పెరటి చెట్టు - టి. వి. యెల్. గాయత్రి

Peratichettu

పొద్దుటి నుండి సుజాతకు దిగులుగా ఉంది.చికాగ్గా ఉంది.

' అనవసరంగా వచ్చిందిక్కడికి. గౌరవం లేని చోట అస్సలు వుండకూడదు. శుభ్రంగా ఊరికి వెళ్లిపోతే సరిపోతుంది. తన మానాన తను బ్రతకొచ్చు! తలుపు తెరిస్తే ప్రపంచం ఇంటి ముందుంటుంది. మాట్లాడే వాళ్ళు, పలకరించే వాళ్ళు, బంధువులు అందరూ ఉంటారు.తన సలహా కోసం భక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.భర్తను కూడా వదలి పెట్టి వచ్చింది. తన మాటంటే విలువ లేకపోతే ఎందుకు ఇక్కడ? ఇంకోసారి పిలిచినా రాదు!...తనకు బుద్ధిలేదు ' అనుకుంటూ ఆలోచిస్తోంది.

సుజాత శ్రీనివాసులు ఉండేది మోపిదేవిలో.శ్రీనివాసుకు పౌరోహిత్యం ఉంది.శ్రీనివాస్ మోపిదేవి లోనే కాకుండా విజయవాడకు కూడా వెళ్లి శుభాకార్యాలు చేయిస్తూ ఉంటాడు. ముహూర్తాల టైములో అయితే ఆయనకు అస్సలు తీరిక ఉండదు. ఊళ్ళో వాళ్లకు మంచి చెడు చెబుతూ పెద్ద దిక్కుగా ఉంటారు భార్యాభర్త లిద్దరు.

వాళ్లకు ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాడు ఆనంత్. హైదరాబాదులో ఉద్యోగం. వాడికి ఇద్దరు మగపిల్లలు.

రెండోవాడు ప్రశాంత్. భార్య రాధిక వాళ్లకు ఒక్కతే ఆడపిల్ల. పూజ.వాళ్ళు పూణేలో ఉంటారు.

సుజాత శ్రీనివాసులు పిల్లల దగ్గరికి వచ్చి ఉండేది తక్కువ.

పిల్లలే అప్పుడప్పుడూ మోపిదేవికి వస్తుంటారు.ఈసారి పూణేలో ఒక నెలరోజులు ఉండటానికి వచ్చింది సుజాత.

కారణం కోడలు రాధిక అక్క కూతురు పెళ్లికని విశాఖపట్నం వెళ్ళింది. ప్రశాంతుకు ఆఫీసు. పూజకు స్కూలు. పూజ నైన్త్ క్లాసు చదువుతోంది.

అలా మనవరాలిని చూసుకోవటానికి కొడుకు ఇంటికి వచ్చింది సుజాత.

ఎప్పుడూ చుట్టం చూపుగా మోపిదేవికి వచ్చే పిల్లకు బామ్మ పద్ధతులు అంతగా తెలియవు. పైగా మోపిదేవిలో పెద్దనాన్న పిల్లలతో ఆడుకుంటూ గడపటంతో బామ్మ గురించి తెలియదు పూజకు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండటంతో పూజకు కొంచెం ఇబ్బందిగా ఉంది.

మడి ఆచారం పాటించే సుజాతకు స్కూలు నుండి రాంగానే పూజ ఆ బట్టలతోనే తిరుగుతుంటే చికాగ్గా ఉంది.

"ఆ స్కూలు బట్టలు మార్చుకోవే!మురికి ఓడుకుంటూ వస్తావు. వెళ్లి స్నానం చేసిరా!"అని బామ్మ చెప్తే విసుక్కుంటుంది పూజ.

బిగుతుగా ఉండే బనీను, షార్ట్ వేసుకొని కూర్చుంటే " పెద్దమనిషయిన ఆడపిల్లవు!అలా పిచ్చి డ్రెస్సులేంటి? చక్కగా నిండుగా పంజాబీ డ్రెస్సు వేసుకో!పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోకు!అందరికీ అలా కనిపించకు!"అంటూ చెప్తూ ఉంటే బామ్మ మీద కోపం వచ్చేది పూజకు.

సాయంత్రం తండ్రి రాంగానే బామ్మ గురించి చెప్పి " మరీ చాదస్తంగా ఉంటుంది బామ్మ... పాత కాలం దానిలాగా ఉండమంటోంది. ఎలా ఉండను నాన్నా!బామ్మ కేమీ తెలియదు!"అంటూ ఫిర్యాదు చేసింది.

"ఒరేయ్!కాస్త మంచి బట్టలు వేసుకోమనటం తప్పట్రా!ఇందాక ఆ ఇస్త్రీ బట్టల వాడు వచ్చాడా!మన పిల్లనే తినేసేటట్లు చూస్తున్నాడు. ఆ నిక్కర్లు కాకుండా కాస్త పద్దతిగా ఉండే బట్టలు వేసుకోమంటే నీ కూతురుకు కోపం.. పొద్దున టి. వి. చూస్తే ఎన్నెన్ని ఘోరాలో కనిపిస్తున్నాయి!....మన జాగ్రత్తలో మనం ఉండొద్దూ! "అంది సుజాత.

ఇవన్నీ కొత్త విషయాలు ప్రశాంతుకు.

"నేను మెల్లగా చెప్తాలే అమ్మా!నువ్వు వర్రీ పడకు!"అని తల్లిని అనునయించాడతడు.

మనవరాలి ప్రవర్తనకు బాధ పడుతోంది సుజాత. అసలు కొడుకు దగ్గరికి రావటమే తప్పని మథన పడుతోంది.

ఆ రాత్రి కూతురి దగ్గర కూర్చుని

"బంగారూ!బామ్మ వాళ్ళు ఉండేది నిజంగానే పల్లెటూరు. అమ్మ వచ్చేదాకా అడ్జస్ట్ అవరాదూ!చిన్న చిన్న విషయాలే కదా!వింటే సరిపోతుంది."అన్నాడు ప్రేమగా.

" ఒకటో రెండో అయితే వినొచ్చు నాన్నా!ప్రతిదీ చెబుతూనే ఉంటుంది. పక్కబట్టలు సర్దు!ఆరేసిన బట్టలు తీసుకురా! వాటిని మడత పెట్టు!...మొక్కలకు నీళ్లు పొయ్యి!....ఇలా ఏదో ఒకటి పురమాయిస్తూ ఉంటుంది. నిన్న సాయంత్రం కాసేపు టి.వి. దగ్గర కూచుంటే ఘోరంగా చిక్కుడు కాయలు ఒలిచిపెట్టమంది నాన్నా!"విసురుగా చెప్పింది పూజ.

ప్రశాంతుకు పరిస్థితి అర్థం అయింది.

రాధిక పూజకు చిన్న మెత్తు పని కూడా చెప్పదు.చిన్నపిల్ల! చదువుకొనే పిల్ల! అందులో ఒక్కతే పిల్ల!గారాబంగా తనే చేతికి నోటికి అందిస్తూ ఉంటుంది.

ఇప్పుడు తల్లి పెద్దది. ఆవిడకు పొద్దున్నే టిఫిను, వంట, పూజ చేసేటప్పటికి ఓపిక అయిపోతుంది. పూజకు పెద్దావిడ అశక్తత గురించి తెలియటం లేదు.

"బామ్మ పెద్దది నాన్నా!నువ్వే కొద్దిగా ఆవిడకు హెల్పు చెయ్యాలి. అమ్మ వచ్చేదాకానే కదా!తర్వాత బామ్మ మోపిదేవికి వెళ్లి పోతుంది.కాస్త సర్దుకుంటావా!"

"ఊరికే కూర్చోకుండా 'ఆ శ్లోకాలు చదువు! ఈ పద్యాలు నేర్చుకో!నీకు పంచతంత్రం కథలు తెలుసటే!' అంటుంది. తెలుసంటే చెప్పమంటుంది. తెలీదంటే' కూర్చో! చెప్తా 'నంటుంది. ఏదో మనకు వంట చేసి పెట్టటానికి వచ్చిందా! ఇవన్నీ ఎందుకు? బామ్మను పంపించెయ్!మనం స్విగీలో తెప్పించుకొందాం!"అంటూ బామ్మ అంటే కొంచెం కూడా గౌరవం లేకుండా చెబుతోంది పూజ.

బాధగా ఉంది ప్రశాంతుకు.

'తన తల్లిని కేవలం ఇంట్లో పని చేయటానికి వచ్చిందనే భావనతో చూస్తూ ఉంది కూతురు.ఇలాగే పెరిగితే రేపు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. పెద్ద వాళ్ళను ప్రేమించటం పిల్లలకు తెలియాలి.

ఇంతవరకు తన కూతురు ఎలా పెరుగుతోందో తనకు తెలియలేదు. పాప మంచిగా చదువుతుందని, చురుగ్గా ఉంటుందని సంతోషిస్తున్నాడు కానీ... ఇప్పుడు పాప మనస్తత్వం అర్ధం అవుతోంది. తల్లి చెప్పేవి కష్టమైనవి కావు! చిన్నప్పుడు ఇంటా బయట తల్లి దండ్రులకు తాము సహాయం చేసేవాళ్ళు.ఇంట్లో తమ బామ్మ తాతయ్యలను చూసుకొనే వాళ్ళు. ఇప్పుడు అలాటి వాతావరణం లేదు. పిల్లలకు అడ్జస్ట్ అవటం ఎలా తెలుస్తుంది. మెల్లగా చెప్పుకోవాలి. లేకపోతే పూజకే కాదు తమకు కూడా కష్టం!' ఆలోచిస్తున్నా డతడు.

"రేపటి నుండి నేను ఇంట్లో ఉండి పని చేసుకుంటాను. ఈ వారం రోజులు నీకు తోడుగా ఇంట్లో ఉంటాను. సరేనా!"అన్నాడు.

సంతోషం వేసింది పూజకు.

రెండో రోజు పూజ కంటే ముందే లేచాడు ప్రశాంత్.

తల్లికి వంటలో సహాయం చేశాడు.

అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దాడు.

"ఇలారా పూజా! నువ్వు స్కూలులో ఎంత తింటావో నాకు తెలీదు. వచ్చి బాక్స్ లో పెట్టుకుంటావా!" అన్నాడు లాలనగా.

గబగబా వచ్చి చపాతీ కూరని బాక్స్ లో సర్దుకొంది పూజ.

"ఆ ముక్క నేను చెబితే ఖయ్యిమనేది నీ కూతురు." అంది సన్నగా సుజాత.

"నేను శంఖం అన్నమాట!"నవ్వుతూ బదులిచ్చాడు ప్రశాంత్.

ఆ మధ్యాహ్నం స్కూలు నుండి వచ్చింది పూజ.

" హాయ్ బంగారూ!"అంటూ కూతురిని పలకరించాడు.

ఆ బట్టలతోనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతోంది పూజ.

"పూజా!నీ కీరోజు స్పోర్ట్స్ క్లాసు అయిందా?" అడిగాడు ప్రశాంత్.

" అవును నాన్నా!"అంది పూజ.

" నీ డ్రెస్స్ మీద దుమ్ము అంటుకొని ఉంది!చూడు!మార్చుకొని వస్తావా!"

చూసుకొంది పూజ. నిజమే!బూట్లు కూడా దుమ్ముగా ఉన్నాయి.

"కాస్త డెట్టాల్ వేసుకొని స్నానం చేస్తావా!జెర్మ్స్ వస్తాయి!"

నిజమే అనిపించింది పూజకు.

వెంటనే బాత్ రూమ్ లో దూరింది.

నవ్వొచ్చింది సుజాతకు.

"నేను పెంకును "అంది చిన్నగా.

ఆ సాయంత్రం ఆరేసిన బట్టలు తెచ్చాడు ప్రశాంత్.

"అబ్బా!నాకు నీ బట్టలు మడతపెట్టటం చేతకావటం లేదు!ఎలాగా? "

తండ్రిని చూసింది పూజ.

బట్టలు పట్టుకొని అస్తవ్యస్తంగా చుట్టబెడుతున్నాడు ప్రశాంత్.

"అబ్బా!ఇలా కాదు నాన్నా! ఇలా మడత పెట్టాలి!"అంటూ మడత పెట్టి చూపించింది పూజ.

మడత పెట్టిన బట్టల్ని తీసుకొని అల్మరాలో సర్ది వచ్చింది.

"ఆహా!"అంది సుజాత.

ఆ రాత్రి భోజనాలయ్యాక రెండో రోజుకు తరగాల్సిన కూరలు పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు ప్రశాంత్.

టి.వి. చూస్తోంది పూజ.

ఒక నిమిషం తర్వాత

" అబ్బా!"అన్నాడు ప్రశాంత్.

"ఏమిట్రా!"అడిగింది సుజాత.

"ఏం లేదమ్మా!కూరలు తరుగుదామనుకుంటే కొద్దిగా కోసుకుంది!"

"అయ్యో!"అంటూ పూజ సుజాత లేచి వచ్చారు.

ప్రశాంతుకు బాండెయిడ్ ఇచ్చి తనే కూరలు తరగటం మొదలు పెట్టింది పూజ.

" నువ్వు వద్దులేవే!నీ క్కూడా కోసుకుంటే కష్టం!నేను తరుగుతాలే!"అంది సుజాత.

"నా కూతురుని అంత తక్కువగా అంచనా వేయకు!అసలు నీ మనవరాలికి రాని పనే లేదు తెలుసా!వదిలి పెడితే రాకెట్ మీద ఆకాశం చుట్టబెట్టి వస్తుంది! ఇదెంత? " అన్నాడు కవ్వింపుగా ప్రశాంత్.

ఛాలెంజ్ గా తీసికొంది పూజ.

కాసేపట్లో జాగ్రత్తగా కూరలు తరిగి బామ్మ వైపు విజయగర్వంతో చూచింది.

నవ్వింది సుజాత.

ఆ వారం రోజులు తనతో పాటు కూతురిని కూడా ప్రతి పనిలోను భాగస్వామిని చేస్తున్నాడు ప్రశాంత్.

కొంత కొంత మార్పు వచ్చింది పూజలో.

ఆ రోజు శనివారం. పూజ ఫ్రెండ్ తరళ పుట్టినరోజు.తయారవుతోంది పూజ.

చిరుగుల చిరుగుల ప్యాంట్. దాని మీద బిగుతుగా ఉండే టీ షర్ట్.

జుట్టు విరబోసుకుంది. పిల్లను చూశాడు ప్రశాంత్.

ఇలాగే ఏ సినిమా తారో కనిపిస్తే సెక్సీగా ఉంది అనుకునే వాడు తను. తన కూతురు ఇలా అధ్వాన్నమైన బట్టల్లో. ఎలా చెప్పాలి?...గట్టిగా వద్దని చెప్తే ఏడుపు మొహం పెడితే ఏం చెయ్యాలి?

"ఈ రోజు వెరైటీ డ్రెస్స్ వేసుకుందామా!"అడిగాడు.

"ఇది బాగాలేదా నాన్నా!"

"బాగానే ఉంది!నీ ఫ్రెండ్స్ అందరిలోకి కొంచెం వేరుగా డ్రెస్స్ వేసుకో! అందరిలాగా ఎందుకు? "

"ఏం వేసుకోను? ఇలాటివే కదా ఉన్నాయి!"

"పద!నీ డ్రెస్సులు చూపించు! నేను సెలెక్ట్ చేస్తాను!"

బీరువాలో ఉన్న డ్రెస్సులు తీసి ప్రశాంతుకు చూపించింది పూజ.

అన్నీ వెదికి ఒక ఎల్లో కలర్ గాగ్రాచోళి తీశాడు.

" ఇది బాగుంటుంది. ఏమంటావు? "

"ఇలాటివి పండగలప్పుడు వేసుకుంటారు. ఇంత ట్రెడిషనల్ గా ఎవ్వరూ రారు."అంది పూజ.

"పుట్టినరోజు కూడా పండగే కదా!వేసుకుంటే తప్పేంటి?"

"అందరిలోనూ నేను ఆడ్ గా ఉంటాను నాన్నా!"

"అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటావు. ఎలా ఉంది!అందరూ వేసుకున్న వే వేసుకుంటే ఏం గొప్ప? గుంపులో గోవిందా అన్నట్లుగా ఉంటావు.నువ్వు ప్రత్యేకంగా తయారయ్యి వెళ్ళు!"

కాసేపు ఆలోచించింది పూజ.

ఆ పిల్ల మనసు ఊగిసలాడుతోంది.

చివరకు తండ్రి చెప్పినట్లు గాగ్రాచోళిని వేసుకొని వెళ్ళింది పూజ.

పార్టీ నుండి ఇంటికి వచ్చింది పూజ.

"ఏమన్నారు నీ ఫ్రెండ్స్?" అడిగాడు ప్రశాంత్.

"అందరూ బాగుందన్నారు.. ఇద్దరు ముగ్గురు ఆంటీలు ఎక్కడ కొన్నావని అడిగారు కూడా!"నవ్వుతూ చెప్పింది పూజ.

"ఊ!దీనిని బట్టి అర్ధం అయిందేమిటి? మనం కొంచెం భిన్నంగా ఆలోచిద్దాం! దాని వల్ల మనం మన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వాళ్లమవుతాము!ఉదాహరణకు నీ ఫ్రెండ్స్ తెలియని విషయాలు నేర్చుకోవటం.. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవటం.. ఇలా ఆలోచించు!కొత్త భాషలు నేర్చుకుందాం!కొత్త సంస్కృతిని అలవాటు చేసుకుందాం!"

"అంటే జర్మనీ, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ నా?"

"వాటిని నీ ఫ్రెండ్స్ నేర్చుకుంటారు.. అవి కాదు. కొత్త విషయాలు నేర్చుకో! నీ ఫ్రెండ్సుకు రాని విషయాలు తెలుసుకో!"

"ఏమిటవి?"

"వంద రూపాయ నోటు మీద ఉన్న భాషల్లో ఒక్కో భాష చొప్పున నేర్చుకుంటూ వెళదాము!అలా ఒక గోల్ పెట్టుకుంటే మనకు బోలెడు భాషలు వస్తాయి.ఇప్పటికే మనకు హిందీ, మరాఠి వచ్చు!కొంచెం తేలికయిన భాష ఇలా రెండేళ్లకొక భాష చొప్పున....ముందు నువ్వు నేర్చుకో!ఆఫీసు నుండి వచ్చాక నీ దగ్గరే నేను నేర్చుకుంటాను!నువ్వే నాకు టీచరువు! ఎలా ఉంది ఐడియా?"

"బాగుంది!ట్యూషన్ పెట్టుకోవాలా? " కాస్త ఉత్సాహంగా ఉంది పూజకు.

"పెట్టుకుందాం! వారానికి రెండు సార్లు! అయితే ఎవరైనా ముందుగా మనకు మాతృభాష వచ్చా అని అడుగుతారు. అందుకని ముందు తెలుగు నేర్చుకొని ఆ తర్వాత కన్నడ, తమిళం ఇలా వెళదాం!ఏమంటావు!"

కాసేపు ఆలోచించింది పూజ.

తనకు తెలుగు సరిగ్గా రాదు. ఏదో మాట్లాడటం వచ్చు కానీ రాయటం రాదు.

తన ఫ్రెండ్స్ ఇలా ఆలోచించరు.

"సరే నాన్నా!" అంది. ఆ అమ్మాయి గొంతులో విశ్వాసం ధ్వనిస్తోంది.

కూతురిని దగ్గరకు తీసికొన్నాడు ప్రశాంత్.

వారానికి రెండు సార్లు తెలుగు నేర్పించటానికి టీచర్ దొరికింది.

"పెళ్ళికి వెళ్ళాలి టీచర్!అక్కడ పాడటానికి ఏదన్నా చిన్న పాట నేర్పిస్తారా!"టీచరును అభ్యర్ధించాడు ప్రశాంత్.

"తెలుగు పాటలే అయితే నేనే నేర్పిస్తాను కదరా!"అంది సుజాత.

" నువ్వు పెరటి చెట్టువు కదమ్మా!మన పిల్ల వినదు!మనం చెప్పాల్సిన వన్నీ ఆ టీచరు చేత చెప్పిద్దాము!"అన్నాడు ప్రశాంత్.

నెలరోజులు గడిచాయి.

విశాఖపట్నంలో పెళ్ళికి అందరూ వచ్చారు.

పట్టులంగా వేసుకొని, నగలు పెట్టుకొని తయారయ్యింది పూజ. ఏదో నెమ్మదితనం. కొద్దిగా మార్పు.

"ఏమిటండీ!"అదిగింది రాధిక.

"మన పిల్ల మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి రాధికా! మంచి చదువే కాదు మంచి సంప్రదాయం, మంచి అలవాట్లు మనమే నేర్పించుకోవాలి. పిల్లలకు అడిగివన్నీ కొనిపెడుతూ, ఒళ్ళు కందకుండా పెంచటం ప్రేమ కాదు.పెద్దవాళ్ళని గౌరవించటం, మన సంస్కృతిని పట్టుకోవటం అన్నీ నేర్పించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మనమే ఒంటరి వాళ్ళమవుతాము!జాగ్రత్తగా చూసుకోవాలి!"కూతురినే చూస్తూ చెప్పాడు ప్రశాంత్.

అవునన్నట్లు తలూపింది రాధిక.

పొద్దున పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెళ్లి కూతురి బామ్మ

"ఎవరైనా పాటలు పాడండ్రా!"అంది.

ఒకటి రెండు పాటలు పెద్ద వాళ్ళు పాడారు.

కూతురుని చూసి పాట పాడమన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ప్రశాంత్.

"అదిగో అల్లదిగో శ్రీహరి వాసమూ!"అని ఎత్తుకొని అన్నమాచార్య కీర్తనను పాడింది పూజ.

" అబ్బో!అబ్బో!నీ కూతురు అద్భుతంగా పాడిందిరా!"అంటూ ప్రశాంతుకు తెలిసిన పెద్దవాళ్ళు కొందరు పొగిడారు.

పూజ నవ్వుతూ తండ్రి వైపు చూసింది.

మనవరాలి పెంపకం మీద కొడుకు శ్రద్ధ పెడుతున్నందుకు సుజాతకు సంతోషంగా ఉంది.

(సమాప్తం)

మరిన్ని కథలు

Manasuna Manasai
మనసున మనసై
- డా:సి.హెచ్.ప్రతాప్
anishi-Janthuvu
మనిషి – జంతువు
- Karlapalem HanumanthaRao
Iddaru yajamaanulu
ఇద్దరు యజమానులు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Gulakarallu
గులకరాళ్ళు
- Lakshmi Priyanka
Mamatala kovela
మమతల కోవెల
- డా:సి.హెచ్.ప్రతాప్
O chelli Tanjamma katha
ఓ చెల్లి తంజమ్మ కథ
- హేమావతి బొబ్బు
Vinta charya
వింత చర్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు