మిత్రుడు - ప్రతాప వెంకటసుబ్బారాయుడు

mitrudu

’కస్తూరిబా సేవాశ్రమం’

ఆటో దిగిన రాఘవ ఆటో అతనికి డబ్బులిచ్చి ఆశ్రమంవైపు అడుగులేశాడు.

రంగులు వెలిసిపోయిన బోర్డుని చూసి నిట్టూర్చి. జీర్ణావస్థలో వుండి తుప్పుపట్టి నేడో రేపో అన్నట్టుగా వున్న గేటుని చిన్నగా తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. గేటు నుండి ఆశ్రమందాకా అటూ ఇటూ ఏటవాలుగా అమర్చిన ఇటుకలతో కాలిబాట కూర్చబడి వుంది.

రెండు వైపులా కొన్ని పూలమొక్కలు మరికొన్ని ఫలాల చెట్లూ వున్నాయి. ఆ ప్రాంతాన్ని చూసే దిక్కు లేదన్నట్టుగా చాలా వరకు పిచ్చిమొక్కలూ ఆక్రమించుకుని వున్నాయి. ఆ పరిసరాలు ఊడ్చి కూడా చాలా కాలమైనట్టు చెత్తా చెదారంతో నిండి వున్నాయి.

మూసి వున్న ఆశ్రమపు తలుపుని ఓ పది సార్లు బాదిన తర్వాత సన్నగా వున్న అరవైయేళ్ళాయన తలుపు తీసి ఏమిటన్నట్టుగా విసుగ్గా చూశాడు."మీ ఆశ్రమంలో వున్న సీతారామయ్య జానకి దంపతులని చూడాలని వచ్చాను. దయచేసి పిలుస్తారా?"అన్నాడు.

ఆయన ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.రాఘవ నిలబడలేక కొద్దిదూరంలో మూడు కాళ్ళతో వున్న స్టూలు మీద కూర్చున్నాడు.ఇరవైనిముషాలు అయింతర్వాత నెమ్మదిగా వచ్చారు ఆ దంపతులిద్దరూ. చిక్కి శల్యమైపోయి జీవఛ్ఛవాళ్ళావున్నారు.


వాళ్ళిద్దరినీ చూశాక కన్నీళ్ళతో మసక బారాయి రాఘవ కళ్ళు. వాళ్ళు బాగా దగ్గరికి వచ్చి రాఘవని చూశాక కోపపు ఛాయలు వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి.‘నువ్వని తెలియక అనవసరంగా వచ్చాము. నీతో మేము కలిసి మాట్లాడవలసిన అవసరము లేదు’ అన్నట్టుగా వెనుదిరిగారు."ఆగరా సీతారామం, ఎందుకురా అంత ద్వేషం? నేను తప్పు చేశాను నిజమే కాని ద్వేషించే తత్వం నీది కాదుకదరా."


"నీమీద కోపంవచ్చిన మాట వాస్తవమే..కానీ వెనుదిరగడానికి మాత్రం మా ఇద్దరి ఈ దిక్కుమాలిన అవస్థనీ నీ ముందు పరచడం ఇష్టంలేక"అన్నాడు బాధగా.


వాళ్ళిద్దరినీ అలాచూస్తుంటే రాఘవకి గతం గుర్తుకొచ్చింది. అసలు మర్చిపోతేగా..

అప్పుడు గాంధీనగర్లోని ఒక చిన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండేవారు రాఘవ, సీతారామయ్య***, శ్రీనివాసు, సుబ్బయ్య.నలుగురూ ప్రాణ స్నేహితుల్లా కలసి మెలసి వుండేవారు. ఏది చేసినా కలసి చేసే వారు. వాళ్ళ కుటుంబాలు కూడా కలసి పోవడంతో వుండడానికి కొద్ది దూరంలో వుంటున్నా ఉమ్మడికుటుంబపు బాంధవ్యం వాళ్ళ మధ్య చోటు చేసుకుంది.

అర కొర జీతాలు. అయినా ఒకళ్ళకొకళ్ళకి సాయం చేసుకుంటారు. అందువల్ల కష్టాలు వాళ్ళకి కాస్త దూరంగానే వుండేవి. జీవితంలో ఎక్కువగా డక్కామొక్కీలు తిని వుండడం వల్ల అందరిలోకి కాస్త ఎక్కువ లోకజ్ఞానం కలిగిన వాడు రాఘవే! అందుకే చాలా విషయాల్లో ఆర్ధికంగా చేతులుకాలడానికి ముందే స్నేహితులని హెచ్చరిస్తుండే వాడు. దాంతో అతనంటే వాళ్ళకి గొప్ప నమ్మకం అభిమానం ఏర్పడ్డాయి.

పిల్లల్ని పెంచి పెద్ద చేయడం..చదివించడం తప్పని సరిగా ప్రతివాళ్ళూ చేయాలసిందే! కాని తల్లిదండ్రులు రేపటి తమ భవిష్యత్తుని కూడా దృష్టిలో వుంచుకోవాలి. అందుకు కావాలసిన ఆర్దిక ప్రణాళికలు కూడా రెక్కాడుతున్నప్పుడే వేసుకోవాలి. అదే స్నేహితులతో చెప్పేవాడు. కాని అసలే జీతాలు తక్కువ..పైగా ఏ నెల కా నెలగా వుండేది. అందుచేత ఆ విషయంలో మాత్రం డబ్బు తమకోసం దాచుకునే వారు కాదు.

ఒకరోజు స్నేహితులందర్నీ సమావేశ పరచిన రాఘవ ’ఒరే మనం ఏది చేసినా కలసి మెలసి చేశాము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన ఊరి శివార్లలో ప్లాట్లు వేస్తున్నారట. దానికి మనం డబ్బు నెలె నెల కట్టచ్చుట. మన పేరుమీద స్థలమూ వుంటుంది. మనందరం భవిష్యత్తులో ఇల్లు కట్టుకుని ఎప్పటికి అక్కడ కలసివుండచ్చు.

మన స్నేహం శాశ్వతమవుతుంది. అందరం తీసుకుంటాము కాబట్టి తక్కువకే మాట్లాడాను. మీరు ఊ అనాల్సిందే!" అన్నాడు.రాఘవ ఎంతో బలవంతం చేసిన మీదట "సరే కాని డబ్బు నెల నెలా నీ చేతికే ఇస్తాం. నువ్వే అవన్నీ చూసుకో. "అన్నారు.స్నేహితులు ఒప్పుకున్న ఆనందంలో "సరే" అన్నాడు.సంవత్సరాలు గిర్రున తిరిగాయి.పిల్లలు అడ్డాల నుండి గడ్డాలదాకా ఎదిగారు.

రెక్కలొచ్చాయి ప్రపంచం వాళ్ళకి అందంగా కనిపించసాగింది. ఆడపిల్లల పెళ్ళిల్లకి..మొగపిల్లల చదువులకీ డబ్బు కావలసి వచ్చింది. ఆ భారం మోయలేనిది. ఆస్థులు లేవు అమ్ముకోడానికి. అంతంత అప్పులూ పుట్టవు. సరిగ్గా అక్కడ ఆగిపోయారు.

ఆలోచించగా..ఆలోచించగా వాళ్ళకి రాఘవ తమచేత స్థలం కొనిపించడం గుర్తుకొచ్చింది. కాని రాఘవ మీద నమ్మకంతో డబ్బు ఇవ్వడంతప్ప ఆ స్థలం గురించి ఏమీ తెలియదు. ఎక్కడుందో కూడా తెలియదు. ఒకసారి మిత్రులంతా కలసి వెళ్ళి రాఘవని అడిగారు.

"ఏ స్థలం?" నింపాదిగా అడిగాడు.


"అదేంట్రా నెల నెల జీతంరాగానే ఠంచనుగా డబ్బు తీసుకునే వాడివి ఇప్పుడు ఏస్థలమంటావేమిటీ?"అడిగారు.


"నెల నెల మీ సంపాదన మీరు తినడానికి.. వుండడానికే సరిపోదు పైగా స్థలం కొనడానికి డబ్బు ఇచ్చారా?"అన్నాడు వ్యంగ్యంగా."అవునంకుల్ మీరు అప్పడప్పుడు ఇంటికొచ్చికూడా డబ్బు తీసుకెళ్ళేవారు"అన్నారు గడ్డాలొచ్చి రక్తం ఉరకలెత్తుతున్న పిల్లలు.


"ఇది అన్యాయంరా నిన్ను నమ్మాం. నిన్ను నిలదీయడానికి మా దగ్గర ఆధారాలేమీ లేవు. కానీ దేవుడున్నాడ్రా."అన్నారు బాధగా.ఆ తర్వాత కొంత కాలానికి రాఘవ చెప్పా పెట్టకుండా ఆ ఊరు వదలి వెళ్ళిపోయాడు.ముగ్గురు స్నేహితులు రాఘవని తల్చుకుని దుమ్మెత్తిపోశారు.


దాదాపు పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇంత కాలానికి ఇప్పుడు..ఇలా..


"మీరేంట్రా ఇలా అనాధల్లా.." కళ్ళ నీళ్ళతో బాధగా అడిగాడు రాఘవ.


"నీలాగానే పిల్లలు కూడా మోసంచేశార్రా..ఒకరోజు మమ్మల్ని పెట్టే బేడా సర్దుకోమన్నారు..మేము మమ్మల్ని తీర్ధయాత్రలకి తీసుకెళ్తారేమో అనుకున్నాం..కాని..కాని..ఇక్కడ దింపి..మళ్ళీ జీవితంలో తమకు కనిపించొద్దని చెప్పి వెళ్ళిపోయార్రా.

.ఉన్నట్టుండి అనాధలమైపోయాం..నువ్వు చెప్పింది నిజమేరా..పిల్లల్ని పెంచడంతో పాటు మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాల్రా.."అంటూ బావురుమన్నాడు.

"ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. అందుకే ఆ స్థలాన్ని మీ పేరున భద్రపరిచాను. ‘మీరు ఎక్కడుంటున్నారు..ఏంచేస్తున్నారు..ఎలా అన్యాయమైపోతున్నారు’ అన్నీ తెలుసుకుంటుంటుండే వాడిని. నా దగ్గరికి స్థలం కోసం వచ్చినప్పుడు మీ స్థలం మీకు అప్పగిస్తే ఏం జరిగేది?

దాన్ని అమ్మి మీ పిల్లలకి మరింత అందమైన భవిష్యత్తునిచ్చేవారు అంతేగా. ఇంక ఏడ్వద్దు..పదండి..మీ పేరున అప్పుడు కొన్న స్థలంలో కొంత అమ్మి మీకు చక్కటి ఇల్లు కట్టించాను. మిగిలిన డబ్బు బ్యాంకులో కూడా వేశాను. దానిమీద వచ్చే వడ్డీతో హాయిగా వృద్ధాప్యాన్ని వెళ్ళదీయవచ్చు."అన్నాడు.

‘తమకోసం ఇంతగా ఆలోచించిన రాఘవనా అనుమానించినది? వాడిదెంత ముందు చూపు? పిల్లల కోసం సమస్తం కోల్పోతామని తమకోసం ఎంత జాగ్రత్తపడ్డాడు. రోడ్డుమీద పడిన తమకి మళ్ళీ పూర్వవైభవం తెస్తున్నాడు.’ ఆపుదామనుకున్నా కన్నీళ్ళాగడంలేదు ఆ దంపతులకి.
వాళ్ళని ఆటోలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.

అప్పటికే అక్కడ సీతారామయ్య, శ్రీనివాసు, సుబ్బయ్య వున్నారు వీళ్ళకోసం ఎదురుచూస్తూ."ఒరే! మనకి నిజమైన స్నేహితుడంటే రాఘవేరా..అలాంటి వాళ్ళేరా స్నేహానికి అసలు సిసలైన అర్ధం. పిల్లలకోసం..మనం సమస్తం ధారపోస్తే..దానికి వాళ్ళు మనపట్ల చూపే కృతజ్ఞత నిరాదరణ.

అందుకే పెంచడం..వృద్దిలోకి తీసుకురావడం మన బాధ్యత కాబట్టి చేయడం తప్పుకాదు..కాని రేపు వాళ్ళు మనకి ఆసరా అవుతారనుకోకూడదు. మన జాగ్రత్తలో మనముండాలి. అందరికీ రాఘవలాంటి స్నేహితుడు వుండడుగా. ఏ తల్లిదండ్రుల చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. చివరాఖరికి పిల్లల నిరాదరణకి గురికావడమేనన్నది మీ అందర్నీ ఇక్కడ చూశాక అర్ధమైంది.

మనందరికీ వాడన్నట్టుగానే పక్క పక్కనే ఇళ్ళు కట్టించి..మన స్నేహాన్ని శాశ్వతం చేశాడు. ఇప్పుడు నాకు వృద్ధాప్యం శాపం అనిపించడంలేదు వరమనిపిస్తోంది." అన్నాడు శ్రీనివాసు."సర్లే..సర్లే..బాధ్యతలతో ఇప్పటిదాకా మీరు సుఖపడింది లేదు..పిల్లలు మిమ్మల్ని వదిలించుకున్నారు కాబట్టీ ఇహనుండైనా మీక్కవలసినట్టుగా వుండండి. ఆనందంగా వుండండి"అన్నాడు రాఘవ.

"మాదో కోరికరా రాఘవా! మా తదనంతరం ఈ ఇళ్ళని మా పిల్లలకి మాత్రం ఇవ్వద్దు..మాలాంటి అనాధ దంపతులకి ఆవాసయోగ్యం చెయ్యి చాలు"అన్నారు ముక్తకంఠంతో భారంగా.

మరిన్ని కథలు

Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి
Kodalu diddina kapuram
కోడలు దిద్దిన కాపురం
- - బోగా పురుషోత్తం.
Sarparaju
సర్పరాజు
- కందర్ప మూర్తి
Devaki Vasudevulu
భాగవత కథలు - 18 దేవకీ వసుదేవులు
- కందుల నాగేశ్వరరావు