మా మేనత్త ప్రయాణం - Kaligotla Sridevi

Maa menatta prayanam

మా ఇల్లు మణిద్వీప వర్ణణకు ఎమాత్రం తీసిపొకుండా ఉంటుంది.సాక్షాత్తు లలితా దేవి నివాస స్థలమంత పవిత్రంగా, సుఖ సంతోషాలతో, ప్రశాంతంగా ఉండే ఆలయం మా ఇల్లు. అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అమ్మమ్మ, దొడ్డమ్మ, పెదనాన్న, బాబాయి, పిన్ని, అక్కయ్య, అన్నయ్య, తమ్ముళ్ళు, స్నేహితులు, ఇలా ఎన్నో అనుబంధాలతో ఆత్మీయతలతో అందంగా ఓర్పుతో నేర్పుతో దిద్దబడే రంగవల్లికనే లోగిలి అంటారని అద్రుష్టవశాత్తు చిన్నతనంలోనే అర్థం అయ్యింది నాకు.

రోజు మా పెరట్లో బామ్మ ఒళ్ళో కులాసాగ గారాలు కురుస్తో పడుకొని ఇంట్లొ సాగుతున్న ప్రహసనాన్ని హసితం తో ఆస్వాదిస్తున్నాను. రోజే మా మేనత్త అత్తవారింటికి తిరుగు ప్రయాణం మరి.

ఆవిడకు వివాహం అయ్యి అయిదు సంవత్సరాలయింది. మూడంటే మూడు కిలోమీటర్ల అవతల ఉంది వాళ్ళ అత్తవారిల్లు. కాని అత్తయ్య తిరుగు ప్రయాణం అనగానే ఇంట్లో ఒక్కరికీ కూడా ఇష్టంగా ఉండేది కాదు. నెలలో ఎదో ఒక వంకన రెండు మూడు సార్లు పుట్టింటికి వస్తూనే ఉన్నా, ఆవిడ తిరుగు ప్రయాణం అనగానే అందరికీ బెంగ వచ్చేసేది.ముఖ్యంగా మా తాతయ్య గారికి.

నలుగురు కొడుకుల తరవాత ఒక్కతే కూతురు మా అత్తయ్య. జాబిల్లి లా ఉంటుంది.ఆవిడ పుట్టగానే మా అమ్మే పుట్టింది అనుకున్నారుట మా తాతయ్య. రోజు పల్లెత్తు మాట అని ఎరుగనే ఎరుగరు. మెట్టినింట్లో మాత్రం ఎం తక్కువ. ఆవిడ అత్త మామలకు ఒక్కడే కొడుకు, బోలెడంత ఆస్థి, ముఖ్యంగా చక్కటి హ్రుదయాలు గల మనుషులు. కంటికిరెప్పలా చూసుకునే భర్త, కోడలిలోనే కూతురిని చూసుకునే అత్త మామలు ఉంటే ఇంకా ఏం కావాలి. మా అత్త బంగారు పూలతో పూజ చేస్కున్నదని, అందుకే అంత మంచి భర్త, అత్త మామలు, మంచి కుటుంబం లభించిందని అందరూ అంటుంటారు. ఆక్కడా అవిడ్ని గరాబమే చేస్తారు అందరూ.

ఇక మా తాతయ్య గారి గారాల పట్టీ అయిన అత్తయ్య, పెళ్ళి ఘనత గురించి కాకుండా, నాటి అప్పగింతల సంగతే చెప్పుకుంటారందరూను.పెళ్ళి నాడు అప్పగింతలప్పుడు చూడాలిట మా తాతయ్యగారి అవస్థ. ఎంతో గంభీరంగా విభూధి రేఖలతొ, నుదుటిన చిరు నామంతో, తెల్లటి పంచె, మల్లెపువ్వులాంటి పై కండువ వేసుకొని అపర రుద్రుని లా వెలిగే ఆయన, రోజు మాత్రం వెక్కి వెక్కి చిన్న పిల్లవాడిలాగ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారుట. నాటి నుండి ఈనాటి వరకు మా అత్తయ్య అత్తారింటి తిరుగు ప్రయాణం తంతు ఒక మహా ప్రహసనమే అంటే నమ్మండి.

మా మేనత్త ఇందాక చెప్పిన్నట్టు చల్లని జబిల్లి లా ఉంటుంది. చాలా నెమ్మదైనది. రోజు పెందరాళే నిద్ర లేచి చప్టా నిండుగా పెద్ద ముగ్గు పెట్టి ముచ్చట పడి పోయి తాత్తయ్య గారిని నిద్ర లేపి మరీ ముగ్గును చూపించి సంబర పడే అత్తయ్య, తిరుగు ప్రయాణం రోజు మాత్రం బారెడు ప్రొద్దెక్కినా నిద్ర లేవదు. తాతయ్య గారు మాత్రం రోజుకంటే పెందరాళే నిద్ర మేల్కొని అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

రోజు కాఫీ, ఫలహారం, వంట అంతా అత్తే చేస్తానంటుంది. కాఫీలు టైం కి అందినా మడి పేరుతో , ఫలహారాలు మాత్రం పద కొండింటికి గాని అందవు. మా అత్తయ్య తాతయ్య గారికి ఇష్టమైన వాసినపోళ్ళ దగ్గర నుంచి, పెసరట్లు,ఉప్మ, ఆవళ్ళు, ముఖ్యంగా మజ్జిగట్లు, దిబ్బరొట్టి తేనె పాకం ఇలా ఒక్కరినీ వదల కుండా, అందరికీ ఇష్టమైనవి చేసే తీరుతుంది.

మామూలు రోజుల్లో మడి అంటేనే పొసగని మా ముద్దుల అత్తయ్య, కడు తిరుగు ప్రయాణం రోజున మాత్రం మడి కట్టు కోడానికి బద్దకించే వాళ్ళంటే మానసిక మౌఢ్యం తో బాధ పదుతున్న వారల్లె మాట్లాడుతుంది.

ఇక మధ్యాహ్నానికి వంట పాట్లు మొదలు పెడుతుంది. ఆప్పటికీ మా బామ్మ, అత్తయ్య సంగతి తెలిసి హాస్యంగా "ఒసేయ్ అమ్మడు, ఆవకాయ, గొంగూర, ఎలాగు ఉన్నవె! ఉత్త పప్పు చేశేశా వంటే, గరిటెడు నెయ్యి వంపుకుని, గడ్డ పెరుగు తో పూట భొజనాలు కానివ్వచ్చు" అంటుంది వేళాకోళానికి.

"చాల్లె ఊరుకొవమ్మ. ఉత్త పప్పు తో మీ అందరికీ భొజనం సరిపెడితె మా అత్తయ్య గారి పరువు ఏంకాను. ఏంత నా పుట్టింట్లో నయితే మాత్రం, నేను వంట చేసేటప్పుడు హోదా కనిపించాల్సిందే", అంటూ మళ్ళా స్నానం ముగించి కచ్చ పోసి మడి చీర ముద్దుగా కట్టి వంటకు ఉపక్రమిస్తుంది.

ఘుమ ఘుమ లాడే గుత్తి వంకాయ కూర, టమాట పప్పు, కొబ్బరి పచ్చడి, ములక్కాడల చారు, మజ్జిగ పులుసు, పెసరు వడియాలు,అప్పడాలు, దప్పళం, పులిహోర,బూరెలు మరియు దధ్యోజనం తప్పక చేస్తుంది.

ముందర మగవాళ్ళ భొజనాలు అంటుంది. పిల్లలకు, మగవాళ్ళకు కొసరి కొసరి వడ్డిస్తుంది. తరువాత తన వదినలతో, మా బామ్మతో, ఎక్కడెక్కడి కబుర్లు చెప్తో భోజనం ముగిస్తుంది. "ఇదిగో వదిన నీకు చెప్పనే లేదు, పొయిన సారి వచ్చినప్పుడు నీలం రంగు పట్టు చీర నా బీరువాలో మర్చిపొయాను" అంటుంది ఒక సారి. ఇదిగొ అమ్మ నా చేత పదహారు ఫలాల నోము పట్టించు అంటుంది మరో సారి. ఇలా ఒక్క దానితో మరొక దానికి పొంతన లేకుండా భొజనం ముగించే వరకూ మాట్లాడుతూనే ఉంటుంది.

అస్సలు ఇంట్లో ఉన్నదో లేదో లా ఉండే అత్తయ్యేనా ఈమె, అని అనుమానం కలుగుతోంటుంది నాకు.

అలా భొజనాలు ముగిసే సరికి సమయం మూడు. ప్రతి రోజు మాట ఎలా ఉన్నా, రోజు మాత్రం భొజనాలు అయ్యి అవ్వడంతోనే తన గది తలుపులన్నీ గట్టిగా బిగించేసేసీ దాదాపు రెండు మూడు గంటలు కునుకు తీస్తుంది. తరవాతే ప్రయాణమైనా మరేదైనా.

లేవగానే తిన్నగా తాతయ్య గారి దగ్గరకు చేరుకుంటుంది.బుంగ మూతి పెట్టి "నాన్నగారు పోని లెద్దు సాయంత్రం దాటింది కదండి రేపు పొద్దున్నే నన్ను మా ఇంట్లొ దింపేసేయండి"అంటుంది.

మాట కోసమే ఎదురు చూస్తున్న తాత్తయ్యగారు "దాందేముందమ్మా, నువ్వు అంతలా అడగాలా. ఇప్పుడు వస్తారుగా అల్లుడు గారు. ఆయనకు నేను చెప్తాన్లే." అంటారు సంతోషంగా.ఆందరి ముఖాల్లో ఒక్క గమ్మత్తయిన వెలుగు మెరుస్తుంది వెంటనే. బామ్మ మాత్రం ఎటువంటి భావన లేకుండ ముసి ముసిగా బయట పడబోతున్న నవ్వును ఆపుకుంటూ ఉండడం నేను గమనిస్తూ ఉంటాను.

సందె దీపం, తులసి కొట దగ్గర దీపం, పూజ ముగించుకు వచ్చి వాలు కుర్చీలో నడుము వాలుస్తారు తాతయ్య గారు. ఆయన పక్కగా సోఫా లో పెద్దనాన్నగారు వాళ్ళు కూర్చుని పిచ్చాపాటి లో ఉండగా వస్తారు మా ముద్దుల మావయ్యగారు. ఆయన బాగ చదువు కున్నారు. సిఏ, సిఎస్,ఎలెల్బి కూడ చేసి సొంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు.

"రండి రండి అల్లుడుగారు, బావున్నారా? బావగారు, చెల్లెమ్మ అందరూ కులాసాయేగా? అని కుశల ప్రశ్నలు వినపడగానే తూనీగ లా మంచి నీళ్ళ చెంబు తో ప్రత్యక్షం అవుతుంది మా అత్తయ్య. మళ్ళీ అంతే వేగంగా తుర్రుమని లోపలికి పరుగు తీస్తుంది.

మా మవయ్యగారు తాతయ్య తో పెదనాన్నగారు వాళ్ళతో మాట్లాడుతో ఉండగా భొజనానికి పిలుపు వస్తుంది లోపలి నుండి. మగవాళ్ళందరు భొజనాలు ముగించి తాంబూలం వేసుకుంటుండగా ఆడవాళ్ళు కూడ భొజనాలు ముగించుకుని అందరూ వసారలోకి చేరుతారు.

ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ.

అక్కడకు వచ్చి నిలబడిన అత్తయ్యను చూసి అందరూ ఆశ్చర్య పోతారు. చక్కని కనకాంబరం రంగు చీర కట్టుకుని, వదులుగా జడ వేసుకుని, తలనిండ మా పెరట్లోని సన్నజాజుల మాల తురుము కుని, చేతిలో పెట్టె తో నిలబడి ఉంటుంది. అప్పుడు చూడాలి మా తాతయ్య గారిని. కలవర పడిపొతారు పాపం.

ఆంతలో అత్తయ్య "వస్తాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను అమ్మ, వెళ్ళి వస్తాను అన్నయ్యలూ, గొరింటాకు రుబ్బి ఉంచాను మర్చిపొకుండా పెట్టుకొండె అని వదినలకు, పిల్లలకు చెబుతుంది.

వెళదామ అంటున్న మవయ్యగారి కేసి ఆనందంగా చూస్తూ మరొక్క సారి అందరికీ వీడుకోలు పలికి చీరె సారెలకు సాటి రాని ఆప్యాయతలని కొంగు బంగరంలా నడుముకు చుట్టుకుని ప్రయాణమౌతుంది. కారు లో కూర్చొగానే తలను బయటకు పెట్టి " నాన్న బెంగ పడకండి ఎల్లుండి మీ పుట్టినరోజేగా. తప్పకుండా వచ్చేస్తాన్లే అంటుంది గట్టిగా నవ్వుతూ.

అత్తయ్య కేసి చూస్తూ నోట మాట రాక నిలబడడం మా అందరి వంతుగా జరుగుతూంటుంది.

బామ్మ ప్రతిసారి ఎందుకు ముసి ముసిగా నవ్వుకుంటుందో అప్పుడు అర్థం అయ్యింది నాకు. నేను బామ్మ ను సారి ఉండ బట్టలేక అత్తయ్య వింత ప్రవర్తన గురించి అడిగేశాను.

దానికి బామ్మ సంతోషంగా మీ అత్తయ్య అంటే ఎవిటనుకున్నావ్ మరి. ఇటు పుట్టింటిని అటు మెట్టింటిని మెప్పించిన ఘనురాలు అన్నది గొప్పగా.

కాని మీకో రహస్యం చెప్పనా. ఇందాకా భొజనాలప్పుడు మవయ్యగారు అత్తయ్య చెవిలో రహస్యంగా ఎదో అన్నారు.అప్పుడు అత్తయ్య చిరు నవ్వు నవ్వి వెంటనే బయలు దేరింది.

ఏం అనుంటారు చెప్మా?

మరిన్ని కథలు

Subhashini-Charavaani
సుభాషిణి - చరవాణి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Maa manchi donga
మా మంచి దొంగ
- అనిసా తబస్సుమ్
Mali vayasu chivari majili
మలి వయసు చివరి మజిలీ..
- వరలక్ష్మి నున్న
Premanubandham
ప్రేమానుబంధం
- Kameswara Rao Rapaka
Vyavasayam
వ్యవసాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vaaradhi
వారధి
- ప్రభావతి పూసపాటి
Gunam pradhaanam
గుణం ప్రధానం!
- చెన్నూరి సుదర్శన్
Mamakarapu velugulu
మమకారపు వెలుగులు
- డా:సి.హెచ్.ప్రతాప్