పని మనిషి నేర్పిన గుణపాఠం - కామేశ్వర రావు రాపాక

Panimanishi nmerpina gunapatham

“అమ్మగారు, అమ్మగారు…..” అనకాపల్లి నూకాంబికా ఆలయ దర్శనం ముగించుకుని కారులో తిరిగి వైజాగ్ వస్తున్నప్పుడు అనకాపల్లి మెయిన్ రోడ్డు లో ఎవరో పిలుస్తున్నారనిపించి, డ్రైవరుకు కారు పక్కకు ఆపమని చెప్పి, కారు అద్దాలు దింపి వెనక్కి చూసాను.

పరుగెత్తుకుంటూ ఒకామె కారు దగ్గరికి వచ్చింది.

“ఎవరు?” అన్నట్టు నేను అనుమానంగా చూసాను.

“నేనండి, లక్ష్మిని. మీఇంట్లో పని చేసేదాన్ని”

“అవునవును గుర్తుకొచ్చింది. మీ అత్తవారు ఈ ఊరే కదూ, చాలా రోజుల తరువాత చూడడం వలన వెంటనే గుర్తుకు రాలేదు. బాగున్నావా, ఎంతమంది పిల్లలు? ఏం చేస్తున్నారు?”

“ఇక్కడ సెంటరులో నేను మా ఆయన కూరగాయలు అమ్ముతామండి. నాకు ఒకడే కొడుకు. వాడు ఇక్కడే బెల్లం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. మీరు అప్పడు రాజమండ్రి బదిలీ మీద వెళ్ళి పోయిన దాకా మీ ఇంట్లో పని చేసానండి.”

“అవును గుర్తుంది. నీకు ఆ సంవత్సరమే పెళ్లి అయ్యింది కదా? ఆ తరువాత మీ చెల్లిని కూడా మా ఇంట్లో పనికి పంపిస్తానన్నావు. ఈ లోగా మాకు ట్రాన్సఫర్ అయిపోయింది.”

“అవునండి”

“పాతిక సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో ఊర్లు తిరుగుతూ ఇప్పుడు రిటైర్ అయిపోయాక మళ్ళీ వైజాగు వచ్చాము”

“మీ సొంత ఇంట్లో, సీతమ్మధారలోనే ఉంటున్నారండి?”

“అవును, ఒకసారి రా”అని దర్పంగా అంటూ డ్రైవరుకు కారు పోనియ్యమన్నాను.

——-///——-

నా పెళ్ళి జరిగిన నాటికే మా వారు ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్. ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగం అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. అందుకేనేమో నాకు కొద్దిగా గర్వంగా ఉండేది. మా బంధువుల్లో కూడా చాలామంది ఇలానే అనుకునే వారు.

నాకు పెళ్ళైన కొత్తలో లక్ష్మి మా ఇంట్లో పనికి కుదిరింది. అప్పటికి తనకు పదేళ్ళు. పదేళ్ల పిల్ల ఏమి చేస్తాది అని అనుకునేదాన్ని. మా అత్త గారు “పాపం వాళ్ళమ్మ వచ్చి బ్రతిమాలింది. భర్త లేడట. ఇంట్లో జరుగుబాటు కష్టంగా ఉందట, కొన్ని రోజులు చూద్దాం” అన్నారు. అయినా నేను ఆ పిల్లని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, పైగా అసహ్యించుకునే దాన్ని.

కొద్ది రోజుల తరువాత లక్ష్మి వాళ్ళ చెల్లెలు రంగిని కూడ తీసుకురావడం మొదలుపెట్టింది.

“ఒకదాన్నే భరించలేక పోతున్నాం, రెండోది కూడా ఏమిటి?” అని చీత్కరించుకుంటు మా అత్తగారిని అడిగాను.

“పోనీలే రాజ్యం, మనమేమైనా రెండు జీతాలు ఇస్తున్నామా, వాళ్ళ చెల్లిని తోడుగా తెచ్చుకుంటుంది. ఆ పిల్ల కూడా పనులకు అలవాటు పడుతుందని అనుకుంటుందేమో.” అని సర్ది చెప్పారు.

——-///——-

ఒకసారి ఏమయిందంటే, మా అక్క రాజమండ్రి నుండి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళమ్మాయి కోసం ‘మీరాస్టోర్స్’ లో ఒక బొమ్మ కొని తెచ్చాను. నేను ఆటో దిగుతుండగా పెద్ద వర్షం వచ్చింది. లక్ష్మిని పిలిచి కేరీబేగ్ తీసుకుని టీ పాయ్ మీద పెట్టమని చెప్పాను. వర్షం పెద్దదై గాలివానగా మారింది. లక్ష్మి, రంగి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని వెతుక్కుంటూ వాళ్లమ్మ గౌరి వచ్చింది. ఆ రోజు ఈదురుగాలులతో రోడ్డుపై పెద్ద పెద్ద హోర్డింగులు కూడా పడిపోయాయి.

“గౌరీ, గాలివాన తీవ్రంగా ఉంది. రాత్రికి పిల్లలతో ఇక్కడే హాలులో పడుకో, రేపు ఉదయం వెళ్లొచ్చు” అని మా అత్తగారు అనడంతో ఆ రాత్రి వాళ్ళు మా ఇంట్లోనే ఉండిపోయారు. తెల్లవారుజామున వర్షం తెరిపి ఇచ్చిందని లేచి వెళ్ళి పోయారు.

తెల్లవారి లేచిన తరువాత, ముందు రోజు కొన్న ‘ఆటబొమ్మ’ టీపాయ్ మీద పెట్టిన సంగతి నాకు సడన్ గా గుర్తొచ్చి వెంటనే హాలులోకి వెళ్లి చూసాను. గౌరి, పిల్లలు కనబడలేదు. టీపాయ్ మీద పెట్టిన కేరీ బేగ్ అలాగే ఉంది. హమ్మయ్య అనుకున్నాను. కానీ బేగ్ తెరిచి చూస్తే అందులో బొమ్మ లేదు. నేను రాత్రి పడుకునేటప్పుడు ఊహించినదే జరిగింది. బొమ్మ కనబడలేదు అంటే ఖచ్చితంగా పని పిల్లలు దొంగతనం చేసుంటారు అనుకున్నాను.

“చూడండి అత్తయ్యగారు, మీరు ప్రతి విషయంలో వాళ్ళని వెనకేసుకొస్తారు, ఇప్పుడేమయిందో చూసారా? మా అక్క కూతురు కోసం కొనుక్కొచ్చిన బొమ్మను కొట్టేసారు, అందుకే మనం లేవక ముందే లేచి వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు కనీసం చెప్పలేదు కూడా”

“సరిగ్గా వెతికావా? ఒకటికి రెండు సార్లు గుర్తు తెచ్చుకో, ఇంకెక్కడైనా పెట్టి మరిచిపోయావేమో, ఊరికే దొంగతనం మోపకూడదు.”

“ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. వీళ్ళు తీయకపోతే ఇంకెవరొచ్చారు చెప్పండి, అన్నం పెట్టే ఇంటికి కన్నం పెట్టే రకం వీళ్లు”

“సరే, ఇవాళ వస్తే అడుగుదాం”

రోజూ వచ్చినట్టే ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మి వచ్చింది. “ఏయ్, ఆగవే… మీ అమ్మని పిలుచుకుని రా” అని ఫంపించేసాను. లక్ష్మి బిక్కమొహం పెడుతూ మారు మాటాడకుండా వెళ్ళిపోయింది.

కొంతసేపటికి వాళ్ళమ్మ గౌరితో కలిసి వచ్చింది. “ఏం, గౌరీ, పిల్లలకు దొంగతనం నేర్పిస్తున్నావా? అని అడిగాను.

“అదేటమ్మా అలాగంతారు, మేము పేదోల్లమని దొంగతనం అంటగడతారా?”

“మరి, తెల్లవారి వెళ్తున్నప్పుడు చెప్పకుండా వెళ్ళి పోయావేం?”

“మీరు నిద్దరలో ఉన్నారు. నిద్దర సెడగొట్టడమెందుకని ఎల్లిపోయాం. మా పేనం పోయినా అలాటి పనులు సెయ్యం”

“నిన్న టీ పాయ్ మీద పెట్టిన బేగ్ అలాగే ఉంది, అందులో పెట్టిన బొమ్మ మాయమైంది. ఎలాగంటావ్?”

“మీరేటి కొన్నారో ఎక్కడెట్టారో మాకేటి తెలుసు. మాఇంటికొచ్చి ఎతుక్కోండి, అలాంటి లేకి బుద్ధులు మా దగ్గర లేవు.” అని విసురుగా లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయింది.

“చూసారా? ఎంత పొగరుగా సమాధానం చెబుతుందో?అలగా జనం, వీళ్ళతో పెట్టుకోవడం మన బుద్ధి తక్కువ” అన్నాను. మా అత్తగారిది మౌనమే సమాధానం.

వర్షాల కారణంగా, ఆ రోజు వస్తాదనుకున్న మా అక్క ప్రయాణం మానుకుంది.

——-///——-

మరుసటి రోజు నుంచి లక్ష్మి మా ఇంట్లో పనికి రావటం మానేసింది. మా ఎదురింట్లో పనికి కుదిరింది. మేము ఇంకొకామెను పెట్టుకున్నాం.

అక్కడికి నాలుగు రోజులు పోయిన తరువాత ‘మీరా స్టోర్స్’

నుండి నన్ను ఇంటికి దింపిన ఆటో అబ్బాయి ఒక బొమ్మను చూపించి “అమ్మగారు ఈ బొమ్మ మీదేనా? ఆటో క్లీన్ చేస్తుంటే కనబడింది, కానీ నాకు తీరిక లేక ఈ నాలుగు రోజులు రాలేకపోయాను” అని చెప్పి నేను పోగొట్టుకున్న బొమ్మను తెచ్చి ఇచ్చాడు.

“అయ్యోపాపం! అనవసరంగా ఆ పని పిల్ల మీద నింద మోపావు రాజ్యం” అని మా అత్తగారు అన్నారు. నేను “సారీ అండి” అనేసాను.

కానీ లక్ష్మిని తీసుకుపోతూ, గౌరి అన్న మాట నా గుండెలో గుచ్చుకుంది. “పనిమనిషిని అనుమానించి నేను నా లేకి బుద్ధిని ప్రదర్శించానా!!! నో, పనిమనుషులకే అలాంటి బుద్ధులుంటాయి” అని నన్ను నేను సముదాయించుకున్నాను.

మా అత్తగారికి లక్ష్మి మీద ప్రేమ పోలేదు సరికదా ఎక్కువయింది. ఆ నెక్స్ట్ మంత్ దసరా పండుగల్లో ఇంట్లో చేసిన పిండివంటలు ఇద్దామని ఎదురింట్లో పనిచేస్తున్న లక్ష్మిని పిలిచారు. లక్ష్మి అక్కడ పని ముగించుకుని మా ఇంటి గేటు తెరుచుకుని వచ్చింది. వస్తూనే గేటు దగ్గర వంగింది. నేను మా అత్తగారు గమనిస్తున్నాం. లోపలికి వచ్చి “అమ్మగారు గేటు దగ్గర చెవి దుద్దు పడి ఉంది” అని తెచ్చిచ్చింది. అది నాదే. తెల్లవారి లేచేటప్పటికి నా చెవిలో లేదు. మంచం చుట్టూ వెతికినా కనిపించలేదు. తరువాత మా పని మనిషికి చెప్పాను, నాగది ఊడ్చినప్పుడు గమనించమని. కానీ ఆమె మరిచిపోయి ఊడ్చిన చెత్త మొత్తం బయటకు తోసేసినట్టుంది.

“ఓహ్, గాడ్ ఈజ్ గ్రేట్” అనుకుంటూ లక్ష్మికి అభినందనలు చెప్పాను. ఆ బొమ్మ విషయమై కూడా ‘సారీ’ చెప్పాను.

“చూడు రాజ్యం, దేవుడు మానవులకు మాత్రమే ప్రసాదించిన గొప్ప గుణం బుద్ధి. మన ఆలోచన, తెలివితేటలు, జ్ఞానం మొదలైన వాటి ద్వారా సక్రమంగా మనం ప్రవర్తిస్తే మానవత్వం పరిమళిస్తుంది. ఆరోజు గౌరి అన్న మాటలకు నేను కూడా కలవరపడ్డాను. కానీ అంత కఠినంగా ఎందుకు మాట్లాడిందో ఇప్పుడు తెలిసింది. ఆమె నిజాయితీ అలాంటి మాటలనిపించింది ఆమె చేత” అన్నారు మా అత్తగారు. నాకు నోట మాట రాలేదు, ‘సారీ’ తప్ప.

తరువాత నెల నుండి మళ్ళీ లక్ష్మిని పనిలో పెట్టుకున్నాము.

లక్ష్మిపై మా అత్తగారికి గురి కుదిరింది. దానితో మేము ఎప్పుడు కేంప్ వెళ్ళినా ఇంటి తాళం చెవి కూడా లక్ష్మికి ఇచ్చే వాళ్ళం. మేము తిరిగి వచ్చేటప్పటికి ఇల్లంతా శుభ్రం చేసి ఉంచేది. అలా మా ఇంట్లో పిల్లలా అయిపోయింది.

——-///——-

మావారు ఆంధ్రా బ్యాంకులో ఎ జి ఎమ్ గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. మా అబ్బాయి, వరుణ్, డిగ్రీ పూర్తి చేశాక సిఎ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. కానీ ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. అందుకని సిఎ చదవడం ఆపేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు. చివరికి మా వారి పరపతితో వాడికి ఆంధ్రా బ్యాంకు లోనే క్లర్క్ ఉద్యోగం వచ్చింది. మేమంతా సీతమ్మధారలో మా స్వంత ఇంట్లోనే ఉంటున్నాం.

“మమ్మీ సంబడీ కేం ఫర్ యూ” అంటూ వరుణ్ కేక వేసి వాడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

ఎవరో వాడికి తెలియని వాళ్ళైతే అలా చేస్తుంటాడు. తెలిసిన వారైతే లోపలికి వచ్చి కూర్చోండి అంటాడు.

ఎవరా? అనుకుంటూ హాల్ లోకి వెళ్ళాను. లక్ష్మి వచ్చింది.

“రా లక్ష్మి “ అంటూ పిలిచాను.

“మా ఆయన, అబ్బాయి కూడా వచ్చారండి”

“ఏరీ, రమ్మను” అన్నాను.

“కారు పార్కింగ్ చేసి వస్తారండి.”

కారు ఎందుకు, బస్సులో రాలేక పోయారా?

మా స్వంత కారమ్మా, ఇంకొక ట్రక్కు కూడా ఉంది. బెల్లం లోడు తీసుకెళ్ళడానికి ట్రక్కుని వాడతాం.

“ఓకే” అని అంటుండగానే లక్ష్మి వాళ్ళ ఆయన, కొడుకు వచ్చారు. వస్తూనే పెద్ద పాకెట్ ఒకటి తెచ్చి టీపాయ్ మీద పెట్టారు.

“ఏమిటిది అని అడిగాను.”

“బెల్లం దిమ్మండి”

“ఎవరు తింటారు లక్ష్మి, అయ్యగారికి, నాకు ఇద్దరికీ షుగర్” అని అన్నాను గాని ‘పని మనిషి దగ్గర మనం తీసుకోవడం ఏమిటి?’ అని నా ఈగో ప్రశ్నిస్తుంది.

“పరవాలేదమ్మా, బెల్లం మంచిదే. రోజూ తినం కదా. పండుగ రోజుల్లో పిండివంటలకు వాడుకోవచ్చు. ప్రతిరోజూ భోజనం తరువాత బెల్లం కొద్దిగా తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ఉబ్బరం తగ్గుతుంది.”

“ఓకే… అంతా బాగున్నారా?”

“బాగున్నామమ్మా. మాఅమ్మ చనిపోయిందమ్మా, నాన్న ముందే చనిపోయారు మీకు తెలుసు కదా. మా చెల్లి ఈ ఊరిలోనే ఉంటుంది. ఇప్పుడు నాతో వస్తానన్నాది కానీ వాళ్లింటికి చుట్టాలు వచ్చారట. తరువాత మీకు కలుస్తానని చెప్పింది.”

“మీ చెల్లి ఇంకా ఇళ్ళలో పనులు చేస్తుందా?”

“లేదమ్మా. మా చెల్లి, మరిది డైమన్ పార్కు దగ్గర ‘విశాఖ డెయిరీ’ పాల బంకు నడుపుతున్నారు. ఈ మధ్యనే కొడుక్కి బ్యాంకు లో పెద్ద ఉద్యోగం వచ్చింది.”

“ఆహా…. అలాగా… మంచిది.”

తరువాత నేను టీ పెట్టి ఇచ్చాను. తాగేసి వెళ్ళిపోయారు.

మరుసటి ఆదివారం లక్ష్మి చెల్లెలు రంగి, భర్తను కొడుకుని తీసుకుని వచ్చింది.

డోర్ తీసిన మా అబ్బాయి వాళ్ళను చూడగానే

“గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్, ఏమిటిలా వచ్చారు?” అన్నాడు.

‘ఇదేమిటి? ఎవరో పెద్ద వారు వచ్చుంటారు, చూద్దాం’ అని కిచెన్ నుండి హాల్లోకి వెళ్ళాను. నన్ను చూడగానే “అమ్మగారు నేను రంగిని, బాగున్నారా? మొన్న అక్కతో కలిసి వద్దామనుకున్నాను గానీ అవ్వలేదు” అన్నది రంగి.

మా వాడు ‘గుడ్ మార్నింగ్’ ఎవరికి చెప్పాడో అర్థం కాలేదు.

“ఈయన జనార్దనరావు గారు, మా బ్రాంచి మేనేజర్” అని వచ్చిన అబ్బాయిని పరిచయం చేసాడు వరుణ్.

నాకు అర్ధం కాలేదు అని గ్రహించిన రంగి, “అవునమ్మా, మా అబ్బాయే, ఆంధ్రా బ్యాంకు మేనేజర్, ఈయన మా ఇంటాయన” అని కొడుకుని, భర్తని నాకు పరిచయం చేసింది.

అది విన్న నేను నిశ్చేష్టురాలినయ్యాను. నేను గాలి తీసిన బెలూన్ లా అయిపోయాను. గగన తలంలో విహరిస్తున్న నా ‘ఈగో’ పాతాళానికి నెట్టివేయబడింది. దేవుడు నాకు గర్వభంగం కలిగించాడు. ఒకప్పుడు ‘అలగాజనం, లేకిబుద్ధి గలవారు’ అని ఎవరినైతే నిందించానో వారు ఈ రూపంలో నాకు గుణపాఠం నేర్పించారు అనుకున్నాను.

——-///——-

మరిన్ని కథలు

Sravanthi
స్రవంతి
- మండా. సూర్యనారాయణ
kala nijamayega
kalanijamayega
- ప్రభావతి పూసపాటి
Sahaayam
సహాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Toli Ekadashi
తొలి ఏకాదశి
- కొడవంటి ఉషా కుమారి
Mudi padina bandham
ముడిపడిన బంధం
- అనిసా తబస్సుమ్ sk (Anisa Tabbasum sk)
Nalupu
నలుపు
- వేముల శ్రీమాన్
Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు