వాసవీ కాలనీ బస్టాప్ - పివిడియస్ ప్రకాష్

vasavi colony busstop

"మమ్మీ! ఏమాటకామాటే చెప్పాలే. ప్లేట్లో చందమామల్లా కనిపించే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకోగానే వెన్నముద్దల్లా కరిగిపోతున్నాయి. ఏ హోటల్లో తిన్నా ఈ ఇడ్లీల రుచి రమ్మంటే రాదుగా..నువ్వలా వడ్డిస్తూ ఎన్ని తిన్నావని అడిగావనుకో, నా మాథమేటిక్స్ తప్పు చెప్తాయి." అన్నాడు అభినందనగా కృష్ణతేజ.

"అంతలా నీకు నువ్వే దిష్టి పెట్టుకోకు. రాళ్ళయినా తిని అరిగించుకునే వయసు నీది. ఈ ఇడ్లీలదేముంది?" అంటూ మాలక్ష్మి మరో రెండు ఇద్లీల్ని అతడి ప్లేట్లో వేసింది. "అమ్మో మళ్ళీ ఇడ్లీలా?"

"ఏదో అయ్యర్ హోటల్లో ఆర్డరిచ్చినట్టు అంత అల్పంగా తింటావేం? కాస్త కొబ్బరి చెట్నీ వేసుకుని ఈ రెండూ కానిచ్చేసెయ్" ముద్దుగా గదమాయించింది కొడుకుని.

"ఇన్ని ఇడ్లీలు తిన్న తర్వాత అఫీసులో పని చేయగలనా? అన్నదే నా డౌట్" అన్నాడు కృష్ణతేజ. ఇంతలో సిటీ బస్ హారన్ గట్టిగా వినిపించింది. ఆ సౌండ్ వినగానే కూచున్న చోట్లోంచి ఒక్క ఉదుటన ఎగిరి గంతేసాడు కృష్ణతేజ.

"ఏమైందీ?"

"బస్ హారన్ మోగుతోందే"

"అయితే?"

"నా గెస్ కరెక్ట్ అయితే అది నంబర్ టెన్ డైరెక్ట్ బస్సే. ఈ బస్ కానీ తప్పిపోతే నరకమే. ఆ తర్వాత ఇక్కడ్నుంచీ రేతిఫైల్ బస్ స్టేషన్..అక్కడ్ణుంచీ సికింద్రాబాద్ స్టేషన్ వరకూ నడక.. ఆ పై సగం దూరం వరకూ ఓ బస్.. ఆఫీస్ దాకా ఇంకో బస్..అలా అంచెలంచెలుగా సిటీ బస్ లు అందుకుంటూ నే వెళ్ళే సరికి అఫీసు మూసే వేళవుతుంది. ఇంత ప్రయాసపడి అక్కడ చేసేదేముంటుంది? వెంటనే యూ టర్న్ తీసుకుని మన కాలనీకొచ్చే బస్ పట్టుకోవడమే..." గబగబా వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి చేతులు కడుక్కుని తువ్వాలు కోసం చూడకుండా అందుబాటులో ఉన్న అమ్మ చీరకొంగుతో వాటిని తుడిచేసుకున్నాడు.

ఆ తర్వాత అంతే హడావుడితో అప్పటికే సర్ది ఉంచిన బ్యాగ్ భుజాన వేసుకుని గేట్ తలుపులు తెరచి పరుగందుకున్నాడు.
"తను...తనతో పాటు పక్కవాళ్ళనీ ఆఖరి నిముషంలో గాభరా పెట్టడం...చిన్నప్పట్నుంచీ వీడింతే" అనుకుంటూ గేట్ మూసి ఇలా లోనికొచ్చిందో లేదో అలా తలుపు చప్పుడైంది.
తెరచి చూస్తే ఎదురుగా కృష్ణతేజ.
"ఏమైనా మరచిపోయావా?"
"లేదు...?"
"అఫీసు లేదా"
"బస్ లేదు"
"తుపాను మెయిల్లా వెళ్ళావ్ కదా ఆ డొక్కు సిటీబస్ అందుకోలేకపోయావా?""
"అందుకోలేనంత వేగంతో వెళ్ళిపోయింది" చెప్పాడు కృష్ణతేజ.
"మరో బస్ రావాలంటే ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది. వెధవ బస్...వెళ్ళిపోతోందని నోట్లో ఇద్లీ గొంతులో దిగబడ్డా కనీసం మంచినీళ్ళు తాగకుండా పరుగు తీసాను. ఆయాసం తప్ప..బస్ అందలేదు." చిరాగ్గా అన్నాడు కృష్ణతేజ.
అతడి మాట పూర్తవకుండానే ఓ గ్లాస్ తో మంచినీళ్ళు తెచ్చింది మాలక్ష్మి.
"అందుకే నిన్ను అమ్మ అన్నారు.మనసులో అనుకున్నది మాటల్లోకి రాకుండానే అమలు చేసేస్తావ్."గడాగడా మంచినీళ్ళు తాగుతూ గలగలా అన్నాడతడు.
"ఈ మాటలకేం గానీ..తొందరగా వెళ్ళి ఈ సారైనా బస్ పట్టుకో" సూచించింది మాలక్ష్మి.
"ఓ..అలాగే" అంటూ కృష్ణతేజ నెమ్మదిగా వెళ్ళాడు.
"ఎళాగో...అవ్వాల్సిన ఆలస్యం అయ్యింది..ఇవాల్టికి బాసుడి తిట్ల దండకం వినాల్సిందే" అనుకున్నాడతడు మనసులోనే.
ఉద్యోగస్తుడంటూ అయాడు గానీ అతడిలో స్టూడెంట్ లక్షణాలు ఇంకా పోలేదు. కొన్ని క్లాసులు పోయినా ఓ గంట అటో, ఓ గంట ఇటో ప్రతి రోజూ కాలేజీకి వెళ్ళి వస్తూండే వాడు. కానీ అఫీసుకంటే అలా కుదరదు కదా! టైమంటే టైమే. అదే సెట్ చేసుకోలేకపోతున్నాడు కృష్ణతేజ
"ఎలాగైనా సరే ఇకనుంచీ అఫీసుకి ఇంటైం లోనే ఉండాలి" అలస్యమైన రోజు అతడు తీసుకున్న నిర్ణయం అది.
వాసవీ కాలనీ బస్టాప్ కి ప్రతిరోజూ ఎనిమిదిన్నరకొచ్చే నంబర్ టెన్ సిటీ బస్ ఒక్కోసారి పదిపదిహేను నిముషాలు ఆలస్యంగానే బయలుదేరుతుంది "ఎలాగ్గో లేట్ గా బయలుదేరుతుంది కదా " అని కృష్ణతేజ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా..ఆరోజే ఠంచనుగా బయలుదేరుతుంది. అలా ఉద్యోగ జీవితంతో ఆ సిటీబస్ దాగుడుమూతలాడుతున్న నేపథ్యంలో ..ఓరోజు అతడికి తత్వం బోధపడింది. ఆరోజు ఎప్పటిలాగానే సిటీబస్ రాక కన్నా అయిదు నిముషాలు ముందుగానే బస్టాప్లో నిల్చున్నాడు కృష్ణతేజ. కండక్టర్, డ్రైవర్, బస్ దిగారు. చుట్టూ పరిసరాల్లో పరిచితమైన ప్రయాణికుల మొహాల్ని పరికించారు. అప్పటికే ఆ బస్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది ఒక్క ఉదుటన బస్లోకి దూకేసి దొరికిపుచ్చుకున్న సీట్లలో మఠం వేసి మరీ కూర్చున్నారు.ఇక, బస్ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. కండక్టర్ ఒక్కొక్కరిదగ్గరకొచ్చి టిక్కెట్లు ఇస్తూ పాస్ లు చెక్ చేస్తున్నాడు. ఆ చివర్నుంచి ఈ చివరి వరకూ డ్యూటీ పూర్తి చేసుకున్న కండక్టర్ ఓ చక్కని విజిల్ వేసాడు. ఆ ఈల గోలకి హారన్ మోగించి బస్ స్టార్ట్ చెయ్యాల్సిన డ్రైవర్ నిమిత్తమాత్రుడిలా తన సీట్లో కూచున్నాడు తప్ప కండక్టర్ విజిల్ కి కనీసమాత్రంగానైనా స్పందించలేదు. బస్సులో జనాలకి సహనం నశిస్తోంది. ఒకరిద్దరు కండక్టర్ కి వత్తాసుగా "రైట్..రైట్.."అని అరిచారు. అయినా డ్రైవర్లో స్పందన్ నిల్. మరో రెండు నిముషాలు గడిచాయి. ప్రయాణికులు బస్ ని కొడుతూ చప్పుడు చేస్తున్నారు. ఇక, ఈ గొడవ భరించలేని డ్రైవర్ ఎట్టకేలకు స్టార్ట్ చేసాడు. అయితే, యాక్సిలేటర్ మీద కాలు మొపలేదనే సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది. బస్ నడిపేందుకు తాను సమాయుత్తుడైనట్టు సంకేతాన్ని అందిస్తున్నాడే తప్ప ఆ విధిని సంపూర్ణంగా అతగాడు నిర్వర్తించడంలేదు. తాను ఒక్క సెకన్ లేటుగా వచ్చేసరికి అందనత దూరం పారిపోయే సిటీబస్ ఇవాళ కండక్టర్ విజిలేసినా కదలడం లేదని కృష్ణతేజకి ఆశ్చర్యం వేసింది. కారణం తెలుసుకోవాలనే ఆసక్తి అధికమవుతుండగా...ఇద్దరు లేడీస్ బస్ ఎక్కారు.
"పెద్ద అంటీ వచ్చింది ఇక బస్ రైట్..రైట్..."అని ప్రయాణీకుల్లో ఒకడు అరిచాడు. బస్సెక్కిన ఆ ఇద్దరిలో పాతికేళ్ళ సుందరి ఒకరు. ఆమె ఎక్కుతూనే డ్రైవర్ వేపు ఓ చూపు చూసి నెమ్మదిగా"థంక్స్"అంది. లిప్ స్టిక్ అధరాల సుందరి చెప్పిన కృతజ్ఞతకి పొంగిపోయిన ఖాకీ దుస్తుల చక్రధారి యాక్సిలేటర్ నేలకు తగిలేలా కాలితో తన్నాడు.
"బస్ ఇంతవరకూ కదలకపోవడానికి కారణం ఇదా?"కృష్ణతేజ అనుకుంటూండగానే సరిగ్గ లేడీస్ సీట్ కి వెనకనున్న సీట్లోంచి ఇద్దరు వ్యక్తులు సడన్ గా లేచి "రండి..రండి.." అని ఆహ్వానించారు.వాళ్ళిద్దరూ నవ్వుతూ పలకరించి..వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లో కూచుండిపోయారు.
"ఏంటివాళ లేట్ ? సీట్లు ఆఫర్ చేసిన ఇద్దరు యువకులు అడిగారు.
"ఇంట్లో దేవుడి పూజ.తొందరగా అవుతుందనుకున్నా.అవలేదు."అంటూ ఆ ఇద్దరిలో పెద్దావిడ ఆ ఇద్దరు యువకులకు ప్రసాదం ఇచ్చింది. తర్వాత " మీరు సీట్లు ఇచ్చి నిల్చుండిపోయారు.మాకు బాధగా వుంది" అన్నారు.
"ఫర్వాలేదు. సికింద్రాబాద్ లో ఎలాగో బస్ ఖాళీ అవుతుంది. అక్కడ సీట్లు దొరొకుతాయి. అయినా, రోజూ మీరు టైముకే వస్తున్నారు. మీ సీట్లలోనే మీరు కూచుంటున్నారు. ఇవాళే కదా మీకు మేం సీట్లు ఆఫర్ చేసాం" అన్నారు.
"అమ్మాజీగారొస్తున్నారా?"అడిగింది పెద్ద అంటీ.
"ఇందాకే సెల్ఫోన్ లో ఎలర్ట్ చేసా..బస్ కాస్త లేట్ అని"
"బస్ బయల్దేరిందని వెంటనే మెస్సేజ్ పంపించండి. బస్టాప్ లో వెయిట్ చేస్తుంటుంది.లేకుంటే, ఇంకా బయల్దేరలేదని ఇంట్లోనే ఉండిపోతుంది."పెద్ద ఆంటీ హెచ్చరించింది.
ఆ వెంటనే ఆ ఇద్దరిలో ఓ యువకుడు "సురేష్..అమ్మాజీగారికి ఫోన్ చెయ్యి"అన్నాడు. అంతే! నెక్స్ట్ బస్టాప్ లో అలర్ట్ గా ఉండమంటూ ఈ బస్ లోని సురేష్ సదరు అమ్మాజీకి ఫోన్ చేసి చెప్పాడు. మరో పది నిముషాలకి ఈ సిటీ బస్ నెక్స్ట్ బస్టాప్ కి చేరుకోవడం...అక్కడ అమ్మాజీ అనే మరో మహిళ వీళ్ళతో కలవడం చకచకా జరిగిపోయాయి.
ఆ ఒక్కరోజే కాదు..ఆ బస్ లో ప్రతిరోజూ వీళ్ళంతా ఇదేరకమైన సహాయాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.ఆఫీసుకి సకాలంలో చేరుకోవాలంటే, ఖచ్చితంగా ఈ ఒక్క బస్ అందుకోవాలంటే ఒకే సమయంలో బయలుదేరే ప్రయాణీకుల మధ్య ఈ తరహా 'నెట్ వర్క్' ఈ స్థాయి కమ్యూనికేషన్ ఉండితీరాల్సిందే.
ఒకవేళ ఈ నెట్ వర్క్ లేకుండా తనలా ఒంటరిగా ఉండిపోతే 'వానరాకడ ప్రాణం పోకడే కాదు ఈ సిటీ బస్ రాకపోకల సంగతి ఆగమ్యగోచరమే.!అందిన రోజున బస్ అందుతుంది, లేనిరోజున లేదు.
ఇక కృష్ణతేజ ప్రతిరోజూ ఆ బృందాన్ని క్యురియాస్ గా అబ్సర్వ్ చేయడం మొదలుపెట్టాడు.
వాళ్ళు బస్ లో ఉన్నారంటే వేయి పండగలు మూకుమ్మడిగా పండగలు చేసుకున్నట్టే.
ముందు వెనక సీట్లలో అద్జస్ట్ అయిపోయి లెక్కలేనన్ని "కహానీలు"చెప్పుకుంటారు. జోక్ లు కట్ చేసుకుంటారు. కడుపుబ్బా నవ్వుకుంటారు. తమచుట్టూ ఓ ప్రపంచం ఉందనీ..ఆ ప్రపంచంలో మనుషులున్నారన్న సంగతిని ఏమాత్రం గుర్తించకుండా తమదైన లోకంలో హాహాయియిగా విహరిస్తుంటారు.
అంతే కాదు, సిటీలో అడుగడుగునా అడ్డుతగిలే 'రెడ్ సిగ్నల్స్' , 'ట్రాఫిక్ జాం'లను పట్టించుకోని బోర్ ఫీలవకుండా ముచ్చట్లాడుకుంటారు. చూసిన సిన్మాల గురించి..తమ ఆఫీసుల్లో వేధించే బాసుల గురించి సెటైర్లు వేసుకుంటారు.మధమధ్య బర్త్ డే ఫంక్షన్లు జరిపేసుకుని చాక్లెట్లు పంచేసుకుంటారు. ఆ చాక్లెట్ల ల పంపిణీ కేవలం వాళ్ళమధ్యే ఉండదు. కండక్టర్, డ్రైవర్లను ఏనాడో తమ బృందంలో కలిపేసుకున్నారు కదా! వాళ్ళ చేతుల్లోనూ గుప్పెడు చాక్లెట్లు పోస్తారు. వాళ్ళందరి పేర్లూ కృష్ణతేజకిపుడు తెలిసిపోయాయి. ఆ బృందంలో పెద్ద ఆంటీ , చిన్న ఆంటీ అనే ఇద్దరున్నారు. వయసు తేడా బట్టీ వాళ్ళిద్దరినీ అలా సంబోధిస్తూంటారు.
ఎర్రెర్రని పెదాల్తో తీయతీయగా డ్రైవర్కి థంక్స్ చెప్పిన సుందరాంగి పేరు అలివేలు మంగతాయారు. నెక్స్ట్ బస్టాప్లో బస్సెక్కే ఆవిడ పేరు అమ్మాజీ.అంతే కాకుండా ఆ బృందంలో ఉన్న యువకుల్లో ఒకరు సురేష్ కాగా మరొకరు ఆనంద్.
వీళ్ళంతా బస్ ప్రయాణాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.
రోజురోజుకి వాళ్ళని చూస్తుంటే కృష్ణతేజకి ముచ్చటేస్తోంది.
ప్రయాణంలో వాళ్ళని గమనించడం..వాళ్ళ మాటల్ని ఆసక్తిగా వినడం..ఓరోజు వాళ్ళలో ఏ ఒక్కరు రాకపోయినా వెలితిగా ఉండడం వాళ్ళతో అసలు పరిచయమే లేని కృష్ణతేజకి కూడా ఈమధ్యనే అనుభవంలోకి వస్తోంది.
కొత్తగా చేరిన ఆఫీసు విషయాలు కాకుండా..ఈ సిటీ బస్ అనుభవాల్నే అమ్మతో ఎక్కువగా పంచుకుంటున్నాడతడు.
"లేచిందగ్గరుంచీ రోజూ సిటీ బస్ కోసం హైరానా పడడం..ఆ వీధిలో వినిపించే హారన్ కి ఈ వీధిలో ఉన్న నువ్వు ఉలిక్కి పడడం నిరోధించాలంటే ఒక్కటే సలహా" ఓరోజు కృష్ణతో అంది మాలక్స్మి.
"చెప్పమ్మా"
"నువ్వుకూడా ఆ బృందంతో కలిసిపో. ఎలాగో, అదే బస్ లో ట్రావెల్ చేస్తున్నావ్ కదా!వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసేయ్"చెప్పింది మాలక్ష్మి.
"కుదురుతుందా?"
ఏం...ఎందుకు కుదరదు?ఒకే స్కూల్లో చదివితే స్కూల్ మేట్స్.ఒకే క్లాసులో ఉంటే క్లాస్ మేట్స్...ఒకే బస్ లో జర్నీ చేస్తే ..."
"బస్ మేట్స్"అన్నాడు కృష్ణతేజ.
ఆ మర్నాడే వాళ్ళని పలకరించి పరిచయం చేసుకోవాలనుకున్నాడు కృష్ణతేజ.
అయితే ఆ రోజు అనుకున్న సమయానికే సిటీ బస్ వచ్చింది. వాళ్ళెవరూ ఎక్కకుండానే కండక్టర్ విజిల్ వేసీ వేయగానే బస్ కదిలింది. ఆరోజు ఒక్కరంటే ఒక్కరూ ఆ బస్ ఎక్కలేదు. వాళ్ళు రారనే సనాచారం ముందుగానే డ్రైవర్ కి, కండక్టర్ కి తెలుసు కాబోలు..వాళ్ళకోసం ఎదురుచూడకుండా బస్ ని నడిపేసాడు. వాళ్ళు లేని బస్ ప్రయాణం బోర్ గా ఉంది కృష్ణతేజకి.
అందరూ ఒకేసారి కట్టకట్టుకుని ఎందుకు రాలేదు? అందరి ఆఫీసులకి ఒకేరోజు సెలవిచ్చేసారా?
అలా ఎలా కుదురుతుంది?
ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాప్ లో దిగుతారు. ఒక్కో ఆఫీస్ లో పని చేస్తున్నారు.
ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం వేసుకుని వాళ్ళంతా మూకుమ్మడిగా సెలవు పెట్టారా?
బహుశా ....అదే అయి ఉంటుంది.
అలా అనుకుని సంతృప్తి పడుతున్నాడు కృష్ణతేజ.
తన ఆఫీస్ స్టాప్ దగ్గర బస్ దిగబోతూ కండక్టర్ తో మొదటిసారిగా మాట కలిపాడు. "వాళ్ళల్లో ఏ ఒక్కరూ ఇవాళ ఈ బస్ ఎక్కలేదేం?"
"మీరడుగుతోంది..అలివేలు మంగతాయారు టీం గురించా?" ఎదురు ప్రశ్నించాడు కండక్టర్.
"ఔను.. ఆ టీం గురించే.."
"నిన్న సాయంత్రమే పెద్ద ఆంటీకి యాక్సిడెంట్ అయింది. అదుపు తప్పిన ఓ సిటీ బస్ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఇవాళ ఆమె అంత్యక్రియలు. ఆమె చివరి చూపు కోసం పెద్ద ఆంటీ ఇంటికి వెళ్ళారు..."
"అందుకేనా ఆ టీం లో ఏ ఒక్కరూ ఇవాళ ఈ బస్సెక్కలేదు..." అనుకున్నాడు కృష్ణతేజ.
ఆ తర్వాతి రోజు వాళ్ళంతా అదే బస్సు ఎక్కారు. వాళ్ళల్లో ఇదివరకటి సందడి కనిపించలేదు.
ప్రతి ఒక్కరి ముఖంలోనూ దిగులు తాండవితోంది.
పెదాలపై నవ్వులు లేవు. హుషారు పలకరింపులు అస్సలు లేవు.ఆ సిటీ బస్ లో ప్రతిరోజూ పెద్ద అంటీ కూచునే సీట్ లో ఇంకెవరో కూచోవడాన్ని కృష్ణతేజ కూడా గమనించాడు. వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనీ..వాళ్ళ భుజంపై చేయి వేసి ఓదర్చాలనీ..వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధని తను కూడా షేర్ చేసుకోవాలని ...ఎంతగానో అనిపించింది కృష్ణతేజకి. అయితే, నిన్నటిదాకా ప్రయాణికుల్లో ఓ ప్రయాణికుడిలా ట్రావెల్ చేసిన తను...ఇపుడు ఇలాటి విషాదకర నేపథ్యంలో వాళ్ళతో ఏ విధంగా కలవగలడు? ఆ సందేహంతోనే కలవలేకపోయాడు. అయితే, ఆ విషయాన్ని ఆ విషాదాన్ని అమ్మతో పంచుకున్నాడు కృష్ణతేజ.
ఆ తర్వాత్తర్వాత -
ప్రతిరోజూ వాళ్ళని పలకరించాలని అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతలో కృష్ణతేజకి మరో మంచి ఉద్యోగం వచ్చి ఆ కాలనీ నుంచే కాదు, ఆ ఊరినుంచే నిష్క్రమించాడు, ఉన్న ఒక్కగానొక్క తల్లితో సహా.
పదేళ్ళ తర్వాత-
మళ్ళీ సికింద్రాబాద్ లో కాలు మోపాడు కృష్ణతేజ.
ఈ పదేళ్ళలో ఏఎన్నో మార్పులు జరిగాయి. మాలక్ష్మి మరో లోకానికి వెళ్ళిపోయింది. కాగా..కృష్ణతేజకి భర్త హోదా కల్పిస్తూ అతడి ఇంటికి ఓ ఇల్లాలొచ్చింది. అంతే కాదు, ఆఫీసులో కొన్ని ప్రమోషన్లతో పాటూ ఇద్దరు పిల్లల తండ్రిగా కూడా సామాజిక హోదా వచ్చింది.
సికింద్రాబాద్ లో పని ముగిసేసరికి సాయంత్రం ఐదు గంటలైంది.
ఇక ఈ ఊళ్ళో పనేం లేదు. తిరిగి ట్రైనెక్కి తన ఊరు వెళ్ళిపోవడమే. అంతకుముందు ఒక్కసారి వాసవీకాలనీని చూడాలనిపించింది. అయితే ఈ సాయంత్రం వేళ కాదు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఆ కాలనీ అంతా ఒక్కసారి తిరగాడాలనిపించింది.పదేళ్ళ కిందటి రోజుల్ని తలచుకొంటూ..అప్పటి జ్ఞాపకాల్లో తలమునకలవ్వాలనే వెర్రి కోరిక వెల్లువెత్తిందతడిలో.
అందుకే అరగంటక్రితం సెల్ ఫోన్ చేసిన తన శ్రీమతితో "ఇవాళ తను బయల్దేరడంలేదనే" సమాచారం అందించాడు. తర్వాత ఓ లాడ్జిలో రూం తీసుకుని బస చేసాడు.
ఇక, ఆ రాత్రంతా కృష్ణతేజకి నిద్ర కరవే. ఎపుడెపుడు తూరుపు తలుపు తెరుచుకుంటుందా?
ఎపుడెపుడు ఆకాశాన అరుణోదయమౌతుందా?
ఎపుడెపుడు వెలుగుల కిరణాలు లోకాన్ని పలకరిస్తాయా?అని ఆశగా ఎదురుచూస్తూ కూచున్నాడు.
కొన్నిగంటల తర్వాత
నిద్రలేమి కారణంగా అతడి కళ్ళల్లోని ఎరుపు కాస్తా తూరుపున ప్రభవించింది. తెల్లరింది. గబగబా తయారై కృష్ణతేజ వాసవీ కాలనీకి వచ్చాడు. ముందుగా తాము ఇదివరకు అద్దెకున్న ఇంటిని చూసి పోల్చుకోలేకపోయాడు.
ఇపుడక్కడో భవంతి వెలిసింది. ఆ తర్వాత వడివడిగా నడుస్తూ కాలనీ బస్టాప్ కి చేరుకున్నాడు.
ఇప్పుడు వాసవీ కాలనీ బస్టాప్ దగ్గర అన్నీ కొత్త ముఖాలే. ఒక్క పరిచితమైన ముఖం లేదు. వాళ్ళ హడావుడి చూస్తుంటే..ఆఫీసులకు వెళ్ళేందుకు సమాయుత్తమౌతున్నారని తెలుస్తోంది. ఒకప్పటి తనలాగే.
సరిగ్గా ఎనిమిదిన్నరకే నంబర్ టెన్ బస్ వచ్చింది. బస్ లోని కండక్టర్, డ్రైవర్ కిందకు దిగారు.
వాళ్ళవీ కొత్త ముఖాలే. అయినా సరే. ఇదే సిటీ బస్ ఎక్కి ఒకప్పటి తన ఆఫీస్ బస్టాప్ దాకా ప్రయాణించాలనుకున్నాడు.
అంతే! గుంపును ఛేదించుకుంటూ తనూ గబగబా బస్సెక్కాడు.
ఇదివరకు కూచునే కిటికీ పక్క సీట్లోనే ఇపుడూ కూచున్నాడు.
ప్రయాణీకులంతా ఎవరి సీట్లలో వాళ్ళు కూచున్నాక కండక్టర్ వచ్చి టిక్కట్లు ఇష్యూ చేసాడు. ఇక బస్ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. కండక్టర్ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి టిక్కెట్లు ఇస్తూ పాస్ లు చెక్ చేస్తున్నాడు.
ఆ చివర్నుంచి ఈ చివరి వరకు డ్యూటీ పూర్తి చేసుకున్న కండక్టర్ ఓచక్కని విజిల్ వేసాడు.
ఆ ఈలగోలకి హారన్ మోగించి బస్ స్టర్ట్ చెయ్యాల్సిన డ్రైవర్ నిమిత్తమాత్రుడిలా తన సీట్లో కూచున్నాడు తప్ప కండక్టర్ విజిల్ కి కనీసమాత్రంగానైనా స్పందించలేదు. బస్సులో జనాలకు సహనం నశిస్తోంది. ఒకరిద్దరు కండక్టరి వత్తాసుగా 'రైట్..రైట్' అని అరిచారు...అయినా డ్రైవర్ లో స్పందన నిల్..మరో రెండు నిమిషాలు గడిచాయి. ప్రయాణీకులు బస్ ని కొడ్తూ చప్పుడు చేస్తున్నారు. ఇక ఈ గొడవ భరించలేని డ్రైవర్ ఎట్టకేలకు స్టార్ట్ చేసాడు. అయితే, యాక్సిలేటర్ మీద కాలు మోపలేదనే సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది.
బస్ నడిపేందుకు తాను సమాయుత్తుడై ఉన్నట్టు సంకేతాన్ని అందితున్నాడే తప్ప ఆ విధిని సంపూర్ణంగా అతగాడు నిర్వర్తించడం లేదు.
కారణం తెలుసుకోవాలనే ఆసక్తి అధికమౌతూండగా..ఇద్దరు లేడీస్ బస్ ఎక్కారు.
బస్సెక్కిన ఆ ఇద్దరిలో పాతికేళ్ళ సుందరి ఒకరూఅమె ఎక్కుతూనే డ్రైవర్ వైపు ఓ చూపు చూసి నెమ్మదిగా 'థాంక్స్' అంది. లిప్ స్టిక్ అధరాల సుందరి చెప్పిన కృతజ్ఞతలకి పొంగిపోయిన ఖాకీదుస్తుల చక్రధారి యాక్సిలేటర్ నేలకు తగిలేలా కాలితో తన్నాడు. ఆ పాతికేళ్ళ సుందరిలో కృష్ణతేజకి ఒకప్పటి అలివేలు మంగతాయారు కనిపిస్తోంది.
ఆ ఇద్దరిలో ఒకావిడ పెద్ద ఆంటీ కూడా. ఈ బస్ లోనే సురేష్, ఆనంద్ లు ఎక్కడున్నారని కృష్ణతేజ వెతుకుతూండగానే...వాళ్ళూ కనిపించారు. "హలో"అంటూ లేడీస్ ను పలకరిస్తూ ఆ సిటీ బస్ ముందుకు దూసుకు పోతూంటే కృష్ణతేజ పదేళ్ళ వెనకటి జ్ఞాపకాలు వెతుక్కుంటూ ప్రయాణిస్తున్నాడు. ఔను..జీవితమే ఓ జర్నీ. ఒక కలయిక..ఒక వీడ్కోలు...

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ