సింహపురి రాజు సింహబలుడు మహా కోపిష్టి. తన రాజ్యంలో రాజోద్యోగులను నిత్యం నిందిస్తూ '' ఆ పని సరిగా చేయలేదు..ఆ పని బాగా చేయలేదు..నీకు అసలు పని చేత కాదు..నేర్చుకో..`` అంటూ తిడుతుండేవాడు.
రాజ ఉద్యోగులు ఎంత కష్టపడినా పని సరిగా లేదని కోపం ప్రదర్శించేవాడు.
అ:తపురంలో తన సింహాసనం మొదలుకొని నిద్రించే మంచం పై దిండు, దుప్పటి సరిగా లేదని చిందులు వేసేవాడు.
సింహబలుడి చాదస్తానికి రాజ ఉద్యోగులు చింతించేవారు.
ఓ సారి వర్షం బాగా పడి దోమలు అధికమై విజృంభించాయి. రాజు జ్వరం బారిన పడి మంచం పట్టాడు. వెంటనే ఆరోగ్య శాఖా మంత్రిని పిలిచి '' ఇది నీ తప్పే..దోమలను నివారించాలన్న జ్ఞానం కూడా లేని నీకు మంత్రి పదవి దండగ``!అని అరిచి పదవి నుంచి తప్పించాడు.
'' ప్రభూ! దోమల నివారణ మందులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు.. ఇక నేనేం చేయగలను? ఇందులో నా తప్పేమీ లేదు..`` అని సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందక రాజు వైద్య శాఖా మంత్రిని తొలగించాడు.
ఉద్యోగుల సంక్షేమం ఏ మ్రాతం పట్టని సింహబలుడికి మరోసారి ఊహించని దెబ్బ ఎదురైంది.
'' మాకు వేతనాలు పెంచలేదు.. కుటుంబం గడవడం కష్టం అవుతోంది..`` అని రాజ ఉద్యోగులు రాజ భవనం ఎదుట నిరసన తెలపడంతో సింహబలుడికి కోపం చిర్రెత్తుకొచ్చింది. '' నా కష్టం తిని బతికే మీరు నాపైనే దండయాత్ర చేస్తారా? మిమ్మల్ని ఏమి చేస్తానో చూడండి..!`` అని కోపంతో అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాడు.
ఒక్క సారిగా అంత మందిని తొలగించడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రత పెరిగి దోమలతో జ్వరాలు వ్యాపించాయి. ప్రజలు వైద్యం అందక అల్లాడారు.
ఇదేమీ పట్టించుకోని సింహబలుడు ఓ సారి పక్కరాజ్యాధిపతి తనపై దండయాత్రకు బయలుదేరాడని తెలిసి సైనికాధిపతిని పిలిచి తన ఖడ్గాన్ని యుద్ధానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు.
సైనికాధికారి కత్తి, డాలును, గుర్రాన్ని సిద్ధం చేశాడు. . తిండి లేక అనారోగ్యంతో బక్కచిక్కిన గుర్రంపై ఎక్కి దుమ్ము పట్టిన కత్తిని తీసి శత్రుసైన్యంపైకి దూసుకెళ్లాడు. అయితే కత్తికి వున్న దుమ్ము ముక్కుకు రావడంతో తుమ్ములు వచ్చాయి. అపశకునం ఎదురైందని భావించి కత్తి కింద పడేసి బలహీనంతో తప్పటడుగులు వేస్తున్న గుర్రంపై నుంచి కింద పడ్డాడు సింహబలుడు. ఇది మంచి సమయం కాదు..కనీసం కత్తిని కూడా సిద్ధం చేయలేని అసమర్థుడు సైనికాధిపతి`` అని నిందించి ఆగ్రహంతో అతడిని వెంటనే తొలగించాడు.
ఇక పోరాటానికి కనీస సైన్యం కూడా లేక దిక్కుతోచక నిస్సహాయంగా కూర్చున్నాడు సింహబలుడు.
ముందు చూపులేని అసమర్థరాజు తన కోపంతో అందరినీ దూరం చేసుకుని తన ప్రమాదాన్ని తనే కొని తెచ్చుకున్నాడు సింహబలుడు.
అప్పటికే ముందుకు దూసుకొచ్చిన శత్రు సైన్యం సింహబలుడిని చుట్టుముట్టి బందించి చెరసాలలో వేయించాడు.
ఇప్పుడు చెరసాలలో ఏకాకిగా మిగిలిన సింహబలుడు ''కోపంతో అందరినీ దూరం చేసుకుని బందీగా మిగిలాను`` అని లోలోన కుమిలిపోయాడు సింహబలుడు.

