ప్రశ్న - isun finn

Prasna

బెంచ్ మీద నల్లటి డైరీ తెరిచి ఉంది.
పక్కనే నీలి రంగు కలం.
కిటికీ అద్దం మీద వర్షపు చినుకులు జారుతున్నాయి.
గదిలో లైట్ వెలుగుతోంది.
అయినా అపర్ణ కూర్చున్న చోట మాత్రం ఏదో చీకటి కమ్ముకున్నట్టుంది.
ఆమె డైరీలోని ఖాళీ పేజీనే చూస్తోంది.
రాయడానికి ఏమీ లేక కాదు.
చాలా ఉంది.
కానీ...
దేనితో మొదలుపెట్టాలో తెలియడం లేదు.
కలం పేజీని తాకింది.
ఒక చిన్న గీత.
అక్కడే ఆగిపోయింది.
అపర్ణ వెనక్కి వాలింది.
“నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను?”
ఆ ప్రశ్న చాలా రోజులుగా ఆమె మనసులో తిరుగుతోంది.
దాని వెంట మరో ప్రశ్న.
“నేను చేస్తున్నది సరైనదేనా?”
మరోటి.
“నేను ఇంతకంటే బాగా చేయగలనా?”
చివరికి—
“లేక... నేను అనుకున్నంత సామర్థ్యం నాకు లేదా?”
ఆమె పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది.
తనకే తన ప్రశ్నలు భరించలేనట్టుగా.
చిన్నప్పటి నుంచి అపర్ణకు ప్రశ్నలంటే ఇష్టం.
ఎందుకు?
ఎలా?
ఇలా ఎందుకు జరుగుతుంది?
అలా చేస్తే ఏమవుతుంది?
ప్రశ్న అడిగితే సమాధానం వెతికేది.
కానీ కొంతకాలంగా...
ప్రశ్నలు బయటివాళ్లను కాదు, తననే వెంటాడుతున్నాయి.
అక్కడి నుంచే సమస్య మొదలైంది.
ఫోన్ మోగింది.
స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే తీసుకుంది.
“హలో అక్క, ఎక్కడున్నావ్?”
“రూమ్‌లోనే ఉన్నాను యతిన్. ఏమైంది?”
“నువ్వు జాబ్ మానేస్తున్నావంట... నిజమేనా?”
అపర్ణ కాసేపు మౌనంగా ఉంది.
“అవును.”
“ఎందుకు?”
“ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్లిపోతున్నాను.”
“అది కాదు. జాబ్ ఎందుకు మానేస్తున్నావు?”
“అలా అనిపించింది.”
“మొన్నటిదాకా ఆ జాబ్ గురించి బాగానే చెప్పావుగా?”
“అవును... కానీ...”
“కానీ?”
అపర్ణ కిటికీ వైపు చూసింది.
“నేను చేస్తున్న పనికి వస్తున్న జీతం... నా పొజిషన్... వాటికి నేను అంత అర్హురాలిని కాదేమో అనిపిస్తోంది.”
అటువైపు నిశ్శబ్దం.
“అక్క...”
“హ్మ్.”
“ఎవరైనా జీతం ఎక్కువ వస్తుందని జాబ్ మానేస్తారా?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“నాకు సంతోషంగా అనిపించలేదు.”
“అసలు ఏమైంది?”
“ఏమీ లేదు యతిన్.”
“నిజంగా ఏమీ లేదా?”
“...ఉంటే చెప్తాను.”
“ఎప్పుడు?”
“తెలియదు.”
ఈసారి యతిన్ ఏమీ అడగలేదు.
“సరే.”
కొద్దిసేపటి తర్వాత మెల్లగా అన్నాడు—
“ఎప్పుడైనా చెప్పాలనిపిస్తే ఫోన్ చేయి.”
“హ్మ్.”
“అక్క?”
“ఏంటి?”
“నువ్వు ఒంటరిగా లేవు.”
అపర్ణ కళ్ళు మూసుకుంది.
“తెలుసు యతిన్.”
“నేను రానా నీ దగ్గరికి?”
“లేదు. వద్దు.”
“మాట్లాడుకుందాం.”
“నీకు ఆఫీస్ ఉంది కదా.”
“అది రేపు కూడా ఉంటుంది.”
అపర్ణ కొద్దిసేపు మౌనంగా ఉంది.
“వీకెండ్‌కి ఇంటికి రా. అప్పుడు మాట్లాడుకుందాం.”
“అంతేనా?”
“అంతే.”
“ఇంకేం లేదా?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“నువ్వు తిన్నావా?”
“అది ఎందుకు?”
“ల్యాప్‌టాప్ ముందేసుకుని పని చేస్తూ టైం ఎంతైందో కూడా తెలియదు నీకు. ఎప్పుడు తింటున్నావో, ఎప్పుడు నిద్రపోతున్నావో కూడా తెలియదు.”
“తిన్నాను అక్క.”
“నిజమా?”
“నిజం. ఫ్రెండ్స్‌తో బయట ఉన్నాను.”
“అదే కదా...”
“ఏంటి?”
“ఏమీ కాదు.”
“కానీ ఈరోజు బిల్ ఒక్కడే కట్టాలి.”
“నీ టర్నా?”
“అవును. నా జేబు ఖాళీ అయిపోయింది.”
అపర్ణకి చిన్నగా నవ్వొచ్చింది.
“అందుకే వీళ్లతో అంటున్నాను. డబ్బులు ఖర్చు చేయకుండా అన్ని ఐటమ్స్ తెచ్చి రూమ్‌లోనే వండిపెడతానని.”
“నువ్వు బాగా వండుతావ్ యతిన్.”
“ఉండు అక్క. స్పీకర్‌లో పెడతా. మళ్లీ చెప్పు.”
కొద్దిసేపటికి ఫోన్‌లో మరికొన్ని గొంతులు వినిపించాయి.
“యతిన్ నిజంగా బాగా వంట చేస్తాడు,” అపర్ణ అంది. “స్పెషల్‌గా చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తాడు.”
అటువైపు నవ్వులు వినిపించాయి.
“థాంక్యూ అక్క!”
“మోస్ట్ వెల్‌కమ్.”
కొద్దిసేపటి తర్వాత యతిన్ మళ్లీ మాట్లాడాడు.
“మరి ఎలా వెళ్తున్నావు ఇంటికి?”
“క్యాబ్ బుక్ చేశాను. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను.”
“సరే. జాగ్రత్తగా వెళ్లు.”
“హ్మ్.”
“అక్క?”
“ఏంటి?”
“ఏదైనా చెప్పాలనిపిస్తే... నాతో మొదలుపెట్టు.”
కాల్ కట్ అయింది.
ఫోన్ పక్కన పెట్టేసరికి ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి.
తమ్ముడికి చెప్పాలనుకున్న నిజమైన విషయం...
అతనితో కూడా చెప్పలేకపోయింది.
మరుసటి రోజు రాత్రికి అపర్ణ ఇంటికి చేరుకుంది.
గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే అమ్మ బయటకు వచ్చింది.
“వచ్చావా?”
అపర్ణ బ్యాగ్ కింద పెట్టి అమ్మను గట్టిగా హత్తుకుంది.
“లవ్ యు అమ్మ.”
అమ్మ నవ్వింది.
“ఏమైంది?”
“ఏమీ లేదమ్మా. ఊరికే.”
అమ్మ ఆమె ముఖాన్ని చూసింది.
“నీ కళ్ళు ఉబ్బినట్టున్నాయే.”
“నిద్ర సరిగ్గా పోలేదు.”
“ఉద్యోగం వల్లా?”
“హ్మ్.”
అమ్మ మరేం అడగలేదు.
“లోపలికి రా. తినేద్దువు.”
ఆ ఒక్క మాటలోనే అమ్మ అడగాల్సిన వంద ప్రశ్నలు దాగున్నాయి.
హాల్‌లో నాన్న పేపర్ చదువుతున్నాడు.
“అపర్ణా!”
“వస్తున్నా నాన్న.”
ఆమె ఆయన పక్కన కూర్చుంది.
“తర్వాత ఏం చేయాలనుకుంటున్నావ్?”
“ఏదైనా చిన్న జాబ్ వెతుకుదాం అనుకుంటున్నా.”
“చిన్నదా?”
“అవును.”
“ఎందుకు చిన్నది?”
అపర్ణ సమాధానం చెప్పలేదు.
“నీకు అంతకంటే మంచి ఉద్యోగమే వస్తుంది.”
“ఏమో నాన్న.”
“ఏమో అంటే?”
అపర్ణ తలదించుకుంది.
“నేను అంత తెలివైనదాన్ని కాదేమో.”
“నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టావు?”
“నాకు అనిపిస్తోంది అంతే.”
“నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే చాలా ఎక్కువ చేయగలవు.”
అపర్ణ ఏమీ మాట్లాడలేదు.
“ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు నీ మీద నమ్మకం మాత్రం కోల్పోకు.”
అపర్ణ తల ఊపింది.
ఆ మాటకు సమాధానం చెప్పలేదు.
కానీ ఆ మాట మాత్రం ఆమెతోపాటు గదిలోకి వెళ్లింది.
ఆ రాత్రి నిద్ర రాలేదు.
గది చీకటిగా ఉంది.
ఒక్కొక్క సంఘటన గుర్తొచ్చింది.
మీటింగ్.
రిపోర్ట్.
క్రెడిట్.
ప్రశంస.
తన సమాధానాల మీద అనుమానం.
చివరికి ఆమె తనను తాను అడిగింది.
“నాకు నిజంగా పని మీద సమస్య ఉందా?”
కొంతసేపు ఆలోచించింది.
లేదు.
పనంటే తనకు ఇష్టం.
అయితే?
ఆమె మెల్లగా అంది—
“నాకు... నా మీదే సమస్య ఉందా?”
ఈసారి కూడా సమాధానం రాలేదు.
వీకెండ్‌కి యతిన్ ఇంటికి వచ్చాడు.
అతన్ని చూసిన వెంటనే అపర్ణ నవ్వింది.
“అక్క! ఎలా ఉన్నావు?”
“బాగున్నాను.”
“అబద్ధం.”
“ఏంటి?”
“నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది.”
అపర్ణ నవ్వింది.
“నువ్వు పెద్ద సైకాలజిస్ట్ అయిపోయావా?”
“అది కాదు. నేను నీ తమ్ముడిని.”
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
టీవీ ఆన్‌లో ఉంది.
కానీ ఎవరూ చూడడం లేదు.
కొద్దిసేపటి తర్వాత యతిన్ రిమోట్ పక్కన పెట్టాడు.
“ఇప్పుడు చెప్పు.”
అపర్ణ గ్లాస్‌లో నీళ్లు పోసుకుంది.
“యతిన్... నేను ఉద్యోగం వల్లే రాలేదు.”
“మరి?”
“నాకు నేను సరిపోవట్లేదనిపించింది.”
యతిన్ ఏమీ మాట్లాడలేదు.
“ఎవరైనా ఏదైనా అడిగితే... నా సమాధానం సరైనదో కాదో అనుమానమే.”
“హ్మ్.”
“ఏదైనా రాస్తే మళ్లీ ఎవరికైనా చూపించాలి.”
“హ్మ్.”
“నేను చేసిన పని మీద కూడా నాకు నమ్మకం ఉండేది కాదు.”
ఆమె గొంతు కాస్త వణికింది.
“నేను చేసిన పనికి క్రెడిట్ వేరేవాళ్లు తీసుకున్నా... ‘ఇది నేను చేశాను’ అని చెప్పలేకపోయాను.”
“ఎందుకు?”
“వాళ్లు నన్ను సెల్ఫిష్ అనుకుంటారేమో.”
యతిన్ ఆమె వైపు చూశాడు.
“అక్క...”
“హ్మ్?”
“అందరూ నిన్ను మంచి అమ్మాయిగా అనుకోవాలా?”
అపర్ణ అతని వైపు చూసింది.
“అలా కాదు.”
“మరి?”
“తెలియదు.”
యతిన్ కొద్దిసేపు ఆలోచించాడు.
“నువ్వు అందరూ నిన్ను ఎలా చూస్తారో చూసుకుంటూ... నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావో మర్చిపోయావేమో.”
అపర్ణ ఏమీ మాట్లాడలేదు.
కొద్దిసేపటి తర్వాత యతిన్ అడిగాడు.
“ఇప్పుడు నీకు ఏం కావాలి?”
“తెలియదు.”
“కొత్త ఉద్యోగమా?”
“తెలియదు.”
“కొంతకాలం ఏమీ చేయకుండా ఉండాలా?”
“అదీ తెలియదు.”
యతిన్ నవ్వాడు.
“అయితే ఒక పని చెయ్యి.”
“ఏంటి?”
“ఇప్పుడే ఏ నిర్ణయమూ తీసుకోకు.”
“నాన్న అడుగుతారు.”
“అడగనివ్వు.”
“అమ్మ అడుగుతుంది.”
“అడగనివ్వు.”
“నువ్వు?”
“నేను కూడా అడుగుతాను.”
అపర్ణ నవ్వింది.
“కానీ నీకు సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని చెప్పే హక్కు నీకు ఉంది.”
ఆమె అతని వైపు చూసింది.
యతిన్ మెల్లగా అన్నాడు—
“నువ్వు ఉద్యోగం కోసం కాదు అక్క... నీకోసం కొంచెం టైమ్ తీసుకోవాలి.”
ఆ తర్వాత అపర్ణ ఖాళీగా ఉండలేక తనకు ఆసక్తి ఉన్న సైకాలజీ గురించి చదవడం మొదలుపెట్టింది.
మొదట తనను తాను అర్థం చేసుకోవడానికే.
ఒక రోజు ఒక పుస్తకంలో ఆమె కళ్ళు ఒక వాక్యం దగ్గర ఆగిపోయాయి.
“కొన్నిసార్లు నమ్మడానికి అత్యంత కష్టమైన వ్యక్తి మీరే.“
ఆమె పుస్తకం మూసేసింది.
కొద్దిసేపు అలాగే కూర్చుంది.
మళ్లీ తెరిచింది.
ఆ రోజు మొదటిసారి “ఆత్మగౌరవం” అనే పదాన్ని తన జీవితంలోని కొన్ని సంఘటనలతో కలిపి చూసింది.
తర్వాత “హద్దులు”.
తర్వాత “ఆమోదం”.
పుస్తకంలోని ప్రతి పదం తన జీవితంలో ఎక్కడో ఒక తలుపు తెరిచినట్టుగా అనిపించింది.
కానీ ఈసారి ఆమె తనకు ఏదో ఒక పేరు పెట్టుకోవడానికి తొందరపడలేదు.
కేవలం గమనించింది.
ఎప్పుడు తన మాటను వెనక్కి తీసుకుంటోంది?
ఎప్పుడు భయంతో “బహుశా” అంటోంది?
ఎప్పుడు ఎదుటివాళ్ల అభిప్రాయం తన అభిప్రాయం కంటే ముఖ్యమవుతోంది?
సమాధానాల కోసం తొందరపడలేదు.
మొదటిసారి తనను తాను గమనించడం మొదలుపెట్టింది.
ఒక రోజు చదువుకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక మెసేజ్ వచ్చింది.
“మీ ఆన్సర్ రైటింగ్ చాలా బాగుంది. మనం ఫ్రెండ్స్ గా ఉంటూ డౌట్స్ షేర్ చేసుకుందామా? “
పేరు—దిశాంత్.
అపర్ణ కొద్దిసేపు ఆలోచించి,
“సరే.”
అని రిప్లై చేసింది.
మొదట మాటలు చదువు గురించే.
పుస్తకాలు.
టాపిక్స్.
ఆన్సర్ రైటింగ్.
నోట్స్.
కొన్ని రోజుల తర్వాత—
“నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది?”
అపర్ణ రిప్లై చేయలేదు.
మళ్లీ మెసేజ్.
“రిలేషన్షిప్లో ఉన్నావా?”
ఈసారి ఆమె టైప్ చేసింది.
“దిశాంత్, మనం చదువు గురించి మాత్రమే మాట్లాడుకుందాం.”
“అంత ఫార్మల్ గా ఎందుకు ఉంటావు?”
“నాకు కంఫోర్టాబుల్గా లేదు.”
“సరే... నీ ఫోటో అయినా పంపుతావా?”
అపర్ణ ఫోన్ పక్కన పెట్టింది.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ తీసుకుంది.
మెసేజ్‌ను చూసింది.
ఈసారి పాత ప్రశ్న రాలేదు.
“నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా?”
దాని బదులు మరో ప్రశ్న వచ్చింది.
“నాకు ఇది నచ్చడం లేదా?”
సమాధానం స్పష్టంగా ఉంది.
అవును.
ఆమె చాట్‌ను బ్లాక్ చేసింది.
ఫోన్ పక్కన పెట్టింది.
గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది.
తన నిర్ణయం సరైందో కాదో ఎవరినీ అడగలేదు.
అదే ఆమెకు కొత్తగా అనిపించింది.
ఆ రాత్రి ఆమెకు ఎవరో ఒకరితో మాట్లాడాలనిపించింది.
తన గురించి ఏమీ తెలియని వ్యక్తితో.
ఒక అనానిమస్ చాట్ లోకి వెళ్లింది.
మొదటి ప్రశ్నలే—
“జెండర్?”
“ఫోటో?”
“వేర్ డూ యు లివ్?”
“వాట్సాప్?”
ఆమె ఒక్కొక్క చాట్ క్లోజ్ చేసింది.
చివరికి ఒక వ్యక్తి మాత్రమే ఏమీ అడగకుండా రాశాడు.
“ఏం మాట్లాడాలి?”
అపర్ణ చాలా సేపు టైప్ చేయలేదు.
చివరికి—
“ఏమీ లేదు.”
“అయితే ఇక్కడ ఎందుకు ఉన్నావు?”
“ఎవరితోనైనా మాట్లాడాలని.”
“ఏ విషయం గురించి?”
“తెలియదు.”
కొద్దిసేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“సరే. తెలియకపోయినా మాట్లాడొచ్చు.”
అపర్ణ స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయింది.
ఎవరో మొదటిసారి తన దగ్గర సమాధానం అడగలేదు.
ఏదైనా నిరూపించమని అడగలేదు.
ఆమె ఎవరో కూడా అడగలేదు.
అందుకే ఆమె ఒక చిన్న నిజం చెప్పింది.
“నాకు ఎవరినైనా నమ్మాలని ఉంది.”
“ఎందుకు భయపడుతున్నావు?”
“నమ్మితే వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో.”
కొద్దిసేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“అయితే ఒక్కసారిగా నమ్మాల్సిన అవసరం లేదు.”
అపర్ణ ఆగింది.
“మరి?”
“కొంచెం కొంచెంగా నమ్మొచ్చు.”
“ఎలా?”
“ముందు వాళ్లు నీ ‘లేదు’ని గౌరవిస్తారా చూడు.”
అపర్ణ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది.
కొద్దిసేపటి తర్వాత టైప్ చేసింది—
“నన్ను అర్థం చేసుకోవడానికి ముందు... నేను నన్ను అర్థం చేసుకోవాలా?”
చాలా సేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“బహుశా.”
మళ్లీ—
“కానీ ఆ పని నువ్వు ఒంటరిగానే చేయాల్సిన అవసరం లేదు.”
అపర్ణ ఏమీ రాయలేదు.
ఫోన్ స్క్రీన్ ఆరిపోయింది.
ఆమె దాన్ని మళ్లీ ఆన్ చేయలేదు.
కానీ ఆ రాత్రి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది.
ఆ తర్వాత ఆమె డైరీలో ప్రతిరోజూ ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టింది.
“ఈ రోజు నాకు కోపం వచ్చింది.”
“ఈ రోజు నాకు భయం వేసింది.”
“ఈ రోజు నేను ‘లేదు’ అని చెప్పగలిగాను.”
“ఈ రోజు నాకు ఏమీ చేయాలని అనిపించలేదు.”
“ఈ రోజు నేను తప్పు చేశాను.”
ఆ వాక్యం రాసిన తర్వాత చాలా సేపు పేజీని చూసింది.
ముందైతే ఆ తప్పును సరిదిద్దేందుకు మరో పేజీ రాసేది.
ఈసారి మాత్రం—
“తప్పు చేశాను. అంతే.”
అని రాసింది.
మరొక రోజు:
“ఈ రోజు నాకు నేను నచ్చాను.”
ఆ వాక్యం రాయడానికి మాత్రం ఆమెకు చాలా సమయం పట్టింది.
రాసిన తర్వాత దాన్ని కొట్టేయాలనిపించింది.
కలం పేజీ మీదే ఆగిపోయింది.
చివరికి కలం పక్కన పెట్టింది.
వాక్యాన్ని అలాగే వదిలేసింది.
కొన్ని నెలలు గడిచాయి.
అపర్ణ మళ్లీ ఉద్యోగం వెతకడం మొదలుపెట్టింది.
ఈసారి—
“ఏదైనా చిన్న జాబ్” కోసం కాదు.
తనకు నచ్చిన పని కోసం.
ఒక ఇంటర్వ్యూలో మేనేజర్ అడిగాడు.
“మీ ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేశారు?”
అపర్ణ కాసేపు ఆలోచించింది.
ముందైతే ఆమె ముందే తయారు చేసుకున్న సమాధానం చెప్పేది.
ఈసారి మాత్రం—
“కొంతకాలం నా గురించి నేను కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి వచ్చింది.”
మేనేజర్ ఆశ్చర్యంగా చూశాడు.
“ఏ విషయాలు?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“అన్నీ ఇప్పటికీ అర్థం కాలేదు.”
ఒక్క క్షణం ఆగి చెప్పింది—
“కానీ నేర్చుకుంటున్నాను.”
మేనేజర్ తల ఊపాడు.
తర్వాతి ప్రశ్న అడిగాడు.
అపర్ణ సమాధానం చెప్పింది.
ఈసారి తన సమాధానం ఎలా వినిపిస్తుందో తెలుసుకోవడానికి ఎదుటివాడి ముఖం వైపు చూడలేదు.
ఆ రాత్రి ఇంటికి వచ్చి డైరీ తెరిచింది.
మొదటి పేజీల్లో గందరగోళమైన వాక్యాలు.
ప్రశ్నలు.
భయాలు.
తన మీద కోపం.
తనను తాను చిన్నచూపు చూసుకున్న మాటలు.
కొత్త పేజీ తెరిచింది.
రాసింది.
“ఈ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో ‘నాకు అన్నీ తెలియవు’ అని చెప్పాను.”
కొద్దిసేపు ఆగింది.
తర్వాత రాసింది.
“అది చెప్పినందుకు నాకు సిగ్గుగా అనిపించలేదు.”
ఆమె నవ్వింది.
అదే సమయంలో యతిన్ ఫోన్ చేశాడు.
“అక్క, ఎలా జరిగింది?”
“బాగానే.”
“జాబ్ వస్తుందా?”
“తెలియదు.”
“మళ్లీ అదే ‘తెలియదు’.”
అపర్ణ నవ్వింది.
“అవును.”
“ఇప్పుడైనా భయంగా ఉందా?”
“ఉంది.”
“అయితే?”
అపర్ణ కిటికీ బయట చూసింది.
“ఉండనివ్వు.”
అటువైపు కొద్దిసేపు నిశ్శబ్దం.
“ఏం మారింది?”
అపర్ణ మెల్లగా అంది—
“ముందు భయం వస్తే... నేను వెనక్కి వెళ్లేదాన్ని.”
“ఇప్పుడు?”
“ఇప్పుడు భయంతోనే ముందుకు వెళ్తున్నాను.”
యతిన్ నవ్వాడు.
“అదే చాలు అక్క.”
ఆ రాత్రి మళ్లీ వర్షం పడుతోంది.
అపర్ణ అదే బెంచ్ దగ్గర కూర్చుంది.
అదే నల్లటి డైరీ.
అదే నీలి రంగు కలం.
కొన్ని నెలల క్రితం ఖాళీగా ఉన్న పేజీలు ఇప్పుడు గందరగోళమైన గీతలతో, ప్రశ్నలతో, చిన్న చిన్న సమాధానాలతో నిండిపోయాయి.
ఆమె మరో కొత్త పేజీ తెరిచింది.
కలం చేతిలోకి తీసుకుంది.
ఈసారి ఎక్కువసేపు ఆలోచించలేదు.
రాసింది.
“నాకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి.”
ఆమె ఆగింది.
కిటికీ బయట చూసింది.
వర్షం అద్దం మీద నెమ్మదిగా కొడుతోంది.
మళ్లీ రాసింది.
“అన్నింటికీ సమాధానాలు ఇప్పుడే తెలియాల్సిన అవసరం లేదు.”
కొద్దిసేపు కలం ఆగింది.
మూడో వాక్యం రాసింది.
“కానీ ఈసారి నా ప్రశ్నల నుంచి నేను పారిపోను.”
ఆమె ఆ వాక్యాన్ని చాలాసేపు చూస్తూ ఉంది.
దాన్ని కొట్టేయాలనిపించలేదు.
డైరీని మెల్లగా మూసేసింది.
కిటికీ బయట వర్షం నెమ్మదిగా ఆగిపోతోంది.
చల్లటి గాలి గదిలోకి వచ్చింది.
ఆమె దగ్గర ఇంకా అన్ని సమాధానాలు లేవు.
రేపు ఏం జరుగుతుందో తెలియదు.
ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు.
ఎవరిని పూర్తిగా నమ్మగలదో తెలియదు.
రేపు మళ్లీ తన నిర్ణయాన్ని అనుమానించదని కూడా చెప్పలేను.
బహుశా మళ్లీ అనుమానిస్తుంది.
బహుశా మళ్లీ భయపడుతుంది.
బహుశా మళ్లీ ఒకరోజు—
“నేను సరిపోతున్నానా?”
అని తనను తాను అడుగుతుంది.
కానీ ఇప్పుడు ఒక చిన్న తేడా ఉంది.
ఆ ప్రశ్న వచ్చినప్పుడు...
ఆమె దాని నుంచి పారిపోదు.
సమాధానం తెలియకపోతే—
“తెలియదు.”
అని చెప్పుకుంటుంది.
తప్పు చేస్తే—
“తప్పు చేశాను.”
అని అంగీకరిస్తుంది.
అసౌకర్యంగా అనిపిస్తే—
“లేదు.”
అని చెబుతుంది.
ఎవరైనా తనను తప్పుగా అర్థం చేసుకున్నా...
తనకు తాను నిజంగా ఉండటాన్ని ఆపదు.
ఎందుకంటే ఆమెకు చివరికి ఒక విషయం అర్థమైంది.
తన మీద నమ్మకం అంటే—
తనకు ఎప్పుడూ అనుమానం రాకపోవడం కాదు.
అనుమానం వచ్చిన ప్రతిసారీ తనను తాను వదిలిపెట్టకపోవడం.
అపర్ణ డైరీని చూసింది.
చిన్నగా నవ్వింది.
ఈసారి ఖాళీ పేజీ ఆమెను భయపెట్టలేదు.
ఎందుకంటే రాయాల్సిన సమాధానాలు ఇంకా లేకపోయినా...
ప్రశ్నలతో కూర్చోవడం ఆమె నేర్చుకుంది.
అదే బహుశా—
ఆమె తన మీద పెట్టుకున్న మొదటి నిజమైన నమ్మకం.

మరిన్ని కథలు

Daiva sankalpam
దైవ సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్
Sudigaadu
సుడిగాడు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Velugu vaipuki payanam
వెలుగు వైపుకి పయనం
- ప్రభావతి పూసపాటి
Chirigina Note book
చిరిగిన నోటుబుక్
- డా:సి.హెచ్.ప్రతాప్
Amma korika
అమ్మ కోరిక
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Teeyani bandhavyalu
తీయని బాంధవ్యాలు
- కామేశ్వర రావు రాపాక
Pisinikottu
Pisinikottu
- మోహనరావు మంత్రిప్రగడ
Vuchithalatho anardham
ఉచితాలతో అనర్ధం
- డా:సి.హెచ్.ప్రతాప్