ఈగ సినిమా విడుదలై విజయం సాధించిన తరువాత, ఇక ఆగదలుచుకోలేదు చంద్రమౌళి. తను కూడా ఇలాంటి వెరైటీ సినిమా తీసి జనం నోళ్ళలో తన పేరే నానాలని తెగ ఆలోచించాడు. ఈగ సినిమా తెగ చూసాడు కూడా. ఈ రోజుల్లో సినిమా తీయటం కష్టంతో కూడుకున్నదే కాదు. చేతులు కూడా కాలుతాయి. అయినా సినిమాలు తీయకుండా ఎవరు ఉండట్లేదు. తీస్తునే ఉన్నారు. చూసేవి చూస్తూనే ఉన్నారు. చూడనివి చూడట్లేదు. కాని పరిశ్రమలో మాత్రం సినిమా నిర్మాణాలు జరుగుతునే ఉన్నాయి. చంద్రమౌళి కి ఎలాగైనా డిఫరెంట్ చిత్రాన్ని తీసి పడేయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ దున్నేయాలని ఉబలాటపడుతున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని ముందు మంచి సబ్జెక్టు కుదరాలి. అలాంటి సినిమా తీయడానికి వెనకాముందు చూడకుండా ఖర్చుపెట్టే నిర్మాత దొరకాలి. ముందు సబ్జెక్టు ఆలోచించి తరువాత నిర్మాతలను పట్టుకుందామని తెగ ఆలోచిస్తూ కూర్చున్నాడు. సిగరేట్ల మీద సిగరేట్లు తాగుతూ గదినంతా పొగతో నింపేశాడు. కాని ఒక్క మంచి ఐడియా కూడా తట్ట లేదు.
ఇంతలో రూమ్ లోకి కుక్క వచ్చి గిన్నెలో ఉన్న అన్నం కాస్త తినేసింది. గిన్నెను కింద పడేసింది. ఆ చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాడు చంద్రమౌళి. ఎదురుగా కనిపించిన కుక్కను చూసే సరికి విపరీతంగా కోపం వచ్చింది. " ఏయ్ ... నీయమ్మా.." అంటూ దాన్ని బయటకి తరిమి కొట్టాడు. అలా కొట్టి వచ్చి మళ్ళీ కూర్చోబోతున్న చంద్రమౌళికి మెదడులో ఫ్లాష్ .. ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చింది. అంతే ఒక్కసారిగా అతని ఆవేశం తన్నుకు వచ్చింది. కలం కాగితం తీసుకుని రాయటం మొదలు పెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. అలా అలా కథ
అయిపోయే దాకా రాస్తునే ఉన్నాడు. హమ్మయ్య అని దీర్గంగా నిట్టూర్చి ఆనందంగా త్వరత్వరగా తయారై నిర్మాతను వెదకడానికి బయలుదేరాడు. అప్పటికే కొంతమంది నిర్మాతలను కలిసి ఉన్నాడు.
"ఏమయ్యా! రొటీన్ కథలను తీసుకుని రాకు! మంచి వెరైటీ సబ్జెక్టు ఉంటీ కలువు చూద్దాం! ఇంగ్లీషు సినిమా నుండి కాపీ కొట్టినా సరే , తెలుగు సినిమా నుండి కాపీ కొట్టినా సరే. మనం సినిమా తీస్తే హిట్టే అవ్వాలి. అర్ధం అయ్యిందా" అని చెప్పిన నిర్మాతలను గుర్తుపెట్టుకుని తన చేతిలో కాగితాల బంచ్ ను చక్కగా ఫైల్ చేసుకుని బయటికి అడుగుపెట్టాడు.
చంద్రమౌళికి చాలా ఆనందంగా ఉంది. తనకు తట్టిన సబ్జెక్టు ఇంతవరకు ఎవరికి తట్టి ఉండకపోవచ్చు. తను సినిమా తీసి ఇండస్ట్రీని షేక్ చేసి పడేయాలి. తనకు ఎంత పేరు, డబ్బు, కీర్తి, చుట్టూ జనం అభిమానులు, తనతో సినిమా తీయ్యమని లైన్లు కట్టే నిర్మాతలు .. తలుచుకుంటూ ఉహల్లో తేలిపోతున్నాడు. మనసంతా హ్యాపీగా నిండిపోయింది.
సరిగ్గా అప్పుడే ఆటో ముందునుంచి పోతుంది. ఆపి ఎక్కుదామనుకున్న చంద్రమౌళి పాపం, జేబులు తడిమాడు కాని ఒక్క రూపాయి బిళ్ళ మాత్రమే తగిలింది. తీసి శివాజీలో రజినీకాంత్ లా ఒక్కసారి రూపాయి బిళ్ళను చూసి స్టైల్ గా ఎగిరేసి జేబు పట్టాడు. సరిగ్గా జేబులోనే పడింది. కాని జేబుకు చిల్లు ఉండడం వల్ల మళ్ళీ కిందికి జారిపోయింది. సర్రున జారుకుంటూ తన బయటికి తరిమికొట్టిన కుక్క ముందు గింగిరాలు తిరుగుతూ పడిపోయింది. కుక్క చంద్రమౌళి, రూపాయి బిళ్ళని చూస్తు నిలబడింది. కాని ఈ సారి మాత్రం చంద్రమౌళికి కోపం రాలేదు. కుక్క మీద ప్రేమ పొంగుకు వచ్చింది. దాని వైపు ప్రేమగా చూసి "నువ్వే ఉంచుకో ఫో " అనుకుని ముందుకు సినిమా ఇండస్ట్రీస్ వైపు కదిలాడు. ఏంటో ఈ మానవుడు తనను ఈసారి ఏమి అనకుండా వెళ్ళిపోయినందుకు చంద్రమౌళి వెళ్ళిన వైపే చూస్తోంది.
చంద్రమౌళికి అద్భుతమైన కథ ఐడియా వచ్చింది. దీనివల్లె అని దానికి తెలియదు. అది చంద్రమౌళికి తెలుసు.
"నమస్తే సార్"
"ఆ.. చంద్రమౌళి! రావయ్య రా ! ఏంటి సంగతులు. " అడిగాడు నిర్మాత నక్కేశ్వరరావు.
"మంచి సబ్జెక్టు పట్టుకు వచ్చాను. మీరు వింటానంటే చెబుతాను " అన్నాడు వినయంగా
"అబ్బా! ఇప్పుడా! ఇంతకుముందే ఒకడు వచ్చి తల వాచేటట్టు కథ చెప్పి వెళ్ళాడు. మళ్లీ ఇప్పుడంటే... " అంటూ ఆగాడు నక్కేశ్వరరావు వినడం ఇష్టం లేనట్టుగా
"అది కాదు సార్. ఇది ఇంతకు ముందు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్, మంచి... "
"ఏమయ్యా చంద్రమౌళి. నేనేమన్నా ప్రెస్ మీట్ లో కూర్చున్న విలేఖరి అనుకుంటున్నావా ?" అన్నాడు.
"అదేంటి సార్"
"లేకపోతే ఏమిటయ్యా ! ప్రెస్ మీట్ లో ఇలాగె కదా మాట్లాడేది. ఇంతవరకు సబ్జెక్టు ఎవరు టచ్ చెయనిది. చాలా బాగా తీసాం. తప్పకుండ హిట్ అవుతుంది . నిర్మాత చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టారు. నటీనటులు చాలా బాగా నటించారు. ఇదొక సినిమా తీస్తున్న అనుభూతి కలగలేదు. ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా సాగిపోయింది. సంగీతం అదిరిపోయేట్టు వుంది. పాటలు కనీ వినీ ఎరగని రీతిలో హిట్ అయ్యాయి. ఇంతవరకు ఇలాంటి సినిమా సినిమా చరిత్ర లోనే రాలేదు. ఇది అందరికీ నచ్చుతుంది. దీన్ని దర్శకులు చాలా బాగా తీర్చి దిద్దారు. టెక్నిషియన్స్ అందరూ సమిష్టిగా కష్టపడ్డాం. ఫోటోగ్రఫీ కూడా కొత్త టెక్నాలజీ వాడాము. ఇంతవరకు ఎవరూ వాడని కెమెరా వాడాము. ఇవేగా సొల్లు చెప్పిందే చెప్పి చెప్పి మనము ఎంత రొటీన్ గా సినిమా తీస్తున్నమో ప్రెస్ మీట్ లే చెబుతాయి. నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న దర్శకులు, రచయితలూ నేడు తీస్తున్న సినిమాలు కొత్తగా తీయలనుకుంటున్నారే తప్ప కొత్తగా రాయలనుకోవటం లేదు . ఏదో ఇంగ్లీష్ సినిమా చూడడం, కాపీ కొట్టడం, తీసెయ్యటం. ఇదే కదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్. ఎవడు ముందు చూస్తే వాడిదే సినిమా అయిపోతుంది. ఎందుకయ్యా మా లాంటి నిర్మాతలను నాశనం చేస్తారు. ఒక్కడన్నా ఒరిజినల్ గా ఆలోచించి ఇది నాకధే అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పే రచయిత గానీ దర్శకుడు గానీ ఉన్నారా? ఎంత సేపు వాడు ఏం తీసాడు, మనం ఏమి తీయ్యాలి ....అని కాపీ కొట్టడం లేకపోతే ఏదో భాషలోని సినిమాను డబ్బింగ్ చెయ్యటం. అంతే కదా అటువంటిది నాకు కొత్త సబ్జెక్టు అంటూ చెవిలో పువ్వు పెడుతున్నావా?" అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు.
పాపం చంద్రమౌళి డంగైపోయాడు. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. మౌనంగా నిలబడ్డాడు. ఏం మాట్లాడితే ఏమంటాడో అని. ఆతను చెప్పింది కూడా నిజమే ఈరోజుల్లో సినిమాను తీస్తున్న దర్శక నిర్మాతలు అలాగే చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఏం చేస్తున్నారు. సినిమా లో ఒక్క సీన్ చెప్పగానే తీసేద్దామని చెప్పేస్తున్నారు. కధ మొత్తం వినడంలేదు. ఇక తనలాంటి రచయితలకు దిక్కు మొక్కు లేనే లేదు. ఎక్కే గడప దిగే గడపతోనే జీవితాలు సగం గడిచిపోతున్నాయి. అవసరం అయితే ఘోస్ట్ రైటర్ గ చేస్తావ అని అడుగుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడి తిరిగి చివరకు ఘోస్ట్ రైటర్ గా చెయ్యలా అనే అహం అడ్డువస్తోంది. కానీ తన వయసుకి ఇప్పటికీ ఇంటి నుండి డబ్బు తెప్పించుకోవాలంటే సిగ్గుగా వుంది. కానీ తప్పడం లేదు. ఒక్కోసారి నిజంగానే ఘోస్ట్ రైటర్ గా మారిపోతే డబ్బులు వస్తాయని ఆశపడుతున్నాడు. కానీ తాను సినిమా పరిశ్రమను మలుపు తిప్పే దర్శకుడిగా పేరు తెచ్చుకునే దమ్ము, సత్తా తనకే ఉన్నాయని నమ్ముతున్నాడు. ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే అన్నిటిని తట్టుకుని ఒక్కసారి తెరమీదకి వస్తే మనం ఏమిటో తెలిసిపోతుంది అనుకున్నాడు
అలా మౌనంగా నిలబడి ఆలోచిస్తున్న చంద్రమౌళిని చూసి ఏమనుకున్నాడో ఏమో నక్కేశ్వరరావు.
"ఇంతకి టైటిల్ ఏంటీ " అన్నాడు.
"మనిషి" చెప్పాడు.
"వ్వాట్" అన్నాడు.
"అవును మనిషి అన్నదే మన టైటిల్" చెప్పాడు.
ఎందుకో నక్కేశ్వరరావు కాస్త ఇంప్రెస్ అయ్యినట్టుగా కనిపించాడు. "మనిషి టైటిల్ బాగానే ఉంది. కధ మూడు ముక్కల్లో చెప్పు" అన్నాడు.
చంద్రమౌళి అదే చాలు అనుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడే మన పనితనం చూపించాలి అనుకుని, గొంతు సవరించుకుని చెప్పడం మొదలు పెట్టాడు.
"అదోక పెద్ద కోటీశ్వరుడు ఇల్లు. అందులో కోటీశ్వరుడితో పాటు, ఒక్కగానొక్క కూతురు, భార్య ఉంటారు. వీళ్ళతోపాటు 'మనిషి' అనే పేరుగల కుక్క కూడా ఉంటుంది. అది ఎంత విశ్వాసంగా ఉంటుందంటే తన యజమాని అన్న, కూతురన్న విపరీతమైన అభిమానం ఉంటుంది. అంతే కాదు, కుక్క యజమాని కూతురును ప్రేమిస్తుంది. ఆమె చుట్టూ తిరగడం, ఆమెతోనే ఉండడం, ఆమె పక్కనే పడుకోవడం జరుగుతుంటుంది. ఇంతలో విలన్ కోటీశ్వరుడు కూతురును చేసుకుంటే ఆస్తి అంతా తనకే దక్కుతుందని ఆలోచించి తన ప్రతాపమంతా చూపించి కూతురును లొంగదీసుకోవాలనుకుంటాడు. కాని వీటన్నిటికి కుక్క ప్రతిసారి అడ్డువచ్చి విలన్ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తుంది. దాంతో విలన్ కోపం వచ్చి కుక్కను పథకం ప్రకారం చంపేస్తాడు. దాంతో కోటీశ్వరుడు కూతురు బెంగతో మంచం పడుతుంది. ఇదంతా ఫ్లాష్ బ్లాక్ చెబుతాం.
ప్రెజెంట్ లో ఆ కుక్కే మనిషిగా పుడుతుంది. మళ్ళీ ఆ ఇంట్లోనే చేరి కూతురికి రక్షణగా ఉంటుంటాడు. విలన్ ప్రయత్నాలన్నీ తెలుసుకుంటూ ఎదుర్కొంటాడు. చివరికి విలన్ ను కుక్కల గ్యాంగ్ తోటి చంపిస్తాడు. అప్పుడు కూతురు ఇతన్ని గత జన్మలో తమ దగ్గర ఉన్న కుక్క అని గుర్తిస్తుంది. తరువాత ప్రేమిస్తుంది. పెళ్ళి కూడా చేసుకుంటుంది. అంతే శుభం." అన్నాడు చంద్రమౌళి.
వీలైనంత తొందరగా, వీలైనంత వివరంగా కథను చెప్పడం ముగించాడు. పాపం నిజంగానే నక్కేశ్వరరావు బాగా ఇంప్రెస్ అయ్యాడు.
"చంద్రమౌళి ఇదేదో ఈగ సినిమాలాగుందే " అంటేను...
"సార్ ! అది ఈగ ఇది కుక్క. చాల తేడా వుంది. కుక్క మనిషికి అత్యంత విశ్వాసమైన జంతువు. కాని ఈగ అలా కాదు. మనిషికి వ్యాదులు అంటించే నీచగుణం కలది. కాని కుక్క అలా కాదు సార్. దీనికే ఎక్కువ మార్కులు పడతాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈగను చుసిన వాళ్ళు కుక్కను చూడరా సార్ ! ఫస్ట్ హాఫ్ అంతా గ్రాఫిక్ డిజైన్ చేసి కుక్కను హైలైట్ చేస్తాము. కుక్క సెంటిమెంట్ చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది. జనంకి కూడా కుక్క మీద సానిభూతి వుంటుంది కుక్కను ప్రేమించని వాడు ఎవడు ప్రపంచంలో ఎవడు ఉండడు సార్."
"బావుందయ్యా ఇదేదో మనకు పనికివచ్చేట్టుగా వుంది. ఇందులో ఇంకాస్త సెంటిమెంట్ సీన్లు చొప్పించి, ఫైట్లు హైలైట్ చేస్తే సినిమా ఎక్కడికో వెళ్తుంది. మనం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ చేద్దాం" అన్నాడు నక్కేశ్వరరావు.
చంద్రమౌళి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అంతా తన ముందు క్యూ కట్టినట్లు కలలు కంటున్నాడు.