హైదరాబాద్ నగరంలోని ఒక మధ్యతరగతి కాలనీలో ఒక చిన్న ఇంట్లో నివసించే సరోజమ్మ జీవితం బయటికి చూస్తే సాధారణంగానే కనిపిస్తుంది. ఉదయం వంట పనులకు వెళ్లే ఆమెను చూసే పొరుగువారికి కూడా ఆమె జీవితం ఎంతటి కష్టాలతో నిండిందో తెలియదు. కానీ ఆమె హృదయంలో దాగి ఉన్న త్యాగం అసాధారణం. జీవితంలో ఎన్నో బాధలు ఎదురైనా తన మనసులో ఒకే ఆలోచన—తన కూతురు నిహారిక మంచి భవిష్యత్తు సాధించాలి అన్నదే. తన కలలు నెరవేరకపోయినా పరవాలేదు, కానీ కూతురు కలలు మాత్రం తప్పకుండా నిజం కావాలనే సంకల్పమే ఆమె జీవిత ధ్యేయంగా మారింది. చుట్టుపక్కల వారు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఆమె అదనపు ఆదాయం కోసం పనులు చేస్తూ అలసటను దరిచేరనీయలేదు. తన ఆకలిని చంపుకుని బిడ్డ కడుపు నింపడమే మాతృత్వానికి నిదర్శనమని ఆమె నిరూపించింది. సమాజం చూపే చిన్నచూపును పంటిబిగువున భరిస్తూ కూతురి చదువు కోసం అహర్నిశలు శ్రమించింది. ఆ చిన్న గదిలో వెలిగే దీపంలా ఆమె నిహారిక దారిని ప్రకాశవంతం చేసింది.
"నా కష్టం రేపు నీ విజయంగా మారాలి తల్లీ , అప్పుడే నా ఈ జన్మకు ఒక అర్థం పరమార్థం లభిస్తాయి" అని సరోజమ్మ తన కూతురితో నిశ్చయంగా చెప్పింది.
కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సరోజమ్మ భర్త మరణించాడు. ఆ సంఘటన తర్వాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చిన్నారి నిహారికను చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది. మొదట్లో ఆమెకు ఏ పని దొరకలేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ఆకలితో అలమటించిన రోజులెన్నో ఉన్నాయి. అయినా ధైర్యం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా పోరాటం సాగించింది. తన కూతురి భవిష్యత్తు కోసం కన్నీటిని దిగమింగుకుని శ్రమించాలని నిర్ణయించుకుంది. చివరకు ఒక కార్యాలయంలో శుభ్రత పనులు చేయడం ప్రారంభించింది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు ముగించుకుని, మూడు ఇళ్ళలో వంట పనులు చేసి తర్వాత ఒక ప్రైవేట్ ఆఫీసులో కష్టపడుతూ నిహారికను గొప్పగా చదివించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె పట్టుదల చూసి చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోయేవారు.
"నా బిడ్డ కళ్లలో సంతోషం చూడటమే ఇప్పుడు నా జీవిత ఆశయం, దాని కోసం ఎంతటి కష్టమైనా భరిస్తాను" అని సరోజమ్మ తనతో తాను చెప్పుకుంది.
ప్రతి రోజు తెల్లవారుజామున లేచి ఇంటి పనులు ముగించుకుని మూడు నాలుగు ఇళ్ళలో వంట పనులకు వెళ్లేది. అక్కడి నుండి పది గంతలలకల్లా ఒక ఆఫీసులో శుభ్రత పనికి వెళ్ళేది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి అలసటతో నడవలేని పరిస్థితి ఉండేది. కానీ నిహారిక పుస్తకాలు తెరిచి చదువుకుంటూ కనిపిస్తే ఆమె ముఖంలో మళ్లీ చిరునవ్వు మెరుస్తుండేది. పగలంతా వంటలు చెస్తూ, తర్వార ఆ కార్యాలయంలోని ప్రతి గదిని శుభ్రం చేస్తూ చెమట చిందించినా రాత్రి తన కూతురు చదువుకునే శబ్దం వింటే ఆ బాధ అంతా మర్చిపోయేది. తన కష్టాన్ని బిడ్డకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడేది.
ఒక రోజు నిహారిక స్కూల్ ఫీజు కోసం ఏడుస్తూ,
“అమ్మా… టీచర్ రేపటిలోగా ఫీజు కట్టమన్నారు. లేదంటే పరీక్ష రాయనివ్వరట…” అంది.
సరోజమ్మ కాసేపు మౌనంగా నిలబడి, “ఏమిటి తల్లీ … ఏడవకు. నీ చదువు ఎప్పుడూ ఆగదు,” అని ధైర్యం చెప్పింది. అప్పు ఎవరూ ఇచ్చే పరిస్థితి లేకపోయినా నిరాశ చెందలేదు. తన వద్ద ఉన్న ఏకైక సంపదను త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె తనకు ఎంతో ముద్దైన బంగారు చెవి దిద్దులు అమ్మేసి ఫీజు చెల్లించింది. అవి తన పెళ్లి నాటి గుర్తులు కావడంతో మనసు భారమైనా కూతురి భవిష్యత్తు కోసం ఆ బాధను దిగమింగుకుంది. మరుసటి రోజు ఉదయం ఎంతో సంతోషంగా ఫీజు డబ్బులు నిహారిక చేతిలో పెట్టింది. నిహారికకు మాత్రం ఆ డబ్బు వెనుక ఉన్న తల్లి త్యాగం ఏమీ తెలియనీయలేదు. తన తల్లి చెవులకు దిద్దులు లేవని నిహారిక గమనించినా సరోజమ్మ మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంది. నిహారిక తన తల్లి పడుతున్న శ్రమను గమనిస్తూ మరింత కష్టపడి చదవాలని నిశ్చయించుకుంది.
"అమ్మా... నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను, పెద్దయ్యాక నిన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటాను" అని నిహారిక తన తల్లితో అంది.
నిహారిక చిన్నతనంలో తరచుగా అనారోగ్యానికి గురయ్యేది. వాతావరణం కొంచెం మారినా ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చేది. అటువంటప్పుడు సరోజమ్మ కంటిమీద కునుకు లేకుండా రాత్రంతా కూతురు పక్కనే కూర్చుని తడిగుడ్డతో నుదుటిపై తుడుస్తూ గడిపేది. తాను రోజంతా కార్యాలయంలో శ్రమించి వచ్చినా, ఆ అలసటను లెక్కచేయకుండా బిడ్డకు ఔషధాలు వేస్తూ, ఆమెను తన కౌగిలిలో ఉంచుకుని ఊరడించేది. తన నిద్ర కంటే బిడ్డ క్షేమమే ముఖ్యమని భావించే ఆ తల్లి హృదయం నిహారిక కోలుకునే వరకు ఆందోళనతో కొట్టుకుంటూనే ఉండేది.
ఒకసారి నిహారిక బడి నుండి వస్తుండగా పెద్ద ప్రమాదానికి గురైంది. ఆ సంఘటనలో ఆమెకు తీవ్రమైన గాయాలై రక్తం బాగా పోయింది. ఆసుపత్రికి తరలించగా, నిహారికది చాలా అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ అని, వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆ రకమైన రక్తం బయట ఎక్కడా దొరకలేదు. సరోజమ్మది కూడా అదే అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆమె ముందుకు వచ్చింది. నిజానికి సరోజమ్మ అప్పటికే తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతోంది. రక్తం ఇస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా ఆమె వినలేదు. "నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి" అని పట్టుబట్టి రక్తాన్ని దానం చేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కూతురిని మృత్యుముఖం నుండి కాపాడుకుంది. ఆ త్యాగం చూసి వైద్యులు సైతం విస్తుపోయారు.
"నా రక్తంతో పుట్టిన బిడ్డను, నా రక్తమిచ్చి కాపాడుకోవడం కంటే గొప్ప భాగ్యం నాకు ఏముంటుంది?" అని సరోజమ్మ గర్వంగా తన వారితో అంది.
కాలం గడిచింది. నిహారిక పదో తరగతిలో జిల్లా స్థాయి ర్యాంకు సాధించింది. ఆ రోజు సరోజమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కష్టం వృథా పోలేదని, తన బిడ్డ చదువుల తల్లిగా ఎదిగిందని మురిసిపోయింది. చుట్టుపక్కల వారు సరోజమ్మ పట్టుదలను మెచ్చుకుంటుంటే ఆమె కళ్ళలో ఒక మెరుపు మెరిసింది.
“అమ్మా… నీకోసం నేను ఇంకా బాగా చదువుతాను,” అని నిహారిక చెప్పినప్పుడు సరోజమ్మ గుండె గర్వంతో నిండిపోయింది.
తరువాత నిహారిక ఇంజినీరింగ్ చదవాలని చెప్పింది. ఫీజులు చాలా ఎక్కువ. నిహారిక సంకోచంతో,
“అమ్మా… మన పరిస్థితి చూస్తే నేను ఇంత ఖరీదైన చదువు చదవడం సరైంది కాదు. ఏదైనా చిన్న ఉద్యోగం చేసి నీకు సాయంగా ఉంటాను,” అంది.
సరోజమ్మ మెల్లగా ఆమె చేతిని పట్టుకుని,
“నువ్వు చదవకపోతే నా కష్టాలన్నీ వృథా అవుతాయి తల్లీ. నీ కలలు పెద్దవిగా ఉండాలి. వాటిని నెరవేర్చడం నా బాధ్యత. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు. అహోరాత్రులు శ్రమించి అయినా నిన్ను గొప్ప స్థాయికి చేరుస్తాను. నీ చదువే మన పేదరికానికి సరైన సమాధానం కావాలి,” అంది. ఆ మాటల్లోని దృఢత్వం చూసి నిహారిక కళ్ళు చెమర్చాయి. సరోజమ్మ అదనపు సమయం పని చేస్తూ, సెలవు రోజుల్లో కూడా వంత పనులకు వెళ్తూ రూపాయి రూపాయి పోగు చేసింది. తన ఆహారం విషయంలో కూడా పొదుపు చేస్తూ బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకుంది. తల్లి పడుతున్న ఈ అపరిమితమైన కష్టాన్ని చూసి నిహారిక తన ప్రతి నిమిషాన్ని చదువుకే అంకితం చేసింది. ఆ తల్లి ప్రోత్సాహం ఆమెకు కొండంత అండగా నిలిచింది.
"అమ్మా... నీ శ్రమకు ప్రతిఫలంగా నేను ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొంది, నీ తల ఎత్తుకునేలా చేస్తాను" అని నిహారిక ఎంతో భావోద్వేగంతో తన తల్లితో చెప్పింది.
ఆమె సంవత్సరాలుగా దాచుకున్న పొదుపులు, మిగిలిన ఆభరణాలు అన్నీ అమ్మేసి నిహారికను చదివించింది. తాను కొత్త బట్టలు కొనకుండా, సరైన ఆహారం తినకుండా కూడా ఆమె తన కూతురు కోసం కష్టపడింది. పాతాళంలో ఉన్న పేదరికం నుండి తన బిడ్డను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఆమె ఒక నిచ్చెనలా మారింది. ఎండనక వాననక శ్రమించి ప్రతి రూపాయిని నిహారిక ఫీజుల కోసమే వెచ్చించింది. తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పనికి వెళ్తూ బిడ్డ భవిష్యత్తును వెలుగులతో నింపింది. ఆ తల్లి పడిన ప్రతి కష్టం నిహారికలో ఒక పట్టుదలను నింపింది. నిహారిక కూడా తన తల్లి పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని రాత్రింబగళ్లు చదివి అద్భుతమైన ఫలితాలను సాధించింది.
ఏళ్ల తర్వాత నిహారిక పెద్ద సాంకేతిక సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతంతో తల్లికి పట్టు వస్త్రాలు కొని పెళ్లి నాటి నగలను మళ్ళీ చేయించింది. ఒక రోజు తల్లిని కొత్త ఇంటికి తీసుకెళ్లి,
“అమ్మా… నువ్వు నన్ను చదివించకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నీ త్యాగం ముందు నా ఈ విజయం చాలా చిన్నది,” అని కన్నీళ్లతో చెప్పింది. ఆ విశాలమైన ఇంట్లో సరోజమ్మను మహారాణిలా కూర్చోబెట్టి తన కృతజ్ఞతను చాటుకుంది. తన తల్లి పాత గుడిసెలో పడిన కష్టాలన్నీ ఇక జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని నిహారిక ఆకాంక్షించింది.
సరోజమ్మ ఆమెను దగ్గరగా కౌగిలించుకుని,
“అమ్మ ప్రేమకు ప్రతిఫలం అడగరు తల్లి . పిల్లలు సంతోషంగా ఉండటం చూసే ఆనందమే అమ్మకు ప్రపంచం. నువ్వు సమాజంలో నలుగురికి సాయం చేసే స్థితిలో ఉండటమే నాకు అసలైన గర్వకారణం,” అంది.
ఆ మాటలు విన్న నిహారిక గుండెల్లో ఒక గొప్ప నిజం చెక్కుకుపోయింది. తల్లి కష్టం అనేది ఒక అదృశ్య శక్తి అని, అది బిడ్డలను ఎంతటి ఎత్తుకైనా ఎదుగులా చేస్తుందని ఆమె గ్రహించింది. తన తల్లి కళ్ళలో కనిపిస్తున్న ఆ తృప్తి ముందు ప్రపంచంలోని ఏ సంపద సాటి రాదని ఆమెకు అర్థమైంది.
"అమ్మా... నా జీవితం నీ త్యాగానికి ప్రతిరూపం, ఇకపై నీ ప్రతి అడుగులో నేను నీకు నీడలా తోడుంటాను" అని నిహారిక తన తల్లితో నిశ్చయంగా చెప్పింది.
అమ్మ చేసిన త్యాగాన్ని ప్రపంచంలోని ఏ సంపదతోనూ తిరిగి చెల్లించలేం. పిల్లల విజయాల వెనుక కనిపించని శక్తి అమ్మ త్యాగమే. అందుకే జీవితం మనకు ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా, అమ్మ పాదాల వద్ద నిలబడి కృతజ్ఞత చెప్పడం మర్చిపోవద్దు. ఆమె చిందించిన ప్రతి చెమట చుక్క మన భవిష్యత్తుకు ఒక పునాది రాయి. నిహారిక తన తల్లి పడిన కష్టాన్ని తలుచుకుంటూ ఆమెకు పాదాభివందనం చేసింది. ఆ తల్లి దీవెనలు తనను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆమె నమ్మింది. మాతృప్రేమ అనేది వెలకట్టలేని నిధి అని, అది ప్రతి బిడ్డ జీవితంలో ఒక దివ్యమైన వెలుగును నింపుతుందని ఆమెకు ఆ క్షణాన అర్థమైంది.
"అమ్మా... నీ త్యాగమే నా గెలుపుకు ఊపిరి, నీ రుణం తీర్చుకోలేను కానీ నీ నీడలో నీ బిడ్డగా ఉండటం నా అదృష్టం" అని నిహారిక ఎంతో వినయంగా తన తల్లితో అంది..

