సుభాషిణి - చరవాణి - డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు

Subhashini-Charavaani

“ చరవాణిని ఉపయోగించని వారు ఈ రోజుల్లో దాదాపు లేరనే చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలు. ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ వారి చేతిలో చరవాణి తప్పనిసరి సహచరిగా మారింది. ఫలితంగా, ఒకే ఇంట్లో నివసిస్తున్న దంపతులు పరస్పరం ముఖాముఖిగా మాట్లాడుకునే సమయం క్రమంగా తగ్గిపోతోందని ఆ కారణంగా విడాకులు పెరిగిపోతున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ విషయంపై ప్రముఖ మానసిక శాస్రవేత్త వసుంధర గారు యేమంటారో విందాం అని యాంకర్ ప్రకటించింది. వసుంధర గొంతు సవరించుకుని ఇలా చెప్పింది.

“మనకు రోజులో సగం సమయం చరవాణితోనే గడిచిపోతోంది. మిగతా సగం దాన్ని చార్జ్ పెట్టడంలో గడుస్తుంది. లేస్తూనే ఫోన్, స్నానం చేస్తూనే ఫోన్, తింటూనే ఫోన్, పడుకుంటూనే ఫోన్. ఇప్పుడు ఇంట్లో మనుషులు ముఖా ముఖీ మాట్లాడుకోవడం లేదు. ఫోన్ చేసుకుంటున్నారు. మెసేజ్‌లు పెట్టుకుంటున్నారు, భర్త పక్క గదిలో ఉన్నా భార్య ‘టీ పెట్టా’ అని వాట్సాప్‌లో సందేశం పంపుతుంది. మునుపు భార్యాభర్తలు రాత్రి భోజనం తర్వాత గంటసేపు మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని వేర్వేరు స్క్రీన్లను చూస్తున్నారు. ముఖాలు దగ్గరగా వున్నా మనసులు మాత్రం దూరంగా వుంటున్నాయి. ముగించే ముందు ఒక మాట: ఇంట్లో గడియారం మోగితే సమయం తెలుస్తుంది; ఫోన్ మోగితే సమయం పోతుంది."

వసుంధర చెబుతున్న మాటలు విని రఘు నవ్వుకున్నాడు.

"నేను చరవాణిని అతి తక్కువగా వుపయోగించే యువతినే వివాహం చేసుకుంటాను." అన్నాడు స్నేహితుడు సుబ్బారావుతో.

“అలాంటి అమ్మాయి దొరకడం దాదాపు అసాధ్యం. అయినా బెస్టాఫ్ లక్." అన్నాడు సుబ్బారావు.

"నీ భార్య సంగతేమిటి?" అని ఆసక్తిగా అడిగాడు రఘు

" రేపు సెలవేగా. మా యింటికి లంచికి రా. నీ కళ్ళతో మా సంసారాన్ని చూద్దువుగాని." అని సుబ్బారావు రఘుని ఆహ్వానించాడు.

@@@

మరునాడు రఘు సుబ్బారావు యింటికి వెళ్ళాడు. సుబ్బరావు స్నేహపూర్వకంగా లోపలికి ఆహ్వానించి, మర్యాదలు చేసాడు.అతని భార్య సుభాషిణి జాడలేదు.

" సుభాషిణి ఇంట్లో లేదా?" అని అడిగాడు రఘు.

"ఇంట్లో వుంది. కానీ మన ప్రపంచంలో లేదు."

"అదేమిట్రా! వింతగా చెబుతున్నావు."

" వింతా పాడా! రోజులో అధిక సమయం చరవాణితో వుంటుంది."

"అందరిళ్ళలో ఇదే టాపిక్. వయసుతో నిమిత్తం లేకుండా ఇంటిల్లిపాదీ చరవాణి బానిసలై పోతున్నారు.” అన్నాడు రఘు విరక్తిగా.

"రా, యిల్లు చూద్దువు!" అంటూ సుబ్బారావు, వరుసగా అన్ని గదులు చూపించాడు. బెడ్రూం, కిచెన్ ద్వారాలకు ఒకే రకం పోస్టర్లు అంటించివున్నాయి. వాటి మీద, "చరవాణి లేని సుభాషిణి, జగదేక సుందరి." అని వ్రాసి వుంది. సుబ్బారావు తెలివి అర్ధమై, రఘు చిరునవ్వుతో అడిగాడు.

" ఈ పోస్టర్ చూసి ఆమె చరవాణి విడిచి పెట్టిందా?”

“లేదు. పోస్టర్ ఫోటో తీసి తన ఫ్రెండ్స్‌కి పంపింది. చూడండి మా ఆయన కామెడీ!’ అని.”

“అయితే ప్రయోజనం?”

“కనీసం నా చమత్కారానికి సాక్ష్యాలు తలుపులమీద వున్నాయి,” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

సుభాషిణి వున్న గది తలుపు మూసి వుంది.

“ఇది ఆమె చరవాణి మందిరం. ఇందులో ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ, ఎవడు యేమన్నాడో, యేం చేసాడో, స్నేహితులతో చెప్తూంటుంది.”

రఘుకి అనుమానం వచ్చి అడిగాడు. " సుభాషిణి కాలేజి లెక్చరరు కాదా? రాజకీయాల్లో చేరిందా?"

సుబ్బారావు జవాబు చెప్పే లోగా సుభాషిణి వచ్చింది.

"సారీ అన్నయ్యా! స్నేహితురాలి నుంచి ఫోన్. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ యెక్కువ. నాకు రాజకీయ నాయకులు, అధికారులతో పరిచయాలున్నాయని, ఫోన్ చేసి సహాయం అడుగుతారు. వాళ్ళ పని అవగానే ఫోన్ చేసి కృతజ్ణతలు చెప్పుకుంటారు. ఎక్కువ సమయం ఫోన్ మీద వుంటానని సుబ్బు అప్పుడప్పుడూ అలుగుతాడు."

" పెళ్ళి చూపుల్లో మా సుభాషిణి బంగారం అని మా మావగారు అంటే, ఎంత అదృష్టం అనుకున్నా! కానీ ధరలు ఆకాశమంటి అటు బంగారం, వ్యవహారాలు పెరిగి ఇటు సుభాషిణి , అందని చందమామలై పోయారు." అన్నాడు సుబ్బారావు పరిహాసంగా

మందహాసం చేస్తూ సుభాషిణి, " నేను చందమామనైతే, సుబ్బూ ఆకాశం. ఆ తారలు మా పిల్లలు. ఎంత బాగుంది మా కుటుంబం." అని అంది.

రఘు సరదాగా, "మన ముఖ్యమంత్రి పిల్లలని కనమంటున్నాడు. మీ దంపతులకి అవార్డ్ గ్యారంటీ." అని అన్నాడు.

"బహుమతిగా జీవిత కాలం టాక్ టైముతో ఐఫోన్ ఇస్తే, మాకు సంతోషం" అన్నాడు సుబ్బారావు. అందరి ముఖాల్లో నవ్వులు విరబూసాయి. అలా నవ్వుకుంటూ భోజనాలు చేసారు. భోజనాలయ్యాక సుభాషిణి రఘుతో ఇలా చెప్పింది.

" అన్నయ్యా! చరవాణి వల్ల నేను సుబ్బూకి విసుగు కల్గించిన సందర్భాలు లేక పోలేదు. అలాగే సుబ్బు నాకు చికాకు తెప్పించిన సమయాలూ వున్నాయి. కానీ ఆలోచించు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో సభ్యుల మధ్య జరిగే ఆత్మీయ సంభాషణలు మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చేవి. కానీ కాలం మారింది; కుటుంబాల రూపం మారింది. నేటి చిన్న కుటుంబాల్లో ఆ ఆత్మీయ సంభాషణలకు అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చరవాణి ద్వారా మాట్లాడటం ఒక సహజమైన అవసరంగా మారింది. ఇందులో తప్పు చరవాణిదీ కాదు, మాట్లాడే వారిదీ కాదు; అది నేటి సమాజ జీవన విధానానికి అనుగుణమైన ఒక సహజ మార్పు మాత్రమే. నీకు నీ బంధంపై నమ్మకం ఉంటే, నీ భార్య నిన్ను నిర్లక్ష్యం చేసి వేరే వారితో మాట్లాడుతుందనే అనుమానం ఎందుకు కలుగుతుంది? ఆ కోణంలో ఆలోచిస్తే, చరవాణి పట్ల నీలో ఉన్న భయం, అనుమానం రెండూ తొలగిపోతాయి. భార్యా భర్తలు సహనంతో సర్దుకు పోతే, కాపురాలు కలకాలం సాగుతాయి."

ఆమె చెప్పిన మాటల్లోని ఔచిత్యాన్ని గ్రహించిన రఘు అంగీకార సూచకంగా తలూపాడు.

@@@

మరిన్ని కథలు

Maa manchi donga
మా మంచి దొంగ
- అనిసా తబస్సుమ్
Mali vayasu chivari majili
మలి వయసు చివరి మజిలీ..
- వరలక్ష్మి నున్న
Premanubandham
ప్రేమానుబంధం
- Kameswara Rao Rapaka
Vyavasayam
వ్యవసాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vaaradhi
వారధి
- ప్రభావతి పూసపాటి
Gunam pradhaanam
గుణం ప్రధానం!
- చెన్నూరి సుదర్శన్
Mamakarapu velugulu
మమకారపు వెలుగులు
- డా:సి.హెచ్.ప్రతాప్