లేడిగాడు - దవులూరి కృష్ణ మనోహర్ రావు

ledigaadu telugu story by davuluri krishna manohar

అతని పేరు "లేడు" వాళ్ళింటి పేరు కర్రి.ద్రాక్షారం ఆకులోరి వీధిలో ఓ సందులో ఉంటాది వాళ్ళిల్లు. అతనికా పేరు ఎలా వచ్చిందంటే - అతని కంటే ముందు పుట్టినోళ్ళను పుట్టినట్టు యములోళ్ళు తీసుకుపోతుంటే, వాళ్ళమ్మ పుట్టినోడు ఇక్కడ లేడు అనుకొని యములాళ్ళు వెళ్ళిపోతారని ఆ పేరు పెట్టింది. అలానే యములాళ్ళు వాడు ' లేడు ' అనుకొని వెళ్ళిపోయేవారు.

అలా బతికి బట్ట్కట్టిళ్ళే అబద్దం, పెంటయ్య వగైరాలు. మా ప్రాంతంలో ఒకడు పుట్టింది అబద్దమైతే మరొకడ్ని పెంట మీద పారేసి తిరిగి తెచ్చుకున్నారు. పెంటయ్య పేరు పెట్టి.

కానీ వాడికైదేళ్ళప్పుడు కోటి పల్లి శివరాత్రి స్నానాలకెడితే అక్కడ యములాళ్ళు కాడు కనబడ్డాడు. ఆ పేరెట్టి తమని బురిడ కొట్టించేసిందని వాడినొదిలేసి వాళ్ళమ్న్ను పెనాల్టీగా వాళ్ళనాన్నను గోదాట్లో ముంచేసి తీసుకు పోయారు యములాళ్ళు.

వాడికెనకాల ఎనిమిదెకరాల మాగాణి, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వలన చుట్టాల్లో వాడ్నెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కల్సి పెంచేరు.

ఆ ఆస్తే లేకపోతే ఏదో అనాధాశ్రమంలో చేర్చేసి చేతులు దులుపేసుకొనేవారు. కానీ నిజంగా అనాధని చూసినట్టే చూసారు. అందరూ లేడిగా అని పిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా అందరికీ అలానే అలవాటైపోయింది. లేడిగాడికి ముగ్గురు పినతల్లులు. ముగ్గురు మేనత్తలు ఉన్నారు. వాడింట్లో ఒకరి తర్వాత ఒకరు రెండేసి నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్లు వాడి ఆస్తిమీదొచ్చేది సమానంగా పంచుకొనేటట్లు ఒప్పందానికొచ్చారు. గుడి దెగ్గర ఉన్న వాడి కొట్టు వెచ్చా కోమట్ల చేతిలో ఉంది. లేడు తండ్రి ఎవర్నో పట్టుకుని పెద్ద కమెనీకి హోల్ సేల్ రైట్ పొందాడు. ఆ కంపెనీ సరుకులు ఆ కొట్లో పెట్టి నడుపుతూ ఆ పని తన వలన కాదని వెచ్చా వారి కొట్టుకు నెలనెలా అద్దె ఇచ్చేటట్లు ఆ కంపెనీ సరుకుల మీద లాభంలో ప్[అదో వంతు వెచ్చా వారిచ్చేట్లు అగ్రిమెంటు చేసుకున్నాడు. వాడి చదువు మీద ఎవరూ శ్రద్ధ పెట్టలేదు, అయినా పదో తరగతి వరకు చదివాడు హై స్కూల్లో అందరూ చిన్నప్పట్నుంచీ లేడిగాదు అని పిలుస్తూంటే లేడిలా పరిగెత్తాలనుకొని అన్ని పనులూ తొందరగా చేసేవాడు. లేడిగాడికి పద్దెనిమిదేళ్ళు వచ్చాక మేనత్తలు మా పిల్లను చేసుకో మా పిల్లను నీకోసమే కన్నాం. అంటూంటే ఆపీడ పడలేక స్నేహితుడు మాచర్రావు ద్వారా వెంకట్టయ పాలెం తోతొఋఈ అమ్మాయిని చేసుకున్నాడు. లేడుగాడు అంత తెలివి తక్కువ వాడేం కాదు. తన చుట్టల చూపంతా తన ఆస్తి మీదే ఉందని తెలుసు. పెళ్ళి అయ్యాక చుట్టాలనందరినీ తరిమేసాడు.

అనుకొన్న పని అనుకొన్నట్టు తొందరగా చేసేయడమే కాని వెనక్కి చూసే ప్రశ్నే ఉండేది కాదు.మాట తొందర, మనసు మాణిక్యం. అందరూ లేడు అంటున్నారని ఉన్నాననిపించుకోవాలని ఎక్కడలేని సందడి పుట్టించేవాడు. కలకత్తాలో కొన్నాళ్ళుండి వచ్చిన సేత్ తో స్నేహం చేసి బెంగాలి పంచె కట్టు నేర్చుకున్నాడు. పంచె కొసలు లాల్చీ జేబులో దూర్చే నేర్పు సంపాదించాడు.

తెల్లగా సన్నగా పొడువుగా పొడుగాటి ముక్కుతో నోట్లో సిగరెట్టు బెంగాలి పంచెకట్టు లాల్చీతో ద్రాక్షరం సెంటర్లో లేడిగాడు హడావుడిగా తిరుగుతూంటే ఫేమిలీ లేడీస్ కూడా సినిమాకు పోతూ మొగుడు చూడకుండా వెనక్కి తిరిగి వాడ్ని చూసేవారు.

పెళ్ళయిన అయిదేళ్ళలో ఇద్దరు కూతుర్లని కని పెద్ద కూతురుకు పదిహేడు వచ్చేటటప్పటికి పిచ్చికుక్క కరిచి లేడిగాడి భార్య చనిపోయింది. ఆమె సంవత్సరీకం వెళ్ళే లోపలే ఒకే పందిరిలో ఇద్దతు కూతుళ్ళూవీరమ్మ, సత్తెమ్మలకు పెళ్ళిళ్ళు చేసేసేడు. వీరమ్మకు 18ఏళ్ళు, సత్తెమ్మకు 16 ఏళ్ళు. వీరమ్మను తోటపేట, సత్తెమను వెలంపాలెం ఇచ్చాడు.

ఇద్దరికీ చెరో రెండెకరాలూ రాసేసేడు. చెరో పదివేల బాంక్ లో వాళ్ళ పేరు మీద వేశాడు. భార్య నగలు చెరో ఇరవై కాసులు ఇచ్చేశాడు.కాపురాలకు పంపించే ముందు పరోక్షంగా ఆడదిక్కులేని ఇల్లు కనక తరచు రావద్దని చూడాలనిపిఒస్తే తానే వస్తానని చెప్పివేశాడు.

వాళ్ళు తమతో వచ్చి ఉండమని బలవంతం చేశారు వాళ్ళు రమ్మంటున్నది తన డబ్బు దక్కించుకొందామనే కానీ తనమీది ప్రీతితో కాదు అనుకొన్నాడు డబ్బు మీదున్న ప్రీతి, మనిషి మీదుండదని సోయంగా గ్రహించినవాడతను. వెచ్చాషావుకార్లు బేంక్ లో వేసిన డబ్బు అంతా తీసి ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. నెల్నెలా కొట్టు అద్దె వస్తుంది. కౌలుకిచ్చిన భూమి మీద శిస్తు వస్తుంది. లేడిగాడి పని దర్జాగా నడిచిపోతుంది. వెచ్చావారిచ్చే 10శాతం ఎలాగూ వస్తుంది.

రెండుపూట్లకు ప్రొద్దుటే తనే వండుకొని భోజనం చేసేసి పదిగంటలకు ద్రాక్షారం రాగానే ముందు గుడిలోకెళ్ళి భీమేశ్వరుని దర్శించుకొంటాడు.పేరుపేరునా పంతుళ్ళను పలకరించి వస్తాడు. పదకొండింటికి సెంటరుకొస్తాడు. లేడిగాడు రాగానే సెంటర్లో సందడి పెరిగిపోతుంది. వచ్చిందొకడైనా పాతికమందొచ్చినట్లుంటుంది. బ్రాకెట్ ఆడేవాళ్ళతో ఓపింగు, క్లోసింగు నెంబర్ల గురించి దీరీలు తీస్తాడు. రాజకీయలలో ఇంట్రెస్టు ఉన్నవాళ్ళతో వాతో వాటి విషయం చర్చిస్తాడు. రాజకీయ పాఠాలు నేర్పుతాడు.

సినిమాల విషయానికొస్తే సాంఘికాలలో నాగేశ్వరరావు అభిమాని. పౌరాణికాలలో రామారావు అభిమాని. వాళ్ళ మీద ఈగ వాలనీయడు. మధ్యాన్నం రెండు గంటల వరకు అదే కాలక్షేపం. దునే నారాయణ గారి షోడాకొట్టు వద్ద ఒక ఆర్టోస్ వింటో కొని అదేదో విస్కిలాగా అరగంట తాగేవాడు. చవకఅని డక్కన్ సిగరెట్లు కాల్చేవాడు. మరో విధమైన ఖర్చు చేసేవాడు కాడు. మాఘమాసం, కార్తీక మాసాల్లో గుడి చాలా హడావుడిగా ఉంటుంది. అందువలన మధ్యాన్నం రెండు వరకు గుడిలోనే ఉండేవాడు. అందర్నీ క్యూలలో నిలబెట్టడం, భక్తులు అవసరాలేమన్న ఉంటే కనుక్కొని సహాయం చెయ్యడం అతని డ్యూటీ. అక్కడ డ్యూటీ చేసే ఉద్యోగులంతా అధికారంతో డ్యూటీ చేస్తుంటే, లేడిగాడు ఆత్మీయంగా చేసేవాడు.

మధ్యాన్నం రెండు గంటలకు తన సొంత బిజినెస్ ప్రారంభించేవాడు. సెంటర్ లో టీ త్రాగి బేగ్ పట్టుకొని బయలుదేరేవాడు. మొత్తం బజారంతా అతని బిజినెస్ ఏరియానే. అతనిది రోజువారీ వడ్డీవ్యాపారం. అంటే వంద రూపాయలు కావాలంటే 90 రూపాయలిస్తాడు. రోజు రోజూ పదేసి చొప్పున పదిరోజులు కట్టాలి. ఇబ్బందుల వలన బడ్డీ కొట్టు వాళ్ళు, జంగిడీ షావుకార్లు షోడాబళ్ళ వాళ్ళు సరిగ్గా కట్టక పోయినా పెద్ద ఇబ్బంది పెట్టేవాడు కాదు. అందరూ కొంచెం ముందో వెనకో కట్టేవారు. కష్టసుఖాలు తెలిసున్న మనసున్న మనిషి అని అందరూ అతని వద్దే డబ్బు తీసుకునేవారు. ఎవరైనా ఇబ్బందితో కట్టలేకపోతే ఉదారంగా వదిలేసేవాడు కానీ, రాద్దాంతం చేసేవాడు కాడు. ఎవరిదగ్గరా ఆ మాట మాత్రం అనొద్దని మాట మాత్రం తీసుకునేవాడు.

అసలల్లంటి చిల్లర వ్యాపారం చేయాల్సిన అవసరం లేడిగాడ్కి లెదు. లేడిగాడు సెంటర్లో ప్రతి ఒక్కరినీ పలకరించడానికి, వాళ్ళ బాగోగులు కనుక్కోడానికి అవసరమైతే, సహాయం చేయడానికి ఈ వ్యాపరం ఎన్నుకొన్నాడు.

ఎవర్నీ పేరుపెట్టి పిలిచేవాడు కాడు. బావా, అన్నయా, తమ్ముడూ, మావయ్యా, చెల్లీమ్మా, అంటూ వరసలు కలుపుకొని కబుర్లు చెప్పుకోవడానికి బిజినెస్ బాగుండేది. తనకంటే చిన్నావిడను కూడా అక్కయ్యా అని పిలిచినా, పెద్దవాడిని తమ్ముడూ అని పిలిచినా నవ్వుకునేవారే కానీ, కోపగించుకునేవారు కాదు.

లేడి గాడికో చిన్న సరదా ఉండేది. జేబుల్లోంచి రూపాయి తియ్యాలన్నా జేబులో ఉన్న మొత్తం డబ్బు దొంతర తీసేవాడు. అందులో సగం వడ్డీ వ్యాపారం తాలూకు పద్దులే. నైసుగా వంద రూపయల నోట్ల సైజులో కత్తిరించి వంద నోట్ల మధ్య పెట్టేవాడు. అందరూ ఆ బొత్తి అంతా డబ్బే అనుకోవాలని తాపత్రయం అతనిది. సాయంత్రం అయిదింటికి బిజినెస్ అయిపోయేది.

హై స్కూలుకి జూనియర్ కాలేజీకి పెద్ద గ్రౌండు ఉంది. అయిదింటి నుంచి పిల్లలు ఆ గ్రౌండులో రకరకాల ఆటలు ఆడేవారు.

లేడిగాడు అయిదింటికి అక్కడ ప్రత్యక్షమైపోయేవాడు. ఎంతదూరం వెళ్ళినా నడకే దేవుడిచ్చిన బండి ఉండగా ఇంకో బండి ఎందుకురా అనేవాడు.

వయస్సైపోవస్తున్నా కుర్రోళ్ళలొ కుర్రోడై సలహాలిస్తూ వాళ్ళతో ఆటలాడేవాడు. సరదాగా ఉంటుందని వాళ్ళు కూడా లేడిగాడ్ని తమ టీంలలో ఆడనిచ్చేవారు.

"బాల్ బేడ్మెంట్లలో షాటిలా కొట్టాలి..అలా కాదురొరేయ్.." అనేవాడు.

ఫుట్ బాల్ లో "ఇంకా బలంగా తన్నాలిరా..నీ పెళ్ళాం నిన్నింతకంటే గట్టిగా తన్నుతుందిరొరేయ్..." అనే వేళాకోళం చేసేవాడు. చీకటిపడే వరకు పిల్లలతో కాలక్షేపం చేసి వచ్చేసే ముందు వాళ్ళందిరికీ శనగలు, బిస్కత్తులు, కొనిపెట్టి, వాళ్ళు ఆనందంగా తింటుంటే సంతోషించేవాడు. అక్కడి నుండి పిల్లలెళ్ళిపోయినాక కాళ్ళీడ్చుకొంటూ రత్తమ్మ కంపనీకొచ్చేవాడు.

అదెలా జరిగిందంటే, లేడిగాడు పక్కింట్లో ఉండే సుందరమ్మ మొగుడు గల్ఫ్ ఎల్లిపోయినాడు. వెళ్ళేడన్నమాటే గానీ రూపాయ పంపే స్థితి లేదు.

అందుకు సుందరమ్మ ఏమన్నా సర్దగలడని లేడిగాడ్కి లైనేయడం మొదలెట్టింది. " మగాడివి, వంటేం చేసుకుంటావు? పోనీ అదన్నా చేసిపెడతాను .." అంది. దానికీ దీనికీ లేడిగాడు ఒప్పుకోలేదు.

దాంతో సుందరమ్మ లేడిగాడు ఆడంగోడు, అసలా కూతుర్లు వాడికే పుట్టారా అని పుకారు లేవదీసింది. స్వయంపాకం కనుక ఆ పుకారు త్వరగా పాకింది. అసలే లేడి అంటే ఆడది అనే అర్థం ఉంది ఇంగ్లీషులో.దాంతో లేడి గాడికి దిగులట్టుకొంది. అందరూ కరంటుపోయిందనుకొంటున్నరని ఆ మాట, మాటల సందర్భంలో తన స్నేహితుడు , రత్తమ్మ కంపనీ ఓనర్ మచర్రావుతో చెప్పి బాధ పడ్డాడు.

"పెళ్ళి చేసుకో " సలహా ఇచ్చాడు మాచర్రావు.

"ఈ వయస్సుల్లో నాకు పెళ్ళేంటి? దాన్ని కాపలా కాసే కుక్క బ్రతుకైపోతాది నాది.."

"పోనీ దేన్నైనా ఉంచుకో "

"తెల్ల ఏనుగును ఇంటిముందు కట్టుకొన్నట్లవుతుంది దాన్ని మనమెక్కడ పోషించగలం? "

"పోనీ ఇంకా మగాడినేనని అనిపించుకున్నట్లుంటుంది. ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అలాంటి కేసు చూసాతాను. సరేనా..? "

సరేనన్నాడు లేడిగాడు.

రత్తాలుతోపాటే పెద్దాపురం నుంచొచ్చిన దాని చెల్లెలు సీతాలు రత్తాలు కంపనీలో చిల్లర పనులు చేస్తూ కాలం గడుపుతుంది. రంగెలిసిపోయింది కనుక ఎవరూ వాడరు.

సీతాలు నుంచుకోమన్నాడు మాచర్రావు.

" మరీ అంత ముసలి డొక్కునా..?"

" నీవు మగాడివి. ముండ ఉంది, అంతేకానీ అది ముసలిదా, ముతకదా అని ఎవడిక్కావాలి? ఇదైతే రోజుకు పది రూపాయలు పారేస్తే సరిపోతుంది. అది నీకో ళ్లెక్కలోది కాదు. నీకూ మగతనం ఉంది ..ముండని మైంటైన్ చేస్తున్నావని సెంటర్లో అంతా అనుకొంటారు." అని ఒప్పించాడు మాచర్రావు.

లేడిగాడు సీతాల్ని ఎప్పుడూ ముట్టుకోలేదు. బిజినెస్ తో, పిల్లలతో ఆటల్తోటీ అలసి పోయిన కాళ్ళను పిసిగించుకొంటూ నాలుగు సరదా కబుర్లు చెప్పుకొంటూ ఒక గంట గడిపి పది రూపాయలిచ్చేసి పెద్ద పొడిచేసినోడిలా సెంటరుకొచ్చేవాడు రాత్రి పది గంటలకు. పది రూపాయలిచ్చినా ఏ మంగలీ కాళ్ళు పట్టడానికి ఆ టైముకి రాడు. వచ్చినా కరక్టు టైముకి రాడు. అయినా ఆడదాని చేతులు స్పెషలే కదా.

"ఎందుకు బావా ! నీకింకా ఈ సెటప్ " అనెవరైనా అడిగితే " బేటరీ ఇంకా దిగిపోలేదు, ఏం చేయమంటావు " అని ఎదురు ప్రశ్న వేసేవాడు. తన కూతుర్లిద్దరూ ఊర్లో ఉన్నా వాళ్ళిద్దరి దగ్గరకు అంతగా వెళ్ళేవాడు కాడు. ఎంతసేపూ ఆ ఎప్పుడో ఇచేది ఇప్పుడే ఇచ్చేయకూడదా వడ్డీ వ్యాపారం చేసుకొంటానని సతాయిస్తాదని"

చిన్న కూతురు సత్తెమ్మ మొగుడు పనికిరాని పోరంబోకు కనుక పిల్లలకు బట్టలూ అవీ కొనేవాడు.

లేడిగాడు లేకుండా ఊర్లో ఏ శుభకార్యం అయ్యేది కాదు. ఊర్లో పెద్దలు " లేడిగాడెక్కడ ఉన్నాడో చూడండ్రా! ఆడు లేకపోతే ఏ పని అవదు. ఉన్నచోటుండడు. వీడ్ని వెతకటానికి ఇద్దర్ని పెట్టాల్సొస్తుంది. " అని సరదాగా విసుక్కొనేవారు.

గుడిలో జరిగే పెళ్ళిళ్ళ కన్నిటికీ లేడిగాడే పెద్ద. పై గ్రామాల నుండి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళకన్ని విధాలా సాయం చేసేవాడు. రద్దీ ఎక్కువుండడం వలన పొరవాట్న పెళ్ళి కూతుర్ని మార్చేసేడు. సరైన టైములో వాళ్ళు చూసుకొన్నారు. కనుక సరిపోయింది. లేకపోతే కొమ మునిగేది.

రాత్రి పది గంటలకు రత్తమ్మ కంపనీలో డ్యూటీ ముగించుకొని మాచర్రావు , లేడిగాడు బోసు సెంటర్లో కొచ్చి కొప్పిశెట్టి స్వామి నాయుడు షాపు దగ్గర కూర్చొన్నారు.

సప్త గోదారి మీదనుంచొచ్చిన చల్లని గాలిని రావి చెట్లు విసన కర్రాల్లా విసురుతున్నాయి

సెంటర్లో సందడి తగ్గలేదు. ఎప్పుడో రాబోయే పార్లమెంటు ఎలక్షన్ల గురించి పనికిమాన్నోళ్ళంతా కుస్తీపట్లు పడుతున్నారు. ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేవకపోయినా పర్వాలేదుగానీ కాబోయే పార్లమెంటు సభ్యులే ముఖ్యం వాళ్ళకి. పిల్లల చదువు సంధ్యలెలా ఉన్నాయో అవసరం లేదు గానీ పార్లమెంటుకెవరిని పంపాలన్న ఆలోచనే ముఖ్యం.భీమేశ్వరాలలో సీతారముల కళ్యాణం చూతము రారండి పాట వేస్తున్నారు.అందులో ముత్యాల ముగ్గు ఆడతా ఉంది.

"తమ్ముడూ సినిమాకెళ్దామా " అన్నాడు మాచర్రావు లేడిగాడిని. అంతకు ముందు మాచర్రావు లేడిగా అని పిలిచేవాడు గానీ సీతాలును తగిలించిన తర్వాత తమ్ముడూ అని పిలవడం మొదలెట్టాడు. అందర్నీ వరసలతో పిలుచుకొనే లేడిగాడికి అది క్రొత్తగా అనిపించలేదూ. బాగానే ఉన్నట్టనిపించింది.

" హీరో ఎవరు ? " లేడిగాడడిగాడు.

శ్రీధర్ అనేవోడులే "నేను ఎంటీ ఆర్, ఏ ఎన్ ఆర్ ల సినిమాలు తప్ప వేరేయి చూడను కదా.."

" అది కాదు, రావు గోపాల రావు కేరెక్టరు చాలా గొప్పగా ఉంటుందట.. అందరూ చెప్పుకొంటున్నారు.

" అసలాడేవూరంట? "

మన పిఠాపురం దగ్గరే పల్లెటూరు. పైగా డైరక్టరు బాపుగారు. గొప్ప పేరు.

బాపు గారు అంటే నాగేశ్వర రావు తో బుద్దిమంతుడు సినిమా తీసినాయినేనా?

"అవున్మ్రా బాబూ "

"అయితే సరే "నాగేశ్వర రావునే డైరక్టు చేసేడని బాపూ మీద గౌరవం తోనూ రావు గోపాల రావు తూ.గో జిల్లా వాడన్న అభిమానం తోనూ సినిమాకెళ్ళడానికి ఒప్పుకున్నాడు లేడిగాడు.

అందులో రావు గోపాల రావు డైలాగు " మనిసన్నాక కాస్తంత కాస్త కలా పోసనుండాలి లేకపోతే మనిసికీ,గొడ్డుకి తేడా ఏటుంటది? " అన్న డైలాగు లేడిగాడికి బాగా వంటబట్టింది.

సీతాలు నుంచుకొని కొంత కల్లాపోసన చేస్తున్నట్టు కనబడుతున్నాడు కనుక దానిలాగే తక్కువ ఖర్చుతో కలాపోసన చేయాలని డిసైడైపోయాడు.

ఆమాటే మాచర్రావుతో అన్నాడు.

"కల్లపోసన చేసేవోల్లంతా గుళ్ళదగ్గర అడుక్కుంటున్నారు. ఆజోలికి పోవద్దురా తమ్ముడూ " అన్నాడు మాచర్రవు.

"డిసైడైపోయాక మడం తిప్పటం మగతనం కాదు.."

"అయితే ఈలపాట రఘురామయ్య గారి కురుక్షేత్రం తెప్పించమంటావా"

"చవితి పందిర్లలోనూ కార్తీక దీపారాధనకి చాలాసార్లు ఏసేరు. అయినా పౌరాణికాలొద్దు.

రామారావు గాని కృష్ణుడుగా, చూసిన కళ్ళతో ఈ సన్నాసుల్ని చూడలేను. అందుకే మరోటి ఆలోచించు. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం లాంటివైతే ఎలాగుంటాయి?

చీచీ..కోడిపందేలు గురించి, మనుషుల్ని చంపుకొనే వాళ్ళంటే నాకు చిరాకు.

మరేదీ నచ్చకపోతే నీవే ఏదో ఒకటి చెప్పుచ్చు కదా

ఏదన్నా సాంఘిక నాటకం చూడు ఏయిద్దాం.

అయితే దుర్గా ఆర్టు వాళ్ళచేత వేయిద్దామా?

ఆళ్ళెప్పుడూ గాలివానతోనే కొట్టుకు పోతాఉంటారు అయినా టిక్కెట్టెట్టి ఆ పాత దెవడు చూస్తాడు?

ఏంటీ టిక్కెట్టు నాటకమా? సాంఘిక నాటకం టిక్కెట్టు కొని ఎవడు చూస్తాడు? ఇదేం రక్త కన్నీరు కాదుగా..

మనం అలవాటు చేయాలి అన్నయ్యా అందుకే మనమే కొత్తది వేయాలి

ఏడ్చినట్టుంది ఈలోపలే నీవారిపోతావు.

మంచిపని చేసేప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేయాలి తప్ప నీరు కార్చకూడదని మాచర్రవుని బతిమాలేడు లేడిగాడు.

అయితే డిసైడైపోతే అయిపోయారు గానీ ఇద్దరికీ దానిగురించి ఏమీ తెలియదు..

..కళాపోసన గురించి ఎబిసిడిలు నేర్చుకొంటున్నాడు లేడి గాడు.

ముందో బేనర్ పేరు సెలెక్టు చేయాలి అన్నాడు ఏసుబాబు.

లేడు, లేక పోలేదు. హైస్కూల్ పిల్లల గుండెల్లో లేడిలా గంతులేస్తానే ఉన్నాడు. చొట్టూ వున్న చెట్ల మీద కూర్చుని వాళ్ళ ఆటల్ని చూస్తూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.

లేడు లేకపోలేదు, చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళను బావా, అన్నాయ్యా అని ఆప్యాంగా పలకరిస్తూనే ఉన్నాడు. కషటం లో వున్న వాళ్ళకు జ్ఞాపకం వస్తూనే వున్నాడు. అతని ఆత్మ సెంటర్ లో అందర్నీ భుజం తట్టి పిలుస్తూనే వుంది.

గుడి తెరవగానే భీమేశ్వరుని మొదటి దర్షించేది లేడిగాడి ఆత్మే అని నమ్ముతారు. ద్రక్షారంతో మమేకమైన లేడిగాడి ఆత్మ పున్ర్జన్మ పొందితే తప్పక ద్రాక్షారం లోనే పుడతానని ఘాడంగా విశ్వసిస్తారు.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ