రామయ్య తాతయ్య నిత్యం నాలుగు రకాల దిన పత్రికలు తెప్పించుకుంటాడు. అవి చదివాకనే దినసరి పనుల్లో నిమగ్నమవుతాడు. తన హృదయానికి హత్తుకున్న ఏదైనా ఒక వార్త ఉంటే దాన్ని కథగా మలిచి ఆ సాయంత్రం పిల్లలకు చెబుతూ ఉంటాడు. అలా తన విశ్రాంత జీవితాన్ని తృప్తిగా కొనసాగిస్తున్నాడు.
ఆరోజు ఒక పక్షి ప్రేమికుని వార్త తాతయ్య మనసును కలిచివేసింది. దాన్ని మనసులో కథగా మలుచుకొని, పిల్లల కోసం వేచి చూడసాగాడు. ఆ కథ చెబితే గాని తన హృదయం తేలిక పడదు. అని మాటి, మాటికి గుమ్మం వైపు చూడసాగాడు. సమయం ఆరు కావస్తోంది. పిల్లలంతా కేరింతలు కొడుతూ.. హాల్లోకి ప్రవేశించారు. వాలు కుర్చీలో కూర్చున్న తాతయ్యను చూడగానే.. అభివాదము చేస్తూ కూర్చున్నారు.
“తాతయ్యా.. అదోలా ఉన్నారు. ఈరోజు కథ చెప్పరా?” అంటూ ప్రశ్నించాడు ఆశ్రిత్.
“అవునురా.. ఆశ్రిత్. ఈరోజు నామనసును కలిచి వేసిన ఒక వార్త చదివాను”
“అయితే తాతయ్యా.. దాని మీద కథ చెబుతారా?” అంటూ ఆతృతగా అడిగింది ఆరాధ్య.
“అవును ఆరాధ్యా.. ‘పక్షి ప్రేమికుడు’ అనే కథను చెబుతాను” అంటూ గొంతు సవరించుకున్నాడు.
హాల్లో నిశ్శబ్ధం ఆవహించింది.
“అది ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం. ఉదయం సమయానుసారం కలెక్టర్ వచ్చి తన సీట్లో ఆసీనుడయ్యాడు. అలా కూర్చున్నాడో లేదో!.. ఒక పక్షి రివ్వున వచ్చి కలెక్టర్ కాళ్ళ దగ్గర వాలింది. కలెక్టర్ కాళ్ళ మీద తల ఆన్చి హృదయ విదారంగా అరవసాగింది. దాని కళ్ళల్లో నీళ్ళు చూసి కలెక్టర్ మనసు కరిగి పోయింది. దాన్ని రెండు చేతులతో ఎత్తుకొని.. గొంతులో ఏమైనా ఇరుక్కు పోయిందా! అన్నట్టు దాని తల యెత్తి, పరీక్షగా చూడసాగాడు. అది దీనంగా అరుస్తూనే ఉంది. కలెక్టర్ చేతిలో నుండి విదిలించుకొని తిరిగి అతని కాళ్ళను మరో మారు ముక్కుతో సుతారముగా తడిమి ఆవేదనగా అరుస్తూ వెళ్లి కిటికిలో వాలింది. కలెక్టర్ మరో నిముషం పాటు దాన్ని మరింత దీనంగా చూసి తన పనిలో నిమగ్నమయ్యాడు. నా మాదిరిగానే ముందుగా దిన పత్రిక చదవడం అలవాటు. పేజీలు తిరగేస్తుంటే ఒక వార్త ఆకర్షించింది. ‘పక్షిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుడు’ అది వార్త హెడ్డింగ్.
కలెక్టర్ విస్తుపోయాడు. వార్తను చదువసాగాడు.
‘రాంనరేష్ కాలనీలో రాజయ్య, రాజమ్మ అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. గత అర్థరాత్రి ఒక పక్షి గుండెలు పిండేలా అరుస్తుంటే రామయ్య లేచి బయటకు వెళ్లి చూసాడు. ఇంటి ముందున్న వీధి దీపపు వెలుతురులో తన ఇంటి వెంటిలేటర్ లో ఇరుక్కు పోయి రెప్పలు కొట్టుకుంటున్న పక్షి కనబడింది. రామయ్య మనసు కరిగి పోయింది. వెంటనే తన ఇంటివెనుకాలే ఉన్న ఒక నిచ్చెన తీసుని వచ్చి గోడకు వాల్చాడు. అది ఎక్కినా పక్షి అమ్డండం లేదు. అయినా నిచ్చెన చివరి వరకు ఎక్కి ఒంటి కాలు మీద లేచి పక్షిని కాపాడాడు. పక్షి సంతోషంగా రెప, రెప రెక్కలు కొట్టుకుంటూ వెళ్తుండగా దభీ మని
శబ్ధమయ్యింది. ఆ శబ్దానికి ఇంట్లో నుండి రాజమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. రాజయ్య నేలకు కరుచుకొని పది పోయాడు. ఉలుకూ, పలుకూ లేదు. రాజమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ప్రక్క ఇంటి వారు వచ్చి చూసి పెదవి విరిచారు. రామయ్య ప్రాణాలు అనంతలోకంలో కలిసి పోయాయి. ఈ దృశ్యమంతా చూసిన పక్షి ఆవేదనగా అరుస్తూ వెళ్ళడం అంతా విస్తుపోయారు’
వార్త చదవడం పూర్తి కాగానే కలెక్టర్ పక్షి వంక తల తిప్పాడు. పక్షి వాలకం చూసి.. దానికి నోరు లేక పోయినా.. రాజయ్యకు సాయం చేయండని అర్థిస్తుందని అర్థం చేసుకున్నాడు. చటుక్కున కుర్చీలో నుండి లేచి కార్లో రాంనరేష్ నగర్ రాజయ్య ఇంటికి బయలుదేరాడు. ముందు పోలీసు జీపు.
ఇంటి ముందు వాకిట్లో రాజయ్య శవం మీద పడి రాజమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తోంది. పోలీసులు జీపు దిగి కలెక్టర్ గారు వస్తున్నారని హెచ్చరించారు.
కలెక్టర్ రాజమ్మను ఓదార్చుతూ.. వారికి పిల్లలు లేరని.. అనాధలుగా బతుకు నీడుస్తున్నారని తెలుసుకున్నాడు. పక్షి ప్రేమికుడైన రాజయ్య శవ దహన ఖర్చులు, ఇంకా రాజమ్మకు ఆర్ధిక సాయం చేసాడు.
ప్రక్కనే చెట్టు కొమ్మపై నుండి పక్షి చూస్తూండడం గమనించాడు కలెక్టర్. కలెక్టర్ ను చూస్తూ.. కృతజ్ఞతా పూర్వకంగా రెప్పలు రెప, రెపలాడిస్తూ.. రాజయ్య శవం కాళ్ళ మీద వాలి చటుక్కున ఎగిరి పోయింది పక్షి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. “
కథ చెప్పడం ముగియ గానే ‘ఇదంతా నిజమేనా తాతయ్యా..” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆశ్రిత్.
“నిజం కాకుంటే తాతయ్య ఎప్పుడైనా అబద్ధాలు చెప్పాడా?” అంటూ మూతి మూదు వంకర్లు తిప్పింది ఆరాధ్య.
తాతయ్య చిరునవ్వు నవ్వుతూ.. “ పిల్లలూ అది రామయ్య మంచితనానికి ఫలితం. మనం కూడా ఒకరికి చేతనైతే సాయం చేయాలి గాని.. ద్రోహం చేయగూడదు. అప్పుడే మనకు గూడా ఎదో ఒక రూపంలో మేలు జరుగుతుంది”
“ఓ!.. అలాగే తాతయ్యా..” అంటూ పిల్లలంతా ముక్తకంఠంతొ పలికారు.*

