బొంగరం - మండా సూర్యనారాయణ

Bongaram

సెలవులు ఇచ్చి నెలరోజులు అవుతోంది. స్నేహితులందరూ వాళ్ళ అమ్మమ్మ, నానమ్మల ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చేస్తున్నారు. పవన్ మాత్రం ఇంట్లోనే ఫోన్లో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ, సాయంత్రమైతే కంప్యూటర్ క్లాసులకు వెళ్తూ సెలవులు గడుపుతున్నాడు. ​పవన్ నాన్న పేరు సూర్య, అమ్మ పేరు స్రవంతి. పెళ్లయిన సంవత్సరానికే సొంత ఊరిని వదిలి పట్టణానికి వచ్చేశారు. పవన్ కి వాళ్ళ అమ్మమ్మ ఊరు పేరు కూడా తెలీదు. పవన్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య చనిపోయారు. ఉన్నది నానమ్మ, తాతయ్య మాత్రమే. వాళ్లు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వారం పదిరోజులు ఉండి వెళ్తుంటారు. ఈసారి ఎలాగైనా నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాలని పట్టుపట్టి కూర్చున్నాడు పవన్. కానీ సూర్యకి సెలవులు కుదిరితే తీసుకెళ్తానని చెప్పడంతో వాళ్ళ నాన్నకి ఎప్పుడు సెలవులు దొరుకుతాయా అని పవన్ ఎదురుచూస్తున్నాడు. ​సాయంత్రం అయ్యింది, సూర్య ఇంటికి వచ్చాడు. "స్రవంతి! లగేజ్ సర్దిపెట్టు. మేనేజర్ గారు పదిరోజులు సెలవులు ఇచ్చారు. పవన్! మనం రేపే తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్తున్నాం" అన్నాడు.

ఆ మాటలకు పవన్ కి రెక్కలు వచ్చినట్లు అయ్యింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. ఇంతలో తెల్లారింది. అసలు జరుగుతున్నది కలా లేక నిజమా అన్న అయోమయంలోనే తాతయ్య వాళ్ల ఊరు 'సింగవరం' చేరుకున్నాడు పవన్. ​అప్పటికే సాయంత్రం కావస్తోంది. సింగవరం మరీ పల్లెటూరు కాకపోయినా చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, ఇంటిముందు అరుగులు, ఉడుతలు, పశువులు... ఇవన్నీ చూస్తుంటే కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అయ్యింది పవన్ కి. వీటన్నిటినీ ఆస్వాదిస్తూనే తాతయ్య వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. కొడుకు, కోడలు, మనవడిని చూశాక రామయ్య, సీతమ్మలకి ప్రాణం లేచివచ్చినట్లయింది. కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకొని, అందరూ తిని పడుకున్నారు. ​ఉదయాన్నే లేచి రెడీ అయ్యి రామయ్యతో కలిసి ఊరు చూడడానికి వెళ్లాడు. పవన్ ని ఊరంతా తిప్పుతూ, కనిపించిన వారందరికీ "నా మనవడు" అంటూ గర్వంగా చెప్తున్నాడు రామయ్య. ఊరంతా తిరిగినా బాగా వయసు పైబడి తన తాతయ్య వయసున్న వారే కనిపిస్తున్నారు తప్ప పిల్లలెవరూ కనిపించలేదు పవన్ కి. రామయ్య వైపు చూస్తూ "తాతయ్యా! ఇక్కడ పిల్లలు ఎవరూ లేరా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. ​సమాధానంగా "ఒకప్పుడు ఈ ఊరిలో చాలామంది ఉండేవారు నాయనా! కానీ చదువుల కోసం, పనుల కోసం అందరూ వేరు వేరు ఊళ్లకు వెళ్లిపోయారు. వెళ్లిన కొత్తలో నెలకో రెండు నెలలకో వచ్చేవారు. ఆ తర్వాత ఊరికి రావడం మానేశారు. ఇదిగో నాలాగా సొంత ఊరు వదిలి ఉండలేక, పిల్లలకు దూరంగా ఉంటూ బతికేస్తున్నారు" అంటూ బాధగా చెప్పాడు రామయ్య. తాతయ్య మాటల్లోని బాధను గమనించాడు పవన్. ​ఊరిలో తన వయసు వాళ్లు లేరు, ఫోన్ కి సిగ్నల్ రావడం లేదు, కనీసం చూడడానికి టీవీ కూడా లేదు. మొదటిసారి తాతయ్య వాళ్ల ఊరు వచ్చిన ఆనందం ఎంతోసేపు ఉండలేదు పవన్ కి. చేసేది లేక ఒంటరిగా అరుగు మీద కూర్చున్నాడు.

సీతమ్మ, స్రవంతిలు వంటపనుల్లో ఉన్నారు, రామయ్య, సూర్యలు బయటికి వెళ్లారు. పవన్ ఒక్కడే కూర్చోవడం చూసిన సీతమ్మ "బాబు పవన్! నాకు కొంచెం సాయం చేస్తావా? ఈ అటక మీద ఊరగాయ జాడీ ఉంది, కొంచెం తీసి ఇస్తావా?" అని అడిగింది. ​సరేనని పవన్ ఊరగాయ జాడీ కోసం అటక ఎక్కాడు. అటక చాలా పెద్దగా ఉంది. అక్కడ ఊరగాయ జాడీతో పాటు కొన్ని డబ్బాలు ఉన్నాయి, వాటి వెనుక మట్టికుండలు ఉన్నాయి. పవన్ చూపు మాత్రం వీటన్నిటికీ వెనుక ఉన్న ఒక పాత పెట్టె మీద పడింది. నానమ్మకు ఊరగాయ జాడీ అందిస్తూ "నానమ్మా! ఇక్కడ ఒక పెట్టె ఉంది, అందులో ఏముంది?" అని అడిగాడు పవన్. ​"ఆ పెట్టె మీ నాన్నది బాబూ! ఎప్పటినుంచో అక్కడే ఉంది" అని చెప్పింది సీతమ్మ. "నానమ్మా! నేను ఆ పెట్టెలో ఏముందో ఒకసారి చూడొచ్చా?" అని మొహమాటంగా అడిగాడు పవన్. "సరే బాబూ" అని సీతమ్మ అనడంతో ఆ పెట్టె కిందకి దించి, అందులో ఏముందా అని ఆత్రుతగా తెరిచాడు పవన్. ​ఆ పెట్టె తెరిచాక అందులో పాత పుస్తకాలు, వాళ్ల నాన్న చిన్నప్పటి ఫోటోలు కనిపించాయి. వాటితో పాటు కోన్ లాంటి పదునైన చెక్కతో చేసిన ఒక వస్తువు కనిపించింది. పవన్ దృష్టి మొత్తం దానిమీదే ఉంది. పవన్ దానిని బయటికి తీసి "అసలు ఈ చెక్క వస్తువు ఏమై ఉంటుంది?" అని తనలో తానే ఆలోచించుకుంటున్నాడు. ​ఇంతలో సూర్య బయటి నుండి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే పెట్టెను ఎదురుగా పెట్టుకుని ఆలోచిస్తున్న పవన్ ని చూశాడు. "ఏమిట్రా పవన్! అంత ఆలోచిస్తున్నావ్?" అని అడిగాడు సూర్య. "ఏమీ లేదు నాన్నా! మీ చిన్నప్పటి పెట్టె దొరికితే తెరిచి చూశా. అందులో ఈ చెక్క వస్తువు కనిపించింది, ఏంటా అని ఆలోచిస్తున్నా" అంటూ చేతిలో ఉన్న ఆ వస్తువుని చూపించాడు పవన్. ​"ఓ అదా! అది వస్తువు కాదు, దాన్ని 'బొంగరం' అంటారు. మేము చిన్నప్పుడు దానితో ఆడుకునేవాళ్లం" అని చెప్పాడు సూర్య. "ఆడుకునే బొమ్మనా! దీనితో ఎలా ఆడేవారు?" అని ఆశ్చర్యంగా అడిగాడు పవన్. ​

అప్పుడు సూర్య ఒక తాడుని తెచ్చి దానికి చుట్టి, నేలపై తిప్పి చూపించాడు. అది చూసి పవన్ "హై! భలే తిరుగుతోంది" అంటూ ఆ తిరుగుతున్న బొంగరాన్ని చూసి ఎంతో ఆత్రుతగా "నాన్నా! మీరు చిన్నప్పుడు దీనితోనే ఆడుకునేవారా?" అని అడిగాడు. ​సూర్య నవ్వుతూ "హా! మాకు ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు టీవీలు, ఫోన్లు ఉండేవి కావు. మేము ఇలాంటి ఆటలే ఆడుకునేవాళ్లం" అని చెప్పాడు. "అవునా! ఇంకా ఎలాంటి ఆటలు ఆడేవారు?" అని ఆత్రుతగా అడిగాడు పవన్. ​పవన్ మాటలకు, తిరిగే బొంగరాన్ని చూస్తూ సూర్య తన చిన్నతనంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ... "మేము చిన్నప్పుడు బొంగరం తిప్పడంతో పాటు, పెంకులను వరసగా పేర్చి బంతితో కొడుతూ 'ఏడు పెంకుల ఆట' ఆడేవాళ్లం. ఒక టీమ్ పెంకులను బంతితో కొడితే, వాళ్లు తిరిగి ఆ పెంకులను పేర్చకుండా ఇంకో టీమ్ బంతిని విసురుతూ అడ్డుకునేది. అప్పట్లో మాకు అది చాలా సాహసంగా అనిపించేది. ​అలాగే మీరు ఇప్పుడు సోడా సీసాల్లో చూసే గోళీలతో మేము ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ గోళీలు ఉంటే వాళ్లే గొప్ప! అలాగే కూల్ డ్రింక్ సీసా మూతలకు కన్నం పెట్టి, తాడు కట్టి తిప్పుకునేవాళ్లం. మీరు తొక్కే సైకిల్ టైరును ఒక కర్రతో తోలుకుంటూ వెళ్లేవాళ్లం, వాటిని ఎవరు ఎక్కువ సేపు నడిపిస్తారని పోటీపడేవాళ్లం. ​తాటికాయలు తినేశాక వాటికి ఒక కర్రపుల్లను గుచ్చి బండిలా చేసి పోటీపడి నడిపేవాళ్లం. అప్పట్లో మాకు అవి ఇచ్చే ఆనందం ఇప్పుడు ఏ కార్ నడిపినా రాదు. ఇకపోతే 'గిల్లీ దండా (గూటిబిళ్ల)' ఆటలో నన్ను మించినవాడు మా ఊరిలోనే లేడు తెలుసా! నన్ను టీమ్‌లోకి తీసుకోవడానికి ఒకటే గొడవపడేవారు. ​మేము ప్రతిరోజూ స్కూల్ నుండి రాగానే ఏదో ఒక ఆట ఆడి చీకటి పడ్డాక ఇంటికి వచ్చేవాళ్లం. ఇక సెలవు రోజుల్లో అయితే తిండి కూడా తినేవాళ్లం కాదు, రోజంతా ఆటలు ఆడుతూనే ఉండేవాళ్లం.

వేసవి సెలవులు వస్తే తోటలోకి వెళ్లి మామిడికాయలు కోసి ఉప్పు, కారం వేసి తినేవాళ్లం. బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టేవాళ్లం. సాయంత్రమైతే పచ్చని పొలాల మధ్యలో, చల్లని గాలిలో కొబ్బరిమట్టలతో చేసిన బ్యాట్లతో క్రికెట్ ఆడేవాళ్లం. ఆ రోజులే వేరు" అంటూ చిన్న నవ్వుతో చెప్పాడు సూర్య. ​చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తున్న సూర్య మాటల్లోని తెలియని ఆనందాన్ని గమనించాడు పవన్. "మీరు ఆడిన ఆటలు భలే ఉన్నాయి నాన్నా!" అంటూ ఉత్సాహంగా అన్నాడు పవన్. ​ఇంతలో స్రవంతి అక్కడికి వచ్చింది. సూర్య చేతిలో ఉన్న బొంగరం చూసి "అబ్బా! బొంగరం చూసి ఎన్నాళ్లయ్యిందో!" అంది. ​అది విన్న పవన్ "అమ్మా! నీకు బొంగరం తెలుసా? నువ్వు కూడా చిన్నప్పుడు బొంగరంతో ఆడేదానివా?" అని ఆత్రుతగా అడిగాడు. ​"హా! నాకు తెలియకపోవడం ఏంటి? నేను చిన్నప్పుడు చేత్తోనే తిప్పేదాన్ని!" అంటూ అక్కడ తిరుగుతున్న బొంగరాన్ని ఒక్క క్షణంలో నేల మీద నుండి చేతిలోకి తీసుకుంది స్రవంతి. అది చూసి పవన్ ఆశ్చర్యపోయాడు. ​

పవన్ చప్పట్లు కొడుతూ "అమ్మా! ఇంతసేపూ నాన్నగారు తన చిన్నప్పుడు ఆడే ఆటలన్నీ చెప్పారు తెలుసా! నువ్వు కూడా ఇలాంటి ఆటలు ఆడేదానివా?" అని ఉత్సాహంగా అడిగాడు. ​స్రవంతికి ఒక్కసారిగా కళ్లముందు బాల్యం కదలాడింది. "నేనా! చాలా ఆటలు ఆడేదాన్ని" అంటూ తను ఆడిన ఆటలను చెప్పసాగింది. "మేము చిన్నప్పుడు 'అష్టచెమ్మ' ఎక్కువగా ఆడేవాళ్లం. ఆ రోజుల్లో ప్రతి ఇంటి అరుగు మీద అష్టచెమ్మ గడులు గీసి ఉండేవి. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఆడేవారు. అలాగే చింతపిక్కల ఆట, దాగుడుమూతలు, తాడాట (స్కిప్పింగ్) ఎక్కువగా ఆడేవాళ్లం. పొలంలో మట్టిని తెచ్చి వాటితో రోకలి, పొయ్యి, వంట సామాన్లు తయారు చేసి ఆడుకునేవాళ్లం. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసేవాళ్లం. ఎంతసేపు ఆడినా మాకు విసుగు పుట్టేదే కాదు తెలుసా!" అని చెప్పింది స్రవంతి. ​"అమ్మా! మీరు ఇన్ని రకాల ఆటలు ఆడేవారా! నాకు కూడా కొన్ని ఆటలు నేర్పిస్తారా?" అని అడిగాడు పవన్. ​అందరూ మాట్లాడుకుంటుండగా సీతమ్మ వేడివేడిగా పిండివంటలు చేసి తెచ్చింది.

వాటిని అందరూ పంచుకుని తింటుండగా... రామయ్య తాటికాయల గెలని భుజాన వేసుకుని, చేతి సంచిలో కొన్ని మామిడిపండ్లను పట్టుకుని ఇంటికి వచ్చాడు. ​తండ్రి భుజాన ఉన్న తాటికాయల గెలను చూసిన సూర్య "పవన్! నేను చెప్పా కదా తాటికాయతో బండ్లు చేసి ఆడేవాళ్లమని, అవి వీటితోనే చేసేవాళ్లం. నీకోసం నేను తర్వాత తాటికాయ బండి చేసి ఇస్తాను" అని చెప్పాడు. ​ఆ మాటలు విన్న రామయ్య "ఏమిటి! తాటికాయ బండి చేసి ఇస్తావా? ఈ కాలం పిల్లలు వీటితో ఆడుకుంటారా?" అని నవ్వుతూ అన్నాడు. "లేదు తాతయ్యా, నేను ఆడుకుంటాను! అమ్మానాన్నలు వాళ్ల చిన్నతనంలో ఆడిన ఆటల గురించి చెప్పారు. నేను తప్పకుండా తాటికాయ బండితో ఆడుకుంటాను" అన్నాడు పవన్. ​"అవునా! చాలా సంతోషం బాబూ! నువ్వు ఆడతానన్నావు కాబట్టి నేను కూడా నీకోసం కొన్ని బొమ్మలు తయారు చేస్తాను" అన్నాడు రామయ్య. "నిజంగానా తాతయ్యా! మీకు బొమ్మలు చేయడం వచ్చా? మీరు కూడా చిన్నతనంలో ఆటలు ఆడేవారా?" అని అడిగాడు పవన్. ​రామయ్య మేడమీదకి వెళ్లి కొబ్బరిమట్టను తెచ్చి, కొబ్బరిరేకులతో వాచ్, పాము బొమ్మలను చేశాడు. పవన్ కి కూడా వాటిని చేయడం నేర్పించాడు. అలాగే సూర్య ఆ కొబ్బరికొమ్మతో తాటికాయ బండిని తయారుచేశాడు. స్రవంతి అష్టచెమ్మ గడులు గీసి, చింతపిక్కలను రుద్ది సిద్ధం చేసింది. ​పవన్ తాతయ్య చేసిన కొబ్బరిరేకుల వాచ్ పెట్టుకుని, సూర్య చేసిన తాటికాయ బండితో ఆడుకున్నాడు. తర్వాత అందరూ భోజనం చేసి కలిసి అష్టచెమ్మ ఆడారు.

సింగవరంలో ఉన్న ఆ పది రోజులు ప్రతి రోజూ ఒక పండగలా అనిపించింది. పది రోజులు పది నిమిషాల్లా అయిపోయాయి. సూర్య, స్రవంతి, పవన్‌లు తిరిగి ఊరికి ప్రయాణమయ్యారు. ప్రతి సంవత్సరం సెలవులకు వస్తానని పవన్ తాతయ్య, నానమ్మలకి మాట ఇచ్చాడు. ఊరు వదిలి వెళ్లబుద్ధి కాలేదు. ఈ సంవత్సరం సెలవులు పవన్ కి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ​సెలవులు పూర్తయ్యాయి. పవన్ స్కూల్ కి వెళ్లాడు. పవన్ క్లాస్ టీచర్ "సెలవులు ఎలా గడిపారు?" అని ఒక్కొక్కరినీ అడుగుతోంది. కొందరు తాము వెళ్లిన ట్రిప్పుల గురించి, ఇంకొందరు తాము నేర్చుకున్న కంప్యూటర్, డాన్స్, మ్యూజిక్ క్లాసుల గురించి చెప్పారు. పవన్ మాత్రం తాను సెలవుల్లో ఆడిన నాటి ఆటల గురించి చెప్పాడు. తాతయ్య ఇంటి నుండి తనవెంట తెచ్చుకున్న బొంగారాన్ని తిప్పి అందరికీ చూపించాడు. ​పవన్ తాను ఆడిన ఆటల గురించి చెప్తున్నంత సేపూ క్లాస్ టీచర్ కూడా తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, తాను ఆడిన కొన్ని ఆటల గురించి పిల్లలకు చెప్పసాగింది. ఇవన్నీ క్లాస్ బయట నుండి వింటున్న ప్రిన్సిపాల్ కి కూడా తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. వెంటనే క్లాస్ లోపలికి వెళ్లి... ​"పిల్లలూ! మన పవన్ సెలవుల్లో ఆడిన ఆటలన్నీ నేను కూడా చిన్నప్పుడు ఆడినవే. అసలు ఆటలు ఆడని పిల్లలు ఉంటారా? ఇప్పుడైతే ఫోన్లు, టీవీలు వచ్చాక పిల్లలు ఆటలాడడమే మానేశారు. పైగా మేము కూడా చదువు పేరుతో మీకు ఆటలను దూరం చేస్తున్నాం.

తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్లాక ట్యూషన్ల పేరుతో మీ నుంచి ఆటలను దూరం చేస్తున్నారు. మీరు కూడా ఖాళీ దొరికితే ఫోన్లలో మునిగిపోతున్నారు. ఈ ఫోన్ల మహిమ వల్ల ఎన్నో ఆటలు మరుగున పడిపోయాయి. ​ఇందాక పవన్ వాళ్ల అమ్మనాన్నలు వాళ్లు ఆడిన ఆటల గురించి చెప్పారు అని చెప్పాడు కదా! వాళ్లు చిన్నతనంలో ఎన్నో ఆటలు ఆడారు కాబట్టి పవన్ కి చెప్పగలిగారు. అదే మిమ్మల్ని మీ తర్వాత తరాలు మీ చిన్నతనం గురించి అడిగితే... అందులో ఈ ఫోన్, టీవీ, కంప్యూటర్లు తప్ప ఇంకేమైనా గుర్తుకొస్తాయా? ​ఒకప్పుడు చంటి పిల్లలకు చందమామని చూపించి లేదా 'బూచోడు పట్టుకుపోతాడు' అని చెప్పి అన్నం పెట్టేవారు. ఇప్పుడు ఫోన్ చేతికి ఇచ్చి తినిపిస్తున్నారు. పిల్లలన్నాక బాగా ఆడాలి, బాగా చదవాలి, అల్లరి చేయాలి. ఎందుకంటే బాల్యంలో ఉన్న స్వేచ్ఛ జీవితంలో మరెక్కడా దొరకదు. ఇప్పుడు పిల్లలు ఆటలు ఆడకపోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. ​అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై మీకు వారానికి ఒకరోజు రెండు పీరియడ్లు ఆటలకు ప్రత్యేకంగా కేటాయిస్తాను. మీ కోసం మన స్కూల్ గ్రౌండ్ బాగు చేయిస్తాను, ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేస్తాను" అని చెప్పాడు ప్రిన్సిపాల్. ​క్లాస్ మొత్తం ఒకటే చప్పట్లతో హోరెత్తిపోయింది.

మరిన్ని కథలు

Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి
Ido prema katha
ఇదోప్రేమ కథ
- కొడాలి సీతారామా రావు
Premonmadam
ప్రేమోన్మాదం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nene
నేనే
- సింగనమల మస్తాన్ వలి