ఆలోచనల సమూహం మనిషి మనసు. ఆ మనస్సే అంతరంగ శక్తిగా మనిషిని నడిపిస్తుంది. సత్సంకల్పమైన పరిమిత లక్ష్యాలతో జీవిత ప్రయాణం సాగిస్తే పరిపూర్ణ సార్థకత సాధ్యమే. మనిషి కృషితో, నిజాయతీతో ప్రయత్నం చేస్తే ఫలితాలను అవే నిర్వచిస్తాయి. అప్పుడే జీవితం సుందరం, సుమధురం!
——-///——-
"నమస్కారమండి, నాపేరు చిరంజీవి" ఎదురుగా ఒక యువకుడు, మా అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలో నన్ను పలకరించాడు.
"నమస్కారం, మీరు???"
"నేను కొత్తగా వచ్చానండి. మీదిగువ ఫ్లోర్ లో ఫ్లాట్ కొనుక్కున్నాను. నన్ను గుర్తు పట్టారా?"
"గుర్తుకు రావడము లేదు" అన్నాను.
"అయిదేళ్ళ క్రితం డాబా గార్డెన్స్ లో “లక్కీ అపార్ట్ మెంట్” లో మీ ఫ్లాట్ అమ్మారు కదండి. ఆ ఫ్లాట్ నేనే మీ దగ్గర కొనుక్కున్నాను."
వయసు మీద పడడంతో ఆ యువకుడిని గుర్తించలేక పోయాను.
నేను రిటైర్ అయ్యాక లక్కీ అపార్ట్ మెంట్ లోని టు బెడ్ రూం ఫ్లాట్ అమ్మేసి మధురా నగర్ లో కొత్తగా కట్టిన అపార్ట్ మెంట్ లో త్రీ బెడ్ రూం ఫ్లాట్ కొనుక్కున్నాను.
"అలాగా! అంటె నీవు అప్పారావు కొడుకువి కదా" అన్నాను.
"మరి అక్కడ ఫ్లాట్ కొని, మళ్ళీ ఇక్కడ కొన్నావేమిటి? టు బెడ్ రూం చాలదని త్రీ బెడ్ రూం కొచ్చావా?"
కాదండి, నేను టాటా కంపెనీ, ఇండియన్ హోటల్స్ గ్రూప్ లో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా సార్, ఇప్పుడు లక్కీ అపార్ట్ మెంట్ ని మా కంపెనీ వారు కొనుక్కొని ఆ స్థలములో ఒక పెద్ద స్టార్ హోటల్ కడుతున్నారు. అందులోని ఫ్లాట్ యజమానులందరికి సగం సొమ్ము నగదు రూపం లో మిగిలిన సగం కంపెనీ షేర్ల రూపం లో చెల్లించారు.ఆ సొమ్ముతో మీ ఫ్లాట్ కొన్నప్పుడు నేను తీసుకున్న బేంకు లోను తీర్చేసాను. మళ్ళీ కొత్త లోన్ తీసుకుని ఇక్కడ కొనుక్కున్నాను."
"చాల మంచిది, మీఅమ్మానాన్న ఎక్కడున్నారు?"
"మా ఊరిలో ఉన్నారండి. మొన్న మా గృహ ప్రవేశానికి వచ్చారు. మళ్ళీ మా ఊరికి వెళ్ళి పోయారు. మీరు అప్పుడు ఊరిలో లేరు. ఎక్కడికో కేంప్ వెళ్లినట్టున్నారు. ఇంక ఆఖరి రోజుల్లో ఇక్కడెందుకురా మన స్వంత ఊరిలో స్వంత ఇంటిలో ఉంటామురా అని చెప్పి వెళ్ళిపోయారండి. అక్కడ మా పెద్దనాన్న పిల్లలున్నారండి. వాళ్ళు చూసుకుంటామన్నారండి. అప్పుడప్పుడు వస్తుంటాం అని చెప్పారండి. నేను కూడ నెలకొకసారి వెళ్ళి వస్తానండి. మీకు తెలుసుకదా, విజయనగరం దగ్గర డెంకాడ మా ఊరు.
"ఆ..ఆ... తెలుసు. ఎలా ఉన్నారు మీనాన్న?"
"బాగున్నారండి."
"సరే మళ్ళీ కలుద్దాం" అని చెప్పి నేను మా ఫ్లాట్ కు వెళ్ళిపోయాను. ఆ యువకుడు బయటకు వెళ్ళి పోయాడు.
ఆ రాత్రి భోజనాలయిన తరువాత పడుకున్న నాకు, కళ్ళ ముందు గత ముప్పై సంవత్సరాలు సినిమా రీలులా కదల సాగాయి.
“ఎక్కడి అప్పారావు? ఇప్పుడెక్కడికి చేరుకున్నాడు? అదృష్టమా! ఆత్మ విశ్వాసమా! “
-------///-------
"అప్పారావు, ఈ అయ్యగారికి మూడవ ఫ్లోర్ లో లిఫ్ట్ పక్కనున్న ఫ్లాట్ చూపించు." బిల్డర్ గారి ఆర్డర్.
"అలాగే సార్, రండయ్యా" అంటు నన్ను మీదికి తీసుకెళ్ళి ఇంకా పూర్తి కాని అపార్ట్ మెంట్ ని చూపించాడు అప్పారావు. అది అతనితో నా తొలి పరిచయం. మనిషి చాల సౌమ్యుడు.
సుమారు ముప్పయ్యేళ్ళ క్రితం లక్కీ అపార్ట్ మెంట్ కడుతున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ లో వాచ్ మేన్ గా అప్పారావు పనికి కుదిరాడు. అపార్ట్ మెంట్ పూర్తి అయిన తరువాత ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సెక్రటరీగా నన్ను నియమించారు. అప్పారావు మంచి తనము చూసి ఆ తరువాత కూడ అతనినే వాచ్ మేన్ గా కొనసాగించాము. భార్య ఇద్దరు పిల్లలతో వాచ్ మేన్ క్వార్టర్ లో నివాసముండేవాడు. అతని భార్య కూడ కొన్ని ఇళ్ళల్లో పని చేసుకుంటు జీవనం సాగించేవారు.
"అయ్యా, మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి. ఈ నెల జీతంలో వంద రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వండి"
"అదేమిటి అప్పారావు మీవాడిని గవర్నమెంట్ స్కూల్ లో చదివించడము లేదా?"
"లేదండి. ఆ స్కూల్ కి పంపితే వాడు నా లాగ అయిపోతాడని, కాన్వెంటుకు పంపిస్తున్నానండి. అసలు నేను వైజాగు వచ్చింది అందుకేనండి. తెలివైనోడండి. బాగ చదువుతాడండి"
నేను ప్రతి రోజు ఉదయం వాకింగ్ కెళ్ళినప్పుడు చూసేవాడిని అప్పటికే ఆ అబ్బాయి పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. “అభ్యాసం కూసు విద్య” అన్న విషయం అప్పారావు కొడుక్కి నేర్పించినట్టున్నాడు.
" అవును అప్పారావు. సరస్వతీ కటాక్షముంది మీవాడికి. తెలివితేటలు ఏ ఒక్కడి సొత్తు కాదు, బాగా చదివించు" అన్నాను.
"సరే మంచిదే, తీసుకో " అంటు వంద రూపాయలు ఇచ్చాను.
అప్పుడు ఆ అబ్బాయి సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నట్టు అప్పారావు చెప్పాడు. అప్పారావుకు వాళ్ళ స్వంత ఊరిలో ఏదో కొంత, తిండికి సరిపడే వ్యవసాయ భూమి ఉంది. దాన్ని చూసుకుంటే చాలు. కానీ తాను చదువుకోలేదు కాబట్టి ఇలా ఉండిపోయాను, తన కొడుకు చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని కోరిక. అందుకే వాళ్ళ ఊరిలో ఉన్న భూమిని లీజుకు ఇచ్చి వైజాగులో అపార్ట్ మెంట్ వాచ్ మేన్ గా వచ్చేసాడు.
కొడుకును కాన్వెంట్ స్కూల్ లో చదివించాలనే పట్టుదలతో వైజాగు వచ్చాడు. అలాగే వచ్చిన వెంటనే ఆ అబ్బాయిని ఒక చిన్న కాన్వెంట్ స్కూల్ లో చేర్పించాడు.
ఒక సారి ఆ పిల్ల వాడికి కామెర్ల వ్యాధి వస్తె, విల విల లాడిపోయాడు. నా దగ్గరికొచ్చి చెప్తె, ధైర్యము చెప్పి, పిల్లల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి మందులిప్పించాను. అందుకే నేనంటె అభిమానం.
ఇంకొక సారి నేను సెక్రటరీ గా ఉన్నప్పుడు, మా అపార్ట్ మెంట్ సెల్లార్ లో ఎవరిదో పిల్ల వాడిది బంగారు గొలుసు దొరికితె, నాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు అది ఎవరిదో కనుక్కొని వారికి తిరిగి ఇచ్చేసాను. అప్పారావు నిజాయితీని అందరు మెచ్చుకున్నారు.
అయిదేళ్ళు మా అపార్ట్మెంట్ లో పని చేసిన తరువాత అప్పుడున్న సెక్రటరీతో మాటామాటా వచ్చి మానేసాడు. ఆ తరువాత సీతమ్మధారలో వేరొక అపార్ట్మెంట్ లో చేరాడు. అప్పుడప్పుడు నా దగ్గరికొచ్చి కొడుకు చదువు విషయాలు చెబుతుండేవాడు.
"అయ్యా, మా వాడు పది పాసయ్యాడు ఫస్ట్ క్లాస్ లో" వాళ్ళబ్బాయి టెంత్ పాస్ అయినప్పుడు నాదగ్గరికొచ్చి చెప్పాడు అప్పారావు అమితానందముగా. పుత్రోత్సాహము ఎలా ఉంటుందో అతని కళ్ళల్లో స్పష్టముగా కనబడింది.
"కంగ్రాచ్యులేషన్స్ అప్పారావు, ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివిస్తావు" అని అడిగాను.
"శ్రీ చైతన్య కాలేజి లో చేరతానంటున్నాడు. కాని అక్కడ ఫీజులు కట్టాలంటె నేను మా ఊరిలో పొలం అమ్మేయాలి" అన్నాడు.
"ఇప్పుడు పొలం అమ్మెస్తె మరి ఇంజనీరింగ్ డిగ్రీకి ఏమిటి అమ్ముతావు?"
"మీ సలహా చెప్పండి సార్" అన్నాడు.
"ఇప్పుడు కృష్ణ కాలేజిలో చేర్పించు. మీ అబ్బాయి ఏ కాలేజి లో చేరినా వాడి చదువు వాడు చదువుకుంటాడు. గవర్నమెంట్ కాలేజి కాబట్టి డబ్బు ఖర్చు అవ్వదు. తరువాత ఇంజనీరింగ్ చదివించినప్పుడు అవసరమైతె పొలం అమ్మవచ్చు." అని సలహా ఇచ్చాను.
"సరే సార్" అన్నాడు.
నా సలహా మేరకు "వి ఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజి" లో చేర్పించాడు. నేను ఊహించిన విధముగానె అప్పారావు కొడుకు ఇంటర్మీడియేట్ కూడ మంచి మార్కులతో పాసయ్యాడు. అయితే "ఎంసెట్" లో మంచి రాంకు రాలేదు.
అప్పారావు మళ్ళీ నా సలహా కోసం వచ్చాడు, వాళ్ళ అబ్బాయితో కలిసి. "మళ్ళీ ఎంసెట్ రాస్తానంటున్నాడు సార్" అన్నాడు.
"ఎందుకు ఒక సంవత్సరం వేస్ట్ చెయ్యడం? ఈ రాంకింగు తో మంచి కాలేజీలలో ఇంజనీరింగ్ సీటు రాదు గాని ఏదో ఒక కాలేజీలో సీటు వస్తె చాలు అనుకుంటె ఇంజనీర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళలో చాల మందికి ఉద్యోగాలు లేవు, ఒక వేళ ఉద్యోగమొచ్చినా మంచి జీతాలు ఇవ్వరు. గనుక హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తె బాగుంటుంది" అని సలహా ఇచ్చాను.
నా మాట మీదున్న గౌరవం కొద్దీ, నేను చెప్పినదానిని తండ్రీకొడుకులిద్దరు అంగీకరించారు.
అప్పారావు వెంటనే వాళ్ళ ఊరు వెళ్ళి తనకున్న పొలం అమ్మివేసాడు. బెంగుళూరులో హోటల్ మేనేజ్ మెంటు బేచిలర్ డిగ్రీ కోర్సులో కొడుకును చేర్పించాడు.
కోర్సు పూర్తయిన తరువాత కేంపస్ సెలెక్షన్ లో టాటా గ్రూప్ లో ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది.
“కలలు కనండి …. వాటిని సాకారం చేసుకోండి” అన్న మన పూర్వ అధ్యక్షులు కలాం గారి మాటను సార్థకం చేసాడు అప్పారావు.
------///------
నేను లక్కీ అపార్ట్మెంట్ లోని నా ఫ్లాట్ ని అమ్మకానికి పెట్టినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
"అయ్యా నేను అప్పారావునండి, మీ ఫ్లాట్ అమ్మకానికి పెట్టారట కదా?"
"అవును అప్పారావు. ఎవరైనా ఉంటె చెప్పు?"
"మాకే కావాలండి, మా అబ్బాయికి బేంక్ లోను దొరుకుతాదట, లోను పెట్టి కొనుక్కుందామంటున్నాడు. మీ ఇల్లైతే నాకు తెలుసుకదండీ. అమ్మ గారు ఎంత శుభ్రం గా ఉంచే వారో! మీరు కూడ ఎక్కడ ఏ రిపేర్ వచ్చినా నిమషాల్లో చెయ్యించేవారు. వీలైతె, మనకు బాగా తెలిసిన అపార్ట్ మెంట్ కనుక, అదే కొనుక్కోరా అని మా అబ్బాయికి చెప్పానండి."
"అలాగే శుభం" అన్నాను
వారం రోజుల్లో అప్పారావు, లక్కీ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ యజమాని అయిపోయాడు.
------///------
ఆ తరువాత అయిదేళ్ళలో అప్పారావు, కొడుకు ఫామిలీ తో సహా, ఇప్పుడు మా అపార్ట్ మెంట్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కుని మాతో సహజీవనం చేసే స్థాయికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం లో అప్పారావు లోని ఆత్మ విశ్వాసం అమోఘం. తనలో ఉన్న నిజాయితీ, పట్టుదలకు నిరంతరము కృషిని జోడించి అంచెలంచెలుగా తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అప్పారావు జీవిత కాల నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు తన జీవితం సుందరం సుమధురం!
"కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు" అన్న సినిమా పాట గుర్తొచ్చింది. ఋషులౌతారో లేదో గాని కచ్చితం గా ఉన్నత స్థితిని చేరుకుంటారు అప్పారావు లాగ.
"కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న పెద్దల మాట ఊరికే పోతుందా!!!
——-///——-

