లాక్ డౌన్ లో అమ్మ - సంధ్య కార్తీక్

Lockdown lo Amma

నాకు పూరి కావాలి అమ్మా అంది శ్రావ్య

నాకు మసాలా దోశ కావాలి అమ్మ,ఎప్పుడు చెల్లికి ఇష్టమైనది చేస్తావు- అది చిన్నది అవ్వడం తో దానికే అన్నీ చేసి పెడతావు అన్నాడు కొంచం కోపంగా వైష్ణవ్

మామగారికి రాగి జావ చెయ్యి తల్లి

ఇవేమీ అరగట్లేదు ఈమధ్య

అంది అత్తగారు

ఒరేయ్ దోశ కి పిండి రుబ్బి పెట్టుకోవాలి ,రేపు దోశ చేస్తా

ఈరోజు పూరి చేస్తా... అన్నది మాధురి

నేను చెప్పానుగా నీవు

చెల్లికి

ఇష్టమైనదే చేస్తావు అని ..... అన్నాడు వైష్ణవ్ బుంగమూతి తో

శ్రీవారికి ఏమీ కావాలో చెప్పనే లేదు

దాన్ని బట్టి నేను వంట ప్లాన్ చేసుకోవాలి కదా!!!!! అని అనింది మాధురి

ఈ ఇంట్లో ఏది పెడితే పెడితే అది తినే ఏకైక మనిషిని నేనే

అయిన ఈ మధ్య నా ఇష్టాలు గురించి ఎవరు అడిగారు అన్నారు శ్రీవారు

అబ్బా అంత నిష్టూరంగా మాట్లకండి....

ఈ మధ్య చూస్తూనే ఉన్నా ఎంత సేపు పిల్లల ఇష్టాలేనా - నాక్కూడా కావాల్సింది చెయ్యొచ్చుగా... అని చిరుకోపంగా శ్రీవారు

అయ్యో ఈ మధ్యనే కదండి సొరకాయ ఉట్టి పులుసు చేశా......

అది పోయిన వారం!!! అయిన నాకు ఇవన్నీ మాట్లాడటానికి టైం లేదు

మీటింగ్ ఉంది,ఎవ్వరు దయచేసి రూం లోకి రాకండి !!!బాగుండదు....

ఆ టిఫిన్ ఏదో చేసేసి టేబుల్ మీద పెట్టు ......

మాధురి అన్నీ ఓపికగా విని వంటగదిలోకి పని ముగిద్దామని వెళ్లి ఇలా ఆలోచనలో పడింది

లాక్ డౌన్ లో పాపం అందరికీ విసుగు ఎక్కువయ్యింది, అందరిదీ అదే పరిస్తితి

అదే గోడు ,అదే గోడ.......

అంతకుముందు హాయిగా ఝమ్మని బైటకి వెళ్ళిపోయే వారు

ఇప్పుడా వీలు లేదు

ఎక్కడకీ వెళ్ళలేరు .........

బైటకు. వెళ్ళాలంటే భయము

ఇంటి లోపలికి వస్తువులు వస్తే భయము

ఇక దగ్గినా, తుమ్మినా నిద్ర పట్టే ప్రసక్తి లేదు ....

కరోనా మహమ్మారి ఎక్కడ తమకి సోకిందా అనే అనుమానంతో!!!!!

ఏమి గొడవ రా బాబూ ఇది ??

చూస్తూ ఉంటే

మనల్ని మోసి మోసి అలసిపోయి భూమాతకు కోపం వచ్చి ఇళ్లలో బందీ చేసి సేదతీరుతున్నట్టుంది, మరి నా లాంటి అమ్మలకో......

అమ్మలకు ఇంకా పని భారము

ఎక్కువయ్యింది....... రెండు పూటలు

వండేది నాలుగు పూటలు వండాల్సి వస్తుంది ........

వండడమేనా , దాని తర్వాత గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం,బట్టల పని......ఇలా ఇంటి పని ,వంట పని ,ఆఫీస్ పనితో నిరంతరం శ్రమిస్తూ నే ఉన్నాము.

లాక్ డౌన్ లో

మనుషులందరూ ఇలా ఆలోచించడం మొదలు

పెట్టారనుకుంటా....

ఇన్నిరోజులు మనం ఎంత

స్వేచ్ఛ గా బ్రతికామో

ఇప్పుడు తెలిసి వస్తోంది!!!

పాపం నాకు వెంటనే జంతు ప్రదర్శనశాల లో జంతువులు గుర్తుకు వస్తున్నాయి ,ఏమైనా అది స్వతంత్రగా అడవిలో ఉండడం వేరు,ఇలా పరిమిత ప్రాంతం లో ఉండడం వేరు ....

అయిన నాకెందుకు అబ్బా ఇన్ని ఆలోచనలు వస్తాయి, అని అనుకొని టిఫిన్ రెడీ చేయ సాగింది

మాధురి....

టిఫిన్ చేస్తూ - అర్రే ఆలోచనలో పడి ఆఫీస్ మీటింగ్ కి టైం అవుతుంది అని మర్చిపోయా - అని మాధురి

వంటిట్లోనే ఫోన్లో మీటింగ్ లాగిన్ అయ్యి , టిఫిన్ చకచకా అందరికీ చేసి పెట్టేసింది.....

మీటింగ్ మొదలైంది ..... దాన్ని అలానే వంటింట్లో పెట్టుకొని

అంట్లు తోమ సాగింది...

ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నావు ఎంటి?? అని అడిగాడు వైష్ణవ్

మరీ ఏమి చేయాలి

ఒక గది లో నీ క్లాసులు ఇంకో గదిలో నాన్న,మరొక గదిలో నాన్నమ్మ భాగవతం క్లాస్ లు,ముందు గదిలో నీ చెల్లి,నేను ఇక్కడైతే అంట్లు

తోముకుంటూ మీటింగ్ అటెండ్ అయిపోవచ్చు,రెండు పనులూ పూర్తి చేసుకోవచ్చు- సిస్టం చేసే మల్టీ టాస్కింగ్ లాగా ......

పైగా నా వీడియో ఆన్ చేసే పని లేదు ఈ మీటింగ్ కి ..... అని జవాబిచ్చింది మాధురి

సరే బానే ఉంది అమ్మా నీ పని.....

అమ్మా ,చెప్పడం మర్చిపోయా నాకు టెస్ట్ ఉంది ఇప్పుడు ...ఎవరు ఆ గది లోకి రావద్దు---నువ్వు ఏదో ఒకటి కావాలని అప్పుడే గదిలోకి వస్తావ్ - అందుకే ముందే చెబుతున్నా.......

ఇదెక్కడి చోద్యం బైట అడుగు పెట్టలేను, ఇంట్లో తిరగలేను, వంటింట్లో వంట పనితో పాటు నా ఆఫీసు పని కూడా ఏడ్చింది.......

ఇందాక మీ చెల్లెమో అమ్మా నువ్వు ముందు గది లోనుంచి బకెట్లో బట్టలు ఆరేయడానికి తీసుకొని వెళ్ళావంటే అంటే క్లాస్ అంతా నిన్నే చూస్తారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పింది......

మొన్నేమో కరెక్ట్ గా మా టీచర్ నన్ను అన్ మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవమన్నప్పుడే మిక్సి వేశావు.... అన్నాడు వైష్ణవ్.

ఇది మరీ బాగుంది మిమల్ని అప్పుడే పిలిచారు అని వంటింట్లో ఉన్న నాకెలా తెలుస్తుంది......

అయినా అందరి ఇంట్లో జరిగే పనులే కదా దానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవడం దేనికో??

నాక్కూడా మధ్యలో ఇంటి పని చేసేసుకుంటే కలసి వస్తుంది, ఈ మీటింగ్ కు అయితే వీడియో ఆఫ్ చేసి అటెండ్ అవ్వచ్చు తర్వాత అలా కాదు కదా కానీ .......ఏదో సర్ది చెప్ప పోయింది మాధురి !!!!

అమ్మో నా క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది అని రూమ్ లోకి వెళ్లిపోయాడు వైష్ణవ్

మళ్లీ మాధురికి ఏవో ఆలోచనలు మొదలయ్యాయి

మా టీవి లో బిగ్ బాస్ షో గుర్తు వ వస్తోంది .. లాక్ డౌన్ లో అందరి ఇల్లు ఒక బిగ్ బాస్ హౌజ్ యే కదా, ప్రతి ఒక్కరూ నాలుగు గోడల మధ్య .... అదే మనుషులతో అన్ని రోజులు ......వచ్చి పోయే వాళ్లు లేరు,ఎవరిని కలిసే ప్రసక్తి లేదు.......

ఇక దీనిలో టాస్కులు అంటే మనకి మనమే క్రియేట్ చేసుకుని ఏవో వో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని పోస్ట్ చేస్తూనే ఉన్నాం.......

బయట నుంచి వచ్చే టాస్కులు మన మోడీ గారు మీడియా ద్వారా మధ్య మధ్యలో ఇచ్చేవి........

ఏంటో నా పిచ్చి ఆలోచనలు తనలో తానే నవ్వుకుంది మాధురి......

టైం చూసుకొని పిల్లలకి విరామ సమయం రాబోతుంది అని శ్రీవారికి టీ ఇచ్చి ,పిల్లలకి పాలు కలిపి రెడీగా పెట్టింది, అమ్మాయి క్లాస్ అయిపోతే తదుపరి మీటింగ్ మొదలయ్యే లోపల గబగబా వెళ్లి బట్టలు అరేసుకోవలని తాపత్రయం.....

వైష్ణవ్ కు ఏదో గుర్తు వచ్చినవాడి మల్లె పరిగెత్తుకు వచ్చి " అమ్మా ఎల్లుండి నీ పుట్టిన రోజు కదా "అన్నాడు

అవునా రా అయితే ఏమి చేయమంటావు? అనింది మాధురి ..

ఏంటో అమ్మ , కరోనా లేకపోయి ఉంటే హాయిగా హోటల్ కి వెళ్ళే వాళ్ళము ...

అది కాదమ్మా !!!! అంతకు ముందు సారేమో నీ పుట్టిన రోజుకి మాకు ఇష్టమైనవి చేసి పెట్టావ్,హోటల్ కి మరోసారి వెళ్దాం లే అని.....

నాకసలు ఒకటి అర్దం కాని విషయము... నీ పుట్టిన రోజు కూడా మాకు ఇష్టమైనవవేనా???

ఎందుకంటే నాకిష్టం అయినవి అందరూ తినరు ,ఎందుకు ఊరికే అది వండడం అదే మికిష్టమైంది చేస్తే మీరు ఆనందంగా తింటారు కదా ,అదే నాకు ఆనందం అంది మాధురి

అయ్యో మరీ నీ పుట్టిన రోజుకి మనము ఎక్కడ కీ వెళ్ళలేము,నేను ఏమి బైట నించి తెచ్చి ఇవ్వలేను, ఇంక ఏమీ చేయలేము కదా,ఎలా??

ఏమీ పర్వాలేదు రా

నీవు చెల్లి నన్ను అరిపించ కుండా నా మాట వింటే చాలు..

అదే పదివేలు ......

నీవు భలే చెబుతావు అమ్మా

ఏదో మేము నీ పైన తిరుగుబాటుదారులు లాగా.....

సరేలే నాకు మీటింగ్ టైం అవుతుంది, మళ్లీ సాయంత్రం ఏమి చేయాలో కూడా చూడాలి.......అంటూ వెళ్లి పోయింది మాధురి ....

వైష్ణవ్ కు వాళ్ల అమ్మ కొరకు ఏదైనా చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు.

అస్సలు బొమ్మలు గీయడం,గ్రీటింగ్ కార్డ్ చెయ్యడం వాడికి రాని పని ,నాన్న దగ్గరికి వెళ్లి నీకు గుర్తుందా నాన్న అమ్మ పుట్టిన రోజు??? అని అడిగాడు

ఉందమ్మా,నేను ఏదో అనుకున్నా ఆర్డర్ పెట్టాలని ......కానీ ఎందుకు అనవసరంగా ఇప్పుడు బైట నించి అంత అత్యవసరం లేనిది ఇంట్లోకి తేవడం అని ఆలోచిస్తున్నా, నిత్యావసర సరుకులు ,మందులు ఎలాగూ తెచ్చుకోవడం తప్పదు

బైట పరిస్తితి చూస్తే ఇప్పుడు వద్దులే అన్పిస్తుంది...

మనింట్లో నాన్నమ్మ,తాత కూడా ఉన్నారు మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి ...

పోనీ ఏదైనా వస్తువు తెప్పించినా వస్తువుల మీద తనకు పెద్ద మమకారము లేదు

వాటితో పెద్ద పొంగిపోదు.........

నాన్న అలా అనేసరికి ఇంక ఎదీ ఆర్డర్ కూడా పెట్టలేము అని చెల్లి దగ్గరకి వెళ్ళాడు వైష్ణవ్ , చెల్లేమో నేను మంచి గ్రీటింగ్ కార్డ్ చేస్తాను అన్నా అని చెప్పింది

వైష్ణవ్ కు ఏదైనా కొత్తగా అమ్మకు ఇవ్వాలని బలంగా అనుకున్నాడు ...

మళ్లీ నాన్న దగ్గరికి వెళ్లి నాన్నా అమ్మకు ఏమీష్టం అని అడిగాడు

పాత పాటలు వినడం.... ఏదో బొమ్మలు గీయడం అని చెప్పగా

తనకి కావాల్సిన సమాధానం ఏమీ లేదు అని

సరే నాన్నా అని హోంవర్క్ చేసుకోడానికి వెళ్లి పోయడు.....

రోజంతా అమ్మను గమనించసాగాడు ఏమీ ఇవ్వాలో తన కు స్ఫురిస్తుంది అని

ఎంతసేపూ పని చేస్తూ కనపడింది తప్ప ,పాపం ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకున్న జాడ లేదు....

తనకే ఒక కొత్త ఆలోచన వచ్చింది ......

మాధురి పుట్టిన రోజు రానే వచ్చింది,

ఆరోజు మాధురి తన పుట్టిన రోజు హంగామా లేకుండా యధా ప్రకారం వంటింట్లో హడావిడి పడసాగింది, ఎందుకంటే తనకు నాలుగు మీటింగ్లు ఉన్నాయని చెప్పింది...

మామగారు అత్త గార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది...

ఆరోజు మాధురిని అందరూ విష్ చేశారు , తన పని చేసేసి ఆఫీస్ పనిలో నిమగ్నం అయిపోయింది మాధురి.....

మధ్యాహ్నం భోజనాలయ్యాక చాలా అలసిపోయాను అత్తయ్యా సాయంకాలం ఇంటి పని చేస్తాను ,కాసేపు నిద్ర పోతాను అని వెళ్ళి నిద్రపోయింది మాధురి

గంట తర్వాత నిద్రలేచేసరికి !!!

ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఊడ్చి నట్టు కనపడింది, వంటింట్లోకెళ్లేసరికి వంటిల్లు ఎంత శుభ్రంగా ఉందో , అన్ని పాత్రలు తోమేసి ఉన్నాయి....

ఒక నిమిషం లాక్ డౌన్ అయిపోయి పనమ్మాయి వచ్చిందా అనిపించింది??

అదెలా సాధ్యం??

అంతలో వైష్ణవ్ అమ్మా ఇక్కడ రామ్మా నీకోసం ఏదో చేసాము అని పిలిచాడు

చూస్తే ఉతప్పం

మీద సాస్ తో అమ్మకు శుభాకాంక్షలు అని రాసుంది,

అప్పుడు అత్తగారు చెప్పారు అమ్మా నీ కొడుకు , కూతురు కలిసి నీ పుట్టిన రోజుకి నీకు బహుమతిగా ఇల్లంతా ఊడ్చి ,తుడిచి , గిన్నెలు తోమిపెట్టారు.

నన్ను పావుగంట ముందు లేపి దోశ పిండి తో ఇది మేము చేస్తాము నీవు పక్కన నిల్చొని ఎలా చేయాలో చెప్పు నాన్నమ్మ అన్నారు ,అస్సలు నన్ను ముట్టనివ్వలేదు వాళ్ళే చేయాలని వాళ్ల ఆ తాపత్రయం చూడ ముచ్చటగా ఉండింది.

అమ్మా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నీకు సరిగ్గా విశ్రాంతి లేకుండా పోయింది అని నీకు ఈ రోజు విశ్రాంతి ఇచ్చాము ,నీకు ఇష్టమైన పాత పాటలు వింటావో బొమ్మలు గీసుకొంటావో నీకోసం కొంచెం సమయం ఇద్దామనుకున్నాము. ఎలా ఉందమ్మా మేము ఇచ్చిన పుట్టినరోజు బహుమతి అని అడిగాడు వైష్ణవ్

మాధురి కళ్ళు చెమ్మగిల్లాయి, ఏడో తరగతి చదువుతున్న నువ్వు ఇంతగా ఎలా ఆలోచించావు రా నాన్న??

అయ్యో!!! అమ్మా మొన్న ఆదివారం నీవు మన కాలనీలో పోలీసులు పాపం ఎండలో కూర్చున్నారని అదే పనిగా వెళ్లి వాళ్లకి జ్యూస్ చేసి అలాగే దారిలో ఉన్న మున్సిపాలిటీ వర్కర్స్ కొద్దిగా నిమ్మకాయ చిత్రాన్నాన్ని కలిపి తీసుకు వెళ్లవు కదా!!!!

ఇంట్లో నీకే ఇంత పని ఉండి కూడా బయట వాళ్ల కోసం అంతగా ఆలోచించావు అమ్మా!!! అందుకే నీ కోసం ఏదన్నా చెయ్యాలని నాకనిపించింది,మేము నాన్నకు కూడా చెప్పలేదు,చెల్లి కూడా చాలా సహకరించింది….....

మాధురికి ఏమీ మాట్లాడాలో తెలీలేదు.....

మీ బుజ్జి బుజ్జి చేతులతో ఇవన్నీ చేశారా!!! అని వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుంది,ఇంతకంటే గొప్ప బహుమతి ఏమి ఉంటుంది ???

పిల్లల ఆలోచనలు మనము చేసే ప్రతి పనుల తో ముడిపడి ఉంటాయి

పిల్లలకి ఏమీ చెప్పకపోయినా

వాళ్ల వ్యక్తిత్వం పెద్దల నడవడిక మీద ఆధారపడి వుంటుంది అన్నదానికి ఇది నిదర్శనం.

మరిన్ని కథలు

Gjnapakala jwalalu
జ్ఞాపకాల జ్వాలలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Nijamaina Vijetha
నిజమైన విజేత
- పడాల హరీష్ కుమార్
Railu prayanam
రైలు ప్రయాణం
- సంధ్య కార్తీక్
Prasna
ప్రశ్న
- isun finn
Daiva sankalpam
దైవ సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్
Sudigaadu
సుడిగాడు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Velugu vaipuki payanam
వెలుగు వైపుకి పయనం
- ప్రభావతి పూసపాటి
Chirigina Note book
చిరిగిన నోటుబుక్
- డా:సి.హెచ్.ప్రతాప్