సహాయం - డా:సి.హెచ్.ప్రతాప్

Sahaayam

ఒక పట్టణంలో అజయ్ అనే పదేళ్ల బాలుడు నివసించేవాడు. అజయ్ మనసు ఎంతో స్వచ్ఛమైనది. అతనికి ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడం అంటే అమితమైన ఇష్టం. ఇతరులకు చేసే సహాయం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు తిరిగి వస్తుంది అని అజయ్ తల్లిదండ్రులు చెప్పిన విలువైపైన మాటలు అతని పసి మనస్సులో బలంగా నాటుకుపోయాయి. సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల కరుణతో మెలగాలని ఆయన భావించేవాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవ ధర్మమని, స్వార్థం లేని సేవే భగవంతునికి ప్రీతిపాత్రమైనదని ఆ చిన్నారి తరచూ ఆలోచించేవాడు. కానీ అతని సహచరులైన స్నేహితులు రవి, సునీల్ మాత్రం ఎంతో స్వార్థపరులు. లోకంలో ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, ఇతరులకు ఉచితంగా సహాయం చేస్తే మనకు నష్టమే కానీ ఏమీ లాభం ఉండదు అని వారు నిరంతరం చెబుతుండేవారు. లోకజ్ఞానం లేని ఆ బాలుర మాటలను అజయ్ మాత్రం అస్సలు పట్టించుకునేవాడు కాదు. పరోపకారమే పరమార్థమని నమ్మి తన దారిలోనే ముందుకు సాగేవాడు.

ఒక రోజు అజయ్ తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆయన చాలా దాహంతో అలమటిస్తూ, ఎంతో బలహీనంగా నడుస్తున్నాడు. అజయ్ తన చేతిలో ఉన్న ఒకే ఒక్క దానిమ్మ పండును చూశాడు. అది అతని తల్లి మధ్యాహ్న సమయం కోసం ఎంతో ప్రత్యేకంగా ఇచ్చింది. వృద్ధుడి దయనీయ పరిస్థితిని చూసి అజయ్‌కు ఎంతో జాలి వేసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అజయ్ ఆ పండును ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఎంతో ఆత్రంగా ఆ పండును తిని, నీ మంచి మనసుకు చాలా ధన్యవాదాలు, నువ్వు చేసిన మేలు నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని దీవించాడు. అజయ్ నవ్వుతూ ముందుకు సాగాడు. రవి, సునీల్ ఈ విషయం చూసి, చూశావా, నీ పండు పోయింది, నీకు ఏం లాభం వచ్చింది అని ఎగతాళి చేశారు. అజయ్ వారి మాటలను లక్ష్యపెట్టలేదు. ఆ పండు వల్ల వృద్ధుడి ముఖంలో కనిపించిన తృప్తి, సంతోషం అజయ్‌కు ఎంతో మానసిక ఆనందాన్ని ఇచ్చాయి. స్నేహితుల హేళన కంటే ఒక ఆకలితో ఉన్న ప్రాణాన్ని కాపాడటం మిన్న అని భావించిన ఆ బాలుడు, భవిష్యత్తులో కూడా ఇలాంటి సత్కార్యాలు ఎన్నో చేయాలని తన మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు.

మరుసటి రోజు, అజయ్ పాఠశాలలో సైకిల్ పందెం ఉంది. పందెం కోసం సైకిల్ మీద వెళ్తుండగా దారిలో అజయ్ సైకిల్ గొలుసు ఊడిపోయింది. అతను చాలా నిరాశపడ్డాడు. అయితే అతని స్నేహితులు రవి, సునీల్ మాకు పాఠశాలకు సమయం దాటిపోతోంది, నువ్వు నిదానంగా బాగు చేసుకుని పాఠశాలకు రా అని అజయ్‌ను ఒంటరిగా వదిలేసి వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అజయ్‌కు ఎంతో దుఃఖం వచ్చింది. సరిగ్గా అప్పుడు ఒక వింత జరిగింది. ఒక అపరిచిత వ్యక్తి హఠాత్తుగా అక్కడికి వచ్చి అజయ్ పక్కనే సైకిల్ దగ్గర కూర్చుని ఆ గొలుసును వెంటనే బాగు చేశాడు. అజయ్ ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా, మీరెందుకు నా సైకిల్ బాగు చేస్తున్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో తలెత్తి, నిన్న నువ్వు ఆ వృద్ధునికి సహాయం చేయడం నేను చూశాను, నీలోని దయను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది, మంచి మనసున్న వాళ్లకు సహాయం చేయడం నాకిష్టం అని చెప్పాడు.

అజయ్ వెంటనే తన సైకిల్‌ను తీసుకుని సమయానికి పందెంలో పాల్గొని, విజయం సాధించాడు. రవి, సునీల్‌లు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. గెలిచిన అజయ్ వారి దగ్గరకు వెళ్లి, "చూశారా, నిన్న నేను చేసిన మంచి ఈ రోజు నాకు సహాయపడింది. మనం ఇతరులకు చేసిన మేలు ఎప్పుడూ వ్యర్థం కాదు, అది మన కష్టకాలంలో మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది." అని అన్నాడు.

నిజాయితీతో కూడిన ఆ బాలుడి మాటలు విన్న రవి, సునీల్ తమ స్వార్థ బుద్ధిని తెలుసుకుని ఎంతో సిగ్గుపడ్డారు. ఆ రోజు నుండి వారు కూడా ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించారు. సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడటమే మానవత్వమని వారు గ్రహించారు.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)