వైజయంతికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లీద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయారు. ఇక్కడే స్తిరపడ్డ కొడుకుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి - ఒక్కగానొక్క మనవడు వైజయంతికి, అభిరామ్ అందరిలో మొదటి పుట్టినవాడు మరియు వంశోద్ధారకుడున్ను! వైజయంతికి ఒక్కసారి విదేశాలకు వెళ్లి అక్కడి పద్దతులతో ఇమడలేక ఇంక వెళ్లకూడదని తీర్మానించుకున్నారు.
మొదటినుంచి కొడుకు దగ్గరే ఉండడంతో వైజయంతికి అభిరామ్ తో చాలా చనువు మరియు అనుబంధము. అభిరామ్ అమ్మ కూడా ఉద్యోగి కావడంతో వాడు తన చేతిలోనే ఎక్కువగా పెరగడంతో వాడంటే విపరీతమైన ప్రేమ, అభిమానము
ఎంతైనా కొడుకు మీద ప్రేమ కంటే మనవడి మీద ప్రేమ రెట్టింపు అవుతుంది.
వైజయంతికి తన సగం రోజు వాడి ఆలనా పాలనతో గడిచిపోయేది. చిన్నప్పుడు వాడు చేసే ప్రతి పనీ ముద్దే, కానీ పెరుగుతున్న కొద్ధి వ్యవహారం తనకు రుచించట్లేదు . రెండు తరాల ఆంతర్యం మరి !
అభి ఐదేళ్ల వయసున్నప్పుడు ఒకసారి...
ఒరేయ్ అభి అలా పరిగెత్తుతూ వుంటే భూమాతకు కోపము వస్తుంది నాన్నా అని వైజయంతి చెప్తే.....
నాన్నమ్మ! కాళ్ళు ఉన్నవి పరిగెత్తడానికే అని అభి ముద్దు ముద్దుగా పలుకుతూ ఉంటే మురిసిపోయేది.
అన్ని పనులకు వైజయంతి సెక్యూరిటీని పిలిచి పురామయించేది . ఒకసారి వైజయంతి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి సెక్యూరిటీ వస్తాడు రిపేర్ చేస్తాడు అని అభి అనటంతో, ఆ మాటలకు , అమాయకత్వానికి ముచ్చట పడింది .
ఎప్పుడూ నాన్నమ్మే లోకంగా తిరిగే అభి, క్లాసులు పెరిగే కొద్ది కొత్త లోకం వైపు మోగ్గు చూపడము మొదలు పెట్టాడు.
అభికి ఎందుకో చిన్నప్పట్నుంచి సైకాలజీ అంటే చాలా మక్కువ.
వాడు తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సైకాలజిస్ట్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అది ఎందుకో వైజయంతికి అంతగా ఇష్టం లేదు....
అనుకునట్టే అభిరా సైకాలాజీ లో మంచి కాలేజీ లో సీటు వచ్చింది. కొత్త విషయాలు సైకాలజీలో తెలుసుకొనే కొద్ది అందరూ మనుషులను గమనించ సాగాడు. అభి నేర్చుకున్న ఒక్కొక్క పాఠం తాను కలిసిన మనుషులతో కొంచం పోల్చుకొని గుర్తుపెట్టుకోసాగాడు .
వైజయంతికి ఎందుకో కొత్త తరం మీద సదభిప్రాయమే లేదు, వైజయంతికే కాదు చాలామంది పెద్ద వాళ్ళకు ఈ తరం పిల్లలు, వాళ్ళ వింత పోకడల మీద ఒక చులకన భావము !
ఏదో ఒక విషయము మీద నాన్నమ్మకు మనవాడికి భేదాభిప్రాయలు , వాగ్వివాదాలు జరుగుతూ ఉండేవి.
ఒక రోజు అభి తన రూమ్ లో ఏదో పనికోసం వచ్చినప్పుడు చూసి అదే పనిగా గొణగడం మొదలు పెట్టింది.......
మనుషుల ప్రవర్తన గురించి చదవటం ఏమిటో !
అయినా ఏ డాక్టరో ఇంజీనీరో అయితే బాగుంటుంది నలుగురికి చెప్పడానికీ! దీనికి ఇంత కాలేజీ ఎందుకు , నలుగురితో మాట్లాడితే వస్తుంది నీ చదువు. అందరి ఆలోచనలు తెలుస్తాయి కదా ఆనింది.
అభి ఇక ఉండబట్టలేక ఇలా వివరించాడు-
మనుషులు ఆలోచనలు ఎందుకు రకరకాలుగా ఉంటాయో, ఎందుకు కొందరు వింతగా ప్రవర్తిస్తారో , బాల్యం లో జరిగిన సంఘటనలు ఎలా ప్రభావితము చేస్తాయో అన్ని తెలుసుకొని , మేము వాళ్లను సరైన దిశ వైపు మళ్లించవచ్చు నాన్నమ్మా !
సైకాలజిస్ట్లు ఈ కాలంలో చాలామందికి ఒత్తిడి , పని భారము పెరగటం వలన కష్టాలను ఎదుర్కొని నిలబడటం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పుతున్నారు ఇతర మానసిక సమస్యలను కూడా గుర్తించి చికిత్స అందించడంలోనూ వీళ్ళు తోడ్పడుతున్నారు .
మన ఆలోచనలు, భావాలను విశ్లేషించుకోవడానికి కూడా సైకాలజీ సహాయపడుతుంది , అని తను చదివే చదువు ఎంత ముఖ్యమో వివరించాడు.
రోజులు గడుస్తున్నాయి......
అభి కాలేజ్ చదువు పూర్తయి ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒకసారి వాళ్ళ స్నేహితులతో మనాలి టూర్ వెళ్లడానికి తయారవుతుoటే వైజయంతి ఒరేయ్ అభి ! ట్రైన్ లో డోర్ దగ్గర నిల్చోవద్దు, నీళ్ల లోకి వెళ్ళవద్దు, ఫోన్ మాట్లాడుతూ రోడ్డుమీద నడవద్దు అని జాగ్రత్తలు చెప్పింది .
అయ్యో నాన్నమ్మా ! నాకు తెలుసు, నేనంటే నీకు చాలా ఇష్టమని, కానీ మరీ చిన్నపిల్లాడికీ చెప్పినట్టు ఏమీటివి ? అన్నాడు అభి కొంచం విసుగుతో.
నాకు నీవు ఎప్పుడూ చిన్నపిల్లడీవేరా అని అనేసి,
చేసేదేమీ లేక వైజయంతి జపమాల చేతిలో పట్టుకొని పడక కుర్చీలో కూర్చొని తనదైన శైలిలో శతనామవళి మొదలుపెట్టింది ...
ఈ కాలం వాళ్ళు ఎప్పుడు చూసినా బయట ప్రదేశాలు తిరుగుతుంటారు....ఇంక వేరే పనేముంది ? గది లోపల ఉన్న అభి కి వినపడేలా ......
అభి ఊరికే ఉంటాడా.......
బయట లోకం చూస్తేనే కదా రకరకాల ప్రదేశాల గురించి, మనుషుల గురించి, వాళ్ల పద్ధతుల గురించి తెలుస్తుంది ! చదువు అనేది పుస్తకాల నించే మాత్రమే రాదు , కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త మనుషులును కలిసినప్పుడు జ్ఞానం పెంపొందిచ్చుకోవచ్చు .
నేను ఎక్కువగా పుస్తకాలు చదివే కొద్ది ఇంకా కొత్త ప్రదేశాలు చూడాలని కుతూహలం కలుగుతుంది.ఇప్పుడు అన్ని చోట్లకు వెళ్ళే వెసలుబాటు ఉంది. ఓపిక, డబ్బు కూడా ఉన్నాయి . అందుకే వెళ్లగలగుతున్నాము . బాధ్యతలు అన్నీ మానేసి బలాదూర్ గా తిరగట్లేదు కదా? ఇంత కష్టపడీ సంపాదించింది మనము కూడా అనుభవించాలి కదా? అన్నీ వచ్చేతరాలకు పెట్టలా ఎంటి???
వైజయంతికి చిర్రెత్తుకొచ్చి , ఈ తరం వాళ్ళతో నేను మాట్లాడలేను రా
అన్నీ ఎక్కువగా ఉన్నాయి మీకు. అందుకే మీకు దేని విలవ
తెలియట్లేదు.
ఇంక అభి ఊరుకుంటాడా ?
నాన్నమ్మా! అన్నిటికి ఈ తరం వాళ్ళను అంటే నేను ఒప్పుకోను ,మీ తరంలో అలా జరిగిందని ఇప్పుడు కూడా అలానే జరగాలo టే ఎలా ?
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాము, కాలం మారింది, ఎన్నో కొత్త అవిష్కరణలు జరిగాయి .
వైజయంతి : అభివృద్ధి పేరుతో మీరు ఎటో వెళ్ళిపోతున్నారు.
అభి : ఈ తరం లో పుట్టడం మా తప్పు కాదు, ఈ తరానికి తగ్గట్టు మేము ఉన్నాము, నిజమే ఆరాచకాలు ఎక్కువైపోయాయి . పదవి వ్యామోహం, మోసాలు రాజుల కాలం నుంచి వినిపిస్తున్నాయి. కానీ అవి ఏవీ బైటకకు ఎక్కువగా తెలియలేదు. ఇప్పుడు ఉన్న మీడియా ప్రతీదీ పూస గుచ్చి వివరించడం వల్ల ఈ తరమంతా ఇలానే ఉన్నారు అనడం ఏమి బాగోలేదు.
అప్పటి కాలంలో ఒకరికి వర్తమానం పంపాలంటే కూడా రోజుల తరబడి అయ్యేది మరియు ఏదైనా కొత్త ప్రదేశం చూడాలంటే చాలా రోజులు పట్టేది, కానీ ఇప్పుడు అలా కాదు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అన్ని రంగాలలో చాలా మార్పులు వచ్చాయి, అందరికీ విషయాలు తెలుసుకునే చాలా మార్గాలు వచ్చాయి. ప్రతి తరంలోనూ మంచి- చెడు రెండూ ఉన్నాయి. మనం ఎంచుకునే మార్గంలోనే ఉంది అంతా ! నువ్వు చెప్పినట్టే ఎందులోనూ అతి మంచిది కాదు అమృతము కూడా ఎక్కువ తాగితే విషమే అని అనేసి
కాస్త నిదానముగా .............
నా మాట విని నువ్వు ఎక్కువగా ఫోన్ వాడకపోయినా పర్వాలేదు కానీ ఎమర్జెన్సీ నెంబర్స్, పనికొచ్చే యాప్స్ కొన్ని తెలుసుకో--- నువ్వు చదువుకున్న దానివి, ఎప్పుడైనా నీకు ఉపయోగముంటుంది. ఒకరీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో . జపాన్ లో ఇకిగై అనే పద్ధతి ఫాలో అవుతారు, ఏదో ఒకటి కొత్తది నేర్చుకునే తత్వం ఉంటే మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని వాళ్ళ నమ్మకం, అని తన ధోరణిలో చెప్పి నాన్నమ్మ వైపు చూశాడు అభిరామ్.
ఇది విని వైజయంతికి అరికాలు మంటకు తలకెక్కింది
చాల్లేరా నాకు చెప్పొచ్చా వు! తాతకి దగ్గులు నేర్పుతున్నరు .....
మీరు ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కానీ నేను ఎప్పటినుంచో ఏదో ఒకటీ నేర్చుకుంటూనే ఉన్నా . ఈ ఫోన్, కంప్యూటర్ పెద్దగా నాకు ఇష్టం లేని పరికరాలు, ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్న ఏకాదశి ఉపవాసం ఎంత మంచిదో ఈ మధ్యనే ఎవరో శాస్త్రవేత్త చెప్పాడట .
పొద్దున్నే లేవడం మా అలవాటు, కానీ దాన్ని కూడా ఆయన ఎవరో రాస్తే మీరు ఆ పుస్తకం చదివి దాన్ని ఆచరించడం నవ్వు తెప్పిస్తోంది .
పాత పద్ధతులకు కొత్త రంగులు పులిమినట్టుంది ..
నేనేదైనా చెప్తే నువ్వు పాత చింతకాయ పచ్చడి అని తీసిపారేస్తావు ,మీరూ అచరించేవన్నీ మా పాత పద్దతులే కానీ కొత్త గా వెలువడుతున్నాయి.
కరోనాప్పుడు చూడలేదా ఏంటి ! అందరూ షేక్ హ్యాండ్ బదులు నమస్కారం చేయడం , కాళ్ళు , చేతులు కడుక్కోవడం !!!
అయినా నీకూ నేను చెప్పకమానను.
జాగ్రత్త రా అభి ! అని కొంచం తగ్గు స్వరం తో వైజయంతి అనింది .
అభి కూడా ఇంక టూర్ కు వెళ్ళే ముందు కొన్ని పనులుండడంతో నాన్నమ్మతో సంభాషణ పొడగించలేదు.
అనుకున్నట్లే వాళ్ళ స్నేహితులతో మనాలి వెళ్ళి క్షేమంగా తిరిగివ చ్చాడు అభి .
రెండు రోజుల తర్వాత వైజయంతి అభి తో ఒరేయ్ ! నీకు మంచి ఉద్యోగం వస్తే నీవు తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ చేస్తావని మొక్కుకున్నా. మొన్నే చెబుదామని అనుకున్నా ,కానీ నీవు టూర్ వెళ్ళే ఉత్సుకతలో ఉన్నావు , సరేలే వచ్చిన తర్వాత నీకు చెప్పడం సబబని ఆగాను.
అభి : నాన్నమ్మా ! ఎందుకు ఇలాంటి మొక్కులు మొక్కుకొని నన్ను ఇబ్బంది పెడతావ్,?నేను వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తా కానీ నువ్వు కూడా నాతో రావాల్సిందే.
వైజయంతి : ఒరేయ్ అభి! నాకు 71 ఏళ్ళు నిండుతున్నాయి. ఈ వయసులో నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు రా.
కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న దాన్ని, ఎక్కడికిపోయినా సరే వేరే వాళ్ళకి ఇబ్బంది రా.
ఇలా బయ ట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమైనా జరగచ్చు.
నాన్నమ్మా! శుభం పలకమని నీవే చెప్తావు .నీకొక విషయం తెలుసా? మనము ఏదీ ఎలా ఆలోచిస్తే అలానే అన్ని విషయాలు మన జీవితంలో జరుగుతాయి.ఈ జగత్తు మన ఆలోచనలకు తగ్గట్టుగా పరిస్తితులనీ ఆకర్షించే శక్తి కలిగి ఉంది.
వైజయంతి : మొదలు పెట్టావా సైకాలజీ పాఠాలు నా దగ్గర..
అభి : సైకాలజీ పాఠాలు కావు, నీవు కూడా మంచి పలికితే మంచి అవుతుందని ,ఎక్కువగా చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుందని చెప్పేదానివి కదా ! తధాస్తు దేవతలున్నారు అని చెప్తుంటారు కదా ! ఇది కూడా అలాంటిదే . అయినా నేను నీతో ఉంటాను కదా, నీకు ఏఏమీ కాదు, నీ మందులన్నీ నాకు తెలుసు, ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో, కాబట్టి ధైర్యంగా నాతోరా .
వైజయంతి : అయ్యో రామా ! ఆ మందుల పేరు ఎత్తవద్దు, అవేసుకుంటే నాకు ఇంకా నీరసంగా ఉంటుంది రా ! .
అభి: నాన్నమ్మ ! నీకు తెలుసా దీన్ని నేసెబో ఎఫెక్ట్ అంటారు .
ముందే ఆ ఫలానా మందు వేసుకుంటే ఇలా ఉంటుంది అని ఊహించేసుకుని, ఆ మందు వేసుకుంటే నీరసంగా ఉంటుంది అనే భ్రమలో ఉంటావు. నీ నీరసం అదే ..అని నవ్వుతూ అభి అనేసరికి
వైజయంతి కి పౌరుషం తన్నుకొచ్చి.......
కొంచం కోపంగా పదరా పోదాం , నాకేమీ కాదులే .
దాంతో అభి కూడా ఏమీ మాట్లాడకుండా వచ్చే శని -ఆదివారల్లో ప్రయాణం ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ తీసుకున్నాడు.
వస్తాను అనయతే అనింది కానీ లోలోపల భయము వెంటాడుతూనే ఉంది వైజయంతి కి .
అనుక్కునట్టుగానే ఇద్దరూ తిరువణ్ణామలై కి కారులో బయల దేరారు .
అభి వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరూ వాళ్ళ అక్క పురిటి కోసం అమెరికా వెళ్ళారు .
వాళ్ళు కూడా ఫోన్ చేసి అభి మరియు వైజయంతిలకు జాగ్రత్తలు చెప్పారు.
దారిలో ఒక జంతువును అడ్డు తప్పించబోయి అభి తన కారును ఒక చెట్టుకు గుద్దాడు. కారు చెట్టుకు గుద్దుకోగానే అభి స్పృహ తప్పి రక్తపు మడుగులో పడిపోయాడు. పడిపోయిన అభిని చూసి వైజయంతి కాళ్ళు చేతులు ఆడలేదు. తను సీట్ బెల్ట్ పుణ్యమా అని కొద్ది గాయలతో బైటపడింది.
అభి కూడా చాలా జాగ్రత్త పరుడే కాని ఇందాక నాన్నమ్మ కోసం కారు అపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాడు .
అభి ఫోన్ కూడా ఆ కారులో ఇరుక్కు పోయింది. నీకు ఎప్పుడైనా ఏ
అవసర మైనా రావచ్చు, అని అభి ఫ్రెండ్ సాయి నంబర్ తన ఫోన్ లో సేవ్ చేసినట్టు గుర్తువచ్చింది.తన ఫోన్ లో నించి అభి ఫ్రెండ్ సాయికి ఫోన్ చేసింది .
సాయీ : జరిణగినది విని ఎక్కడున్నారు నాన్నమ్మా ? అంటే చెప్పలేని పరిస్థితి,
అప్పుడు సాయి ధైర్యం చెప్పి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి అభి మరియు నాన్నమ్మ ఫోన్ నంబర్ పంపించి ( లొకేషన్ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని) వాళ్ళు బెంగళూరు తిరువాన్నమలై దారిలో ఉన్నారని వాళ్లకు తెలిపాడు, అంతే కాదు ఆ దారిలో తెలిసిన ఫ్రెండ్స్కు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్ళమని , పైగా తాను వచ్చేవరకు వైజయంతిని జాగ్రతగా చూసుకో మని చెప్పాడు.
వైజయంతి చూస్తే వుండగానే అంబులెన్స్ రావడం, అభికి సకాలంలో వైద్యము అందటం, గండం గడవటం జరిగిపొయింది.
అభి ఇంకా సాయి ఫ్రెండ్స్ ఆంబ్యులెన్స్ చేరే సమయానికి హాస్పిటల్ కు చేరుకొని
సాయి కూడా సాయంత్రంని కల్లా ఆసుపత్రి చేరుకొని తన స్నేహితులతో పాటు వైజయంతి కి అండగా నిలిచాడు.
వైజయంతి గమనించింది ఏంటంటే యువత చాలా మంది రక్తదానం చేయటం కోసం రావడం. అదే మాట సాయితో అంటే తను
రక్తం కావాలి అని వర్తమానము పంపిస్తే క్షణాల్లో చాలా మందికి ఫోన్ ద్వారా చేరి దగ్గరున్న వాళ్ళు ఇలా ఇవ్వడానికి వచ్చారని, అభి గురించి , మీ గురించి నేను మా స్నేహితులకు మెసేజ్ పెట్టానని , అందుకే చాలా మంది వెంటనే వచ్చారని చెప్పాడు.
వైజయంతి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎన్నో సార్లు సాయి ధోరణి ,ఈ తరం యువత పద్ధతులు నచ్చలేదని అభి దగ్గర వాపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ వలన తన మనవడు ప్రాణాలతో బయిట పడ్డాడు.
నిజమే! అభి చెప్పినట్టు ఈ తరం లో పుట్టినందుకు అందరినీ అలా
అడిపోసుకోడం మంచిది కాదు , మంచి -చెడూ అన్ని కాలాల్లో నూ ఉన్నాయి.
అప్పుడే కళ్ళు తెరచిన అభిని వైజయంతి హత్తుకొని ఉండబట్టలేక నీవు చెప్పినవి కొన్ని సబబే రా అంది ...
అభి ఏమీ అర్దం కానీ వాడు మల్లే, దేని గురించి నాన్నమ్మా! నీవు మాట్లాడేది? అని అడిగాడు.
వైజయంతి వెంటనే ఈ తరం చాలా మంది చేయూత నివ్వడానికి వెనకడుగు వేయ్యట్లేదు అని, ఎలా స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారో చెప్పసాగింది ----
అభి వెంటనే అది సరేలే నాన్నమ్మా ! నేను చెప్పానా, ఎమర్జెన్సీ నంబర్స్ పెట్టుకోమని, అమ్మ వాళ్లను ఖoగారు పెట్టలేదు కదా? నీవు కూడా ఈ కొన్ని గంటలు ఎంత ఖoగారు పడ్డావో ఏమిటో ! అని నాన్నమ్మని కొంచం ప్రసన్నం చేయడానికి నవ్వుతూ ఇలా కొనసాగించాడు -
నాన్నమ్మా! మీ పాత పద్దతులు మేము పాటిస్తే నిజంగా ఆరోగ్య సమస్యలు దూరం. నీతో ఇందాకే కారులో చెబుదామనుకున్న, అంతలో ఇదంతా జరిగిపోయింది. మరే కొత్త జాడిలో ఇంకో పాత విషయమూ బయిట పడింది! మూడు నాలుగేళ్ల నిమ్మకాయ పచ్చడి జలుబు దగ్గుకు నివారణ అంటా😊
ఒక్కసారి రూమ్ అంతా నవ్వులతో నిండిపోయింది.
అభి, వైజయంతి అను కున్నట్టుగానే అభీ స్నేహితుల సహాయముతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. ఆ రెండురోజులలో అభి స్నేహితులు ఎంత బాగా తనను , అభిని చూసకున్నారో! అది తనకు చాలాఆశ్చర్యానికి గురి చేసింది ..ఏదో ఈతరం వింత పోకడలు నచ్చక వాళ్ళని ఎన్నిసార్లు అడిపోసుకున్నా నో అని గుర్తుచేసుకొని , అభి అన్నట్టు అన్ని తరరాలో మంచి- చెడు రెండూ ఉంటయాని అనుకుంటూ.....
మెల్లగా నడుస్తూ, ఆ శివుడి ధ్యానం వైపు మనస్సు మళ్లించింది .

