వెళ్ళను - isun finn

Vellanu

(తెల్లవారుజామున టైం 5:15 కి, ఆర్య​ తన ఫ్రెండ్ అరవింద్ కార్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆర్య ఎగ్జామ్ రాయడానికి తిరుపతి నుంచి చెన్నై కి వెళ్ళాలి. అరవింద్ చెన్నై లో జాబ్ చేస్తున్నాడు. ఈ వన్ వీక్ ఇంటికి వచ్చాడు. టైం 5:35 అయ్యింది. అప్పుడు అరవింద్ వస్తాడు)

త్వరగా వెళ్ళాలన్నాను కదరా, నేను అప్పటికి ముందే కాల్ చేసాను రెడీ అవ్వమని.

నేను నిన్ను కరెక్ట్ టైం ​కి అక్కడకి తీసుకెళ్తాను ఆర్య. నువ్వు కంగారుపడకు.

(అరవింద్ డ్రైవ్ చేస్తున్నాడు, ఆర్య నిద్రపొతాడు. టైం 7:35, అరవింద్ కార్ ఆపి బయట కాఫీ తాగుతున్నప్పుడు ఆర్య నిద్రలెగుస్తాడు)

అరవింద్, ఎక్కడ ఉన్నాం? ఇంకా ఎంత టైం పడుతుంది?

సరిగ్గా చూడు నీ ఎగ్జామ్ సెంటర్ కి వచ్చేసాం.

అదేంటి అంత త్వరగా ఎలా వచ్చేసాం?

100 స్పీడ్ లో వస్తే త్వరగానే వస్తాం.

అంత స్పీడ్ ఎందుకు, నేను మేల్కొని ఉంటే అసలు 80 దాటొద్దు అని చెప్పేవాడిని.

రోడ్ స్మూత్ గా ఉంది, ఎర్లీ మార్నింగ్ వెహికల్స్ కూడా ఎక్కువ లేవు. అయినా ఇప్పుడేం అయ్యిందని? త్వరగానే వచ్చేసాం కదా.

ఏమైనా అయ్యి ఉంటే? మెల్లగా నడుపురా బాబు నువ్వు.

సర్లే, నీ ఎగ్జామ్ ఎప్పుడు?

9:00 నుంచి 11:15 వరకు పేపర్ 1. మల్లి 2:00 నుంచి 2:15 వరకు టైపింగ్ టెస్ట్.

మరి ఇంటికి ఎలా వెళ్తావు?

ఎగ్జామ్ అయిపోగానే బస్సు ఎక్కి వెళ్ళిపోతాను.

ఈరోజు ఉండొచ్చుగా,నువ్వు చక్కగా బీచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈవెనింగ్ కి నా వర్క్ అయిపోగానే నేను వచ్చేస్తాను. ఇద్దరం కలిసి సినిమా చూసి డిన్నర్ కి వెళ్దాము.

లేదు, అరవింద్.

నువ్ ఎప్పుడు మారకుండా అలానే ఉండు. నేను వెళ్తాను ఇంక. అల్ ది బెస్ట్.

థాంక్యూ అరవింద్.

దేనికి?

డ్రాప్ చేసినందుకు అలాగే ఆల్ ది బెస్టకి.

నేను వచ్చేది ఇటు వైపెగా. అయినా ఫ్రెండ్స్ మధ్య ఈ థాంక్స్ లు ఎందుకు. మల్లి కలుద్దాం.

(ఆర్య టిఫిన్ చేసి, 8:15 కి లోపాలకి వెళ్తాడు. చెకింగ్, రిజిస్ట్రేషన్ అయిపోయాక తన కంప్యూటర్ దెగ్గర కూర్చుంటాడు. తన కంప్యూటర్, అటు ఇటు ఉన్న కంప్యూటర్స్ లో బ్లాక్ స్క్రీన్ వచ్చి రిఫ్రెష్ కొట్టమని అంటుంది. అటు పక్కన ఉన్న వ్యక్తి)

మీ కంప్యూటర్ కూడా అలానే చూపిస్తుందా ,ఇన్విజిలేటర్ ని పిలుదాం.

అక్కర్లేదు.

(అని చెప్పి ఆర్య రిఫ్రెష్ కొట్టేసి)

ఇప్పుడు మన రోల్ నెంబర్, ఫోటో కనిపిస్తుందిగా , ఇంకా 15 నిమిషాలున్నాయి స్టార్ట్ అవ్వడానికి.

అంతేనా, థాంక్యూ. ఏదైనా కొడితే ఎగ్జామ్ పోతుందేమో అని భయపడ్డాను.

(ఇటు పక్కన ఉన్న వ్యక్తి కూడా అది చూసి రిఫ్రెష్ కొడతాడు. ఎగ్జామ్ రాయడం అయిపోయాక ఇంకా అందరిని కొంచెం సేపు ఆగమన్నారు. అప్పుడు ఆర్య అటు పక్కన ఉన్న వ్యక్తి తో)

ఎలా రాశారు?

పర్లేదు. మీరెలా రాశారు?

బానే రాశాను.

(ఆర్యకి ఇటు వైపున్న వ్వ్యక్తి ఉత్సవాహంగా కనిపించాడు. ఇటు పక్కన ఉన్న వ్యక్తి తో)

మీరెలా రాశారు?

సగం వరకు ఈజీగానే ఉన్నట్టున్నాయి. కానీ మిగితావి డౌట్, అన్ని పెట్టేసాను. మీరెలా రాశారు?

బానే రాశాను కానీ అన్ని పెట్టలేదు. కటాఫ్ ఎక్కువే ఉంటుంది. కానీ నెగటివ్ పోకూడదు కదా.

(అలా ఈ క్వశ్చన్ కి ఎం ఆన్సర్ పెట్టారు అని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, ఆర్య ఆ వ్యక్తి ఆధార్ కార్డు లో ఇయర్ అఫ్ బర్త్ చూస్తాడు)

నువ్వు 2004 బోర్న్ ఆ? చాలా చిన్నోడివి అయితే. నేను 2000 బోర్న్.

ఎక్కడ నుంచి?

తిరుపతి.

మాది కూడా తిరుపతే. పొద్దున్న ఎలా వచ్చావ్?

నాన్న కార్ లో తెచ్చారు. మీరెలా వచ్చారు?

ఫ్రెండ్ చెన్నై లోనే ఉంటాడు. తను డ్రాప్ చేశాడు. ఎం డిగ్రీ చేశావు?

బి.ఏ ఎకనామిక్స్. ఇప్పుడు డిస్టెన్స్ లో ఎం.ఏ ఎకనామిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్. మీరేం చేస్తున్నారు?

బి.ఎస్.సి మ్యాథ్స్ చేసాను. ఎం.ఏ ఎకనామిక్స్ చేసాను. తర్వాత టి.సి.ఎస్, చెన్నై లో వర్క్ చేసాను. ఏ కాలేజీ లో బి.ఏ కంప్లీట్ చేశావ్?

ఎస్.వి ఆర్ట్స్ కాలేజీ లో బి.ఏ చేశా. ఎం.ఏ ఏమో ఎస్.వి.యు.

నేను కూడా బి.ఎస్.సి, ఎం.ఏ ​ఎస్.వి.యు లోనే చేశా.

ఎందుకు టి.సి.ఎస్ నుంచి వచ్చేసారు, అక్కడ బాగుంటుంది కదా?

టి.సి.ఎస్ లో చేరాలనే అనుకున్నాను. సాలరీ కూడా బానే ఉంది.కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యూరిటి ఉంటుంది కదా. నాన్నేమో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి రాయమన్నారు. అది క్విట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇది ట్రై చేస్తున్నాను.

అవును గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యురిటి ఉంటుంది.

ఇప్పుడు ఫుల్ టైం ప్రిపరేషన్ ఏనా?

అప్పుడప్పుడు ట్యుషన్స్ చెప్తూవుంటాను.

(అప్పుడు అందరిని వెళ్ళమని చెప్తే ఇద్దరు వేరే వైపు వెళ్తారు. లంచ్ చేసి టైపింగ్ టెస్ట్ కి వస్తారు. ఎదురుపడినప్పుడు హాయ్ చెప్పుకుంటారు. ఎగ్జామ్ అయిపోయింది. పక్క వ్యక్తి ఆర్యతో)

ఇది 2000 వర్డ్స్ కదా నాకు 1999 అనే చూపిస్తుంది. నేను అన్ని టైపు చేశాను. నేను డిస్క్వాలిఫై అవుతానా?

లేదు ఎం అవ్వదు. ఏదో ఒకటి పోయుంటుంది. అయినా టైపింగ్ టెస్ట్ ని అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఓహ్ థాంక్యూ అన్న.

అన్న వద్దులే. నా పేరు ఆర్య. ఆర్య అని పిలువు.

నా పేరు విహాన్.

నీ పేరు బాగుంది, విహాన్.

థాంక్యూ ఆర్య. ఇప్పుడు ఎలా వెళ్తావు? మాతో పాటు కార్ లో రావొచ్చుగా?

థాంక్యూ విహాన్, కానీ నేను బస్సు ఎక్కి వెళ్ళిపోతాను.

(ఇద్దరు వెళ్ళిపోతారు. విహాన్ కి సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి. తను ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాడు. రాసి వచ్చేటప్పుడు అక్కడ ఆర్య కనిపించాడు. అతని వైపు చూసి)

హలో ఆర్య.

హాయ్ విహాన్, ఏంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ?

అవును ఆర్య. నువ్వెంటి ఇక్కడ?

నేను లైబ్రరీ లో చదువుతూవుంటాను. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు?

ఆటో లో వచ్చాను. మల్లి ఆటో బుక్ చేసుకుని వెళ్లడమే.

మీ ఇల్లు ఎక్కడ?

మాది లీలామహల్ సర్కిల్ దగ్గర ఆర్య.

అవునా! నేను కపిలతీర్థం వైపే వెళ్తున్నాను, నీది నా రూటే కదా. రా, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. ఆటో దేనికి దండగ?

థాంక్యూ ఆర్య!

(ఇద్దరు బండి మీద వెళ్తున్నప్పుడు)

ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నావు ఆర్య? అంటే ఎస్.ఎస్.సి మెయిన్స్ ఎగ్జామ్ రాసేసాక ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఎలాగో నువ్వు క్వాలిఫై అయిపోతావుగా.

అదేం లేదు విహాన్ , మనం చెప్పలేము. ఆల్రెడీ 2 టైమ్స్ పోయింది. ఈసారి దాని మీద కూడా అంత హోప్ లేదు. అందుకే ఏపిపిఎస్సి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఇయర్ ఏదైనా ఒకటి కొట్టాలి. ముందు జాబ్ ఉంటె తర్వాత ఇంకా కావాలంటే పెద్ద పోస్ట్ కి ట్రై చేయొచ్చు. ఏజ్ లిమిట్ అయిపోతుందిగా.

(విహాన్ ఇంటికి వచ్చేస్తారు)

నీ ఎం.ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయ్, విహాన్?

రోజు మర్చి రోజు ఉన్నాయ్, సాటర్డే వస్తే అప్పుడు 2 డేస్ మధ్యలో గ్యాప్ వస్తుంది.

అయితే నేను పిక్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు డ్రాప్ చేస్తాను.

ఎందుకు ఆర్య? ఈరోజు తెచ్చినందుకు చాలా థాంక్యూ. రోజు ఇలా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు.

అలా ఎం కాదు విహాన్. ఇద్దరం వెళ్ళేది ఒకే వైపు కదా అందుకే అన్నాను. నాకేం ప్రాబ్లెమ్ లేదు. నీ నెంబర్ చెప్పు, వచ్చేటప్పుడు కాల్ చేస్తాను.

సరే నీ ఇష్టం ఆర్య.

(అని నంబర్స్ సేవ్ చేసుకుంటారు. ఆర్య బయల్దేరతాడు, విహాన్ ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు ఆగి విహాన్, ఆర్య కి మెసేజ్ చేస్తాడు)

ఆర్య, ఇంటికి చేరావా?

చేరాను.

(ఆరోజు రాత్రి, విహాన్ చదువుతున్నాడు, ఒక టాపిక్ దెగ్గర బాగా టైం తీసుకుంటున్నాడు. అప్పుడు ఆర్య నెంబర్ చూస్తాడు)

ఇప్పుడే కాల్ చేస్తే ఇబ్బంది పెడుతున్నానేమో.

(అని అనుకుని, ఐదు నిమిషాల తర్వాత కాల్ చేస్తాడు. ఆర్య వెంటనే కాల్ ఎత్తుతాడు. మరుసటి పరీక్ష రోజు ఉదయం. ఆర్య బైక్ మీద విహాన్ ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడతాడు. విహాన్ హడావిడిగా బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చి బైక్ ఎక్కుతాడు. బండి స్టార్ట్ అయ్యి రోడ్డుపైకి వస్తుంది)

ఈరోజు ఏ పేపర్?

అడ్వాన్స్‌డ్ ఎకనోమెట్రిక్స్. రాత్రంతా బుక్కులు తిరగేసినా ఆ మోడల్స్, థియరీస్ అస్సలు మైండ్‌కి ఎక్కట్లేదు ఆర్య. బి.ఏ లో ఉన్నట్టు లేదు సబ్జెక్ట్, ఎం.ఏ లో చాలా డీప్‌గా ప్యూర్ మ్యాథ్స్ లోకి వెళ్ళిపోయాడు.

పిజి లెవెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది విహాన్. ఏ టాపిక్ నిన్ను అంతగా ఇబ్బంది పెడుతోంది?

అదే ఆర్య, ఈ సమల్టేనియస్ ఈక్వేషన్ మోడల్స్ లో వచ్చే ఆ అండర్-ఐడెంటిఫైడ్, ఓవర్-ఐడెంటిఫైడ్ కాన్సెప్ట్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఆ ఆర్డర్ కండిషన్ ఫార్ములాలు చూస్తేనే పిచ్చెక్కుతోంది.

అది చూడటానికి మ్యాథ్స్ లా భయంకరంగా ఉంటుంది కానీ, దాని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. నేను ఒక ప్రాక్టికల్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్తా విను.

(అంటూ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆర్య. కాలేజీ పార్కింగ్ దెగ్గర బైక్ అవుతాడు)

నువ్వు నిజంగా గ్రేట్, ఆర్య.

(ఆర్య నవ్వుతూ)

ఆల్ ది బెస్ట్ విహాన్! బాగా రాయి. ఎగ్జామ్ అవ్వగానే కాల్ చెయ్.

థాంక్యూ ఆర్య.

(ఆర్య నవ్వుకుంటూ తన బ్యాగ్ సర్దుకుని లైబ్రరీ వైపు నడుస్తాడు. ఎగ్జామ్ రాసి వచ్చాక, విహాన్ కాల్ చేస్తాడు. కానీ అప్పటికే ఆర్య వెయిట్ చేయటం చూస్తాడు)

ఆర్య ఎప్పటినుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు?

జస్ట్ 5 నిమిషాలైంది అంతే. నువ్ ఎలా రాశావు?

బాగా రాశాను. నువ్వు చెప్పిన టాపిక్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే రాశా. థాంక్యూ ఆర్య.

ఎన్ని సార్లు చెప్తావు థాంక్యూ.

నువ్వు చేసే సహాయాలకి ఎన్నైనా చెప్పొచ్చు.

(విహాన్ని ఇంటి దెగ్గర డ్రాప్ చేసినప్పుడు)

ఆర్య, మా ఇంటి లోపాలకి రావొచ్చుగా. కాఫీ తాగి వెల్దువు.

ఎందుకు? నేను ఇంటికి వెళ్ళిపోతానుగా.

ప్లీజ్, ఆర్య.

(విహాన్ అంతగా బ్రతిమిలాడేసరికి ఆర్య ఇక కాదనలేక బైక్ స్టాండ్ వేసి, విహాన్ వెనుక నడుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక పక్కన చిన్న బుక్ షెల్ఫ్ ఉంది)

కూర్చో ఆర్య, నేను లోపలికి వెళ్లి కాఫీ తీసుకువస్తాను. నాన్న ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అమ్మ ఉంది లోపల.

సరే విహాన్.

(ఆర్య సోఫాలో కూర్చుని చుట్టూ చూస్తాడు. విహాన్ బుక్ షెల్ఫ్ లో ఉన్న ఎకనామిక్స్ బుక్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ కనిపిస్తాయి. కొద్దిసేపటికే విహాన్ రెండు కప్పుల వేడి వేడి కాఫీతో బయటకు వస్తాడు. ఒక కప్పు ఆర్యకి ఇస్తాడు. కాఫీ సిప్ చేస్తూ)

కాఫీ చాలా బాగుంది విహాన్.

నేను నీ గురించే చెప్తున్నాను లోపల. రోజు ఎగ్జామ్ కి పిక్ చేసుకోవడమే కాకుండా, ఈరోజు కష్టమైన టాపిక్ కూడా సింపుల్ గా చెప్పావని అన్నాను.

ఇందులో అంత పెద్ద హెల్ప్ ఏం లేదు విహాన్.

అయినా ఈ రోజుల్లో అంత టైం కేటాయించి ఎవరూ చేయరు ఆర్య. నీ ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? లైబ్రరీ లో రోజంతా చదువుతున్నావు కదా, బోర్ కొట్టదా?

బోర్ అనే ఆలోచన వస్తే మన లక్ష్యం వెనకబడిపోతుంది విహాన్.

నీ డెడికేషన్ చూస్తే నాకు ఎనర్జీ వస్తోంది ఆర్య.

నీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు, నాకు తెలిసింది కచ్చితంగా చెప్తాను.

థాంక్యూ ఆ... సారీ, సారీ! థాంక్యూ అనకూడదు అన్నావు కదా, అలవాటులో వచ్చేసింది.

పర్లేదులే. కాఫీ చాలా బాగుంది. ఇంక నేను బయల్దేరతాను, మళ్లీ ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు ప్రిపేర్ అవ్వాలి.

అలాగే ఆర్య, కలుద్దాం. బై, జాగ్రత్తగా వెళ్ళు.

(ఆర్య బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే, విహాన్ గేట్ దగ్గర నిలబడి నవ్వుతూ టాటా చెప్తాడు. తర్వాత ఎగ్జామ్ అప్పుడు, ఎగ్జామ్ అయిపోయాక, ఆర్య బైక్ ని ఒక టీ స్టాల్ దగ్గర ఆపాడు)

ఏంటి ఆర్య, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఆపావ్?

రోజు పుస్తకాలే. మధ్యలో టీ కూడా తాగాలి కదా.

నేను టీ తాగను. కాఫీ. మరి నువ్వు?

టీ. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు.

నాకు వర్షంలో తడవడం ఇష్టం.

నాకు కూడా.

(ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడకుండా వర్షాన్ని చూస్తారు. రాత్రి 10:48. విహాన్ ఫోన్ చూస్తూ కొంచెం ఆలోచించి కాల్ చేస్తాడు)

హలో విహాన్.

పడుకున్నావా?

ఇంకా లేదు.

ఒక డౌట్ ఉంది.

అడుగు.

నిజానికి మూడు డౌట్స్ ఉన్నాయి.

సరే.

ఇంకా కొంచెం మాట్లాడాలని కూడా అనిపించింది.

అది కూడా ఒక మంచి కారణమే.

(నెక్స్ట్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2:15. లైబ్రరీ.)

లంచ్ చేశావా ఆర్య?

ఇంకా లేదు.

టైం ఎంత అయిందో తెలుసా?

ఒక టాపిక్ పూర్తి చేసి వెళ్దాం అనుకున్నా.

ఉదయం కూడా ఇదే చెప్పావ్.

చదువుతున్నప్పుడు టైం తెలియదు.

(విహాన్ తన బ్యాగ్ నుంచి టిఫిన్ బాక్స్ తీసి అతని ముందుపెడతాడు.)

ఇది ఏంటి?

అమ్మ రెండు డబ్బాలు ఇచ్చింది. ఒకటి నాది. ఇంకొకటి నువ్వు ఇలాగే మర్చిపోతావని.

మీ అమ్మకి నేను అంత బాగా తెలుసా?

లేదు. నాకు బాగా తెలుసు.

(ఆరోజు ఆఖరి ఎగ్జామ్. అది అయిపోయాక, విహాన్ ని ఆర్య తన ఇంటికి తీసుకెళ్తాడు)

ఆర్య , మీ ఇంట్లో కుక్క ఉందా, నాకు చెప్పలేదు?

అంటే ఆ టాపిక్ రాలేదుగా. వాడి పేరు ధీర్.

బలే ఉన్నాడు. పగ్ కదా?
అవును. ధీర్ నాకు తోడు.

ఆంటీ, అంకుల్ ఎం చేస్తుంటారు ఆర్య?

ఎస్.జి.ఆర్.ఎస్ హై స్కూల్ లో అమ్మ సోషల్ టీచర్, నాన్న సైన్స్ టీచర్.

(అప్పుడే ఆర్య వాళ్ళ అమ్మ విహాన్ని చూస్తుంది)

ఆర్యకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా తక్కువ. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాలే. చెన్నై నుంచి వచ్చాక మరీ మారిపోయాడు.

ఏమైంది ఆంటీ?

అదే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని.

కానీ నువ్వు వచ్చిన తర్వాత కొంచెం నవ్వుతున్నాడు.

(అప్పుడు విహాన్ నవ్వుతాడు)

ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయిగా ఇంక ఇప్పుడు ఎం చేస్తావ్ విహాన్?

నేను కూడా నీతో లైబ్రరీ కి వద్దాము అని అనుకుంటున్న ఆర్య. లైబ్రరీ కి ఏమైనా ఫీజు ఉందా?

(మొదట రోజు విహాన్ లైబ్రరీ కి వెళ్ళాడు. అక్కడ సీట్స్ ఖాళీలు లేవు. ఆర్య, విహాన్ దూరంగా కూర్చుని చదువుతున్నారు. కొంచెం సేపు తర్వాత, ఆర్య ఎవరో అమ్మాయితో బయట మాట్లాడటం విహాన్ చూసాడు. బైక్ మీద ఇంటికి వెళ్ళేటప్పుడు, విహాన్)

ఆర్య, లైబ్రరీ లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావు. తనెవరు?

తను అరవింద్ చెల్లి. కొన్ని బుక్స్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చింది.

(ఒక నెల గడిచింది. ఉదయం లైబ్రరీ. సాయంత్రం టీ స్టాల్. రాత్రి ఫోన్ కాల్స్. సాయంత్రం 5:30. ఎప్పటిలాగే టీ స్టాల్.)

ఇద్దరికీ టీనేనా?

నాకు కాఫీ.

అయ్యో, మర్చిపోయాను బాబు. మీరు రోజూ వస్తుంటారు కదా.

ఇదిగో చూశావా, ఇప్పుడు టీ షాప్ వాళ్లకి కూడా మన అలవాట్లు తెలుసు.

(లైబ్రరీ. మధ్యాహ్నం)

ఆర్య. ఒక మనిషి నాలుగు గంటలు కదలకుండా ఎలా కూర్చోగలడు?

ప్రాక్టీస్.

నువ్వు మనిషివేనా? నిజంగా చెప్తున్నాను. నువ్వు రోబోట్ లా ఉంటావ్.

మరి నువ్వు?

నేను?

పది నిమిషాలకు ఒకసారి నన్ను చూసి, బోర్ కొడుతుందా? అని అడిగే మనిషివి.

ఎందుకంటే బోర్ కొడుతుంది.

అయితే బయటికి వెళ్లి తిరిగి రా.

ఒంటరిగా వెళ్లాలని లేదు.

(ఆర్య తన పుస్తకం మూసి.)

సరే. ఐదు నిమిషాలు.

(రాత్రి 8:15. విహాన్ ట్యూషన్ చెప్పి బయటకి వస్తాడు. బయట బైక్ మీద కూర్చుని ఫోన్ చూస్తున్న ఆర్య కనిపిస్తాడు.)

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్?

ఇంటికి వెళ్తున్నా.

మా ఇంటి ముందు నుంచి?

యాదృచ్ఛికం.

అబద్ధం.

సరే. నీకు చీకట్లో ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేదని తెలుసు.

నేను అలా ఎప్పుడు చెప్పాను?

చెప్పలేదు.

మరి?

తెలుసు అంతే.

నువ్వు చాలా వింత మనిషివి, ఆర్య.

నువ్వు ఎందుకు ట్యూషన్స్ చెప్తున్నావు, విహాన్?

ఖాళీగా ఉంటె ఇంట్లో ఏదొక పని చెప్తారని. ఎంతో కొంత ఇన్కమ్ కూడా వస్తుంది.

ఎలా మేనేజ్ చేస్తావు ఆ పిల్లల్ని? పిల్లలు అసలు మాట వినరు. ఈ కాలం పిల్లలు మన కన్నా చాలా అప్డేటెడ్ గా ఉంటున్నారు. ఎదురు సమాధానాలు ఎక్కువ చెప్తున్నారు.

అది మనం డీల్ చేసే దాని బట్టే ఉంటుంది, ఆర్య. ఒకవేళ మనం అలుసు ఇచ్చామనుకో, మనల్ని ఒక ఆట ఆడుకుంటారు. అదే స్ట్రిక్ట్ గా ఉంటె, వాళ్ళకి భయం ఉంటది కానీ మనం చెప్పే మాటలు ఎక్కవు అలాగే వాళ్ళు ఎం అనుకుంటున్నారో బయటకి చెప్పరు. అలాగే ఒకరి నుంచి ఇంకొకరికి చాలా తేడా ఉంటుంది. దాని బట్టి మనం అప్డేట్ అవుతువుండాలి.

చాలా అనుభవం ఉన్నట్టుంది ఆర్య నీకు. ఎప్పటి నుంచి ఈ ట్యూషన్స్ చెప్తున్నావు?

డిగ్రీ స్టార్టింగ్ నుంచి చెప్పటం మొదలుపెట్టాను. అలాగే నాకు పిల్లలంటే ఇష్టం. వాళ్ళుంటే బలే ఫన్ గా ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు కదా.

(ఆరోజు మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. విహాన్, ఆర్య కి కాల్ చేస్తాడు)

హలో ఆర్య, రిజల్ట్ చూశావా?

చూశాను. ఈసారి కూడా రాలేదు. నీదేమైంది?

నాది కూడా పోయింది. ఎం అవ్వదు ఆర్య, నువ్వు పడే కష్టానికి తొందర్లోనే ఫలితం దొరుకుతుంది.

నేను, నీకు చెప్పాల్సింది, నువ్వు నాకు చెప్తున్నావ్ విహాన్.

(మూడు రోజుల తర్వాత, ఆర్య తిరిగి లైబ్రరీకి వచ్చాడు. గడ్డం కొద్దిగా పెరిగింది. కళ్లలో నిద్ర లేదు)

ఎక్కడికి వెళ్లావ్?

కొంచెం ఒంటరిగా ఉండాలని అనిపించింది.

మరి ఒక్క మెసేజ్ కూడా చేయలేదే?

(విహాన్ ఏమీ మాట్లాడకుండా అతని చేతిలో టీ కప్పు పెట్టాడు)

ఇక నుంచి ఇలా చేయొద్దు.

విహాన్, నీకెవరైనా క్రష్ ఉన్నారా?

చాలా పేర్లే ఉన్నాయి.

కానీ సీరియస్ గా ఎవరైనా ఉన్నారా?

ఇప్పటి వరకు ఏది సీరియస్ కాదు. మరి నువ్వు చెప్పు, ఆర్య.

చెప్పడానికి కొంచెం భయంగా ఉంది, విహాన్. కానీ నువ్వెలా అర్ధం చేసుకుంటావో నాకు అర్ధం కావట్లేదు.

చెప్పు ఆర్య. నేనెందుకు తప్పుగా అర్ధం చేసుకుంటాను.

తను, నేను డిగ్రీ, ఎం.ఏ ఒకేసారి కంప్లీట్ చేసాం. ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఇద్దరికీ టి.సి.ఎస్, చెన్నై లోనే జాబ్ వచ్చింది. ఒకే రూమ్ లో ఉండే వాళ్ళం.

అమ్మో ఆర్య, ఇది చాలా ఫాస్ట్ గా ఉన్నట్టుంది.

తర్వాత తెలిసింది తనకి ఆల్రెడీ ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉందని.

ఏంటి, నాకు అర్ధం కాలేదు ఆర్య?

నేను ఇష్టపడింది అరవింద్ ని.

(చాలా సేపు సైలెంట్ గా ఉంది. విహాన్ కి అర్ధం కాలేదు ఎం చెప్పాలో, అప్పుడు)

అందుకే, చెన్నై నుంచి వచ్చేసావా ఆర్య?

లేదు. కానీ అక్కడ ఉండటం కష్టమైంది.

(ఆ రాత్రి. టైం 1:26. విహాన్ కి నిద్ర పట్టట్లేదు. తన ఫోన్ ఓపెన్ చేశాడు. గ్యాలరీలో ఆర్య అనే ఫోల్డర్ కనిపించింది. టీ స్టాల్. ధీర్. లైబ్రరీలో పుస్తకం చదువుతున్న ఆర్య. విహాన్ ఒక్కసారిగా ఫోన్ క్లోజ్ చేశాడు. రెండో రోజు. ఉదయం 9:14. ఆర్య నుంచి మెసేజ్)

లైబ్రరీకి వస్తావా?

(విహాన్ చాలా సేపు ఆ మెసేజ్ వైపు చూస్తూ ఉన్నాడు. మరో మెసేజ్)

విహాన్?

(రిప్లై ఇవ్వలేదు. మధ్యాహ్నం 2:38. ఫోన్ మోగింది. ఆర్య కాలింగ్..కొన్ని సెకన్లు ఫోన్ వైపు చూసి, సైలెంట్ లో పెట్టేశాడు. రాత్రి 11:07. మళ్లీ కాల్. ఈసారి కూడా ఎత్తలేదు. నాలుగో రోజు. ఉదయం 6:12. విహాన్ చివరికి కాల్ చేశాడు. రెండో రింగ్ కి ఆర్య లిఫ్ట్ చేశాడు)

హలో.

పడుకోలేదా?

నువ్వు?

లేదు.

ఆర్య, నువ్వు నాకు ఎందుకు చెప్పావ్?

ఎందుకంటే..

(ఆర్య గొంతు చాలా ప్రశాంతంగా ఉంది)

నిన్ను కోల్పోవడం ఇంకా భయంగా అనిపించింది.

(విహాన్ ఒక్కసారిగా ఏమీ మాట్లాడలేకపోయాడు)

నువ్వు అనుకున్నట్టు నేను ధైర్యమైన మనిషిని కాదు, విహాన్.

అలా అనకు.

నిజమే. అరవింద్ కి చెప్పలేకపోయాను. కానీ నీకు చెప్పకుండా ఉంటే..

మళ్లీ ఒకసారి ఆలస్యమైపోతుందేమో అనిపించింది.

(విహాన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి)

నీకు తెలుసా ఆర్య..

ఏంటి?

ఈ నాలుగు రోజులు నాకు ఒకటే భయం వేసింది.

ఏంటి?

నిన్ను ఎలా చూడాలో కాదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని.

ఆర్య? నువ్వు ఇంకా ఉన్నావా?

ఉన్నాను.

అయితే ఏదైనా మాట్లాడు.

వెళ్ళను విహాన్.

( కళ్లల్లోని నీళ్లు తుడుచుకున్నాడు)

అదే మాట మళ్లీ మళ్లీ చెప్పకు, అలవాటు అయిపోతుంది.

అలవాటు అయితే?

అప్పుడు... నువ్వు మాట తప్పకూడదు.

(ఆరు నెలల తర్వాత, విహాన్ హాల్లో కూర్చుని ఫోన్ చూస్తున్నాడు. స్క్రీన్ మీద ఆర్య కాలింగ్)

ఎవరురా?

ఆర్య.

రోజుకి ఎన్ని సార్లు మాట్లాడుకుంటారు మీరు? ఉదయం ఫోన్.

(విహాన్ కాల్ ఎత్తి రెండు నిమిషాలు మాట్లాడి కట్ చేస్తాడు)

మధ్యాహ్నం లైబ్రరీ. సాయంత్రం టీ.

కాఫీ.

రాత్రి మళ్లీ ఫోన్.

మీ ఇద్దరూ ఫ్రెండ్స్ మాత్రమేనా?

(విహాన్ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూశాడు.)

అంటే?

అంటే... ఫ్రెండ్స్ మాత్రమేనా అని అడిగాను.

అవును. లేకపోతే? ఎందుకు అలా అడుగుతున్నావ్?

మొన్న ఆర్య కనిపించకుండా పోయిన మూడు రోజులు గుర్తున్నాయా?

(విహాన్ ముఖం మీద ఉన్న నవ్వు మెల్లగా మాయమైంది.)

నువ్వు సరిగ్గా తినలేదు. సరిగ్గా నిద్రపోలేదు.

ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు కదా.

అవుతారు. కానీ, నీ కళ్లల్లో భయం కనిపించింది.

(విహాన్ ఏమీ మాట్లాడలేదు)

ఫ్రెండ్ వెళ్లిపోతే అంత భయం ఉండదు.

మరి?

కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెంటనే రావు.

(ఆమె లేచి వంటగది వైపు నడిచింది. వెళ్లేముందు ఒక్కసారి వెనక్కి తిరిగి)

కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మన జీవితంలో ఉండాలని అనిపించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో.

(కొన్ని నెలలు తర్వాత, వాళ్లిద్దరూ విహాన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆర్య చేతిలో కెమెరా ఉంది. బయట చల్లగా గాలి వీస్తుంది. మబ్బులు కమ్ముకున్నాయి)

పద పైకెళదాం మంచి ఫొటోస్ తీసుకుందాం , విహాన్ .

సరే కానీ ఈ విషయం అమ్మకి తెలియకూడదు, అమ్మ వచ్చేలోపే కిందకి వచ్చేదాం ఆర్య.

సరే, నేను అమ్మ వచ్చేలోపు వెళ్ళిపోతానుగా, విహాన్.

(అలా ఇద్దరు పైకెళ్తారు. ఫొటోస్ తీసుకుంటారు )

విహాన్, ఈ మెమరీ కార్డు నీ దెగ్గరే ఉంచు. మళ్ళి వచ్చినప్పుడు నేను తీసుకుంటాను. నేను బయల్దేరతాను.

అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొన్చుగా, ఆర్య.

లేదు విహాన్, అమ్మ వచ్చేస్తుంది. నువ్వేగా చెప్పావ్.

మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకునేది?

కాల్ చేసి చెప్తా.

(ఆర్య వెళ్ళిపోతాడు. ఆ మెమరీ కార్డు, కార్డు రీడర్ లో పెట్టి కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఫొటోస్ ఓపెన్ చేస్తుంటాడు విహాన్. అప్పుడే అమ్మ ఇంటికి వస్తుంది. విహాన్ ఆ ఫోల్డర్ ని క్లోజ్ చేస్తాడు)

ఏం చేస్తున్నావ్ విహాన్?

ఏం లేదమ్మా, రిజల్ట్స్ అప్డేట్ అయ్యాయేమో అని చూస్తున్నాను.

వచ్చే దారిలో ఏదో ఆక్సిడెంట్ అయినట్టుంది. నీఫ్రెండ్ ఆర్య లాగ కనిపించాడు.

ఏంటి? సరిగ్గా చూసావా అమ్మ?

అంత పర్ఫెక్ట్ గా తెలీదు. కానీ తను ఇక్కడికి ఎందుకు వస్తాడు చెప్పు. తను కాదెమోలే.

(అని అమ్మ స్నానానికి వెళ్తుంది. విహాన్ ఒళ్ళంతా చెమటలు, భయమేస్తుంది. ఆర్య కి కాల్ చేస్తాడు, రింగ్ అవుతుంది కాని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. విహాన్ ఇంటి నుంచి బయటకి ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తూవుంటాడు. అమ్మ వచ్చే దారిలో నడుస్తున్నాడు. ఒక చోట రెండు బండ్లు, కొంతమంది జనాలు కనిపిస్తారు. విహాన్ పరిగెత్తుకుంటు వెళతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అది ఆర్య కాదు. విహాన్ ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ చేసింది ఆర్య)

హలో ఆర్య, ఎలా ఉన్నావ్?

ఇప్పుడేగా నీ దెగ్గర నుంచి వచ్చాను. బండి మీద ఉన్నాను అందుకే కాల్ ఎత్తలేదు. గాలి, ఉరుముల శబ్దం వస్తుంది కదా అందుకే వినపడలేదనుకుంటా. అయినా, నాకేం అవుతుంది?

(వర్షం మొదలవుతుంది. విహాన్ తడిసిపోతుంటాడు)

నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను ఆర్య. అది చాలా భయంకరంగా అనిపిస్తుంది.

ఎం మాట్లాడుతున్నావ్ విహాన్? ఏమైంది అసలు. నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. వర్షం లో తడుస్తున్నావా ఏంటి?

ఆర్య, నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా?

వెళ్ళను విహాన్.

(ఫోన్ కట్ అవుతుంది. విహాన్ ఇంటికి వెళ్తాడు. అమ్మ చూస్తుంది)

ఎక్కడికి వెళ్ళావ్ విహాన్? తడిచిపోయావేంటి? వర్షం లో ఎందుకు బయటకి వెళ్ళావు. వర్షం లో తడిస్తే నీకు ఫీవర్ వస్తుంది కదా.

అమ్మ... ఒకవేళ ఆర్యకి ఏదైనా అయి ఉంటే?

అంత భయమా?

అవును.

ఎందుకు?

(విహాన్ సమాధానం చెప్పలేదు. కొన్ని నెలలు తర్వాత, ఒక సాయంత్రం. లైబ్రరీ నుంచి ఇంటికి వస్తున్న ఆర్యకి అరవింద్ నుంచి కాల్ వచ్చింది.)

హలో, అరవింద్.

ఎక్కడున్నావ్?

లైబ్రరీ నుంచి ఇంటికి వెళ్తున్నాను.

నేను నీ ఇంటి దగ్గరే ఉన్నాను.

ఏంటి? చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావ్?

అరగంట అయింది. త్వరగా రా.

(ఆర్య ఇంటి ముందు బైక్ ఆపాడు. గేట్ దగ్గర అరవింద్ నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక కవర్ ఉంది.)

ఏంటి చాలా హ్యాపీ గా ఉన్నావ్?

కవర్ ఓపెన్ చేసి చూడు.

(ఆర్య కవర్ తీసుకుని నెమ్మదిగా తెరిచాడు.అరవింద్ వెడ్స్ సింధు. కొన్ని క్షణాలు, ఆర్య ఏమీ మాట్లాడలేదు.)

నువ్వు లేకుండా పెళ్లి జరగదు.

నేను ఎందుకు?

ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్.

(ఆర్య నవ్వుతాడు. కానీ ఏమీ మాట్లాడడు. ఆ రాత్రి. టైం 11:48. ఆర్య గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద వెడ్డింగ్ కార్డ్. పక్కనే హాల్ టికెట్. రెండింటి వైపు చాలా సేపు చూస్తూ ఉన్నాడు.)

రేపు ఇద్దరిలో కనీసం ఒకటి అయినా నా దగ్గర ఉండిపోతుందేమో.

(సెకండ్ మెయిన్స్ రిజల్ట్ రోజు. విహాన్ చేతులు కొంచెం వణుకుతున్నాయి. మొబైల్ స్క్రీన్ మీద తన రోల్ నెంబర్ కనిపించింది)

క్వాలిఫైడ్.

(కొన్ని క్షణాలు నమ్మలేకపోయాడు. అతని మనసులోకి వచ్చిన మొదటి వ్యక్తి, ఆర్య. వెంటనే కాల్ చేశాడు)

హలో ఆర్య! రిజల్ట్ చూశావా?

చూశాను, విహాన్.

ఏమైంది, ఆర్య?

ఈసారి కూడా రాలేదు, విహాన్.

(విహాన్ ముఖం మీదున్న ఆనందం ఒక్కసారిగా ఆగిపోయింది)

నీదేమైంది, విహాన్?

క్వాలిఫై అయ్యాను, ఆర్య.

కంగ్రాచులేషన్స్ విహాన్.

ఆర్య..

సరే, నాకు కొంచెం పని ఉంది, విహాన్. తర్వాత మాట్లాడదాం.

(కాల్ కట్ అయిపోయింది, విహాన్ చాలా సేపు ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆరోజు సాయంత్రం, ఆర్య తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. టేబుల్ మీద: అడ్మిట్ కార్డ్స్, పాత నోట్స్, టైమ్ టేబుల్స్, ఫైనల్ అట్టెంప్ట్ అని రాసిన ఒక పేపర్. ఆ పేపర్ ని చేతిలోకి తీసుకున్నాడు. నెమ్మదిగా చింపేశాడు. తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన స్టడీ షెడ్యూల్ ఫైల్ తెరిచాడు. కొన్ని క్షణాలు దానిని చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒక్కొక్క ఫైల్ డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. స్క్రీన్ ఖాళీ అయిపోయింది. తన జీవితంలో గత రెండు సంవత్సరాలు కూడా. మరుసటి రోజు. విహాన్ కాల్ చేశాడు)

ది నంబర్ యూ ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్.

(మళ్లీ చేశాడు. అదే వచ్చింది. రెండో రోజు. లైబ్రరీకి వెళ్లాడు)

అన్నా, ఆర్య రాలేదా?

రెండు రోజుల నుంచి కనిపించలేదు.

(ఇంటికి వెళ్లాడు. గేట్ దగ్గర ధీర్ పడుకుని ఉంది)

ధీర్..

(అది నెమ్మదిగా వచ్చి విహాన్ కాళ్ల దగ్గర కూర్చుంది. ఆర్య వాళ్ళ అమ్మ బయటికి వచ్చారు)

విహాన్, ఆర్య నీతో లేడా?

లేదాంటీ.

మొన్న ఉదయం బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి రాలేదు.

ఏంటి?

ఫోన్ కూడా ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడు.

(విహాన్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది)

ఏమన్నారు?

ఇదిగో. టేబుల్ మీద ఆర్య ఫోన్ ఉంది.

(ఆ రాత్రి, విహాన్ కి నిద్ర పట్టలేదు. మూడో రోజు. ఉదయం 5:30. విహాన్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్)

హలో?

విహాన్.

(అది ఆర్య గొంతు)

ఎక్కడున్నావ్ ఆర్య?

మరీనా బీచ్.

ఏంటి?

సూర్యోదయం బాగుంది.

ఆర్య, జోక్స్ వేయకు. మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా?

విహాన్..నువ్వు ఎప్పుడైనా, నీ జీవితంలో అన్నీ అయిపోయాయని అనిపించిందా?

నేను వస్తున్నాను. అక్కడే ఉండు.

వద్దు. నువ్వు ఒకటి ప్రామిస్ చేయి.

ఏంటి?

నన్ను చూసిన తర్వాత. నన్ను అసహ్యించుకోవద్దు.

(ఫోన్ కట్ అయిపోయింది. ఆరోజు ఉదయం 6:15కి, విహాన్ చెన్నై వెళ్లే మొదటి బస్సు ఎక్కాడు. ఉదయం 9:10, విహాన్ అక్కడకి చేరుకుంటాడు )

ఆర్య!

(ఆర్య వెనక్కి తిరుగుతాడు.)

ఆర్య ఏంటి ఇది? మూడురోజుల నుంచి అందరూ కంగారు పడుతున్నారు!

సారీ.

నీకు సారీ చెప్పే హక్కు లేదు ఇప్పుడు.

విహాన్. నేను నీకు ఒక విషయం చెప్పాలి.

చెప్పు.

అది 2022. కంగ్రాట్యులేషన్స్! యు హవ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ టి.సి.ఎస్. ఆ మెయిల్ ని నేను కనీసం పది సార్లు చదివాను. టెర్రస్ మీద నిలబడి చెన్నై గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా మూడు రోజుల్లో నా జీవితం మారిపోతుంది అని అనుకున్నాను. నేను అరవింద్ ఒకే దెగ్గర ఉన్నందుకు చాలా సంతోషించాను. తను ఆరోజు, బ్లాక్ టీ-షర్ట్, భుజానికి బ్యాగ్, ముఖం నిండా నవ్వు తో నా పక్కనే ఉన్నాడు. చెన్నై వెళ్లిన రోజు, మొదటిసారి సముద్రం వాసన, అంత పెద్ద నగరం, ఇంటికి ఇంత దూరం. అప్పుడు అరవింద్, రా, మన కొత్త జీవితం మొదలైంది అని అన్నాడు. ఆరోజు సాయంత్రం 6:20. టాక్సీ ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది. ఇదే మన కంపెనీ ప్రొవైడ్ చేసిన స్టే. అని అరవింద్ చెప్పి రెండు లగేజీలు కింద పెట్టాడు. నేను మాత్రం బిల్డింగ్ వైపు చూస్తున్నాను. నాలుగు అంతస్తులు. పాత అపార్ట్మెంట్. పక్కనే టీ షాప్. దూరంగా మెయిన్ రోడ్ ట్రాఫిక్ శబ్దం. ఏంటి? భయమేస్తుందా? అని అడిగాడు. లేదని అంటే. అబద్ధం. నీ మొహం చూస్తే తెలుస్తోంది అని అన్నాడు. ఇద్దరం మూడో అంతస్తుకి వెళ్లి, 407 అని ఉన్న తలుపు ముందు ఆగాం. అరవింద్ తాళం తీసి తలుపు తెరిచాడు. చిన్న హాల్. ఒక బాల్కనీ. రెండు బెడ్ రూమ్స్. కిచెన్. ఇక నుంచి ఇదే మన ఇల్లు అని అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్. ట్రైనింగ్. ప్రెజెంటేషన్స్. వీకెండ్స్ అయితే బీచ్ కో, సినిమా కో, మాల్ కో వెళ్లే వాళ్ళం. ఒకరోజు రాత్రి. కరెంట్ పోయింది. బాల్కనీలో ఇద్దరం కూర్చున్నాం. వర్షం పడుతోంది. అప్పుడు అరవింద్, నీకు తెలుసా ఆర్య? మనిషి జీవితంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఎంత దూరం వెళ్లినా, ఎంత మంది వచ్చినా, వాళ్ళని మాత్రం మర్చిపోలేం. అని. ఆరోజు రాత్రి 2:13. హాల్ లో లైట్ ఆన్ ఉంది.హాల్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ అరవింద్ లేడు. ఫోన్ తీసి చూసాను. అరవింద్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కాల్ చేసాను. నేను ఎక్కడున్నానో తెలుసా? మరీనా బీచ్. వస్తావా? అని అన్నాడు. నేనేమో, ఉదయం మాట్లాడుకుందాం. అని చెప్తే, అరవింద్ కాల్ కట్ చేశాడు. నేను మళ్ళి పడుకోడానికి ట్రై చేసాను. కానీ నిద్ర రావట్లేదు. పది నిమిషాలు. ఇరవై నిమిషాలు. ముప్పై నిమిషాలు. చివరికి లేచి టీ-షర్ట్ వేసుకుని బయటికి వచ్చాను. ఆటో ఎక్కి, మరీనా బీచ్ కి వెళ్ళాను. 2:57 అయ్యింది. దూరంగా సముద్రం శబ్దం వినిపిస్తోంది. మొత్తం బీచ్ దాదాపు ఖాళీగా ఉంది. అరవింద్ ఒంటరిగా ఇసుకలో కూర్చుని ఉన్నాడు. నువ్వు రానన్నావుగా అని అన్నాడు. నేను ఎం మాట్లాడకుండా పక్కన కూర్చున్నాను. సముద్రం వైపు చూస్తూ ఉన్నాం. అరవింద్ మొదలుపెట్టాడు. నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. ఎంత మంది వచ్చి వెళ్ళినా, అది మాత్రం అక్కడే ఉంటుంది. మనుషులు కూడా అలా ఉంటే బాగుండు. నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా అని అడిగాడు? నేను ఒక్కసారిగా తన వైపు తిరిగి చూసి లేదు అని అన్నాను. తనేమో, నాకు అనిపిస్తుంది, నేను ప్రేమలో పడితే చాలా దారుణంగా పడిపోతాను. వాళ్ళు లేకుండా ఉండలేనంతగా. అప్పుడు నేను అది ప్రేమ కాదు. భయం. వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అన్నాను. నా సాలరీతో నేను అమ్మకి వాచ్. నాన్నకి షూస్ కొన్నాను. ఆరోజు సాయంత్రం. అరవింద్ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చాడు. లోపల ఒక కెమెరా ఉంది. అది నాకోసమే అని అన్నాడు. నేను ఫోటోలు దిగను అంటే, అందుకే ఇచ్చాను అని అన్నాడు. లాజిక్ ఏంటి? అని అడిగితే, పది సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రోజుల్ని గుర్తు చేసుకోవాలి. నేను మర్చిపోనని అన్నాను. నువ్వు మర్చిపోవని నాకు తెలుసు. అదే ప్రాబ్లమ్ అని అన్నాడు. అలాగే పది సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తుంటావ్ అని అడిగాడు అరవింద్. తెలీదన్నాను. పెళ్లి? పిల్లలు? అన్ని ప్రశ్నలకి తెలీదని సమాధానం చెప్పాను. నువ్వు? అని అడిగితే. పెళ్లి. ఇద్దరు పిల్లలు. ఒక కుక్క. ప్రతి సంవత్సరం ట్రిప్స్ అని అన్నాడు. ఆరు నెలల తర్వాత. రాత్రి 10:42. నేను ల్యాప్టాప్ ముందు కూర్చునివున్నాను. అరవింద్ మాత్రం బాల్కనీలో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. తర్వాత నవ్వుతూ కాల్ కట్ చేశాడు. లోపలికి వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నవ్ అని అడిగాను. నేను ఇన్నేళ్ళుగా ప్రేమిస్తున్న అమ్మాయి. టైప్ చేస్తున్న నా చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అరవింద్ కొన్ని సెకన్లు నా వైపు చూశాడు. అంతేనా, నువ్వు ఫోటో చూడవా అని అన్నాడు. చూస్తానని అన్నాను. తన ఫోన్ నా చేతిలో పెట్టాడు. స్క్రీన్ వైపు చూసాను. తెల్లటి చుడిదార్. నవ్వుతున్న అమ్మాయి. తన గురించి ఏమీ అనిపించలేదు. కానీ, మొదటిసారి నా గుండెలో ఏదో బరువుగా అనిపించింది. బాగుంది. అని చెప్పి ఫోన్ తిరిగి ఇచ్చేసాను. ఆ రాత్రి. నాకు నిద్ర పట్టలేదు. తర్వాత రోజు సాయంత్రం. ఇద్దరం బైక్ మీద మరీనా బీచ్ కి వెళ్ళాం. ఏమైంది? ఈరోజు చాలా సైలెంట్ గా ఉన్నావ్ అని అడిగాడు అరవింద్. ఏం లేదు అని చెప్తే. అబద్ధం అని అన్నాడు. అలసిపోయాను అని అన్నాను. ఆరోజు రాత్రి, ల్యాప్టాప్ ఓపెన్ చేసి హెచ్.ఆర్ కి రెసిగ్నషన్ లెటర్ పంపించేసాను.

ఏమైంది ఇప్పుడు, ఆర్య?

మూడు రోజుల్లో నేను మొత్తం చెన్నై తిరిగాను విహాన్. మొదట దిగిన అపార్ట్మెంట్ ఇంకా అలాగే ఉంది. కింద టీ షాప్ మాత్రం మారిపోయింది. ఆఫీస్ బయట నిలబడి అరగంట చూసాను. అక్కడ ఎవరికీ నేను గుర్తు లేను. ఇది అరవింద్ వెడ్డింగ్ కార్డు, విహాన్

అయితే అరవింద్ కి నీ మనసులో ఉన్న విషయం చెప్పి భారాన్ని దించుకో ఆర్య.

నేను అతన్ని ప్రేమించాను, విహాన్. అందుకే అతని జీవితాన్ని కష్టపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు.

(విహాన్ ఏమీ మాట్లాడడు)

నేను ప్రయత్నించాను. చాలా ప్రయత్నించాను. ఇది పోతుందని అనుకున్నాను. పెళ్లి అయ్యాక పోతుందని అనుకున్నాను. కానీ..ఇప్పటికీ..మరీనా బీచ్ చూస్తే ముందుగా అతనే గుర్తొస్తాడు.

నాకు కొంచెం టైం కావాలి ఆర్య. కానీ..నేను ఎక్కడికీ వెళ్ళట్లేదు.

(తిరుపతి. ఆ రాత్రి. విహాన్ గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. టైం 1:47 చూపిస్తోంది. ఆర్య చెప్పింది మళ్లీ మళ్లీ తన చెవుల్లో వినిపిస్తోంది)

విహాన్.

(అని తలుపు దగ్గర నుంచి అమ్మ పిలిచింది)

ఇంకా పడుకోలేదా?

కొంచెం పని ఉంది అమ్మ.

ఆర్య దొరికాడా?

(కొన్ని క్షణాలు విహాన్ సమాధానం చెప్పలేదు)

దొరికాడు.

ఎక్కడ ఉన్నాడు?

చెన్నైలో.

చెన్నైలోనా? ఏం పని?

తెలీదు.

(టైం 3:12. అప్పటికీ నిద్ర రావట్లేదు. అతను తన ఫోన్ తీసుకున్నాడు. ఆర్య కాంటాక్ట్ ఓపెన్ చేశాడు. చాలా సేపు కాల్ బటన్ వైపు చూస్తూ ఉన్నాడు. చివరికి కాల్ చేయలేదు. తనకి భయమేస్తోంది. ఆర్య గురించి కాదు. తన గురించి. టైం 4. వర్షం మొదలైంది. విహాన్ కిటికీ దగ్గర నిలబడ్డాడు. అప్పుడే తనకి ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను ఆర్య. ఆరోజు వర్షంలో తడుస్తూ తను అన్న మాట)

అప్పుడు, ఆర్య ఒక్క మాట కూడా అడగలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని కాదు. ఎందుకు? అని కూడా కాదు.

తను చెప్పింది ఒక్కటే. వెళ్ళను విహాన్ అని.

(మొదటిసారి, విహాన్ కి ఆర్య మీద కోపం వచ్చింది)

ఎందుకు చెప్పలేదు? ఇంత బాధ ఒంటరిగా ఎందుకు భరించావ్? నన్ను ఎందుకు నమ్మలేదు?

(టైం 5:26. ఫోన్ తీసుకున్నాడు. ఈసారి ఆలోచించలేదు. కాల్ చేశాడు. రెండో రింగ్ కి ఆర్య లిఫ్ట్ చేశాడు)

హలో.

(అతని గొంతు చాలా అలసిపోయినట్టు ఉంది)

పడుకోలేదా, ఆర్య?

లేదు.

నేను కూడా.

ఆర్య, నాకు ఇంకా చాలా విషయాలు అర్థం కావట్లేదు.

పర్లేదు.

నాకు కొంచెం టైం పడుతుంది.

సరే.

కానీ, నేను మాట తప్పను.

(ఆర్య ఏమీ మాట్లాడలేదు)

విన్నావా?

థాంక్యూ.

ఏంటి?

ఏం లేదు.

నువ్వు నాకు థాంక్యూ చెప్పావా?

(కాల్ కట్ చేసాడు ఆర్య. విహాన్ తన ఫోన్ వైపు చూస్తూ ఉన్నాడు. మూడు నెలల తర్వాత. ఎప్పటిలాగే, లైబ్రరీ, నోట్స్ తో ఆర్య. కానీ ఒక విషయం మాత్రం మారిపోయింది. ప్రతి ఉదయం. వెళ్ళావా అని ఒక మెసేజ్ వస్తుంది. విహాన్ నుంచి. ప్రతి రాత్రి. తిన్నావా అని ఇంకో మెసేజ్. మొదట్లో ఆర్య కి అది వింతగా అనిపించేది. ఇప్పుడు ఆ మెసేజ్ రాకపోతే వింతగా అనిపిస్తోంది. ఒకరోజు సాయంత్రం. ఆర్య ఇంటికి వెళ్లాడు విహాన్. కరెంట్ పోయింది. ఇద్దరూ టెర్రస్ మీద కూర్చున్నారు)

ఆర్య, ఒక విషయం అడగనా?

అడుగు.

నువ్వు నన్ను ఎందుకు నమ్మావ్?

తెలీదు.

అది సమాధానం కాదు.

మరి నువ్వు ఎందుకు ఉండిపోయావ్?

అరవింద్ వెళ్లిపోయాడు. నేను కూడా ఒకరోజు వెళ్ళిపోవచ్చు.

తెలుసు.

అయితే?

(ఆర్య ఆకాశం వైపు చూస్తూ చాలా ప్రశాంతంగా అన్నాడు)

అందరూ వెళ్లిపోతారు విహాన్.

మరి?

ఈసారి వెళ్తారని తెలిసే ఎటాచ్ అయ్యాను.

నీకు భయం లేదా?

ఉంది.

మరి ఎందుకు?

కొంత మంది మన జీవితంలో ఉండే సమయం తక్కువైనా వాళ్లు ఉన్నంత సమయం విలువైనది.

నేను కూడా అలాంటి వాళ్లలో ఒకడినా?

నువ్వు వెళ్లిపోయిన తర్వాత కూడా నేను గుర్తుపెట్టుకునే వాళ్లలో ఒకడివి.

(ఆ రాత్రి. విహాన్ కి మళ్లీ నిద్ర పట్టలేదు. తన ఫోన్ ఓపెన్ చేశాడు. ఆర్యతో ఉన్న ఫోటోలు. లైబ్రరీ. టీ స్టాల్. ధీర్త. తనకి ఒక్కసారిగా ఒక విషయం అర్థమైంది. ఆర్య ప్రతి ఫోటోని ఎందుకు సేవ్ చేసుకుంటాడో. ఎందుకు ప్రతి జ్ఞాపకాన్ని పట్టుకుని ఉంచుకుంటాడో. ఎందుకంటే, అతను మనుషుల్ని కోల్పోవడానికి అలవాటు పడిపోయాడు. టైం 2:18)

ఒకరోజు నేను వెళ్ళిపోతే, ఆర్య మళ్లీ మరీనా బీచ్ కి వెళ్తాడా?

(ఆ ప్రశ్నకి వచ్చిన సమాధానం, తనకి అస్సలు నచ్చలేదు.టైం 2:19. అతను తన ఫోన్ తీసుకున్నాడు. ఆర్యకి మెసేజ్ చేశాడు)

నేను ఎక్కడికీ వెళ్ళను.

(ఒక్క నిమిషంలో రిప్లై వచ్చింది)

పడుకో విహాన్.

(ఒక నెల తర్వాత. ఉదయం 9:17. లైబ్రరీ. ఎస్ఎస్సి ఆఫిసిఅల్ వెబ్సైటు. విహాన్ చేతులు వణుకుతున్నాయి. సెలెక్టెడ్ కాండిడేట్స్- ఫైనల్ పోస్టింగ్ లిస్ట్. విహాన్ నెమ్మదిగా పిడిఎఫ్ ఓపెన్ చేశాడు)

కొన్ని సెకన్లు. తర్వాత, తన పేరు కనిపించింది. విహాన్ కుమార్, పోస్టింగ్: గువాహటి, అస్సాం. విహాన్ మొదటగా చేసిన పని ఏమిటంటే, గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేయడం. తిరుపతి టూ గువాహటి డిస్టెన్స్. 2,100 కిలోమీటర్స్. ఆ సాయంత్రం. ఆర్య ఇంటి టెర్రస్)

అస్సాంనా?

(అని ఆశ్చర్యపోయారు ఆర్య వాళ్ల అమ్మ)

చాలా దూరం కదా..

(ఆర్య మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు)

ఏమైంది, ఆర్య?

ఏం లేదు. ఎప్పుడు వెళ్లాలి?

మరో ఇరవై రోజుల్లో. అంతేనా?

(ఆ రాత్రి. ఆర్య నిద్రపోలేదు. చివరికి లేచి బయటికి వచ్చాడు. ధీర్ కూడా అతని వెంట వచ్చింది)

ఏమైంది?

(అని అడిగినట్టు అతని కాళ్ల దగ్గర కూర్చుంది)

తను వెళ్తున్నాడు.

(అన్నాడు ఆర్య. ధీర్ ఏమి అర్థం కానట్టుగా అతని వైపు చూసింది. ఆర్య చిన్నగా నవ్వుకున్నాడు. ఆఖరి రోజు. విహాన్ తన గదిలో బట్టలు సర్దుతున్నాడు. తలుపు తట్టిన శబ్దం వచ్చింది. ఆర్య)

లోపలికి రా ఆర్య.

(ఆర్య చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది)

ఏంటి?

తెరిచి చూడు.

(లోపల ఒక కెమెరా. అదే కెమెరా. అరవింద్ తనకి ఇచ్చినది. విహాన్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు)

ఇది నీకు చాలా ఇష్టం కదా.

ఇప్పుడు నీకు ఎక్కువ అవసరం.

ఎందుకు?

నువ్వు మర్చిపోతే మంచిది.

నువ్వు నిజంగా నన్ను వదిలేస్తున్నావా?

నిన్ను వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాను.

(వెళ్లే రోజు. రైల్వే స్టేషన్. అందరూ వచ్చారు. ఆర్య మాత్రం కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు)

ఆర్య, దగ్గరికి రా.

(ఆర్య నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు)

ఏమైనా చెప్పాలా, ఆర్య?

వెళ్ళాక మెసేజ్ చెయ్యి.

అంతేనా?

తిన్నావో లేదో కూడా చెప్పు.

ఇంకా?

చలిగా ఉంటుంది. జాగ్రత్త.

ఒక ప్రశ్న అడగనా?

అడుగు.

నేను ఆరోజు వర్షంలో అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం చెప్పలేదు.

ఏది?

నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను?

(రైలు హారన్ వినిపించింది)

వెళ్లిపోవద్దని అడిగే హక్కు నాకు లేదు.

(ఆ ఒక్క మాట, విహాన్ జీవితాంతం మర్చిపోలేడు. రైలు కదలడం మొదలైంది. విహాన్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆర్య మాత్రం ప్లాట్‌ఫారమ్ మీద. కొన్ని సంవత్సరాల క్రితం, మరో రైల్వే స్టేషన్ లో. మరో వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు, ఇంకో వ్యక్తి తన జీవితం నుంచి దూరంగా వెళ్తున్నాడు. కానీ ఈసారి, ఆర్యకి ఒక విషయం తెలుసు. ప్రతి వీడ్కోలు శాశ్వతం కాదు. అలా అని, ప్రతి తిరిగి రావడం కూడా ఖాయం కాదు. ఒక సంవత్సరం తర్వాత. గువాహటి. రాత్రి 11:43. వర్షం పడుతోంది. విహాన్ తన ప్రభుత్వ క్వార్టర్స్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. టేబుల్ మీద ఫైల్స్. ఒక చిన్న కెమెరా. వాళ్లు ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేదు. కొన్ని సంబంధాలు, దూరాన్ని పట్టించుకోవు. ఆ రాత్రి. విహాన్ ఫోన్ మోగింది. ఆర్య కాల్ చేస్తున్నాడు)

ఆర్య, ఈరోజు డేట్ తెలుసా?

తెలుసు.

అది...

అరవింద్ పెళ్లి రోజు.

ఇంకా గుర్తుందా?

కొన్ని విషయాలు మర్చిపోవడం కష్టం.

ఇంకా బాధగా ఉందా?

ఇంతక ముందులా కాదు.

అంటే?

కొన్ని జ్ఞాపకాలు నొప్పిని తగ్గించుకోవడం నేర్చుకుంటాయి.

ఆర్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఏంటి?

ట్రాన్స్‌ఫర్ కి అప్లై చేశాను. తిరుపతికి. ఒకవేళ నేను తిరిగి వస్తే, ఈసారి నువ్వు ఉండిపోతావా? ఆర్య? సమాధానం చెప్పు.

నేను ఎప్పుడూ వెళ్లలేదు విహాన్.

(ఆ మాట విన్న తర్వాత. విహాన్ కి ఎందుకో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే, అది నిజం. చెన్నై నుంచి. అరవింద్ నుంచి. జీవితం నుంచి. ఆర్య ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు. ఎప్పుడూ అక్కడే ఉండిపోయాడు. ఐదు సంవత్సరాల తర్వాత. తిరుపతి. సాయంత్రం 5:42. వర్షం పడబోతున్నట్టుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. అదే పాత టీ స్టాల్. కానీ, ఇప్పుడు అక్కడ కొత్త బోర్డు ఉంది)

ఇద్దరికీ టీనేనా?

ఒక టీ. ఒక కాఫీ.

ఇంకా మారలేదా మీరు

కొన్ని విషయాలు మారకపోవడమే మంచిది.

(ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం)

అయితే, మిస్టర్ డిప్యూటీ తహసిల్దార్ గారు.. ఇప్పుడు ఎలా ఉంది జీవితం?

ఉదయం ఫైల్స్. మధ్యాహ్నం మీటింగ్స్. సాయంత్రం కంప్లైంట్స్. రాత్రి నిద్ర.

అంటే, ప్రభుత్వ ఉద్యోగం కొట్టాక కూడా నువ్వు ఇంతే బోరింగ్ అన్నమాట.

అస్సాం నుంచి తిరిగి వచ్చాక కూడా నువ్వు ఇంతే ఎక్కువ మాట్లాడుతున్నావ్.

అది నా టాలెంట్.

(ఇద్దరూ నవ్వుతారు.)

నిజంగా చెప్పు ఆర్య. ఆరోజు ఎవరో వచ్చి, ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అవుతావు అని చెప్పి ఉంటే నమ్మేవాడివా?

లేదు.

మరి నేను గువాహటి నుంచి ట్రాన్స్‌ఫర్ తీసుకుని మళ్లీ తిరుపతి వస్తాను అంటే?

అది కూడా కాదు.

మరి ఏది నమ్మేవాడివి?

(ఆర్య కొద్దిసేపు తన చేతిలో ఉన్న టీ కప్పు వైపు చూస్తాడు)

నువ్వు ప్రతి రోజు కాల్ చేస్తావని.

(విహాన్ ఒక్కసారిగా ఆర్య వైపు చూస్తాడు)

నీకది ఎప్పటి నుంచి తెలుసు?

ఆరోజు వర్షంలో, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను? అని అడిగినప్పటి నుంచి.

(విహాన్ ఏమీ మాట్లాడడు)

అయితే నువ్వు ఎప్పుడూ అడగలేదు ఎందుకు?

ఎందుకంటే నాకు సమాధానం తెలుసు.

ఏంటి అది?

కొంత మంది మనుషులు మన జీవితంలోకి వచ్చేది, మనతో ఉండడానికి కాదు విహాన్.

మరి?

మనకి ఇల్లు అంటే ఏంటో గుర్తు చేయడానికి.

(వర్షం మొదలవుతుంది. టీ స్టాల్ టిన్ షీట్ మీద చినుకులు పడుతున్న శబ్దం వినిపిస్తుంది)

ఆర్య. ఇప్పుడు కూడా మరీనా బీచ్ గుర్తొస్తుందా?

కొన్నిసార్లు.

బాధగా ఉంటుందా?

లేదు.

ఎందుకు?

ఎందుకంటే, ఈసారి నేను ఒంటరిగా లేను.

(విహాన్ కళ్లల్లో చిన్నగా నీళ్లు తిరుగుతాయి)

నువ్వు ఈ మాటలు ఎక్కడ నేర్చుకుంటావో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

లైబ్రరీ.

అబద్ధం.

సరే. జీవితమే నేర్పించింది.

(ఇద్దరూ వర్షాన్ని చూస్తుంటారు)

ఆర్య.

ఏంటి?

మనిద్దరం అసలు ఏమిటి?

(వర్షం కొంచెం ఎక్కువ అవుతుంది. రోడ్డుమీద జనాలు పరుగులు పెడుతున్నారు)

ఐదు సంవత్సరాలైనా ఇంకా అదే ప్రశ్నా?

సమాధానం మారిందేమో అని.

లేదు.

అయితే చెప్పు.

పేర్లు పెట్టిన తర్వాత, కొన్ని సంబంధాలు చిన్నవైపోతాయి.

మరి మనది?

(ఆర్య తన టీ కప్పు ఖాళీ చేసి టేబుల్ మీద పెట్టాడు)

మనది... ఐదు సంవత్సరాల తర్వాత కూడా, ఒక టీ... ఒక కాఫీ ఆర్డర్ చేసే సంబంధం.

(వర్షం మరింత పెరుగుతుంది. కొన్ని ప్రేమలు ముగిసిపోతాయి. కొన్ని స్నేహాలు మారిపోతాయి. కానీ, కొంత మంది మనుషులు మాత్రం, మన జీవితంలో ఒక చోటు ఆక్రమించి, అక్కడి నుంచి ఎప్పటికీ వెళ్లిపోరు)

మరిన్ని కథలు

Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి
Ido prema katha
ఇదోప్రేమ కథ
- కొడాలి సీతారామా రావు
Premonmadam
ప్రేమోన్మాదం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nene
నేనే
- సింగనమల మస్తాన్ వలి
Achhiyamma
అచ్చియమ్మ
- అనిసా తబస్సుమ్ sk