తొలి ఏకాదశి - కొడవంటి ఉషా కుమారి

Toli Ekadashi

పూర్వం కృత యుగంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఎంతోధర్మాత్ముడు,ప్రజారంజకుడు. ప్రజలు ఆయన పరిపాలనలో ఎంతో సంతోషంగా ఉండే వారు. కానీ, ఒకసారి ఆ రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు అసలు వర్షాలు పడలేదు. నదులు ఎండిపోయాయి. పంటలు పండ లేదు ప్రజలు ఆకలితో అలమటించిపోయారు. తీవ్రమైన కరువు ఏర్పడింది. పూజలు యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రజల కష్టాలు చూసి మహారాజు ఎంతగానో బాధపడ్డాడు. తన పరిపాలనలో ఏమైనా తప్పు జరిగిందేమోనని ఆవేదన చెందాడు. పరిష్కారం కోసం అతడు అడవులకు కాలినడకన బయలుదేరాడు. ఎంతో మంది మునులను కలుసుకున్నాడు! కానీ పరిష్కారం దొరకలేదు! రాజు బ్రహ్మ దేవుని కుమారుడైన ఆంగీస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షికి నమస్కరించి తన రాజ్యంలో ప్రజలు పడుతున్న కరువు భాదలను వివరించాడు. పరిష్కారం తెలియజేయమని వేడుకున్నాడు ఆప్పుడు అంగీరస మహర్షి జ్ఞానదృష్టితో చూసి, “రాజా ఇది కృతయుగం ! ఇందులో ధర్మం నాలుగు పాదాలు మీద నడుస్తుంది! కానీ నీ రాజ్యంలో ఒకరు తెలియక చేసిన అధర్మం వల్ల వర్షాలు పడటం లేదు. దీనికి పరిహారంగా ఆషాడ శుక్ల పక్షంలో వచ్చే ‘తొలి ఏకాదశి’(పద్మ ఏకాదశి) వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం సర్వపాపాలను హరిస్తుంది. నువ్వు నీ ప్రజలు కలిసి భక్తితో వ్రతాన్ని చేస్తే తప్పక వర్షాలు కురుస్తాయి!” ఆని చెప్పారు. మహర్షి మాటలపై నమ్మకంతో రాజు రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున మహారాజు మహారాణి మరియు రాజ్యంలోని ప్రజలందరూ కలిసి అంతా భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి, జగన్నాథుడైన శ్రీమహావిష్ణువుని పూజించారు. రాత్రంతా జాగారం చేసి విష్ణు కీర్తనలు ఆలపించారు. మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి వ్రతాన్ని ముగించారు. ఆశ్చర్యంగా వ్రతం ముగిసిన వెంటనే ఆకాశంలో దట్టమైనమేఘాలుఆలముకున్నాయి. క్షణాల వ్యవధిలో రాజ్యం అంతా అమృత ధారల్లా జడివాన కురిసింది. నదులు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కరువు తొలగిపోయింది! పంటలు పచ్చగా పండాయి! ప్రజలందరూ మళ్ళీ సుఖసంతోషాలతో జీవించారు! తొలి ఏకాదశి నుండి చాతుర్మాస్యం ప్రారంభం అవుతుంది. ఆ రోజున చేసే ఉపవాసం విష్ణు సహస్రనామం పారాయణ వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా సకల సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం! విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రం జపించడం అత్యంత శుభప్రదం.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)