పాపం జోగినాథం - కె.కె. భాగ్యశ్రీ

pity joginatham

"యా హూ..." దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు ఇంటర్నెట్ లో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ చూస్తున్న జోగినాథం. కొడుకు పెట్టిన గావుకేక విని ఏం పుట్టి మునిగిందోనని పరిగెత్తుకుచ్చింది అతడి తల్లి ఆదిలక్ష్మి.

"కనుగొంటిని... నా దేవిని..." అంటూ ధీర్ఘాలు తీసి మరి రాగాలాపన చేస్తూ బొంగరం లా గిరగిరాలు తిరిగాడు జోగినాథం.

కొడుకు చేస్తున్న ఆనంద తాండవానికి అర్థం తెలియని ఆ అమాయకపు మాతృమూతి "నాన్నా... జోగి... ఎందుకలా అరిచావురా... ఏమైంది?" అడిగింది ఆప్యాయంగా.

నా నిరీక్షణ ఫలించింది. నాకు నచ్చిన అమ్మాయే నీకు కోడలిగా రాబోతోందమ్మా... కలనిజమాయెరా.. కోరిక తీరెగా.... " అంటూ తల్లి చేతులందుకుని హుషారుగా నృత్యం చేయనారంభించాడు.

ఆమె ఆనంద పరవశురాలైంది. "స్వామి... వెంకటరమణా ... ఇన్నాళ్ళకి నా మొర ఆలకించి కరుణించావా తండ్రీ... మా వాడికి పెళ్ళవగానే వచ్చి నీ కొండకొచ్చి తల నీలాలు సమర్పించుకుంటాడు స్వామీ..."

భక్తి తీవ్రత ముప్పిరిగొనగ మొక్కుకుంది ఆదిలక్ష్మి.

జోగినాథం తల్లి వైపు గుర్రుగా చూస్తూ 'నువ్వు తొందరపడి అలాంటి మొక్కులేవి మొక్కుకోకు... పెళ్ళవగానే గుండు కొట్టించుకుంటే హనీమూన్ అంతా బోడిగుండుతో గడపాలి. ... కావలిస్తే... ఆ గుండేదో నాన్న చేయించుకుంటాడులే... ఆయనకెటూ బట్టతలేగా!" అన్నాడు గింగిరాలు తిరిగిన తన ఉంగరాల జుట్టును స్టైల్ గా తడుముకుంటూ..

జో...నా.. తండ్రి వెర్రి వెర్రి చూపులు చూసాడు కొడుకువైపు.

ముచ్చటగా మూడుపదుల వయసు జోగినాథానికి ఇంకా పెళ్ళి కాలేదు.అతగాడు ఆరడుగుల అందగాడు. వేలకు వేలు సంపాదన వచ్చిపడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో వున్నవాడు. ఆకర్షణీయమైన నామధేయం లేకపోయినా, ఆకట్టుకునే రూపం కలిగిన మగధీరుడు.
ఇన్ని మంచి లక్షణాలున్న సదరు జోగినాథం ఇంకా బ్యాచలర్ గా మిగిలిపోవడమేమిటీ? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు.
ఇప్పటికి జోగినాథం నూటిరవయ్యారు సంబంధాలు చూసారు. ఆడపిల్లల కలల రాకుమారిడికీ వుండవలిసిన అర్హతలన్నీ కలిగిన అతగాడికి ఇన్ని సంబధాలు తప్పిపోవడానికి కారణం.. అతడు అమ్మాయిల అందచందాలకి వంకలు పెట్టడమే! లేకపోతే అత్యాశకు పోయి... తనకున్న మార్కెట్ రేటు దృష్ట్యా లక్షలు లక్షల కట్నం డిమాండ్ చేయడమే కాదు. జోగినాథం ఆడపిల్లల అవయవ సౌందర్యాన్ని వేలెత్తి చూపించి, వారి సొమ్ము కోసం కక్కుర్తి పడే కుసంస్కారి కానే కాదు. అయినా సరే... "శత పెళ్ళిచూపుల దినోత్సవం" దిగ్విజయం గా జరుపుకోవడానికి వెనుక ఓ వింత కారణం వుంది. పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయితో ఏకాంతం గా మాట్లాడినప్పుడు ఒకే ఒక వింత షరతుని విధించేవాడు జోగినాథం. తమకి పెళ్ళయిన తరువాత... ఆమె తరపు బంధువు గానీ, తన తరుపు బంధువులు గాని పొరబాటున కూడా తనింటికి రావడానికి వీళ్ళేదని కండీషన్ పెట్టాడు.

చిత్రాతి చిత్రమైనఈ షరతుని విన్న ప్రతీ కన్యామణి ఇతనికి చిత్తచాంచల్యం లాంటి అవలక్షణం ఏదైనా వుందేమోనని భ్రమించి, మరొక ఆలోచన లేకుండా అతడు తనకొద్దని ముఖాన తేల్చి చెప్పేసేది.

ఏ లలనా రత్నమైనా షరతుకి అంగీకరించి తనను పెళ్ళిచేసుకుంటుందేమోనని ఆశగా ఎదురుచూసేవాడు జోగినాథం.

కానీ, బంధుమిత్రులను బద్ద విరోధుల్లా భావించే జోగినాథంలాంటి బడుద్దాయిని చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి పెళ్ళిచేసుకుంటుంది చెప్పండి!.

అసలు... జోగినాథం ఈ వింత షరతుని విధించడం వెనుక ఓ వింత కారణం వుంది. జోగినాథం తండ్రి ఎక్కువమంది బందు బలగాన్ని కలిగి వుండేవాడు, తల్లి కూడా డిట్టో డిట్టో... వచ్చిపోయే బంధు జన సందోహంతో ఇల్లు నిరంతరం పెళ్ళివారిళ్ళులా కిటకిటలాడేది.

ఆదిలక్ష్మి నిత్యం వంట పొయ్యికే అంకితమైపోయి జీవితానికి సార్ధకత ఇంటికొచ్చిన చుట్టాలకు యధాశక్తి మర్యాదలు చేసి, వాళ్ళ మన్ననలు పొందడంలో తప్ప మరి దేనిలోనూ లేదని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది.

ఎప్పుడూ జిడ్డోడుతూ, మాసినబట్టలు కట్టుకుని వంటినిండా మసి మరకలతో కనిపించే భార్యను"కాస్త శుభ్రంగా తయరయ్యి మంచి బట్టలు వేసుకుంటే నీ సొమ్మేం పోయింది?" అంటూ కసురుకునేవాడు జోనా తండ్రి.

కాని, అప్సరసలా తయారయ్యి తనని అలరించేందుకు, ఆమెకు కనీసం రోజు మొత్తం మీద అరగంట సమయమైనా మిగలడం లేదన్న సత్యాన్ని అతడు గుర్తించేవాడు కాదు.

పసివాడైన జోగినాథం మనసులో ఈ సంఘటన చెరగని ముద్ర వేసింది. తన తల్లి యొక్క ఈ దీన స్థితికి కారణం తన ఇంటికి తండోపతండాలుగా వచ్చి వాలే చుట్టాలేనన్న వాస్తవం బోధపడ్డాక అతడికి బంధువులంటే రోత మొదలైంది.

చుట్టల తాకిడి లేకపోతే, తన తల్లి కూడా అడ్వటైజ్ మెంట్స్ లో " మమ్మీ" లా నీట్ గా తయారయ్యి తన ఆలనా పాలనా చూసుకునేది కదా! అన్న భావం ఒకటి అతడి మదిలో అంకురించింది.

పెరిగి పెద్దయి, ఉద్యోగస్తుడయిన తరువాత అతడు ఒక నిర్ధారణకు వచ్చాడు. తాను పెళ్ళంటూ చేసుకుంటే ఎవరూ లేని అనాధ పిల్లని గాని లేకపోతే బంధువులెవర్నీ కూడా దరిచేరనివ్వని పరమ గయ్యాళిని కాని చేసుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాడు.

ఇటువంటి పిచ్చి షరతులు విధిస్తే ఈ జన్మకి పెళ్ళి కాదని, అందరికీ తనలాగానే జరగాలని లేదని నచ్చజెప్పి అతడి మొండి పట్టుదలను రూపుమాపే ప్రయత్నం చేసింది ఆదిలక్ష్మి.

అయినా సరే... జోగినాథం నిర్ణయం లో నో చేంజ్. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న చందాన బిగుసుకు కూర్చున్నాడు.
"మీ నుదుటన కళ్యాణ గీత లేదు కాబోలు... ఏం చేస్తాం? అంతా నీ ఖర్మ!" నుదురు బొప్పికట్టేలా బాదుకుంది ఆదిలక్ష్మి.
ఇక ప్రస్తుతానికొస్తే...

జోగినాథాన్ని అంతగా ఆకట్టుకున్న ఆ పెళ్ళిసంబంధం తాలూకు వివరాలిలా వున్నాయి.

తమ ఏకైక కుమార్తె, అందాల భరిణె అయినా జీవనకు వరుడు కావాలని, అతడు చుట్టపక్కాలను చుట్టు పక్కలకికి కూడా చేరనివ్వని చండశాసనుడై వుండాలని, తమ పిల్లను చేబట్టబోయే వరుడికి అన్నీ ముద్దు ముచ్చట్లని తాము జరిపించగలమని ప్రకటన ఇచ్చారు పిల్ల తల్లి తండ్రులు.

వెదకబోయిన తీగ కాలిని తగిలినట్లుగా ఎగిరి గంతేసాడు జోగినాధం. ఒకానొక శుభముహూర్తాన మాతాపితరులతో కలిసి పెళ్ళిచూపులకి వెళ్ళాడు. ఒకరి షరతులు, నిభంధనలు ఇంకొకరికి అమితంగా నచ్చేయడం తో "శుభస్యశీఘ్రం" అనుకుని ఇరు వర్గాల వారు పెళ్ళికి బంధువులనెవరిని ఆహ్వానించడానికి వీల్లేదని జోగినాధం మంకు పట్టు పట్టాడు. కానీ తండ్రి ఆ పప్పులేం వుడకనివ్వ్లేదు. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి "తూ.." మంత్రంగా చేస్తే అందరూ తనని పీనాసివాడని దుయ్యబడతారని చెప్పి జోగినాథం నోరు మూయించాడు. కావాలిస్తే పెళ్ళయిన తక్షణం వేరింటి కాపురం పెట్టేసుకుని, ఒంటికాయ సొంటికొమ్ములా గడపండని పర్మీషన్ కూడా ఇచ్చేసాడు.

తండ్రి మాటలు విని పరమానందభరితుడైన జోగినాధం. తను,తన అర్ధాంగి జీవన బంధు రహిత జీవనం సాగించబోతున్నాం అని తెలిశాక అతడి సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి.

మరొక ఇరవై రోజుల తరువాత జీవన, జోగినాధం సహధర్మ చారిణిగా అతడి జీవితంలోకి, ఆ తరువాత అతడి టూ బెడ్రూం ఇండివిజ్వల్ హౌజ్ లోకి అడుగుపెట్టింది.

"తేనే చంద్రుని" దర్శనం అయ్యాక హాయిగా జీవించసాగారు దంపతులిద్దరు.

"తాము త్వరలో భాగ్య నగర సందర్శనార్ధం విచ్చేయనున్నామని, అక్కడ వున్న మూడు రోజులు వీరింట్లోనే మకాం వేయబోతున్నమని" ఫోన్ చేసి చెప్పాడు జీవన పిన తండ్రి చిదంబరం ఓనాడు ఉదయాన్నే.

అంతే... ముచ్చెమటలు కమ్మి మిడిగుడ్లు పడ్డాయి జోగినాధానికి. "ఇదేమిటీ? మీ చిన్నాన్న ఇలా ఫోన్ చేసాడు! అసలు నేను పెట్టిన కండిషన్ మీ వాళ్ళకు ఎవరికి తెలియదా! ఆ మాటకొస్తే మీ అమ్మగారి అభీష్టం కూడా అదే కదా! వీళ్ళెలా దిగబడుతున్నారు!" పెద్ద గొంతేసుకుని భార్య మీద గయ్యుమన్నాడు.

"అది... అది... బాబాయ్ కుటుంబం తో నాకు అనుబంధం కాస్త ఎక్కువ. ఆ చనువు కొద్ది నన్ను చూడాలని..." బిక్కచచ్చిపోయి బితుగ్గా బదులిచ్చింది.

చుట్టాలెవరైనా సరే.. ఇంటి దరిదాపులకొస్తే "సూర్యకాంతం' లెవల్లో పెద్ద గొంతేసుకుని వాళ్ళ మీద విరుచుకుపడేదని మీ అమ్మ గారికి మా చేడ్డ పేరుంది కదా! మరి మీకు మీ చిన్నాన్న కుటుంబం తో అటాచ్ మెంట్ ఎలా ఏర్పడింది!" ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసాడు జోగినాదం.

""మా ఇళ్ళకి ఎవరిని ఆవిడ రానిచ్చేది కాదు కాని అప్పుడప్పుడు మేం మాత్రం మా బాబాయ్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంచుమించు నా బాల్యమంతా మా బాబాయ్ గారి దగ్గరే నడిచింది." చావు కబురు చల్లగా చెప్పింది జీవన.

ఖంగు తినడం జోగినాదం వంతయ్యింది. బంధువులను గుమ్మం తొక్కనివ్వని రాకాసి తల్లి పెంపకంలో పెరిగిన జీవన అంతకన్నా రాటుతేలి పోయి, చుట్టాలకు సిం హ స్వప్నమై నిలుస్తుందని ఆశించిన జోగినాధం కలలు కల్లలైనాయి.

పోనీ... కొత్త పెళ్ళానికి ఆనందం కలుగజేసే విధంగా ఈ సారికి ఊరుకుని, ఊరి నుండి రాబోతున్న వారికి ఆతిధ్యం ఇస్తే ఎలా వుంటుంది! ఈ ఆలోచనకే జోగినాధం గుండె గుభిల్లుమంది.

అమ్మో! ఈ చుట్టాలున్నారే! వేలు చూపిస్తే మండ మింగే రకాలు. కాస్త సంధిస్తే... తామర తంపరలల్లే అల్లుకుని, పీల్చి పిప్పి చేసి తన కొంప గుండం చేయరూ! తల్లి లాగే జీవన కూడా... చాకిరీ చేస్తూ.. ధేభ్యం ముఖం వేసుకుని... ఠాట్... అలా జరగడానికి వీల్లేదు. తన ప్రాణం పోయినా సరే బంధువులెవ్వరినీ ఇంట కాలు పెట్టనివ్వడు.

"అప్పుడు నీకు వాళ్ళతో అనుభందముంటే ఉండుగాక! ఇప్పుడు మాత్రం ఎవ్వరూ నా గడప తొక్కేందుకు వీల్లేదంతే! హుంకరించాడు జోగినాధం లేని బింకం తెచ్చుకుని.

"అంతేనా ఈ ఒక్కసారికీ" అర్ధాంగి అరమోడ్పు కళ్ళతో అలా అర్ధింపుగా చూసేసరికి జోగినాధం గుండె తన నెలవు తప్పింది ఒక్క క్షణం.
మనో నిగ్రహం కలిగినవాడు కనుక ఆ చూపుల గారడీలో చిక్కుకు పోకుండా "నథింగ్ డూయింగ్" .. ఒక్క సారీ లేదు... అర సారీ లేదు..." అన్నాడు ఆమే కళ్ళల్లోకి చూడకుండా జాగ్రత్తపడుతూ,

"లాభం లేదు ఎంతగా బతిమిలాడిన ఓ మెట్టు కూడా దిగిరాడీ మొండి మొగుడు. "మనసులోనే కసిగా తిట్టుకుని " సరే.. మీ ఇష్టం" అంది జీవన ముఖం చిన్నబుచ్చుకుని.

అయితే మనం ఊళ్ళో వుండడం లేదని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పై ." హుషారుగా అన్నాడు జోగినాధం.

'అలా చెప్తే మనం ఊరి నుండి తిరిగొచ్చాక వస్తామంటారు" నిర్లిప్తంగా అంది జీవన.

అయితే తరుణోపాయం తానే అలోచించాలి. అనుకున్నాడే కానీ వాళ్ళ రాకను ఎలా నిరోధించాలో జోగినాధం కంప్యూటర్ బుర్రకి తోచలేదు. "చుట్టాలున్నారు", భంధువులొస్తున్నారు" తదితర తెలుగు చిత్ర రాజాల సి.డి. లు తెచ్చుకుని రాత్రి పగలు కళ్ళు కన్నాలు పడేలా చూసినా నో యూజ్...

ఈ ఉపద్రవాన్ని ఎలా అడ్డుకోవాలో ఆలోచించీ..చించీ అతడి కళ్ళు లోతుకుపోయాయి. పట్టుకుచ్చులాంటి వెంట్రుకలు కుచ్చుచ్చులుగా ఊడి చేతులోకొస్తున్నాయి. జుట్టు పీక్కున్నప్పుడల్లా, అప్పటికే పేను కొరికినట్లుగా తయారైన తన అందమైన తలకట్టు ఇంకా పీక్కుంటే రాగి చెంబయిపోయే ప్రమాదముందని ఆ పని మానేసి ఆలోచించడం కొనసాగించాడు.

అలా.. మరి రెండు రోజులు నిద్రాహారాలు మాని మెదడుకి పదును పెట్టగా ఓ మహత్తరమైన ఆలోచన తట్టింది. జోగినాధానికి, దాన్ని యధాతథం గా అమలు పెట్టాలని ముందుకురికాడు జోగినాధం.

అన్నీ సర్దావా! త్వరగా రా.. మళ్ళీ మీ వాళ్ళొచ్చేయగలరు. .." అన్నాడు జొగినాధం హడావుడి పడుతూ. "ఆ.. ఆ.. అయిపోవచ్చింది.." ముచ్చటగా ముప్పై ఒకటవసారి చీర కుచ్చిళ్ళను సవరించుకుంది జీవన. నాలుగైదు రోజుల యోచనా ఫలితంగా ఉద్భవించిన ఐడియా ప్రకారం ఆ బంధువులొచ్చేసరికి తాము ఇంటి పట్టున లేకుండా, భార్యా సమేతం గా బయటకు వెళ్ళి రెండు రోజులపాటు కులాసాగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు జోగినాధం.

వచ్చిన వాళ్ళు, ఇల్లు తాళం పెట్టి ఉండడం గమనించి తమకి ఫోన్ చేసినా సరే.. అనుకోకుండా ఏదో కంపనీ టూర్ తగిలి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందని, జీవనని కూడా తనతో పాటు తీసుకెళ్ళల్సి వచ్చిందని బుకాయిస్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళేమీ చేయలేక ఏ హోటల్లోనో ఉండి ఊరు చుట్టేసి వెళ్ళిపోతారని జోగినాధం అంచనా..

అన్ని రకాలుగా ఆలోచించిన మీదట ఈ ప్లానయితే వర్కవుట్ అవుతుందనిపిచింది.

"నువ్వెళ్ళి బైక్ దగ్గరుండు. నేను ఇంటికి తాళం వేసి వస్తాను. జీవనను బయటకు తరిమి తలుపు గట్టిగా పెట్టి కొత్తగా కొనుక్కొచ్చిన గోడ్రెజ్ కంపనీ వారి అతి పెద్ద తాళం కప్పను బిగించి వేసాడు జోగినాధం. తాళం సరిగ్గా పండిందో లేదోనని

ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని , కూని రాగాలు తీస్తూ బయటకొచ్చాడు.వున్నట్టుండి మనోవల్లభుడిని చెవులు చిల్లులు పడేలా కెవ్వుమని అరిపించింది.జీవన.

గుండెలవిసిపోయిన జోగినాధం ధూ...ధూ... అని వీపు చరచుకుని ఎందుకలా అరిచావు. అని అడిగాడు. ఆగ్రహంగా...

"మరి .. నా హ్యాండ్ బ్యాగ్ లోపలే మరిచిపోయాను. ముద్దులు గునిసింది జీవన. ఆ కులుకులకి కుదేలైపోయాడు జోగినాధం. తాళం చెవి ఆమె చేతికి అందిస్తూ "త్వరగా వెళ్ళి తెచ్చుకో ... ఆ తాళం మాత్రం సరీగా వేయడం మరచిపోకు. అసలే దొంగల బెడద ఎక్కువగా వుంది." అన్నాడు ఆమెను హెచ్చరిస్తూ. జీవన మత్తుగా నవ్వి "క్షణం లో వచ్చేయనూ..!" అంది. అన్నట్లుగానే క్షణం లో తిరిగివచ్చి కీస్ భర్త చేతికి అందించింది.

"సరిగ్గా లాక్ చేసావా!" బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు జోగినాధం.

"నా మీద మీకంత నమ్మకం లేకపోతే వెళ్ళి వేరిఫై చేసుకు రండి ." మూతి బిగించి రుసరుసలాడింది జీవన. మరి లోపలికి వెళ్ళి చూసొచ్చే ఓపిక లేక బైక్ మీద నుండి ముందుకు వంగి, దూరానికి కనిపిస్తున్న తన ఇంటి తలుపుకి వేళ్ళాడుతున్న తాళం కప్పను, తృప్తిగా నిట్టూర్చి బైకె ముందుకురికించాడు జోగినాధం.

వాళ్ళిద్దరూ. హైద్రాబాద్ ఝాం ఝాం ఝాం అంటూ విహరించారు ఇంటికొచ్చేసరికి అవాక్కయి నిలబడి పోయిన జోగినాధాన్ని చూసి
"ఏవిటల్లుడుగారూ! అలా షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయారు". చనువుగా పలకరించాడు చిదంబరం.

"అంతా మనలని చూసిన ఆనందం అయ్యుంటుంది. .. అంతేనా బాబు..." అంది జగదాంబ ముసిముసిగా నవ్వుతూ. వారికి ఏమని బదిలియ్యాలో తెలియక, వారి రాకను జీర్ణించుకోలేక ఆల్లల్లాడిపోయాడు జోగినాధం. ముఖాన చిరునవ్వు అతికించుకుని ముక్తసరిగా వారిని పలకరించి గదిలో దూరాడు. తరువాత జీవన ఒంటరిగా దొరికినప్పుడు"ఇదెలా జరిగింది" అంటూ ఆమె కర్ణభేరి బద్దలయ్యేలా గొంతు చించుకున్నాడు.

జీవనకు ఏపని తగలనివ్వకుండా అన్నీ తానే చేసుకుపోయింది జగదాంబ. రకరకాల వంటకాలు చేసి జోగినాధానికి కడుపు నిండా భోజనం పెట్టింది. చిదంబరం సంగతి సరేసరి...

జోగినాధం తన షరతు సంగతి తాత్కాలికంగా మరిచి వారితో ఎంజాయ్ చేసాడు.వెళ్ళే ముందు వాళ్ళ కుటుంబానికి బట్టలు పెట్టారు జోగినాధం. వాళ్ళకి నచ్చిన వస్తువు కొనుక్కోమని ఐదు వేల రూపాయలు చేతిలోపెట్టారు. తాళం వున్న ఇంట్లోకి వాళ్ళెలా ప్రవేశించారో అర్ధమవట్లేదు.

ఈ విషయంలో వాస్తవం అతడికి ఎట్టి పరిస్థితుల్లో తెలిసే చాన్స్ లేదు. ఆ రోజు హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయానన్న నెపంతో లోపలికి వెళ్ళిన జీవన తలుపు గడియపైన తాళం వేయకుండా, కిందున్న గొనిదకి తాళం కప్ప దిగించి ఆ పైన గడియ మామూలుగా వేసేసి వచ్చేసి తాళం చెవులు భర్త చేతికిచ్చేసింది.

గడియ కింద వేసి వున్న తాళం కప్పను చూసి గడియపైని భ్రమించాడు జోగినాథం.

అంతకు మునుపే పొరిగింటి పిన్నిగారికి, సంగతి వివరించి తన వాళ్ళను ఇంట్లోకి చేర్చే పూచీ ఆమెకు అప్పగించింది. జీవన సాగించిన ఈ మంత్రాంగం అస్సలు తెలియని అమాయక జోగినాధం " మూసి వున్న ఇంట్లోకి బంధువులెలా చొరబడ్డారో " అని ఆలోచిస్తూ బుర్ర బద్దలుకొట్టుకుంటూనే వున్నాడు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు