శాంభవి, ఎంబియే., పిహెచ్.డి. పుదుచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసరు. వివాహ జీవితం పైన సదభిప్రాయం లేని ఆమె, పెళ్లి ఆలోచన పక్కన పెట్టి ఒంటరి జీవనం కొనసాగిస్తోంది. ఆమె కిప్పుడొక చిన్న సమస్య యెదురైంది. మరో రెండు రోజుల్లో దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ఆ సెలవులు యెలా గడిపితే . బాగుంటుందా అని ఆలోచన చేసింది.
ఇంటికి వెళ్తే… అమ్మ చెప్పే మాటలు ఆమె చెవిలో మార్మోగాయి.
" నీ కెరీర్ బాగానే వుంది కానీ, జీవితానికి పెళ్ళి కూడా అవసరం. చూస్తూండగానే ముప్ఫై మూడేళ్ళు వచ్చాయి. పుదుచ్చెర్రీలో వుండే వాడే కావాలన్నావు. దొరకలేదు. చెప్పు! పెళ్ళి ముఖ్యమా, వుద్యోగం ముఖ్యమా? పిల్ల పాపా అక్కరలేదా? ఏ ముద్దూ ముచ్చటాలేకుండా, జీవితం గడిపేస్తావా? వయసు మళ్ళాక తోడులేక బాధపడతావు. ముందు పెళ్లి చేసుకో. అందుకు అవసరమైతే ఇప్పుడున్న జాబ్ వదిలెయ్యి. పెళ్లి అయ్యాక మరో వుద్యోగం చూసుకోవచ్చు."
అమ్మ మాటల్లో ప్రేమ వుంది, కానీ ఉద్యోగం వదలమనడంలో ఔచిత్యం లేదు. ఇవే మాటలు రోజూ వింటూ అక్కడ వుండడం కష్టం. మరో ప్రత్యామ్నాయం, కజిన్స్ దగ్గరకు వెళ్లడం. బాబాయి కూతురు వనజ దగ్గరకి వెళ్లాలా, లేక పిన్ని కూతురు సౌజన్య దగ్గరకి వెళ్లాలా అని ఆలోచించింది. ముందుగా వారి పరిస్థితి తెలుసుకుందామనుకుని, ముందుగా వనజకి ఫోన్ చేసింది.
వనజ ఏకబిగిన తన కష్టాలని యేకరువు పెట్టింది.
"పెళ్లి చేసుకుని పెద్ద తప్పే చేసాననిపిస్తోంది శామ్. అటు వుద్యోగం, ఇటు కాపురం బాలన్సు చెయ్యలేక పోతున్నా! ఆయన పాత మోడల్ మగాడిలా ఏ పనీ చెయ్యడు. అత్త మామలు పెద్దవాళ్ళై పోయారు. వాళ్ళని నేనే చూసుకోవాలి. నా తోటి కోడలు మహా గడసరి. ముసలోళ్ళ మాట ఎత్తకుండా కాలక్షేపం చేస్తుంది. వాళ్ళంటే అలవి మాలిన ప్రేమ వున్నట్లు, వాళ్ళ సేవ చేసుకోడానికి వస్తున్నా అని ఫోన్ చేసింది. ఆ వంకతో, ఆమె కుటుంబమంతా ఈ పండగకి యిక్కడ తిష్ట వేస్తారు. నువ్వు వాళ్ళ గోల తట్టుకోలేవు. ఏ మాటకా మాటే, నువ్వు అదృష్టవంతురాలివే. ఏ బాదరబందీ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. ప్రొఫెసరయ్యావు కదా! లక్షల్లో జీతం. అంతా నీ ఒక్కదానికే. దేనికైనా పెట్టి పుట్టాలి."
‘కావాలని పెళ్ళి చేసుకుని, ఇప్పుడు కష్టాలన్నీ తనవే అంటోంది. అదనంగా నన్ను చూసి అసూయ ప్రకటిస్తోంది. నంగనాచి వేషాలు’ అని శాంభవి మనసులో తిట్టుకుంది. ఇంక మిగిలింది సౌజన్య. అదేమంటుందో చూద్దాం! అని అనుకుంటూ ఆమెకి ఫోన్ చేసింది.
సౌజన్య వెంటనే బదులు పలికింది.
" బాగున్నా అని అనలేను. నా మొగుడిని ప్రక్క చూపులు చూడకుండా కాపాడుకోవడానికి, ఇంటిల్లి పాదికీ వండి పెట్టడానికే నా టైం సరిపోతోంది. నువ్వెలా ఉన్నావు? ఒంటరి ఆడది అంటే అందరికీ ఆశే. అందరి చూపు నీ మీదే వుంటుంది. కొంచెం జాగ్రత్తగా వుండు. ఈ మధ్య అక్రమ సంబంధాల హత్యలు ఎక్కువైపోయాయి. నిన్ను తలచుకుంటే అప్పుడప్పుడూ బాధగా ఉంటుంది. ఎంతైనా పెద్దమ్మ కూతురివి కదా! పండగకి రమ్మని అనాలనిపిస్తోంది… కానీ నిజం చెప్పాలంటే, మా ఆయన ఎక్కడ నీ వెంట పడతాడోనన్నభయం కూడా వుంది.”
ఆ మాట ఈ మాట అంటూ, సౌజన్య ఎర్రజండా చూపించేసింది.
“ఇప్పుడేం చేయాలి?” అని కాసేపు శాంభవి ఆలోచనలో పడింది. మరో ఆప్షన్ ! ఆలోచిస్తే, సులభమైనదీ, తానెప్పుడూ ఆస్వాదించేదీ, పుస్తక పఠనం. ఆమెకు తను గత నెలలో ఒక ఇంగ్లీష్ నవల కొన్న విషయం గుర్తుకు వచ్చింది. లేచి వెళ్ళి అలమారలోంచి దానిని తీసి కవరు పేజీలు, చూసింది. స్మృతి దేవాన్ వ్రాసిన “ఊర్మిళ: ది ఫర్గాటెన్ ప్రిన్సెస్”; అంటే మర్చిపోయిన యువరాణి. చిన్న పాత్రగా రామాయణంలో దర్శన మిచ్చిన ఊర్మిళను ఎవరైనా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆమె ఒంటరిగా పదునాలుగేళ్ళు నిద్రపోయింది. భర్త అడవికి వెడుతూ అప్ప చెప్పిన పని అది. పురాణకాలంలో పురుషుల ప్రశంసలకు పాత్రమైన స్త్రీ దురదృష్ట జీవనానికి ఆమె కథ ఒక చిన్న ఉదాహరణ. ఆ ఆలోచనల మధ్యలో ఆమెకు సారధి గుర్తుకువచ్చాడు. వాడికి ఫోన్ చేస్తే? భార్య మరణం, వాడి జీవితాన్ని దుఃఖమయం చేసింది. ఎలా వున్నాడో? ఒక సారి మాట్లాడి, కాస్త ఓదారుద్దామని అతడికి ఫోన్ చేసింది.
@@@
శాంభవి ఎంబియే చేసినప్పుడు సారధి ఆమె తోటి విద్యార్ధి. చదువు తప్ప వేరే విషయాలని పట్టించుకునే వాడు కాదు. అందువల్ల శాంభవి అతనితో స్నేహం చేసింది. అతడు ఆమెకు సెమినార్లలో, ప్రాజెక్టు ప్రెజెంటేషన్సు లో సహాయం చేసే వాడు. ఆఖరి సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు, సారధి తన మనసులోని మాట బయటపెట్టాడు.
“శామ్! నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా… వాళ్లలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా?”
“ఎవ్వరినీ కాదు.”
“అయితే… నన్ను?”
" నీలాంటి పని రాక్షసుడిని చేసుకుంటే జీవితంలో వుత్సాహం వుండదు. ప్రతి రోజూ, సూర్యుడు వుదయించెను, మరల అస్తమించెను అన్నట్లు నిస్సారంగా వుంటుంది."
కొద్ది సేపు ఆగి అతడు మళ్లీ అడిగాడు, “అయితే, నీకు ఎవరైనా నచ్చినవాడు వున్నాడా?”
“ఇప్పటికైతే లేడు. ఐ లవ్ మైసెల్ఫ్. నేను పిహెచ్.డి చేసి ప్రొఫెసరు కావాలి. "
ఆ మాటలు విన్న సారధి, ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపొయాడు.
తర్వాత అతడు బెంగళూరులోని ఒక మంచి కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరాడు. మూడు సంవత్సరాల తర్వాత, అతని పెళ్లికి శాంభవి హాజరైంది. వేడుకల మధ్యలో, ఇద్దరూ కాసేపు ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం దొరికింది.
సారధి చిరునవ్వుతో అడిగాడు. “నీ పెళ్లి ఎప్పుడు శామ్?”
"నాకు పెళ్ళి అంటే తక్కువ ఆభిప్రాయం యేర్పడింది సారధీ. స్వేఛ్చని, కెరీరులో యెదుగుదలని, కోరుకునే స్త్రీలకి భర్తగా మనగల స్నేహ స్వభావం, మానసిక పరిణతి చాలా మంది పురుషుల్లో లేదు.”
సారధి కాసేపు నిశ్శబ్దంగా ఆమెను చూసాడు. తర్వాత మెల్లగా అన్నాడు.
“ నీకు ఎంతో కొంత నచ్చిన వాడిని కట్టుకుని, నచ్చేలా మార్చుకోవడమే కాపురం."
"అప్పుడు దాన్ని కాపురం అనరు; భర్తని మలిచే శిక్షణ అంటారు. ఆ కష్టం నా కెందుకు?"
శాంభవి అభిప్రాయాలను విన్న సారధికి, ఆమెకు బాధ్యతాయుతమైన సాంసారిక జీవితం కన్నా వ్యక్తిగత స్వేఛ్చయే ముఖ్యమైపోయిందనిపించింది. ఆ అవగాహనతో, అతడు కాస్త వ్యంగ్యంగా ఇలా అన్నాడు, " ఏదైనా, నీ లాంటి మేధావికి సలహా ఇచ్చేటంత వాడిని కాను. ఆల్ ది బెస్ట్."
@@@
" సారధీ, హలో!"
"హాయ్ శామ్! ఎలా వున్నావు?"
" బానే వున్నాను. కానీ ఇప్పుడు పండుగ సెలవుల వల్ల కాస్త బోరుగా వుంది."
“ఆమె వున్నప్పుడు పండుగ అంటే సంబరం. ఇప్పుడు అదే ఇల్లు… ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో. ఆ ఆనందం అంతా మాయమైపోయింది. బ్రతుకు భారమైంది.” సారధి గొంతులో నైరాశ్యం ధ్వనించింది.
"సారీ! నీ ఆరోగ్యం యెలా వుంది?"
"ప్రస్తుతానికి సమస్యలేవీ లేవు. కానీ మా వాళ్ళే. బాధ పడుతూ కూర్చుంటే యేం లాభం , ఆరోగ్యం చెడడం తప్ప అని అంటున్నారు.”
" అదీ నిజమే?"
" “ఒంటరిగా వుండకూడదంటున్నారు శామ్. ముఖ్యంగా, గతాన్ని మళ్లీ మళ్లీ తలుచుకోకూడదని చెబుతున్నారు. త్వరగా పెళ్ళి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. సంబంధాలు చూస్తున్నాను."
సారధి మాటలు విన్న శాంభవికి అసహ్యం కలిగింది. “చనిపోయిన భార్యకు గౌరవంగా కనీసం కొంతకాలం ఒంటరిగా వుండలేడా? అతని ప్రేమ అంత తేలికపాటిదా?” అని మనసులోనే అనుకుంది. ఆ ఆలోచనను దాచలేక, “మరీ ఇంత త్వరగానా?” అని ప్రశ్నించింది
సారధి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు."చేసుకోదల్చినప్పుడు, ఇవాళైతేనేం, రేపయితేనేం. ఆ శుభ కార్యం జరిగిపోతే, మళ్ళీ రొటీనులో పడొచ్చు.”
శాంభవి కొద్దిసేపు మౌనంగా వుండి, "అదీ నిజమే!" అని అంది.
" శామ్! ఒక మాట అడగనా?" స్వరం ఎంతో మృదువుగా, మంద్రంగా వుంది.
ఆమె ఆ మార్పుని గమనించింది. "కొంపదీసి నా పెళ్ళి మాటా ?" అని నిర్వికారంగా అడిగింది,
" అవును. ఎన్నాళ్ళు ఒంటరిగా వుంటావు? “
“నేను ఒంటరిగా నాకు నచ్చిన రీతిలో బ్రతకటానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు పెళ్ళి చేసుకుని నిరంతరం ఇంకొకరి కోసం నన్ను నేను మార్చుకుంటూ బ్రతకలేను."
“ స్త్రీకి సంతానం ముఖ్యం. సంతానం లేని స్త్రీ జీవితం అసంపూర్ణం."
“అది స్త్రీని ఇంటికే పరిమితం చేయడానికి చెప్పిన మాట. పెళ్లి తర్వాత భర్త కోసం, ప్రసవం తర్వాత పిల్లల కోసం… ఇంటి గడప దాటకుండా బంధించే ఒక ప్రవచనం. ప్రతి స్త్రీ జీవితం, అదే మార్గంలో నడవాలి అనుకోవడం సరైంది కాదు.”
“అయితే… జీవిత చరమాంకంలో తోడు అవసరం అనిపించదా?”
“అనిపిస్తే… తోడుని మనమే సృష్టించుకోవచ్చు. ఒక అనాధ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటాను.” అని శాంతంగా చెప్పింది శాంభవి.
"మరొక్కసారి ఆలోచించు. నీకు యే కష్టమూ రాకుండా చూసుకుంటాను."
అదీ సంగతి. నేరుగా అడక్కుండా చర్చకి తెరదీసాడు. జీవితాంతం ఒక స్త్రీకి, ఒక పురుషుడు స్నేహితుడిగా వుండలేడా? పురుషులెంత బలహీనులు? వాళ్ళది పేరాశ. వారికి స్త్రీ మనసూ, స్నేహమూ చాలదు. సుఖాన్ని అందించే శరీరం కావాలి. అందుకే పెళ్ళి అనే బంధం వారికి అవసరం. స్త్రీకి అలా కాదు. అందుకే స్వావలంబన సాధించిన స్త్రీ, తన స్వాభిమానాన్ని, స్వేచ్చని హరించి వేసే ఆ బంధానికి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కుంటోందని అనుకుంటూ, ఆమె యిలా మృదువుగా జవాబిచ్చింది.
“మనిద్దరికీ సరిపడదు. నాది పుదుచెర్రీ. నీది బెంగళూరు. నాది స్వేచ్చా జీవితం. వేరే అమ్మాయిని చూసుకో."
" భర్త అంటే ధర్మార్ధ కామాలకు తోడు. ఆ తోడు వల్ల పొందే ప్రయోజనాలను నువ్వు నష్టపోతున్నావు. "
అతని మాటలు తన నిర్ణయాన్ని పరిహసించేలా వున్నాయని భావించిన ఆమె, అసహనంతో ఫోన్ కట్ చేసి, తన జీవితాన్ని ఒక్కసారి సమీక్షించుకుంది.
“ఇన్నాళ్ళూ నాకు నచ్చిన జీవితాన్ని గడుపుతూ నేను సంతోషంగా వున్నాను. ప్రొఫెసరుగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఒక అనాధాశ్రమానికి నిధులు పోగు చేసి యిస్తున్నాను. ఒక జీర్ణ దేవాలయ పునరోద్ధరణలో కీలక పాత్ర పోషించాను. వృత్తికి, హోదాకి చెడ్డ పేరు రాకుండా ప్రవర్తించే మానసిక నియంత్రణ నాకుంది. వివాహం చేసుకుంటే, జరిగేదేమిటి? ఒక పురుషుడు నా జీవితంలోకి వస్తాడు. నా స్వతంత్ర భావాలని, ఎదుగుదలని ఇష్టపడని ఒక శత్రువులా నా ఇంట తిష్ట వేస్తాడు. వాడి బలహీనతలని భార్యగా నేను భరించాలని కోరుకుంటాడు. అందుకే. నాకు భర్త వద్దు. అప్పుడప్పుడూ నేను ఒంటరిననిపిస్తుంది. అయితే ఒంటరితనం శాపం కాదు, అది ఆత్మావలోకనానికి, ధ్యానానికి దారి చూపే అవకాశం. సమాజం ముద్రవేసినట్లు నా జీవితం యెడారి కాదు. నా కలలను ప్రతిబింబించే ఒక అందమైన పుష్పవనం.”
తన సమీక్ష తృప్తినివ్వగా, ఆమె వూపిరి పీల్చుకుని వుపశమనం పొందింది.
@@@

