కొత్తపాఠం - మౌద్గల్యస

kotta paatham

‘‘ ఏదో ఒక ప్లే స్కూలులో చేరుద్దాం. అంటే పట్టుపట్టి తీసికెళ్లి ఆ స్కూలులో చేర్పించావు. ఇప్పుడు చూడు. వాళ్లు మనల్ని ఎలా సతాయిస్తున్నారో’’... మా వారు నా పైన విరుచుకుపడ్డారు.

‘‘శనివారం ...ఓ బాక్సులో కాస్త ఫ్రూట్ సలాడ్ చేసి పంపండి.’’ అని స్కూలు వాళ్లు పాపకిచ్చిన పంపిన నోట్ అప్పుడే ఆఫీసు నుంచి తిరిగొచ్చిన ఆయన చేతిలో పెట్టాను.

‘‘ మొన్ననే కదా.. పాత బట్టలుంటే పట్టుకురండి అంటే తీసికెళ్లి ఇచ్చొచ్చాం. మళ్లీ కొత్తగా ఇదేంటి?’’

‘‘ అక్కడ మామూలు స్కూళ్లలా ఉండదట. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది’’ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాను.
‘‘ డబ్బులు దండుకోటానికి ఏదో ఒకటి చేస్తూంటారులే

ఓ రోజు తలో పది రూపాయలు పట్టుకురమ్మంటారు. ఇంకోసారి మీరు చదివిన కథలు పుస్తకాలు తెమ్మంటారు. ఏమిటిదంతా?
‘‘ అక్కడకు వెళితే కదా మనకు తెలిసేది... ఓసారి చూసొద్దాం’’

‘‘ పేరెంట్స్ కూడా వెంట రావాలి’’ అని నోట్ లో ఉంది. అది గుర్తు చేసుకుంటూ చెప్పాను.

‘‘ శనివారం మాత్రం బయటకు రావటం నా వల్లకాదు. కుదిరితే నువ్వువెళ్లు’’ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు.

‘‘ మనం వెళ్లకపోతే సిరి చిన్నబుచ్చుకుంటుంది. ’’ అన్నాను.

అంతే ఆయన కోపం పొంగు చప్పున చల్లారింది.

‘‘ సరే...చూద్దాంలే’’ అంటూ బాత్రూంలోకి వెళ్లిపోయారు.

మేము ఇద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగులం.

ఉదయం ఆఫీసుకు వెళితే రాత్రి దాకా తిరిగిరాం.

సిరికి ఇంకా మూడేళ్లు నిండలేదు.

పగలంతా తనని చూసుకోటానికి ఓ ఆయాను ఏర్పాటు చేశాం.

వీడియోగేమ్స్ ఆడుకోవటం, టీవీ చూడటం.. ఇదే పాప పని.

ఓ ఆరు నెలలపాటు ఎక్కడయినా మంచి ప్లే స్కూలులో చేరిస్తే తన వయసు వాళ్లు స్నేహితులవుతారు. ఆటపాటలతో ప్రయోజనకరమైన కాలక్షేపం అవుతుంది అనిపించింది.

గూగుల్ సెర్చి చేస్తే నగరంలో పేరుమోసిన ప్లే స్కూలు వివరాలొచ్చాయి. నలుగురైదుగురు కొలీగ్సుని కూడా ఆరా తీశాను.
‘‘ ఏదో ఒక స్కూలులో చేరిస్తే సరిపోయేదానికి... దేనికింత అవస్థ? అని ఆయన విసుక్కున్నా.. నా ప్రయత్నాలు మాత్రం నేను మానలేదు.
ఇంట్లో అమ్మానాన్నలు చెప్పిందాని కంటే, బయట వాళ్లు చెప్పిన విషయాలు పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. త్వరగా కొత్త అంశాలు నేర్చుకోగలుగుతారు. అది నాకున్న బలమైన అభిప్రాయం.

ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పాపకి సరైన చదువు చెప్పించకపోతే ఎలా? అన్న పట్టుదల కూడా దానికి తోడయ్యింది.
చివరికి ఓ ప్లే స్కూలు ఎంపిక చేసుకున్నాను.

అన్ని హంగులూ ఉన్నాయి అక్కడ. విశాలమైన హాలు, పిల్లలకు ఆటవస్తువులు, పెయింటింగ్ సామాగ్రి, బొమ్మల పుస్తకాలు అద్దాల బీరువాల్లో కనిపిస్తున్నాయి. పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత పడుకోటానికి కుషన్ బెడ్స్ లాంటివి ఏర్పాటు చేశారు.

నలుగురు పిల్లలు కనిపించారు

పళ్లెంలో ఉన్న పిండిని తీసి ఓ బాక్సులో పోస్తోంది ఓపాప.

ఇంకో పిల్లాడు బొమ్మకు రంగులద్దుతున్నాడు.మిగిలిన ఇద్దరు పిల్లలు నాలుగయిదు కారు బొమ్మలు ముందేసుకుని ఈ లోకంతో తమకు సంబంధం లేనట్టుగా ఉన్నారు.

‘‘ మాది మాంటిసోరి విధానం. మూడేళ్ల వయసు నుంచి ఎనిమిదేళ్ల వయసు వారు వరకూ చదవవచ్చు. ఆ తరగతులు పక్కనున్న భవనంలో సాగుతాయి. క్రమంగా ఏడాదికో తరగతి చొప్పున పెంచుకుంటూ పోవాలనుకుంటున్నాం ’’ చెప్పింది ఆవిడ. ఆమె మాటతీరు ముచ్చటగొలిపేలా ఉంది.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి మన దేశానికి తిరిగొచ్చి పిల్లలకు విలువైన విద్య అందించాలనే సంకల్పంతో ఈ ప్లే స్కూలు ఏర్పాటు చేశానని మాటల్లో చెప్పుకొచ్చింది.

అక్కడున్న ముగ్గురు టీచర్లు మంచి ఇంగ్లిషు మాట్లాడుతున్నారు. ఈ వాతావరణంలో సిరి బాగా రాటుదేలుతుందనిపించింది.

అన్నింటిలోకి నాకు నచ్చిన విషయం..

‘‘ఇరవై మందిని మించి తీసుకోం’’ అని చెప్పటం.

‘‘ అమ్మో అంత ఫీజా? చిన్న పిల్లకి ఇంత అవసరమా?’’ అని ఆయన అభ్యంతర పెట్టినా నేను పట్టించుకోకుండా స్కూలు వాళ్లడిగిన ఫీజు మొత్తం చెల్లించి తిరిగొచ్చాను.

మర్నాటి నుంచి సిరి స్కూలుకి వెళ్లటం ప్రారంభించింది. రోజుకి మూడు గంటలు.. ఓ చిన్నబాక్సులో కాసిని బిస్కెట్లు, పాలు ఇచ్చి ఆటోలో పంపేవాళ్లం. తను తిరిగొచ్చేసమయానికి ఆయా ఇంటి దగ్గర ఉండేది. అంతా బానే సాగుతోందని నాకు అనిపించినా, ఆయనకి మాత్రం భిన్నాభిప్రాయం ఉండేది.

‘‘డబ్బులు దండుకునేందుకే ఈ హంగామా అంతా...’’ అని నా మాటల్ని తేలిగ్గా కొట్టి పడేసేవారు.

శనివారం రానే వచ్చింది.

సిరిని వెంటబెట్టుకుని స్కూలుకు వెళ్లాం.

పాపను తమకు అప్పచెప్పి, పేరెంట్సు అందరినీ దగ్గర్లోని ఇంజనీరింగ్ కాలేజీకి రావలసిందిగా సూచించారు స్కూలు వాళ్లు.

‘‘ ఈ స్కూలు వాళ్లకి పనిలేదు. మనల్ని ఇబ్బంది పెట్టటానికి కాకపోతే దేనికిదంతా ...’’ మళ్లీ విసుకున్నారు ఆయన.

‘‘ ఇంత దూరం వచ్చాం కదా... అసలేమిటో చూద్దాం’’ అన్నాను ఆయనకి సర్ది చెబుతూ.

వాళ్లు చెప్పిన కాలేజీకి వెళ్లాం. మరికాసేపటికి పిల్లలు, స్కూలు టీచర్లు వ్యానులో అక్కడికొచ్చారు.

అక్కడ జరుగుతున్నదేమిటో మాకు అర్థం కాలేదు.

‘‘ వృద్దుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టాం. పిల్లలు తమ ఇంటి నుంచి తెచ్చిన ఫ్రూట్ సలాడ్ కొనుగోలు చేయండి. మీకు నచ్చిన మొత్తం ఆ చిన్నారులకు చెల్లించండి’’

ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్కడ గుమిగూడిన దాదాపు వంద మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.టీచర్లు చిన్న కప్పుల్లో ప్రూట్ సలాడ్ నింపితే... పిల్లలు వాటిని విద్యార్దుల దగ్గరకు స్వయంగా తీసికెళ్లి అందించటం మొదలు పెట్టారు. పదిరూపాయలు విలువ చేసే కప్పు సలాడ్ కి ఒక్కొక్కరు రూ. 50, రూ.100 ఇవ్వటం ప్రారంభించారు. ఒక విద్యార్థయితే సిరికి ఏకంగా రూ.500 కిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పిల్లలే కాదు. స్కూలులో పనిచేసే ప్రతి ఒక్కరూ సలాడ్ తెచ్చిన వాళ్లలో ఉన్నారు.

గంటలోపే కార్యక్రమం పూర్తయింది. బాగానే డబ్బు పోగయ్యింది.

అక్కడ వీడ్కోలు తీసుకున్నాక ఐదు నిముషాల లోపు దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి పిల్లల్ని వెంట బెట్టుకుని వెళ్లారు. వచ్చిన సొమ్మును అక్కడున్న వృధ్దులకు కాస్తకాస్త చొప్పున పిల్లల ద్వారా అందించారు. అది అంత పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ వృద్ధులంతా కదిలిపోయారు. పిల్లల్ని ప్రేమగా గుండెలకు హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు. కొందరయితే కన్నీళ్లుపెట్టుకున్నారు.

నిజంగా ఇదో అద్భుత దృశ్యమనిపించింది.

పాఠాలు చెప్పే స్కూళ్లు చాలానే ఉంటాయి. కానీ..పిల్లలకు మానవత్వం గురించి నేర్పేవి, ఎదుటి మనిషికి ఇవ్వటంలో కలిగే ఆనందం గురించి తెలియచెప్పేవి అరుదుగా ఉంటాయనిపించింది . బాల్యంలోనే ఇలాంటి వాటికి అలవాటుపడితే భవిష్యత్తులో వారు మరింతగా రాణి స్తార నటం లో ఎలాంటి సందేహంలేదు.

‘‘పాప స్కూలు విషయంలో నా ఎంపిక సరైనదే’’ అన్న నిర్ణయానికొచ్చాను.

మా వారు కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. అప్పటివరకూ నామీద చిర్రుబుర్రులాడిన ఆయన నోరు మెదపలేదు. మేమే కాదు.
అక్కడి కొచ్చిన తల్లిదండ్రులందరం జీవితంలో కొత్తపాఠం నేర్చుకున్న విద్యార్దులమయ్యాం.

మరిన్ని కథలు

Thotakoora naade..
తోటకూరనాడే...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poola danda
పూలదండ
- ప్రమీల రవి
STREE
స్త్రీ
- chitti venkata subba Rao