"అమ్మా... పక్షులు ఎగరగలుగుతున్నాయి! కానీ మనం మనుషులు వాటికంటే గొప్ప వాళ్ళం కదా! ఆకాశంలో ఎందుకు ఎగరలేకపోతున్నాము? తాబేలు నీటిలో జీవించగలదు! నేలపైనా జీవించగలదు! కానీ మనం ఎందుకు నీటిలో జీవించలేము? నూనె పోసి వత్తి వేసి నిప్పు పెడితే దీపం వెలుగుతూ ఉంది! అదే నిప్పు మనల్ని కాలుస్తూ ఉంది ఎందుకు?" తన చిన్నారి కొడుకు అడిగే ప్రశ్నలు చూసి ఆ తల్లి ఎంతో ముచ్చట పడింది. ఏ గురువుకు పుట్టాల్సిన వాడు ఈ శబరి ఇంట్లో పుట్టాడా అనుకుంది ఆమె. అడవిలో రకరకాల ఔషాద గింజలు, ఆకులు, వేర్లు సేకరించి వాటిని అమ్మి ఆ డబ్బుతో ఆమె తన కుటుంబాన్ని పోషిస్తుంది.ఆ చిన్నారి పిల్లవాడి జ్ఞానాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోసాగింది. తమ గూడెం లో తమ మంచి చెడ్డలు చూసే దొర దగ్గరికి తన కొడుకుని తీసుకెళ్లి... "దొర... వీడి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేకపోతున్నాను. మీరు కొంచం మీ జ్ఞానం తో భోదించండి" అని అడిగింది. దొర ఆమెతో... "కొండ కింద దిగివనున్న గ్రామంలో ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు దగ్గరికి నేను వీడిని తీసుకెళ్తాను. ఆయన ఏం జవాబు చెప్తాడో చూద్దాము" అని చెప్పాడు. తెలతెల్లవారుతుండగా, ఆ చిన్నారిని తీసుకొని పక్షుల కూకూ రాగాలతోనే ఇద్దరు బయలుదేరి కొండ దిగువకు ప్రయాణమై వెళ్లారు.ఆ చిన్నారి బాలుడు తమ గూడాన్ని వదిలి ఇదే మొదటిసారి కొండ దిగువకు రావడం. గూడెం లో ప్రజలందరూ కూడా ఒకరితో ఒకరు అనుబంధం పెనవేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పాలంటే ఆత్మ సంబంధం ఉన్నటువంటి మనుషులు. వారి ఇళ్లకు గొళ్ళాలు ఉండవు. వారు దొంగతనం చేయరు. ఏ వస్తువు దొరికిన అందరు పంచుకుని తింటారు ఆకలి అన్నిటికంటే గొప్ప దైవము అని చెప్పుకుంటారు. కొండ దిగువకు రాగానే పశువులను మేపడానికి కొండమీదకు వెళ్తూ, అప్పటికే కొంతమంది ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. దొర ని చూసి...ఎప్పుడూ కొండ దిగని నీవు ఊరిలోకి వస్తున్నావు. ఏమైనా కావాలా! అని అడిగారు. దొర వారితో...."పండితుల వారు ఉన్నారా!" అని అడిగి పండితులవారు ఉన్నారు ఊరిలోనే అని వారు చెప్పగానే.... చిన్నారిని తీసుకుని పండితుడి ఇంటికి వెళ్ళాడు. పండితుల వారి భార్య అప్పుడే ఆవు పాలు పిండి చెంబు నిండా బురుగుతో ఇంట్లోకి వెళుతూ ఉంది. వీరిని చూడగానే "పండితుల గారిని కలవాలా!" అని అడిగి..."ఇక్కడికి రండి" అని వారిద్దరిని ఇంటి ముందు ఉన్న తిన్నె మీద కూర్చోండి అని చెప్పింది. "ఏమైనా తింటారా! అని అంటూ....ఈ చిన్న పిల్లవాడిని చూస్తే ఎంతో ముచ్చటగా ఉన్నాడు. ఉండండి! ఇప్పుడే వస్తాను! అని లోపలికెళ్ళి ఆరోజు బియ్యప్పిండితో చేసిన అట్లు తీసుకొచ్చి, కొంచెం చట్నీ వేసి కొన్ని పల్లీలు వేయించినవి, నువ్వుల లడ్డు కూడా పక్కనపెట్టి, ఆ బాలుడికి పెట్టింది. అలాగే దొరకు కూడా ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చింది. మీరు తినండి గురువుగారు స్నానం చేస్తున్నారు. పూజ ముగించుకుని వస్తారు" అని చెప్పింది. దొర, ఆ బాలుడు ఇద్దరు ఆమె పెట్టినటువంటి ఆహారం భుజించారు. ఆమె తెచ్చిన నీరు కూడా తాగి సేద తీరారు.అర్థగంట కాగానే గురువుగారు బయటకు వచ్చారు. గురువుగారు వస్తుండడం దూరం నుండే చూసి, దగ్గరకు రాగానే దొర గౌరవంగా పైకి లేచి నిలబడి నమస్కరించాడు. పక్కనున్నటువంటి చిన్నారి బాలుడు పైకి లేచి నమస్కరించాడు. కూర్చోండి అని చెప్తూ గురువుగారు కూడా కూర్చున్నారు. గురువుగారు దొరవారిని చూసి "ఏమన్నా కావాలా!ఇలా వచ్చేసారు!" అని అడిగాడు. దొరగారు... గురువుతో "ఈ చిన్నారి బాలుడు పేరు ప్రహ్లాదుడు. వాళ్ళ అమ్మ ఎంతో ఇష్టంగా పేరు పెట్టుకుంది. కానీ వాడు అడిగే ప్రశ్నలు కూడా ఆనాటి భక్త ప్రహ్లాదును మాకు గుర్తుతెస్తున్నాడు. అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాను" అని చెప్పాడు. గురువుగారు ఆ బాలుడిని తేరిపార చూసి... ఆ బాలుని తేజస్సును గమనించి, "ఈ బాలుడిని నాతోపాటు ఒక మూడు రోజులు పెట్టుకుంటాను. అతను అడిగే ప్రశ్నలకు అంతా కూడా జవాబు చెప్తాను. మీరు వెళ్లి రండి" అని చెప్తాడు. "వాళ్ళ అమ్మకి చెప్పండి వీడు మూడు రోజులు నా దగ్గర ఉంటాడు" అని చెప్పాడు. సరేనని దొరగారు బయలుదేరి వెళ్లారు. గురుపత్ని వచ్చి ఆ బాలుడుని లోపలి గదిలోకి తీసుకెళ్లి, "ప్రయాణమై వచ్చావు కదా అలసిపోయి ఉంటావు. విశ్రాంతి తీసుకో" అని చెప్పింది. ఆ బాలుడు వారిని వారి ప్రేమను చూసి ఆనందిస్తూ.. తనకు తండ్రి లేడు కానీ తనకు తండ్రి ఉంటే అచ్చం ఇలాగే గురువు లా ఉంటాడు! దొర కూడా తనని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. అతను తనకొక తాత రూపంలో కనిపిస్తాడు! గురుపత్ని ని చూసి తల్లి తర్వాతే ఈమె నా తల్లి!" అనుకుంటాడు. ఆ చిన్నారి ఎనిమిది ఏండ్ల పసి బాలుడు. అలా పడుకోగానే నిద్రపోయాడు. అతనికి అది నేలా లేదా పరుపు అని అవసరం లేదు. అంతటి ప్రసన్న వదనుడు ఆ బాలుడు. సాయంత్రం కాగానే గురుపత్ని వచ్చి అతన్ని నిద్రలేపింది. కొద్దిగా గోరువెచ్చ నీరు ఇచ్చి నోరు కడుక్కోమని చెప్పింది. అలాగే ఒక చెంబు నీళ్లు ఇచ్చి మొహము, కాళ్లు, చేతులు కడుక్కు రమ్మంది. అతను కడుక్కుని రాగానే తీసుకెళ్లి వసారా లో గురువు గారి పక్కనే కూర్చోబెట్టింది. అప్పటికే గురువుగారు భోజనానికి కూర్చొని ఉన్నారు. ఆ చిన్నారి కుర్రవాడు కూడా ఆయన పక్కన కూర్చొగానే పచ్చని అరిటాకులో రకరకాల పదార్థాలు వడ్డించింది. తెల్లటి అన్నం, పెసుల కూర, వంకాయ కూర, బెండకాయ వేపుడు,కందిపప్పు పచ్చడి, అందులోకి వేడి వేడి నెయ్యి, పల్చటి మజ్జిగ. అటువంటివి ఎప్పుడూ తినని ఆ చిన్నారి బాలుడు నెమ్మదిగా వాటిని తినసాగాడు. ఇద్దరు భోంచేసుకుని బయటికి రాగానే అక్కడ ఆవులు, వాటి దూడల దగ్గరికి గురువుగారు వెళ్లి నెమ్మదిగా వాటి వీపు నిమర సాగారు. తర్వాత చిన్నారి ప్రహ్లాదుని తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి బల్లమీద కూర్చున్నారు."ఇప్పుడు అడుగు. ఏ ప్రశ్నలకు జవాబు కావాలి? " అని అన్నారు గురువుగారు. ఆ చిన్నారి బాలుడు గురువుగారిని ప్రేమతో చూస్తూ" స్వామి పరబ్రహ్మం అంటే ఏమిటి " అని అడిగాడు. ఆయన వాడి ప్రశ్నకు ఆశ్చర్యం చెందుతూ" నీకు ఎలా అనిపిస్తుంది పరబ్రహ్మం అంటే? " అని తిరిగి ప్రశ్నించారు. "నాకు పరబ్రహ్మం అంటే నా కలలో కనిపించే దీపపు వెలుతురా? లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి! ఆ చిన్న లేగ దూడలా! లేదా నా తండ్రి తల్లి స్థానంలో ఉన్నటువంటి మీరా! నా తాతస్థానంలో ఉన్నటువంటి మా దొరగారా? లేదంటే నన్ను కని పెంచి ఇంతవాడిని చేసిన మా తల్లి! లేదా ఇంతకు మించింది ఉందా?" అని అడిగాడు. అతని ప్రశ్నలకు గురువుగారు ఆశ్చర్యం చెందుతూ....ఇంకా చెప్పమని అతన్ని అడిగాడు. "నా చుట్టుపక్కల గూడెం ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ప్రశాంతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. నాకు అందులో కూడా పరబ్రహ్మం కనిపిస్తుంది అన్నాడు. నెమలి నాట్యం మాడుతుంటే అందులో పరబ్రహ్మం ఉంది. వంట చేస్తూ ఉంటే అమ్మ కొంగును పట్టుకొని నేను మూతి తుడుచుకున్న... అమ్మ ప్రేమగా సుతారంగా నవ్వింది. అందులో కూడా నాకు పరబ్రహ్మం ఉంది. ఇంతకీ పరబ్రహ్మం అనే పదార్థానికి రూపం ఉందా! అని అడిగాడు. లేదా నేననుకునే ఈ ప్రేమతత్వం పరబ్రహ్మమా?....అని నాకు ఎప్పటినుంచో ప్రశ్నగా ఉంది" అని చెప్పాడు. గురువుగారు ఆ బాలుని చూస్తూ...."నీ ప్రశ్నలోనే జవాబు ఉంది! పరబ్రహ్మానికి రూపం లేదు! కానీ నువ్వు చూసే సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ రూపమే! అమ్మ ప్రేమలో పరబ్రహ్మం ఉంది! లేగ దూడ ప్రేమలో పరబ్రహ్మం ఉంది! నీకు ప్రేమగా ఆహారం పెట్టిన గురుపత్ని ప్రేమలో కూడా పరబ్రహ్మం ఉంది! అంటే మన అందరిలోనూ ఆ పరబ్రహ్మం ఉంది. ఆ పరబ్రహ్మం నుంచి, అనేక భాగాలుగా ఆ పరబ్రహ్మ రూపం, మన అందరిలో ప్రవేశించింది". ఆ బాలుని చూసి చెప్పాడు...."ఈ శరీరం ఒక మాయ! ఈ చుట్టూ ఉన్న జనం, ఇక్కడ జరిగే సంఘటనలు, ఇవన్నీ మాయ! మనమంతా మాయలో ఒక భాగం. మనం ఇవన్నీ నిజం అనుకుంటున్నాం...కానీ ఇదంతా మాయ! ఇది అలాగే ఉంటుంది! కానీ మనము ఈ మాయలో నుంచి తిరిగి ఇంకొక మాయలోకెళ్ళిపోతాం! " అని అన్నారు. అంతలోనే ఆ బాలుడు ఆశ్చర్యంగా... చూస్తూ "మాయ" అంటే? అని అడిగాడు. "మాయ అంటే మనం అనుకున్నవి ఏవి నిజం కాదు అని చెప్పారు గురువుగారు. ఇప్పుడు నీ పిడికిలి బిగించు. పిడికిలి లో ఏముంది" అని అడిగాడు. ఆ బాలుడు పిడికిలి బిగించి.... "ఏమీ లేదు గురువుగారు" అన్నాడు. వెంటనే "గురువుగారు! ఏమిలేదు కాదు.. కాదు పిడికిలి లో గాలి ఉంది"అన్నాడు. ఏమీ లేదు అనే స్థానంలో ఏదో ఉంది! ....అంటే అదే మాయ అన్నారు గురువుగారు. అవును అదే మాయ! అంటే మనం ఇక్కడ అన్ని ఉన్నాయి అనుకుంటున్నాము! కానీ ఏమీ లేదు! ఏమీ లేదు అనుకునే చోట కూడా ఏదో ఉంది! అది అంతా కూడా మాయ! అని అంటూ... అగ్ని వెలుగుతుంది మనకు అగ్ని కనిపిస్తుంది. ఆ అగ్గిమీద పెట్టిన పదార్థాలు ఉడికి ఆహారంగా మారుతున్నాయి. అంటే ఈ అగ్ని ఎక్కడి నుంచి పుట్టింది. వంట చెరుకు నుంచి పుట్టింది. వంటచేరుకులో ఏమీ లేదనుకుంటున్నావు... కానీ వంట చెరకు నుంచి అగ్ని పుట్టింది! అగ్నిపుట్టి ఏమీ లేదనుకునే...పచ్చి ఆహారాలని ఏదో ఉంది అన్నట్టు మనం తినదగిన ఆహారంగా మారుస్తుంది. మనము ఆహారం తీసుకోగానే మన శరీరంలో ఆ ఆహారము ఒక పదార్థంగా మారి శరీర తత్వంగా మారిపోతుంది. ఇదంతా మాయే!!!" అప్పుడు ఆ బాలుడు గురువుగారిని చూస్తూ... "గురువుగారు! నేను చూసిన నా చుట్టూ మనుషులు, ఎంతో ప్రేమతో ఉంటున్నారు.ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు. తక్కువ మాట్లాడుతున్నారు. కానీ లోపల కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ నేను ఈ ఊర్లోకి ప్రవేశించేటప్పుడు ఇతర వ్యక్తులను చూశాను.వాళ్ళు కోపంగా తిట్టుకుంటున్నారు. అంతలోనే ఆ కోపం అయిపోయినట్టు మాయమైనట్టు ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకుంటున్నారు. అంటే ఈ కోపం తెచ్చుకునే వాళ్లలో ఏముంది? మాలో ఏమీ లేదు? మాకెందుకు కోపం రావట్లేదు? వీళ్ళకెందుకు కోపం వస్తుంది? " అన్నాడు. "వాళ్ల కు కోపం వస్తోంది! అంటే వాళ్లకు భయం ఉంది! వాళ్ళకు భయం ఉందంటే వాళ్ళలో అహం ఉంది. నాది అనేది ఏదో పోతుంది అన్నట్లు వాళ్ళు భయపడుతూ, ఉన్నది సరిపోదు! ఇంకా ఏమో కావాలి! తానే గొప్ప! తాము ఏ తప్పు చేయము! అని గొడవ పడుతున్నారు. అంతలోనే ఈ వ్యక్తితో నాకు అనుబంధం ఉంది కదా అని గుర్తుకొచ్చి, అనుబంధం ఉండటం వల్ల ఆ కోపాన్ని తగ్గించుకోవాలని మళ్లీ ప్రేమగా వాళ్లతో మాట్లాడుతున్నారు. కానీ అదంతా అశాశ్వతంగా ఉంది. శాశ్వతంగా లేదు!" అన్నాడు. ప్రహ్లాదుడు... గురువుగారిని చూస్తూ... "గురువుగారు! నేను నిద్రపోతున్నంతలో లేదా మెలకువగా ఉన్నంతలో, ఎప్పుడూ అని చెప్పలేను కానీ, నాకు నా కనుబొమ్మల మధ్య ఏదో వెలుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది! ఆ వెలుగు నా చుట్టూ అంతా కూడా ప్రకంపన సృష్టిస్తూ ఉంది! " అని చెప్తూ... "నా లోపలికి నేను నన్ను చూసుకున్నప్పుడు, నేను గమనించిందేమంటే, నాలోన ఒక దేవుడు ఉన్నాడు అని గమనించాను!! ఆ దేవుని నేను చూస్తున్నాను! ఆ దేవుడికి నేను మొక్కుతున్నాను! నేను అక్కడ ఉన్నాను! ఇక్కడ కూడా ఉన్నాను! ఈ శరీరంలో ఉన్నాను! అక్కడ ఆత్మ రూపంలో ఉన్నాను! ఆత్మ రూపంతో నేను నాలోని మరొక దైవానికి నేను మొక్కుతున్నాను! అంటే అక్కడున్న దైవము నేనేనా? ఇక్కడ నా ఆత్మ నేనేనా? ఈ శరీరంలో ఉన్నది నేనేనా? నాకు అర్థం కావట్లేదు" అన్నాడు. గురువుగారు ప్రసన్న వదనంతో బాలుని చూస్తూ.... "నువ్వు చెప్పింది నిజమే . అనంతమైన ఆకాశంలో ఉన్నది దైవమే! నీలో ఉన్నది అదే దైవము! నాలో ఉన్నది అదే దైవము! మన చుట్టుఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నది కూడా అదే దైవం! అదే శక్తి. ఆ శక్తి నీలోకి ప్రవేశించినప్పుడు నీవు పూర్తిగా జీవం పొందుతావు. నీ నుంచి ఆ శక్తి ఆత్మ స్వరూపమైనది...అది వేరుపడినప్పుడు నీవు తిరిగి ప్రకృతిలో కలిసిపోతావు!" "నీవు గమనించి నిజమే! నీవు నీ లోపల ఆ పరబ్రహ్మంన్ని చూస్తున్నావు! ఆ పరబ్రహ్మము అనంతమైన విశ్వంలోనూ ఉన్నారు! అదే పరబ్రహ్మము నీలోనే ఉన్నారు! నీవు చూసేది ఆ పరబ్రహ్మాన్ని! నీవు కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్న అగ్ని ఆ పరబ్రహ్మ స్వరూపం! అదే దైవము!!" "అదే పరబ్రహ్మం నాలో నువ్వు ఉంది! ఈ చుట్టూ ఉన్న సమస్త జీవరాసిలో ఉంది! ఆ శక్తి అనేది మన శరీరం నుంచి బయటకు పోయినప్పుడు, మనం మట్టిలో మట్టిగా, గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా అవుతాం!" అని చెప్పాడు. "గురువు గారు.... దైవం శిక్షిస్తుంది! మలమల కాగే నూనెలో వేసి వేపుతుంది! కానీ శిక్ష వలన మార్పు రాదు! జ్ఞానం వలన మార్పు వస్తుంది. నిజంగా దైవం శిక్షిస్తుందా?".... అని బాలుడు ప్రశ్నించాడు. గురువుగారు బాలుని తో అన్నారు...."మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ... కోపమనేది అహాన్ని సూచిస్తుంది" ఆశని సూచిస్తుంది! కోపం వల్ల ద్వేషం వస్తుంది! ద్వేషం వలన మమకారం చచ్చిపోతుంది! మన లోపల అనంతమైన నిశ్శబ్దం అనేది చచ్చిపోతుంది! ఆ ప్రేమ అనేది మనలో ఉన్నది! అది చచ్చిపోతుంది! మనశ్శాంతి కోల్పోతాం! వీటన్నిటి వలన అహం మరింత పెరిగి, వారు హింసకు పాల్పడతారు! నీవు అన్నది నిజమే! పరబ్రహ్మానికి... అహంతో ఉన్న వ్యక్తికి, నీకు, నాకు తేడా లేదు! అహంతో ఉన్న వ్యక్తి, పరబ్రహ్మానికి చిన్నపిల్లల్లా కనిపిస్తాడు! అమ్మ తనకే కావాలని కోరుకుంటాడు చిన్నపిల్లవాడు! ఆహారం మొత్తం తనకే కావాలని కోరుకుంటాడు! అలా నాకే అంతా కావాలి అని కోరుకోవడమే స్వార్థం! అహం తో ఉన్న వ్యక్తులకు, మిగిలినవారికి ఆదైవం తేడా అనేది చూపదు! అలాగే పరబ్రహ్మానికి రూపం ఎలా లేదో, మతం, ప్రాంతం, అనుబంధం, మంచి చెడు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు!" ప్రహ్లాదుడు గురువుగారికి ప్రశ్నలకు సంతృప్తి చెందాడు. ఆరోజు సాయంత్రం దీపాలు పెట్టే వేళ పశువులన్నీ తిరిగి గూళ్ళకి చేరడం చూస్తూ ఆనందించారు. గురుపత్నితో ప్రేమగా మసులుకున్నాడు. తనలోని ప్రేమను ఆ ఇద్దరు వ్యక్తులకి గురువుకి గురుపత్నికి అందించాడు. వారి ప్రేమను అతను స్వీకరించాడు. ఆ మూడు రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి. మూడో రోజు దొరగారు, ప్రహ్లాదుని తల్లితో పాటు కలిసి గురువుగారింటికి వచ్చారు. గురువుగారిని చూడంగానే బాలుని తల్లి నమస్కారం చేసింది. గురువుగారు ప్రతి నమస్కారం చేస్తూ.. అమ్మ నీవు కారణజన్ముని కన్నావు. ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాదు. ఆనాటిభక్త ప్రహ్లాదు తిరిగి దైవ కృప వలన మీ ఇంట జన్మించాడు. మీకు మాత్రమే కాదు. మన ప్రాంతానికి అంతటికి నాయకుడు కాగల లక్షణాలు ఉన్నాయి. ప్రేమగా చూసుకోండి. విద్యలన్నీ నేర్పండి అని చెప్పాడు. ప్రహ్లాదుడు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుపత్నితో మళ్లీ వస్తానని చెప్పాడు.తన తల్లితో కలిసి ప్రహ్లాదుడు... పరబ్రహ్మం అంటే సమస్త జీవరాశి. ఆ జీవరాశి మీద చూపించే దయ! ప్రేమ! నేను నా వారు అని తేడా లేకుండా అందర్నీ ఒక్కలాగా చూడటం" అని గ్రహించి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు! డా.బి. హేమావతి

