ఎద మాటు గానం - లాస్య రామకృష్ణ

Eda Maatu Gaanam

నాకు మ్యూజిక్ అన్నా, డాన్సు అన్నా చాలా ఇష్టం. పాటలు వినడం అంటే ఇంకా ఇష్టం.

నాకు పాటలు సెలెక్ట్ చేసుకుని వినడం నచ్చదు. తరువాత వస్తున్న పాట ఎప్పుడూ సస్పెన్స్ గా ఉండాలి. అందుకే నేను రేడియోనే ప్రిఫర్ చేస్తాను. ఈ దేశం లో తెలుగు పాటలు వినాలంటే ఆన్ లైనే దిక్కు. అందుకే ఆన్‌లైన్ రేడియో లో సాంగ్స్ వినటం నాకు చాలా ఇష్టం.

అలా సరదాగా సాంగ్స్ వింటుంటే నాకిష్టమైన పాట రావడం మొదలయింది.

"ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన,

ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన

చుట్టంలా వస్తావే చూసేళ్లి పోతావే

అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే

చెయ్యారా చేరదీసుకోనా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా..."

ఈ పాట నా ఎద మాటు జ్ఞాపకాలని నిద్రలేపుతోంది.

సంగీతానికి జ్ఞాపకాలకి అవినాభావ సంబంధం ఉందని మీరు నమ్ముతారా.

నేను నమ్ముతాను.

ఆ జ్ఞాపకాలు సంతోషకరమైనవి కావచ్చు, బాధాకరమైనవి కావచ్చు, అసలు ఎటువంటి విశేషం లేనివీ కావచ్చు.

కొన్ని సందర్భాలలో విన్న పాటలు ఆ సందర్భాల్ని గుర్తు చేసేలా ఉంటాయి. ఉదాహరణకి మీరు మీ ప్రియురాలితో సరదాగా ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళారనుకోండి అక్కడ మీకు వినిపించిన మెలోడీయస్ సాంగ్ ని మళ్ళీ మీరు విన్నప్పుడల్లా అదే షాపింగ్ మాల్ లో మీరు మీ ప్రియురాలితో కలిసి వెళ్ళిన జ్ఞాపకం వెంటాడుతుంది.

ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పలేను. కానీ నాకు మాత్రం వర్తిస్తుంది.

అలా వర్షం సినిమాలోని ఈ పాట వింటున్నప్పుడు మెల్లగా నాలోని జ్ఞాపకాలు దృశ్య రూపం లో నా మదిలో మెదలసాగాయి.

ఆ రోజు వర్షం సినిమా పాట ప్లే అవుతుండగా స్వతహాగా డాన్సు అంటే ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఆ పాటంటే మక్కువ తో డాన్సు చెయ్యడం మొదలుపెట్టాను.

నాలో ఉన్న గొప్పతనం ఒక్క సారి చూసిన స్టెప్స్ ని గమనించి అవే స్టెప్స్ ని రెండో సారి చూడకుండా కరెక్ట్ గా చెయ్యగలను. నా ఈ టాలెంట్ నాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. మా కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పకుండా నేను పాల్గొనే దానిని. ఒక వేళ నేను పాల్గొనడానికి ఆసక్తి చూపించక పోయినా మా స్నేహితురాళ్ళు, లెక్చరర్లు నా పేరు ని పరిశీలనలో పెట్టేవాళ్ళు. అంతటి నమ్మకం నా నాట్యం అంటే.

అలా ఆ పాట కి మైమరచి నా రూం లో డాన్సు చేస్తున్న సమయం లో ఎవరో నా రూం లో కి అడుగు పెట్టినట్టు అనిపించింది. సాధారణంగా నేను డాన్సు చేస్తున్నప్పుడు నా ఏకాగ్రతకి భంగం కలగకుండా గది తలుపులు వేసుకుంటాను. కానీ ఈ సారి వేసుకోలేదు.

ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు మా అన్నయ్య. నన్ను అన్ని విధాలా ప్రోత్సహించే వ్యక్తి. అటువంటి మా అన్నయ్య ఆ రోజు నా గదిలోకి వచ్చి స్పీడ్ గా వెళ్లి సిస్టం ని ఆఫ్ చేసి నా దగ్గరికి కోపంగా వచ్చాడు.

ఎప్పుడూ ఎంతో ఆనందంగా, ప్రశాంతం గా ఉండే మా అన్నయ్య కళ్ళలో ని తీవ్రమైన కోపాన్ని చూసి ఆ రోజు నేను ఎంతో భయపడ్డాను.

"అన్నయ్య, ఏం జరిగింది"

"ఇంకా, ఏం జరగాలి"

"నాకేం అర్ధం కావట్లేదు. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో"

"చిన్నపిల్లవి కదా అని నిన్ను ఇంట్లో అందరూ గారం చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు"

"ఏమైంది. కొంచెం నాకు అర్ధం అయ్యేటట్టు చెప్పు"

"ఏంటి ఈ లెటర్"

"లెటర్ ఏంటి"

"అదే ఈ లెటర్ ఏంటి"

"నాకు తెలీదు"

"నీకు తెలియకుండా నీ బాగ్ లో ఉంటుందా"

"నా బాగ్ లో ఉందా. ఏదీ ఒక సారి చూడనివ్వు"

"ఏంటి చూసేది. ముందు ఈ విషయం చెప్పు ఏంటి ఈ లెటర్"

"నిజం గా నాకు తెలియదు అన్నయ్య"

"నీ సంగతి ఇలా కాదు ముందు నాన్న గారి దగ్గరికి వెళ్లి చెప్పాలి"

"అన్నయ్య ప్లీజ్, అసలు జరిగినదేంటో పూర్తిగా చెప్పకుండా ఇలా ఎందుకు చేస్తున్నావు"

"ఎంత బాగా నటిస్తున్నావే, చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకురాలిలా బాగా నటిస్తున్నావ్"

ఒక్క సారిగా అన్నయ్య అంత మాట అనేసరికి నా హృదయం బాధతో నిండిపోయింది.

నన్ను ఎంతగానో అభిమానించే అన్నయ్యేనా ఇలా మాట్లాడగలుగుతోంది. ఇంట్లో నాన్నగారు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అన్నయ్యకు తెలుసు. నాన్నతో ఈ విషయం చెప్తానంటాడు. అసలు ఇది ఏ విషయమో నాకు చెప్పకుండా ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు.

చిన్నప్పుడు ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను నడవలేకపోయినప్పుడు నన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చాడు. స్కూల్ నుండి ఇల్లు ఎంత దూరంగా ఉండేదో.

అలాగే ఎన్నో సార్లు అమ్మా నాన్నా ముందు నా అల్లరి చేష్టలను వెనకేసుకు వచ్చేవాడు.

స్కూల్ లో పిల్లలకి మా అన్నయ్య అంటే హడల్. తను ఆ ఇమేజ్ నా కోసమే సృష్టించుకున్నాడు. లక్ష్మీ సినిమాలో వెంకటేష్ అంత బిల్డ్ అప్ ఇచ్చుకునేవాడు. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు అన్నది అన్నయ్య ఉద్దేశ్యం.

టీనేజ్ లోకి వచ్చాక అబ్బాయిలు కామెంట్స్ చెయ్యడానికి భయపడేవారు ఎందుకంటే బాడీ గార్డ్ లాంటి మా అన్నయ్య నా వెంట ఉన్నాడు కదా.

ఆ రోజు ఇంటర్ లో జరిగిన సంగతి నాకింకా గుర్తుంది.

ఒక అబ్బాయి నాతో మాట్లాడాలని ఏంతో ఆశతో దగ్గరికి వచ్చాడు. ఇంతలో నా వెనుకే ఉన్న అన్నయ్యను చూసి తను నడుస్తున్న తోవను గమనించకుండా గుంటలో పడిపోయాడు. ఫన్నీ ఇన్సిడెంట్. పాపం ఆ అబ్బాయి.

అలాంటి అన్నయ్య నన్ను అనుమానిస్తున్నాడా. ఆ లెటర్ ఏంటి నా బాగ్ లో ఉండటం ఏంటి నాకేం తోచట్లేదు.

అది లవ్ లెటరా? అఫ్ కోర్స్ అందమైన చెల్లెలికి లవ్ లెటర్స్ రావడం సహజమే కదా. మరి అన్నయ్య నన్ను అనుమానించడం నన్ను అతిగా బాధిస్తోంది.

బతిమిలాడుతూ అడిగాను

"అన్నయ్య, ప్లీజ్ చెప్పవా, ఆ లెటర్ గురించి నాకేం తెలియదు."

"నేను నమ్మను"

"ప్లీజ్"

"సరే, బట్ ఆన్ వన్ కండిషన్"

"చెప్పు,"

"ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదు"

"ఏంటి" ఆశ్చర్యం గా అడిగాను

"యా, ప్రామిస్ మీ"

"ప్రామిస్"

వెంటనే కామెడీ మూడ్ లో కి వచ్చి

"ఒసేయ్, ప్లీజే, నీ ఫ్రెండ్ అంకిత కి ఈ లెటర్ ఇవ్వవే"

ఒక్క క్షణం నాకు షాక్

ఇంతసేపు లెటర్ ఏంటి లెటర్ ఏంటి అని నన్ను హింసించి ఆ లెటర్ తను నా ఫ్రెండ్ కి రాసి ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడా

"ఏంట్రా అంటున్నావ్"

"అవునే, ఈ లెటర్ నీ ఫ్రెండ్ అంకిత కి ఇవ్వు. నువ్వు మాత్రం చదవకు చిన్నపిల్లవి"

"మరి ఇంత సేపు నన్ను ఏడిపించావు కదరా"

"ఏదో కామెడీ కి అలా చేసాను. మా చిట్టి తల్లి కదూ, వెళ్ళమ్మా వెళ్ళు ఈ లెటర్ అంకిత కి ఇచ్చి తనేం చెప్పిందో నాకు చెప్పు"

"సరే,"

"థాంక్స్. ఎంతైనా నువ్వు నా బంగారు కొండవి కదా"

"అవును" అని మనసులో నా వ్యూహాన్ని అన్నయ్య ముందు బయటపెట్టలేదు

ఆ లెటర్ ని సరా సరి అన్నయ్య అంటే ఇష్టపడే మా ఎదురింటి రంజిత కి ఇచ్చాను.

రంజిత లావుగా పొట్టిగా ఉంటుంది. ఇంటర్ తో నే చదువు ఆపేసింది. లెటర్ తీసుకున్నప్పటి నుంచి అన్నయ్య పైనే వళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది.

లెటర్ సంగతి తెలియని అంకిత ని చూసినప్పుడల్లా అన్నయ తను ఆ లెటర్ చదివి ఉంటుందని మెలికలు తిరిగి పోతూ ఉంటాడు.

అన్నయ్యే లెటర్ ఇచ్చాడని అనుకున్న రంజిత అన్నయ్యని చూడగానే వయ్యారాలు పోతూ ఉండేది.

నాకు మాత్రమే తెలిసిన రహస్యం కావడం వల్ల వాళ్ళ రియాక్షన్స్ చూసి మనసులోనే ఆనందించేదాన్ని.

కానీ ఆ రోజు నేను ఆడిన నాటకం బయట పడే రోజు వచ్చింది

ఆ రోజు అంకిత నా కోసం మా ఇంటికి వచ్చింది. తను సన్నగా పొడవుగా నాజుగ్గా ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అన్నయ్య పడిపోయాడు.

వాళ్ళేం మాట్లాడుకుంటారో విందామని నేను గోడచాటు గా గమనిస్తున్నాను.

తను రాగానే అన్నయ్య సిగ్గు పడిపోతూ

"చదివారా" అని అడిగాడు

ఎగ్జామ్స్ కాబట్టి చదువు గురించి అడుగుతున్నాడని అనుకుంది కాబోలు పాపం అంకిత "చదివాను" అని సిగ్గు పడుతూ సమాధానం ఇచ్చింది. మగవాళ్ళతో మాట్లాడడం అంకిత కి అలవాటు లేని కారణం గా వచ్చిన సిగ్గు ఇది.

"మరి మీ ఉద్దేశ్యం ఏంటి" అని అన్నయ్య మళ్ళీ అంకితను అడిగాడు

ఏం ఉద్దేశ్యం గురించి అడుగుతున్నాడో అంకిత కి అర్ధం కాలేదు. ఒహో పరీక్షలలో పాస్ అవుతానా లేదా నని అడుగుతున్నాడు కాబోసు అని

"పాస్ అవ్వాలి" అని సమాధానం చెప్పింది

ఇదేంటి ఉద్దేశ్యం ఏంటి అంటే "పాస్ అవ్వాలి అని సమాధానం చెప్పిందేంటి" ఓహో ప్రేమలో పాస్ అవ్వాలి అని అర్ధమా అనుకుని

"ఎలా" అని అన్నయ్య మళ్ళీ అడిగాడు

"బాగా అర్ధం చేసుకుని చదవాలి"

అర్ధం చేసుకుని చదవాలి అంటే మనసులని అర్ధం చేసుకుని ఒకరి కొకరు చదువుకోవాలి అని ఆహా ఎంత బాగా చెప్పింది అంకిత అని తనలో తనే మురిసిపోయాడు.

"మరి అర్ధం చేసుకుంటున్నారా" అన్న అన్నయ్య ప్రశ్నకు

"యా రొజూ అదే పనిలో ఉన్నాను" అని అంకిత సమాధానమిచ్చింది

'దొంగ, ఇన్నాళ్ళు దొంగ చాటుగా నా మనసుని అర్ధం చేసుకునే పనిలో ఉందన్నమాట . తనే సూపర్ ఫాస్ట్ గా ఉంది. నేనేమో ఒక లెటర్ ఇచ్చేసి ఊరుకున్నాను. ఆలస్యం చెయ్యకుండా నేను కూడా అర్ధం చేసుకోవడం ప్రారంభించాలి.'అని అనుకుని మనసులోనే ప్రణాళికలు వెయ్యడం ప్రారంభించాడు.

"మీరు అర్ధం చేసుకుంటున్నారు సరే మరి నేను కూడా అర్ధం చేసుకోవాలనుకుంటున్నాను" అని అంకిత తో అన్నయ్య అన్నాడు

"అయితే చేసుకోండి"

"మరి ఎలా అర్ధం చేసుకోవాలి, నాక్కొంచెం చెప్పరు"

"ఏముంది పదే పదే చదవండి. అర్ధం కాకపోతే ట్యూషన్ మాస్టర్ ని అడగండి"

"ఆఆఆ, మధ్యలో వీడెవడు"

"అదే నండి అర్ధం కాకపోతే అర్ధం అయ్యేటట్టు చెప్పటానికి మాస్టర్ ని అడగండి"

ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అసలు ఇది మాట్లాడేది ప్రేమ గురించేనా అనుకుంటున్న సమయం లో ఎదురింటి రంజిత వచ్చింది.

ఈలోపు అంకిత "అనూ కి ఈ బుక్ ఇవ్వండి" అని వెళ్ళిపోయింది.

ఆ తరువాత రంజిత అన్నయ్యతో "అభి, నీకు నీలం రంగు ఇష్టమని ఇదిగో నీకోసమే ఈ చీర కట్టుకున్నాను అనేసరికి" అన్నయ్యకి విషయం అర్ధమయింది. నేను ఇంక ఒకటే నవ్వు. నా నవ్వుని గమనించి ఇదంతా నేను చేసిన పనే నని అన్నయ్య గ్రహించాడు.

మా అన్నయ్య నన్ను కోపం గా చూడడం ప్రారంభించాడు.

ఇక చూడండి నా పరిస్థితి ఇల్లంతా పరుగో పరుగు నేను మా అన్నయ్య చేతిలోని దెబ్బలు తప్పించుకునేందుకు.

ఎలాగైతేనేం నేనే అంకితతో అన్నయ్య విషయం చెప్పి వాళ్ళని ప్రేమికులుగా కలిపాను.

చదువైపోయాక అంకిత మా వదిన అయింది. మా అన్నయ్యకి ముంబై లో ఉద్యోగం వస్తే అక్కడే సెటిల్ అయ్యాడు.

మధ్య మధ్యలో ఎప్పుడు కలిసినా మేం ముగ్గురం ఈ విషయాన్నీ తలచుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాము.

నేను పై చదువుల కోసం అమెరికా కి వచ్చాను. ఇక్కడ కి వచ్చినప్పటి నుంచి మెకానికల్ లైఫ్. మన కోసం మనకి ఇచ్చుకోవడానికి కూడా సమయం ఉండదు.


కాలం తో పరుగులు పెడితే కానీ ఈ పోటీ ప్రపంచం లో నెగ్గుకు రాలేము.


ఇక్కడికి వచ్చాక నా హాబీస్ అన్ని రూఫ్ ఎక్కాయి.


మొత్తానికి ఎలాగో ఒకలా ఇవాళ్టికి నాకంటూ కొంత సమయం చిక్కింది. లేదు చిక్కించుకున్నాను.


రిలాక్స్ డ్ గా ఉంటుందని ఆన్ లైన్ రేడియో ని ఆన్ చేస్తే అలా అలా ఒక సరదా సంఘటనని జ్ఞప్తి కి తెచ్చింది. అందుకే నాకు ఈ పాటంటే చాలా ఇష్టం.


ఇంతలో ఎవరో బెల్ నొక్కినట్టు అనిపించింది. ఎదురుగా నా కలల రాకుమారుడిలా ఉన్న ఒక అబ్బాయి చేతిలో ఒక లెటర్ తో నిలబడి ఉన్నాడు. ఆ లెటర్ నాకోసమే అని నాకు అర్ధమయింది.

రేడియో లో ఇప్పుడు "మనసంతా నువ్వే" అన్న పాట వస్తోంది.


అందమైన బంధానికి సిద్దం కమ్మని నా మనసు పలికింది.

***

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ