రైల్వే స్టేషన్ అంతా జనంతో కీటకిటలాడుతోంది. స్టేషన్ లో కొందరు రైలు కోసం ఆతృత తో వేచిచూడ్డం, వీడ్కోలు చెప్పేవారి ఆత్మీయులు సాగనంపే దృశ్యాలు , అప్పుడే వచ్చిన రైలు నుంచి దిగే వాళ్ళ ఆదుర్దా , మరో వైపు అమ్మే వాళ్ళ హడావిడి , వీటన్నిటి మధ్యలో రైల్వే అనౌన్స్మెంట్ ల తో కోలాహలంగా ఉంది. నేను ఇంత సందడి చూసి చాలా రోజులయ్యింది . అస్సలు అంతా ఒక పండుగ వాతావరణంలా తోచింది. అంతలో నా దృష్టి అక్కడ బుక్ షాప్ లో ఉన్న శ్రీ శ్రీ కవితల పుస్తకం పై పడింది. ఈ పుస్తకాలు చదవడం అలవాటుచేసింది మా బాబాయి. ఎప్పుడో చదివాను కానీ మరొక్కసారి ఆ పుస్తకం రైలులో
చదువుదామనిపించి కొన్నాను.
ఎక్కబోయే రైలు పట్టాల మీద వస్తుంటే దాన్ని చూసి నేను తెలియని భావోద్వేగానికి లోనయ్యాను. కంపార్ట్మెంట్ లో ఎక్కిన క్షణం నుంచి నాకు ఎన్నో మధురానుభూతుల్ని గుర్తు చేసింది ఈ గోదావరి ఎక్స్ప్రెస్. లోయర్ బర్త్ లో కిటికీ పక్కన సర్దుకొని కూర్చోగానే పక్క కంపార్టుమెంటు లో ఎవరో పిల్లాడు పైకి ఎక్కుతానని మొండి చేయడం వినిపించింది. నాకు ఒక్కసారిగా నా చిన్ననాటి సంఘటన గుర్తుకు వచ్చింది.
ఒకసారి బాబాయి పనిమీద హైదరాబాదుకు వస్తే నేను ఒక్కడినే బాబాయితో రాజమండ్రి సెలవులకు బయిలుదేరడం , బాబాయి వద్దని వారించినా మిడిల్ బర్త్ లో పడుకుంటానని మొండి చేయడం, అర్ధరాత్రి వేళ మిడిల్ బెర్త్ నుంచి కింద పడటం , బాబాయి తదుపరి స్టేషన్లో నాకు ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడం, అన్ని నా ముందు కదిలాయి. నా కంటి కింద దాని తాలూకు గుర్తు ఇప్పటికీ ఉంది. అప్రయత్నంగానే దాన్ని తడిమి చూసుకుంటూ గతం లోకి జారుకున్నాను .
ఎవరైనా ప్రియమైన వ్యక్తి శాశ్వతంగా దూరమైనప్పుడే... మనుషుల మధ్య బంధాల అసలు విలువ ఏమిటో కల్మషాలూ కడిగేసిన కఱకు సత్యంలా గుండె లోతుల్లోoచి అర్థమవుతుంది.
చిన్న చిన్న మనస్పర్థలు ఎంత వ్యర్థమో మరణమే కళ్లముందు నిలబెట్టి చూపినప్పుడు , మనసు విపరీతంగా బరువెక్కిపోతుంది.
మా బాబాయి ఏడాది క్రితం పోయినప్పటి నుంచి నా వేదన ఇది.
అసలు నాకు మా నాన్నతో కంటే మా
బాబాయి తోనే చనువు ఎక్కువ.
నేను గత పదిహేడేళ్ల నుంచి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డా, బాబాయి తో తరచుగా మాట్లాడేవాడిని . కానీ గత కొన్నేళ్లుగా బాబాయితో ముక్తసరిగానే మాట్లాడటం. దానికి కారణం తను రెండు మూడు సార్లు వయసు మీద పడ్డ అమ్మానాన్నలకు ఆసరాగా ఉండడానికి నన్ను స్వదేశానికి తిరిగి రమ్మనడo.
నేను చివరిసారిగా బాబాయిని కలిసింది అమ్మ పోయినప్పుడే. ఈ మూడేళ్లలో బాబాయి ఆరోగ్యం క్షీణిస్తోందని తెలుసు ఎన్నోసార్లు వచ్చి కలుద్దామనుకున్న, కానీ పని ఒత్తిడితో తెలియని హడావిడి చక్రంలో ఇరుక్కుపోయి రాలేకపోయాను. అవి చెప్పేంత పెద్ద పనులు కావు, అలా అని వదిలేసేంత చిన్న పనులు కావు.
యవ్వనంలో ఎగిరి వెళ్లిపోయాను కానీ జుట్టు నెరిసినప్పటి నుంచి మాతృభూమి పై మెల్లగా మనసు లాగుతోంది . నా పిల్లలు యుక్త వయస్సులో ఉండటం తో ఇటు రాలేక అక్కడ ఉండలేక త్రిశంకు స్వర్గంలో ఊగుతున్నట్టు అనిపిస్తుంటుది.
నా జుట్టు నెరిసినా నేను యువకుడి లా కనపడడానికి కారణం బాబాయే. తను అలవరిచిన క్రమ శిక్షణ , ఇంకా నేర్పించిన యోగా వంటి వాటివాల్లే .
మనసు ఇక్కడికి లాగుతున్నా లౌకిక బంధాలకు ముడిపడి అక్కడే ఉండిపోయాను. కానీ, గత ఆరు నెలలుగా స్వప్నంలో బాబాయి పదే పదే గుర్తుకురాసాగాడు , నా మనసు లోని అపరాధ భావనను సద్దుమణoచడానికి అన్ని పనులు పక్కన పెట్టి తెగించి రాజమండ్రి లో ఉన్న పిన్ని వద్దకు బయలుదేరాను.
మూడేళ్ల తర్వాత మాతృభూమిపై అడుగు పెట్టాను , పిన్నికి నా మొహం ఎలా చూపించాలి? పిన్ని ఏ పరిస్థితిలో ఉందో? ఇన్ని రోజుల తర్వాత నా రాకను ఎలా స్వాగతిస్తుందో ? ఏo మాట్లాడాలి ? పిన్నికి ఏమి చెప్పి నేను ఓదార్చగలను? విమాన ప్రయాణం లో నా ఆలోచనలు వీటి చుట్టే తిరిగాయి.
బాబాయి పోయి ఏడాది గడిచినా పిన్నితో రెండు సార్లే మాట్లాడటం జరిగింది. బాబాయ్ తో ఉన్న అనుబంధం, సంబంధం అన్నీ తలచుకుంటే నా బాధ వర్ణనాతీతం.
నేను హైదరాబాద్ లో పెరిగినా, సెలవులు అంటే రాజమండ్రిలో ఉన్న బాబాయి వాళ్ళింటికి వెళ్ళాల్సిందే. అమ్మమ్మ , తాతయ్య వాళ్ళ ఇల్లు రాజమండ్రిలో ఉండటం దానికి కారణం . మేము ప్రతి వేసవి సెలవులకు అక్కడికి వెళ్లడం ఆనవాయితీ . బాబాయి పిల్లలతో భలే సరదాగా కలసిపోయే మనిషి. ప్రతి ఏడాది సెలవులకు బాబాయిని ఎప్పుడు కలుస్తామా ? అని ఆత్రుతతో ఎదురుచూసేవాడిని. అలాంటి నేను పెరుగుతున్న కొద్దీ రాజమండ్రి వెళ్లడం తగ్గిపోయింది.
అమ్మ పోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు అమ్మేశాను. నాకు ఏ బంధువుల దగ్గరికీ వెళ్లాలనిపించలేదు. అందుకే హైదరాబాదులో హోటల్ రూమ్ తీసుకుని, వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పకుండా మరుసటి రోజే గోదావరి ఎక్స్ప్రెస్ రైలు లో సెకండ్ ఏ . సి. లో టికెట్ బుక్ చేసుకున్నా. పిన్ని రాజమండ్రి లోనే నివసిస్తున్నట్లు ఖరారు చేసుకొని మరీ బయలుదేరాను. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే అందరికీ అదొక రైలు మాత్రమే కానీ నాకు మా బాబాయిని కలవడాన్ని సులువు చేసిన వారధి. ఇప్పుడు విమాన వెసులుబాటు ఉన్నా రైలులో ప్రయాణించి నా చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరువేసు కుందామని!!
మొదటిసారి నేను బాబాయిని చూసింది మా పిన్ని పెళ్లిలో. పిన్ని అంటే మా అమ్మకు చెల్లి . బాబాయిని పెళ్ళికోదుకుగా పట్టబట్టలలో, ఉంగరాల జుట్టుతో , చిన్న మీసాల వెనుక దాగి ఉన్న చిరునవ్వుతో చూసిన నాకు ఒక హీరో లాగా తను ముద్ర పడిపోయాడు .
అమ్మా నాన్నల ఆంక్షల నడుమ, నా మనసులోని చిన్న చిన్న కోరికలను అర్థం చేసుకుని, బాబాయి నాకిచ్చిన మద్దతు ఒక గొప్ప అనుబంధానికి పునాది వేసింది.
ఇక పిన్ని పెళ్లి తర్వాత బాబాయ్ నాతో చిన్నపిల్లా డిలా కలిసిపోవడం, ఆటలాడించడం, బైక్ మీద తిప్పడం అన్ని మరపురానివే. ఇక రాజమండ్రికి వెళ్తున్నా అన్న ఊహే నన్ను స్థిమితంగా నిలువనీయట్లేదు . ఎందుకంటే బాబాయి రాజమండ్రి లో నన్ను తిప్పని ప్రదేశాలు లేవు. రాత్రి పడుకోడానికి మొండి చేసినా నిద్రపుచ్చడానికి వీధులన్నీ బైక్ మీద ఎన్నోమార్లు రయ్ రుయ్ మని తిప్పాడో !!!! బాబాయితో బంధం ఎటువంటిదో రాజమండ్రి తో కూడా అటువంటిదే.
ఎందరో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న సెంట్రల్ జైలులో మా బాబాయి పనిచేసేవారు. అంత మంది కఠినాత్ముల మధ్య ఉన్నా బాబాయి చాలా సున్నిత మనస్కుడే !
ఇక రాజమండ్రి లో ఒక్కో ప్రదేశం తో నా చిన్ననాటి స్మృతులు అన్ని ఒక్కొక్కటిగా మెదిలాయి .
పైన ఆకాశo లో మబ్బులు చడీ చప్పుడు లేకుండా కదులుతుoటే ,
కింద జలజల గోదావరి పరవళ్ళు తొక్కుతూ పారాడుతుంటే,
మధ్యలో నేను అలా బాబాయి రాజదూత్ బైకు మీద ముందు కూర్చొని ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద వెళ్తుంటే
ఆహా !
ఆ అనుభవం నన్ను ఇంకో లోకంలోకి తీసుకెళ్ళేదనే చెప్పొచ్చు . ఆస్ట్రేలియాలో ఎన్నో వంతెనలు మీద వెళ్లినా ఈ అనుభూతి మరల రాలేదు. బాబాయి తో ఈ అనుభూతి ఒక గాఢ బంధానికి ఉన్న జ్ఞాపకం.
తెల్లటి మల్లె మొగ్గలు కుప్పలు తెప్పలుగా ఉండే కడియపులంకమార్కెట్ మల్లెపూల పరిమళాల గుబాళింపు ఇప్పటికీ మరుపురానిదే . దూరం నుంచి మంచు ముత్యాలు కప్పిన ప్రాంతంలా మెరిసిపోయేది .
సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం లో దాగి ఉన్న పాతకాలపు ఇంజనీరింగ్ నైపుణ్యాలు , తాజా జున్ను ,ఇంకా నోరూరించే కోవా ఇవన్నీ నన్ను ఒక్కసారిగా రాజమండ్రికి తీసుకువెళ్ళాయి.
మరోసారి నన్ను తన ఆఫీసు జీప్ ముందు భాగం మీద కూర్చోపెట్టి తిప్పినప్పుడు విజయ యాత్రలో అంబారి సవారి లాగా అనిపించింది . ఇది నా జీవితం లోనే అత్యంత అద్భుతమైన జ్ఞాపకం .
నా ఊహలో నేనుండగా ఎవరిదో గొంతు వినిపించి ఈ లోకంలోకి వచ్చాను. నా కంపార్ట్మెంట్ లోకి ఒక ముసలాయన రావడం గమనించాను. వయసు డెబ్బై ఐదు ఏళ్ళు పైనే ఉంటాయి. తెల్లటి జుట్టు. ముఖంపై ముడతలు ఆయన జీవితానుభవాలను తెలియజేస్తున్నాయి. కళ్ళల్లో అమాయకత్వం , ఒక రకమైన కుతూహలం కనపడుతూవుంది. పాతకాలపు చేనేత తెల్ల ధోవతి, లాల్చీ చొక్కా ధరించి ఉన్నాడు.
ముసలాయన కూర్చోగానే : నా పేరు రాఘవయ్య బాబు. నీ పేరు ? ఎక్కడి దాకా ? అని అడిగాడు
చాలా ఏళ్లు విదేశాల్లో ఉండటం వల్ల కావచ్చు, నాకు ఇప్పుడు కొత్తవారితో మాట్లాడాలనే ఆసక్తి కానీ, సంభాషణలు మొదలుపెట్టే ఓపిక కానీ అస్సలు లేదు. ఇందాక తనను ఎక్కించడానికి వచ్చిన వ్యక్తి వైజాగ్ యాసలో మాట్లాడినట్టు గుర్తుకు వచ్చి , మొదట్లోనే తుంచేస్తే మేలని ముక్తసరిగా
“ నా పేరు ప్రశాంత్ , రాజమండ్రి దాకా అని సమాధానమిచ్చాను “.
రాఘవయ్య: “ అవునా! బాబు, నేను కూడా రాజమండ్రి దాకానే వెళ్తున్నా. నా భార్య క్రితం సంవత్సరమే పోయింది. మాకు పిల్లలేరు. నేను రాజమండ్రిలోనే ఒక చిన్న అనాథ ఆశ్రమం చూసుకుంటున్నాను, అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు . వారందరికీ కొత్త జీవితం ప్రసాదించాలంటే చాలా మొత్తం కావాలి. అందుకే హైదరాబాద్ లో నా కున్న కొద్ది ఆస్తుల్ని అమ్మేసాను. అలాగే కొంత విరాళాలు సేకరించాను. ఇక నా శేష జీవితం అక్కడే బాబు ! ? ఏ ఇంతకీ మీరు ఉద్యోగ పని మీద వెళ్తున్నారా బాబు, లేక సొంత పనా? హైదరాబాద్ లో ఎక్కడ ? “
నాకు ఆసక్తి ఉందో లేదో కూడా పట్టించుకోకుండా తన పురాణం మొత్తం వెలిబుచ్చాడు.
అనాథ ఆశ్రమం అనే మాట వినగానే నా మనసులో ఒక్కసారిగా అనుమానం మొదలైంది. ఫోన్ స్క్రీన్ చూస్తున్నా మనసులో "ఓహో... ఇదా అసలు సంగతి! అనాథ ఆశ్రమం పేరు చెప్పి మెల్లగా విరాళాలు అడగడానికి రూట్ మ్యాప్ వేస్తున్నాడన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. రైళ్లలో పరిచయం పెంచుకుని సెంటిమెంట్ డైలాగులతో జేబులు ఖాళీ చేస్తారు .
కొంచెం చికాకు వేసింది .
నేను నా ఫోన్ లో ఏదో టైప్ చేస్తూ, తల ఎత్తకుండానే “మా బాబాయి వాళ్ళింటికి వెళ్తున్నా”, యధాలపంగా “ఆస్ట్రేలియా నుండి వచ్చాను “అని జవాబిచ్చను . “అయినా నాకు ఇలాంటి ట్రస్టులు, ఆశ్రమాల మీద పెద్దగా నమ్మకం లేదండీ”.
రాఘవయ్య: (ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని పట్టించు కొ కుండా), ఆసక్తిగా “అబ్బో! ఆస్ట్రేలియా నుంచా! చాలా దూరం కదా. భార్య పిల్లలు కూడా వచ్చారా బాబు?”
నా మనసులో నేను " ఈ రాఘవయ్యకు పరోక్షంగా నాకు ఆసక్తి లేదని తెలిపినా నన్ను వదలట్లేదు. నా కుటుంబ వివరాలు అన్నీ కనుక్కుని, ఆస్ట్రేలియా అనగానే ఇంకా పెద్ద మొత్తంలో విరాళం అడగాలని ప్లాన్ చేస్తున్నాడు కాబోలు. వీళ్ళకి ఇదే పనేమో " అని అనుకుంటూ, ఇక ఇతనికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు అని నిర్ణయించుకుని
" లేదండి రాలేదు , ఏదో ముఖ్యమైన ఆఫీసు మెయిల్ పంపాలి” అని అనేసి ఫోను, శ్రీ శ్రీ కవితల పుస్తకం కూడా పక్కన పెట్టి ఏదో పని ఉన్నట్టు ట్యాబ్ తెరిచాను .
నా మనసులోని విముఖతను, అనుమానాన్ని రాఘవయ్య గమనించాడు. ఆయన ముఖం ఒక్కసారిగా చిన్నబోయి , ఒక చిన్న నిట్టూర్పు విడిచి “ ఆ... సరే బాబు. చేసుకో “అని అన్నాడు “నేను ఊరికే కాలక్షేపానికి అడిగాను ఏమనుకోకు, నీ పని నువ్వు చూసుకో” , అని తన దగ్గరున్న డైరీ తీసి ఏదో రాయడం మొదలుపెట్టాడు.
నా మనసులో మాత్రం " ఏదో ఉద్దేశం లేకపోతే అంతలా సోది ఎందుకు చెప్తారులే!" అని అనుకుంటూ విసుగ్గా ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని కాసేపు స్క్రీన్ మరి కాసేపు కిటికీ లోంచి బయిటకు చూస్తూ ఉండిపోయాను ,
మరోవైపు చూద్దామంటే రాఘవయ్య ఎక్కడ నన్ను పట్టకుంటాడో అనే భయo తో, కానీ తను నన్నే తదేకంగా చూస్తుండడం నేను గమనించాను.
మధ్యలో మళ్ళీ ఒక్కసారి నన్ను “కాఫీ తాగుతావా బాబు?’ అని అడిగాడు. నేను వద్దండీ అని వారించినా కాఫీ తీసుకుని ఇచ్చి , డబ్బులు కూడా తీసుకోలేదు.
రైలు గమ్యస్థానం చేరుకునేలోపు రాఘవయ్య నాతో మాట్లాడడానికి రెండుమూడు సార్లు ప్రయత్నించినా, నేను ఆదిలోనే త్రుoచి వేసాను.
సమయం చూసకుంటే రాజముండ్రి ఇంకో అరగంటలో చేరుతామని తెలిసింది .
“హమ్మయ్య! ఇక రాఘవయ్య భాధ ఉండదు “అని మనసులో అనుకుంటుండగానే
ఆకస్మికంగా రాఘవయ్యకు ఛాతీ నొప్పి మొదలయ్యి శ్వాస ఆడటం కష్టమై చూస్తుండగానే పడిపోయాడు.
జనం గుమిగూడారు. గుండెపోటుతో రైలులోనే, నిశ్శబ్దంగా కన్నుమూశాడని అక్కడే ఉన్న ఒక డాక్టర్ నిర్ధారించాడు. టీటీఈ అతని బ్యాగ్
వెతకమని చెప్పగా డైరీ లో రాసి ఉన్న అడ్రసు, ఫోన్ నెంబర్ ఇచ్చి కుతూహలంతో చివరగా రాసి పెట్టిన పేజీ తెరిచాను. అక్కడ మా బాబాయి పేరుతో ఉత్తరం రాసి ఉండటం చూసి కొంత ఆశ్చర్యంతో చదవటం మొదలు పెట్టాను.
ప్రియమైన సత్యం !
ఈరోజు నా రైలు ప్రయాణం మొదలైనప్పటి నుండి నా గుండెల్లో ఒకటే అలజడి, ఎంతో సంతోషంగా కూడా ఉంది .
ఇన్నాళ్లకు ఇలా అనుకోకుండా నా కళ్లముందే, నా ఎదురు సీట్లోనే ప్రశాంత్ ను చూసి నాకు కలిగిన ఆనందానికి అవధులు లేవు.
మనం సహోద్యగులు అన్నమాటే కానీ, మన జీవితాలు ఎంతగా పెనవేసుకుపోయాయో! నీవు నీ కుటుంబసభ్యుల గురించి చెప్పినప్పుడల్లా, వాళ్ళ ఫోటోలు చూపించినప్పుడల్లా నాకు నా సొంత కుటుంబాల కలిగిన ఆనందమే నిదర్శనం .
నీవు ఎన్నో సార్లు నాకు ప్రశాంత్ ఫోటో చూపించడంతో , చూడగానే గుర్తుపట్టాను. నీ నోటి నుండి ఎప్పుడు ప్రశాంత్ ప్రస్తావన వచ్చినా, ప్రతి సారి నీ కళ్ళలో మెరుపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీవు నాతో చాలా సార్లు "మా ప్రశాంత్ తో ఆడుకున్నట్లు నేను మా సొంత పిల్లలతో కూడా అడుకోలేదు " అని చెప్పావు .
ఎన్నిసార్లు ప్రశాంత్ జ్ఞాపకాలన్నీ నాతో నెమరు వేసుకున్నావో ! తన గురించి ఎంతలా మాట్లాడా వంటే నాక్కూడా తెలియకుండా తనతో ఒక బంధం ఏర్పడిపోయింది. నీతో పాటే నేను కూడా ప్రశాంత్ వస్తాడని అతృతతో ఎదురుచూసాను. తనని కలవాలని,మాట్లాడాలనీ ఎప్పుడెప్పుడా అని ఉండేది. ఇప్పుడు నీ పేరు చెప్పి పరిచయం చేసుకోవాలని నేను ఎంతో తపనపడ్డాను. కానీ ప్రశాంత్ నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.
ప్రయాణం సాగుతున్నంత సేపూ... ప్రశాంత్ ఫోన్ చూసుకుంటూనో, కిటికీ వైపు ఆలోచనగా చూస్తూనో ఉండిపోయాడు .
ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ముందు పరిచయం లేక నా బిడియం కూడా నన్ను ఆపేసింది. ఒకే దగ్గర కూర్చున్నా తనతో రెండు ముక్కలు మాట్లాడలేకపోయాననే బాధ నన్ను వేధిస్తోంది. అందుకే నేరుగా చెప్పలేని నా మనసులోని భావాలను నీతో పంచుకుంటున్నా .
ఇట్లు
నీ ప్రియ స్నేహితుడు రాఘవయ్య .
ఆ లేఖను చదువుతుండగానే నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. గుండెల్లో ఏదో శూన్యం ఆవహించింది. కళ్ల నుండి నీళ్లు తెలియకుండానే ధారగా కారాయి , చేతిలోని లేఖపై పడి ఆ అక్షరాలు తడిసేంతగా . చల్లబడిపోయిన రాఘవయ్య వైపు చూస్తూ ! "పాపం నాతో మాట్లాడడానికి ఎంత తపనపడ్డాడో ? అసలు బాబాయ్ ఇంకో రూపంలో వచ్చి నన్ను కలవడానికి ఇచ్చిన అవకాశాన్ని అనవసరపు అనుమానపు బీజంతో చేజార్చుకున్నా."
నేనే గనుక ఒక్క చిన్న చిరునవ్వు నవ్వి ఉంటే... ఈరోజు ముగింపు వేరేలా ఉండేది కదా!" వెంటనే ఏదో స్ఫురించిన వాడివలె టి.టి. తో : " ఇతను నాకు బాగా తెలిసిన వాడే " అని చెప్పి, నేనే అన్ని విషయాలు చూసుకుంటాను అని బాధ్యత తీసుకున్నాను. తన డైరీ లో ఉన్న అనాథ ఆశ్రమము నెంబర్ కు ఫోన్ చేసి విషయము తెలిపాను. అలాగే ఆ డైరీ లో ఉన్న చెక్ కూడా దగ్గరుండి అందజేయాలని నిశ్చయించుకున్నా . రాజమండ్రి చేరగానే ఆశ్రమo వాళ్ళు రావడం , ఎవరూ లేని తనకు నేను దగ్గరుండి అన్ని ముగించి వీడ్కోలు పలకడం నాకు కొంత సంతృప్తి నిచ్చింది.. ఆశ్రమం వాళ్లకు తన చెక్కు తో పాటు నా విరాళం కూడా కొంత అందించాను.
నా ప్రయాణం, బాబాయి అంతక్రియలకు రాలేదనే అపరాధ భావంతో మొదలయ్యి , ఇలా రాఘవయ్య చివరి ప్రయాణాపు సారధిగా ముగిసింది . అలాగే నా మలి జీవితానికి ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించింది.
రాఘవయ్య ఆశ్రమాన్ని వీలు చిక్కినప్పుడల్లా సందర్శించి నా వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నాను.
బాబాయి చివరి ప్రయాణంలో పాల్గొనకపోయినా, ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడైన రాఘవయ్యను దగ్గరుండి సాగనంపడం నా మనోవేదనను కొద్దిగా శాంతింపచేసింది.
మనిషి జీవితం ఎంత తాత్కాలికమో ! మన చుట్టూ ఉన్నవారిని, అపరిచితులైనా, పలకరించేవారితో ఆప్యాయంగా మాట్లాడటం , వారిని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ రైలు ప్రయాణం నాకు బోధిoచింది.
కొన్ని ప్రయాణాలు మజిలీ చేరేలోపు మన గమ్యాన్నే మార్చేస్తాయి. బహుశా నా ప్రయాణం రాఘవయ్యకు, తద్వారా మా బాబయికి మళ్ళీ వీడ్కోలు చెప్పడానికేనేమో అనుకుంటూ పిన్ని ఇంటి వైపు అడుగులు వేసాను.

