ఆరు అంతస్తూల అపార్టమెంట్ అది. ఒక అంతస్తుకు ఆరు ఇళ్ళు మోత్తం ముఫై ఆరు డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు, రేపు ఉదయం గ్రుహప్రవేశం. ఈపగలు,రాత్రిలో వైరింగ్ పూర్తిచేయాలి.నాదగ్గర పనిచేస్తూన్న వారినికాకుండా అదనంగా ఎలక్ట్రీషియన్లను ఒకప్లాటుకు ముగ్గురువంతున పనికి పురామాయించాను. నేను బజ్ బార్ ,జనరేటర్, ఛేంజ్ అవర్ స్వచ్ పనికి పూనుకున్నాను .
నా సెల్ ఫోన్ మోగడంతో చూసాను నాగరాజు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఆన్ చేస్తూనే 'హల్లో బావగారు ఎక్కడ ఉన్నారు 'అన్నాడు.
'మాంబళం జానకి రామన్ వీథిలో కొత్త అపార్ట్ లో 'అన్నాను.
' నేను అక్కడికి భోజన సమయానికి వస్తాను'అని ఫోన్ ఆఫ్ చేసాడు నాగరాజు.
నూట పది భోజనాలు ఆర్డ్ చేసాను. సరిగ్గా భోజన సమయానికి వచ్చాడు నాగరాజు.భోజనంచేస్తూనే ''బావగారు నాకోవిషయం అర్ధంకాదు ఎన్నో కథలు రాసిన మిమ్మల్నికాని,ఈనగరంలో సంవత్సరాల తరబడి ఎన్నో తెలుగు భాషా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నన్నుకాని ఏఊరు వాళ్ళయినా పిలిచి సన్మానం చేసిన వాళ్ళులేరు. ఆకన్నయ్యను చూడండి వంరంగల్ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, ఒంగోలు వాళ్ళు పిలిచి ఘనంగా సత్కారం చేసారు. వేయిరూపాయలు కర్చు చేసి ఏకార్యక్రమం చేయని అతనికి ఇన్ని సన్మానాలు ఎలాజరుగుతున్నాయో,ఎందుకు జరుగుతున్నాయో అర్ధంకావడంలేదు ''అన్నాడు .
భోజనం ముగిసిన అనంతరం ''నాగరాజు నేను సన్మానలకోసం రాయడం లేదు. ఆశయం కోసం రాస్తున్నా. కన్నయ్య తనలా సన్మానల పిచ్చి ఉన్నవాళ్ళని జిల్లాకి ఒకరు లేక ఇద్దరిని ఎంపిక చేసుకుని,వారిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని, వారినుండి తలా రెండు వేలు తీసుకుని , వారిలో నలుగురుని చెన్నయ్ పిలిపించి సత్కరించి ,ఒక ఆదివారం ఉచితంగా పాఠశాల తరగతి గదిలో, ఆరుగురిని ప్రేక్షకులుగా ( వారు కన్నయ్య సంస్ధ సభ్యులే )వచ్చిన నాలుగు జిల్లాలవారిని వాళ్ళఊరిలో తెలుగు భాషకు సేవచేసే సూర్యులు అని పోగిడి,అదేరాత్రి వాళ్ళను వాళ్ళఊరికి పంపుతాడు. మరుదినం ఇక్కడి దినపత్రికలలో వచ్చిన ఆవార్తను వాళ్ళకు ఈమెయిల్ చేస్తాడు. వాళ్ళు తమఊరిలో వాళ్ళ మిత్రులు అందరికి మా భాషాసేవకు చెన్నయ్ లో ఒక తెలుగు సంస్ధవారు సత్కరించారని డబ్బకొట్టుకుంటారు.
ఆక్కడ పచ్చిపూమాల అయితే ఒకరేటు,చందనమాలతొ సత్కారమైతే మరో రేటుఉంటుంది.బిరుదు కూడా కావాలి అంటేమరికొద్దిగా రేటుపెరుగుతుంది.
ఆది మనకన్నయ్యతంతు. కొద్దిరోజుల తరువాత ఆనాలుగు జిల్లాల వారు మనకన్నయ్యను ఒకొక్కరుగా తమజిల్లాకు పిలిచి సత్కరించి,చెన్నయ్ లో తెలుగు భాష కన్నయ్యవలనే నడుస్తుందని, ఈయనలేకుంటే అక్కడ తెలుగు భాషకు మనుగడ లేదని చెన్నయ్ తెలుగు భాషకు కన్నయ్య చంద్రుడు లాంటివాడని పొగిడి,తము గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుని, కన్నయ్య తమకు కప్పి పంపిన శాలువా,తమకువేసిన అదే చందన మాలవేసివేసి, ఫోటోలు, దినపత్రికలో వచ్చిన వార్త ఈమెయిల్ చేస్తారు. దీన్నే ఇచ్చానమ్మవాయనం - పుచ్చుకున్నానమ్మ వాయనం అంటారు.నువ్వుకూడా అదే దారిన వెళ్ళాగలిగితే నీ కోరిక తీరుతుంది.
నాకు అంత ఓపికాలేదు,అలాంటి అవసరం లేదు,అంత సమయంలేదు, పనులవత్తిడిలో ఉన్నాను ,చూసావుగా ఇప్పుడు, రాత్రికి ముఫైవేల చిల్లర భోజనాలకు,టీలకు బిస్కెట్స్ కు మూడు వేలు,తెల్లవారితే ఒక్కో పనివాడికి పదిహేనువందల కూలిఇవ్వాలి. ఇలాంటి బిల్డింగ్ లు మరికొన్నిఉన్నాయి, నిరంతరం ఒక నలభైమందికి రోజు పని చూపించాలి.నాచేతిలో చాలాఅపార్ట్ మెంట్స్ ఉన్నాయి పనిచేయడానికి'' అన్నాను.
'' ఓహా అదా సన్మానాలకు మార్గం, సరే ఉంటాను '' అని వెళ్ళిపోయాడు.
పదిహేనురోజుల తరువాత ఓ ఆదివారం సరిగ్గా ఉదయం నేను అల్పహారం చేసే సమయాని వచ్చిన నాగరాజు ''అక్కయ్య గారు మంచి వాసన వస్తుంది టిఫెన్ ఏమిటో ''అన్నాడు.
'' చపాతి పుట్టగొడుగుల కూర,చేతులు శుభ్రపరచుకో తెస్తున్నా '' అన్నది నాశ్రీమతి.
రెండు చపాతీలుతిని చేతులు శుభ్రపరచుకుని టేబుల్ ముందు కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసి కథరాయడం ప్రారంభించాను, టేబుల్ ముందు ఉన్నప్పుడు నన్ను ఎవరూ పలకరించరు.
చపాతీలు తినడం పూర్తిచేసి చేయి శుభ్రపరచుకుని తన వెంట తెచ్చుకున్న చేతి సంచిలోనుండి ఒక ఆహ్వాన పత్రికపై నాపేరు రాసి మాశ్రీమతి చేతికి అందించి,ఆమె అందించిన కాఫీ తాగి మౌనంగా వెళ్ళిపోయాడు నాగరాజు.
నాటేబుల్ పై కాఫీకప్పు పెడూతూ ఆహ్వాన పత్రిక కూడా ఉంచి, తను డైనింగ్ టేబుల్ పైకూర్చొని తను అల్పహారం తినసాగింది నాశ్రీమతి .
కాఫీ తాగి ఆహ్వాన పత్రిక తీసి చూద్దుకదా, తన సంస్ధద్వారా చీరాలనుండి, కడపనుండి, హైదరాబాద్ నుండి ముగ్గురరిని ఎంపిక చేసి వారికి సన్మానాలు చేస్తున్నట్లు, ఆసభకు తనే అధ్యక్షతవహిస్తున్నట్లు, కన్నయ్యను ముఖ్య అతిధిగా పేరు వేసాడు. నేను ఇలా చెపితే అలా అల్లుకు పోయాడు. మనవాడు తోవకు వచ్చినట్లే అనుకుని, నేను కథ రాయడంలో మునిగిపోయాను. అదే ఈకథ.

