలవతి .పెద్ద ఉద్యోగస్తురాలు కూడా,అప్పట్లో భార్యలని చెప్పుకింద తెలు లా తొక్కిపెట్టివుంచకపోతే మగతనమే కాదు అన్న అహంకార భావం వల్ల చేజేతులా పండంటి కాపురాన్ని,మణిపూస వంటి భార్యని ,రత్నాల్లాంటి పిల్లలిని దూరం చేసుకొన్నాను.కొన్నాళ్ళు దూరంగా ఉంటే పొగరు అణిగి తానే నా దగ్గరికి వస్తుందని బెట్టుచేశాను.నా భార్య చాలా స్వాఅభిమానమున్న మనిషి.అటువంటి నా భార్య సమాజానికి భయపడి సంసారం అనే ముసుగులో నా దగ్గర గా ఉండి మానసికంగా తనకి ,పిల్లలికి నేను దూరం అయ్యే కన్నాతను దూరం గా ఉండి తన విలువ నేను తెలుసుకునేలా చేసింది..నా అహంకారపు పొరలు కరిగాక తన ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు నేను ఓడిపోయి దోషిలా నిలబడ్డాను.ఎంత మంది తన మంచితనం గురించి,తన ఎదుగుదల గురించి చెప్పినా మొగుడు అనే భావం మగాడిని నా కేమిటి అన్న ధీమా నాకు తనని కలవాలని అనిపించ లేదు.ఇప్పుడు అహంకారం తగ్గి తను కనపడితే క్షమించమని అడిగి నా తప్పుని కొంతైన దిద్దుకొందామని ,ఇక్కడ ఈ ప్రాంతం లోనే పిల్లలు తను ఉన్నట్టు తెలిసి ప్రాణం పోయే లోపల కలవక పోతానా అన్న ఆశ తో ఇక్కడికి వచ్చాను.మీ లాంటి వారికి వాళ్ళ గురించి చెప్పి ఆచూకీ తెలిపి పెట్టమని అడుగుదామనుకొంటున్నాను" గొంతు జీర పోవటం తో చెప్పటం ఆపి నన్ను,నా పక్కనే తడిసిన కన్నులతో నిలబడిన రజిని ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
వయసు భారం తోనూ,చేసిన తప్పు ని సరిదిద్దుకోవాలని తపనతో మానసికంగా కృంగిపోయిన తండ్రి ని ఆ స్థితిలో చూసిన మా ఇద్దరికీ హృదయం ద్రవించిపోయింది. నిప్పు సెగ వల్ల బంగారం మంచి వర్ణం సంతరించుకొన్నట్టు పశ్చత్తాపమువలన అయన లోని కరడు గట్టిన ద్వేషభావం కరిగి పితృ వాత్సల్యం తో మమ్మలిద్దరిని గుర్తుపట్టి అక్కున చేర్చు కొన్నారు. కొంచెం దూరంగా తలుపు వెనకాల నించుని అన్నీ వింటున్న అమ్మ ఇంక ఉండలేక ఎదురుగ వచ్చి నిలబడిపోయింది.చూస్తున్నది నిజమేనా అన్న భావం తోనాన్న లేచి క్షమించమన్నట్టు వంగి అమ్మని తాకబోయారు.ఆయన్ని వారిస్తూ అమ్మ కూడా క్షమించానన్నట్టు నాన్న పాదాలని తాకింది.వాళ్ళఇద్దరి కన్నీరు ఓకరినొకరి మనసు కడిగి పవిత్రం చేసింది.దూరం నుంచి జరిగింది కలా నిజమా అన్నట్టు చూస్తున్న మా రెండు జంటలు “కనువిప్పు” కలిగి మమతానురాగం తో ముడిపడుతున్న ఆ జంటని మనస్ఫూర్తిగా అభినందించాయి .
తప్పులు చేయడం మానవ నైజం .క్షమించడం దైవ గుణం అని భావిస్తూ...
.
.