కేకిసలు - ఎలక్ట్రాన్

kekisalu

అడగందే అమ్మయినా పెట్టదంటారు. యిది అమ్మ విషయంలో కొద్దిపాటి అతిశయోక్తిగా వాడినా, వాస్తవానికి లోకంలో ఏ పనీ అడగందే కానీ జరగదు. ఓటు కోసం వచ్చినాయన ఒంటి చేతి దణ్ణంతో ఓటడిగితే, ఆయన ఎంపికై నాయకుడైన తర్వాత వెయ్యి నమస్కారాలు చేసినా కోరికలు తీరుస్తాడని ఎక్కడా లేదు. బిచ్చం దగ్గర్నుంచీ, సినిమాల్లో వేషాల వరకూ అడిగితే కాని వెయ్యరు, కాళ్లా వేళ్ళా పడితే కాని యివ్వరు. ఏతా వాతా తేలిందేమిటంటే జీవితంలో అదగందే ఏమీ దొరకదనీ, ఎవరైనా చెప్పందే ఎవరూ ఏమీ చెయ్యరనీ, ఖర్చుతో కూడినదైనా కాక పోయినా ఏ పనీ అడగనిదే జరగదనీ.

కళాకారులకి ఊపిరి అభిమానుల ప్రశంసలు. నోటి మాటలుగా కాక తక్షణంగా స్పందించి చేసే కరతాళ ధ్వనులు వక్తలకీ, గాయకులకీ, వాయిద్య కారులకీ, వేదికనేక్కిన ప్రతి వారికీ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అయితే యిటీవలి కాలంలో ప్రేక్షక, వీక్షక మహాశయులకి రసాస్వాదన తగ్గిన కారణంగానేమో కళలకి సంబంధించి తక్షణ స్పందన లోపించి, వేదిక మీద ఎంతటి రక్తి కలిగించిన ప్రదర్శన జరిగినా ఏవో మంద్ర స్థాయి మొక్కుబడి చప్పట్లు తప్పించి హోరెత్తించేవిగా ఉండటల్లేదు. దాంతో కళాకారులందరూ కార్యక్రమం ఆరంభం ఎంత గొప్పగా ఉన్నా క్రమేపీ నీరసించిపోయి నిస్తేజమైన ప్రదర్శనలోకి జారి పోతారు. కళాకారులకి నిర్వాహకులిచ్చే సంభావనలు వేరు, ప్రేక్షకుల హస్త తాళాలు వేరు! కీర్తికి సోపానాలు హర్షధ్వానాలే. కళాకారులను ఉత్సాహ పర్చాలంటే కరతాళ ధ్వనులు అత్యవసరమని గుర్తించడంతో కార్యక్రమ నిర్వహణ కోసం ఓ నూతన కుహనా సంస్కృతి ఏర్పడింది. అడిగీ, చెప్పీ చప్పట్లు కొట్టించడం. కార్యక్రమాల్ని నిర్వహించే ‘ లంగరు’ అంటే ‘యాంకర్’ వృత్తి ప్రవీణులు పాశ్చాత్యదేశాల్లోనే కాకుండా మన భారతంలో కూడా రూపుదాల్చారు. ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియని ప్రేక్షకులకి దిశా నిర్దేశం చేసే ఈ వ్యాఖ్యాన కర్తలు లేదా కార్యక్రమ సారథులు కొద్ది మినహాయింపులతో దాదాపు ప్రతి సభలోనూ ప్రముఖమైన పాత్రవహిస్తున్నారు.

తెలుగు ప్రాంతంలో ‘ఉశిఝాసు’ అనే వ్యాఖ్యాతాంగన మరియు లంగరు యువతి వాగ్దేవి కటాక్షంతో ఆవిర్భవించింది. ఆ యువతి కార్యక్రమ నిర్వహణా బాధ్యతని నెత్తి మీద వేసుకొని యిటూ కళాకారుల్లోనూ, సందు దేరికితే చాలు వేదిక మీదకు చేరుకొనే అనేకానేకమైన ప్రముఖుల్లోనూ, ఎప్పుడు స్పందించాలో తెలియని ప్రేక్షక, వీక్షకుల్లోనూ కొత్త ఊపిరులు పోయనారంభించింది.

“ అందరికీ ఘనమైన స్వాగతం! యిప్పుడు ఈ కార్యక్రమ ప్రాయోజకులు నిమ్మ రసం నిరంజన్ గారూ, వారి సంస్థ తయారు చేసే నిమ్మ రసం సీసాలూ, డబ్బాలూ మీకు కొత్త కాదు. స్వాగత ద్వారం వద్ద యివ్వ బడిన నిమ్మ రసం, వీరి తయారీ మీద మీ విశ్వాసాన్ని మరింత పెంచిందనే అనుకొంటాను. అందుకని మీ గొంతు తడిపి స్వాగతమిచ్చిన నిమ్మ రసానికి జోరుగా చప్పట్లు కొట్టి మీ అభిమానాన్ని తెలియజేయండి!” అంది ‘మైక్’ తో వేదికనంతా కలయ దిరుగుతూ. ‘తేరగా దొరికిందని తెగ తాగడం కాదు, యిచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి మహాశయులారా!’ అన్న అంతరార్థం స్ఫురించడంతో చప్పట్లు హోరెత్తి పోయాయి. “యిక్కడ జన గణ మన పడే దాకా ఉండి వెళ్ళే వారికి మరో సారి నిమ్మ రసం యివ్వబడుతుంది. అందుకు మీ హర్షం వ్యక్తం చేయండి!” అనడంతో కరతాళ ధ్వనులు మరో మారు మారుమ్రోగాయి.

“నిరంజన్ గారు ‘వర్షంలోనూ దాహం’ అనే చలన చిత్రాన్ని తీస్తున్నారన్న సంగతి మీకు తెలిసిందే. మీ అభిమాన నాయికానాయకులతో ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకొని మరో పక్షం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం తాలూకు పాటల విడుదల శ్రవణ సంబరమిది. అంటే ఆడియో సీడీ రిలీజ్ ఫంక్షన్ అన్నమాట! ముందుగా నిర్మాత నిరంజన్ గార్ని వేదిక మీదకు రావల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఊఁ! ఆయన కుర్చీ లోంచి లేచారు, యిదుగో వచ్చేశారు, యిలాగేనా ఆయన్ని స్వాగతించేది? జోరుగా చప్పట్లతో అభినందనలు తెలియ జేయండి మరి!” అంది ఉశిఝాసు. చప్పట్లు మోగాయి.

‘నా డబ్బుతో జరుగుతోందీ వేడుక. వేదిక మీదకు నన్ను నేనే పరోక్షంగా నీ ద్వారా ఆహ్వానించుకున్నట్లే ఉశిఝాసూ! బాగు బాగు! నాకు సొమ్ములు వెద జల్లడం వచ్చును కాని మాటలు వెద జల్లడం రాదు! నాకే కనక మాటల గారడీ వస్తే నీ స్థానంలో నేనే ఉండేవాణ్ణి! సినిమా తీసే సరికే చుక్కలు కనబడ్డాయ్! పైగా ఈ పాటల మాటల హారతికి మరో ఖర్చు!” అనుకొన్నాడు నిరంజన్. ప్రేక్షకులకి చేతులెత్తి అన్ని దిశలా తిరిగి నమస్కరించాడు. ‘ నాచేత చేతులెత్తేయించకండి ప్రేక్షక దేవుళ్ళారా!’ అనుకొంటూ.

“ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతాన్నందించిన వారు మీరు విపరీతంగా అభిమానించి, మెచ్చే ‘దేవీమణిచక్రి’ గార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ సినిమాలో మృదంగ నాదాలు అంటే డ్రమ్ బీట్స్ అదిరి పోయాయని నిర్మాత గారు చెప్పారు. ఆ నాదాలకి మించిన కరతాళ ధ్వనులతో ‘దేవీమణిచక్రి’ గారికి స్వాగతం పలకండి!” అంది ఉశిఝాసు.

‘దేవీమణిచక్రి’ హుందాగా వేదిక మీదకు రావడంతోనే సభా మందిరంలో హస్తతాళాలదిరాయ్.
హీరో, హీరోయిన్లు ఎప్పుడొస్తారెప్పుడొస్తారని?’ ప్రేక్షకుల్లో గోల మొదలైంది. ఉశిఝాసు యిబ్బందిలో పడింది. అతి చురుకు నాయకుడు ‘నేత్రానంద్’ ముందు వరసలో కూర్చుని సిద్ధంగాఉన్నా , నాయిక నటీమణి ‘అనుకజాతమ’ సభా ప్రాంగణానికి వెనక వైపున నిలబడిన అలంకార వాహనంలో తన అందాలకి తుది మెరుగులు దిద్దించుకొంటోంది.

“మీ ఆతృత నాకు తెలియంది కాదు. దారిలో ఆమె అభిమానులు అడ్డుకొన్న కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలింగిదనీ, పోలీసులు దారి కలిగిస్తున్నారని సమాచారం అందింది. అమె త్వరలోనే వచ్చేస్తున్నారు. సినిమాలో నాయికానాయకుల నటనా విశేషాలు రెండు విధాలు. ఒకటి సంభాషణలకీ, అభినయనానికీ సంబంధించినది. రెండవది నాట్య గానాదులకు సంబంధించినది. నాట్య గానాదులు ఈనాటి మన భారత దేశీయ చలన చిత్రాలకు ప్రాణాలనడంలో సందేహం లేదు. అయితే నాదం, గానం లేనిదే నాట్యం లేదు. ఈ చిత్రంలో అద్భుతమైన ‘దేవిమణిచక్రి’ గారి సంగీతానికి శృంగార భరితమే కాకుండా, సంక్లిష్టమైన పాద విన్యాసాలతో నృత్య దర్శకత్వం చేసిన ‘రాఘవ దేవా’ ని ఘనంగా ఆహ్వానించండి.” సభా ప్రాంగణం చప్పట్లతో నిండిపోయింది.

“భావ యుక్తమైన గీత రచన చేసిన సిరి చంద్ర గారిని వేదిక మీదకు పిలిస్తున్నాను. చప్పట్లతో పలకరించండి.” ఆ పలకరింపుల్లో పస లేదు.
“అన్ని అంశాలనీ తగు పాళ్లలో మేళవించి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మలచిన దర్శకుడు ‘వినాశీనుపూరీ’ గారిని స్వాగతించండి.” హర్ష ధ్వానాలు మిన్నంటాయ్.

“మీరందరూ ఆసక్తితో ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. ప్రాంగణం లోకి యిప్పుడే నిర్మాతల, దర్శకుల, నాయకుల, ప్రేక్షకుల అభిమాన తార ‘అనుకాజతమ’ అడుగు పెట్టారు. అలశ్యమెందుకు........?” అందరూ లేచి వెనక వైపుకు చూశారు. ‘ అనుకాజతమ’ వయ్యారంగా అడుగులు వేసుకొంటూ వేదిక దిశగా పయనించింది. యువ నాయకుడు నేత్రానంద్ కుర్ఛీలోంచి లేచి ‘అనుకాజతమ’ దారినడ్డగించి, ఆమె చేతిని దొరకబుచ్చుకొన్నాడు. యిద్దరూ కలిసి అతి నెమ్మదిగా వేదిక నెక్కారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తోన్న ‘టీవీ’ ప్రేక్షకుల కోసం ఆ దృశ్యాన్ని అతి మందగ మనంలో నాలుగు సార్లు మరీ మరీ బుల్లి తెర మీద చూపించారు.

సభా మందిరమంతా చప్పట్లతో కాదు కాని ఈలల తోటీ, కేకల తోటీ నిండి పోయింది. కాస్త సద్దు మణిగిన తర్వాత “యిప్పుడు లయ బద్ధమైన మీ కేకిసలు......అయ్యా, ఆగండాగండి! కేకసలూ, కేకిసలూ అంటే చప్పట్లకి పర్యాయ పదాలు! అందుకని మిమ్మల్ని కొట్టమన్నది చప్పట్లని కానీ , పెట్టమన్నది కేకలు కాదు! ఆగకుండా కనీసం ఒక నిముషామైనా కరతాళ ధ్వనులు వినిపించండి!” అని ఒక చేత్తో మైకు ఎత్తి పట్టుకొని, రెండో చేత్తో మైకు మీద బాద సాగింది. అందరూ అలాగే చేతులు పైకెత్తి భజన రీతిలో చప్పట్లు కొట్టారు. ఉశిఝాసు హీరో, హీరోయిన్ల వైపు మెప్పు కోసం చూసి నిరాశ పడింది. ఎందుకంటే వారిరువురి దృష్టీ ప్రేక్షకుల వైపే సారించి ఉన్నాయి. అదీ కాక సదరు నటీ మణి మాటి మాటికీ మొహం మీద పడే జుత్తుని సవరించుకొంటూ యమగా హావ భావాలు ప్రదర్శిస్తూ ఉంది. ఆమెకు ఉశిఝాసు తెలుగు మాటలు అర్థం కావటల్లేదు. ఆమెకు అర్థమయ్యేవి చప్పట్లూ, ఈలలూ, కేకలూ!

“ఈ సినిమా కాలేజీ వార్షిక దినోత్సవ సంబరాల దృశ్యంతో ప్రారంభమౌతుంది. నాయికా, నాయకులు విజృభించి పోతూ పోటాను పోటీగా పాడే పాటట! విశిష్ట అతిథిగా ఆహ్వానితులైన జగద్విఖ్యాత దర్శక, నిర్మాత ‘రాఘవేంద్ర నారాయణ రావు గారు’ ఆడియో సీడీని ఆవిష్కరించి ఆ పాటని వినిపిస్తారు. ఘనంగా ఆయన్ని స్వాగతించండి!” అంది. కరతాళ ధ్వనులు నీరసంగా వినిపించాయి. వేదిక వెనకనున్న ప్లాస్మా తెర మీద నాయకుడి పిడికిలీ, నాయిక నాభీ, కింద ‘జీన్ పాంటూ’ కనబడ్డాయి. చప్పట్లు అదిరిపోయాయి. అదే అదనుగా, ఆ చప్పట్లు ముగియక ముందే ప్రముఖ దర్శక నిర్మాత, మూడడుగుల వ్యాసం గల ఓ గుండ్రటి ప్లాస్టిక్ ఫలకం మీది ముచ్చి రేకుని ఛిద్రం చేసి, అందరికీ ఎత్తి చూపాడు. దాని మీద కూడా అవే పిడికిలీ, నాభీ రంగుల్లో ముద్రించి ఉన్నాయి. తర్వాత అందమైన ఓ చిన్న పెట్టి లోంచి చిన్న సీడీలు తీసి అందరికీ పంచాడు. మొదటి పాటని ఆవిష్కరించాడు. ‘ యింకో సారి ప్రముఖ దర్శక నిర్మాతని చప్పట్లతో అభినందించండి’ అనే అవసరం కలగ నందుకు ఉశిఝాసు ఊపిరి పీల్చుకుంది. ఎందు కంటే నాభి బొమ్మ ప్లాస్మా తెర మీద కనబడ్తున్నంత సేపూ చప్పట్ల జోరు తగ్గ లేదు.
“యిప్పుడు చిత్రంలోని ఈ మొదటి పాటని నృత్య కళా కారులు నృత్య రూపంలో మీ ముందుంచుతారు. నాయికా-నాయకుల ఉత్తేజ కరమైన ఈ నృత్యం కోసం మీరు చిత్రం చూడాల్సిందే! క్లాసులు బంకు కొట్టి, ఆఫీసులు ఎగ్గొట్టి, మొదటి ఉదయం ఆటకి టికెట్ వంపులు తిరిగిన బారుల్లో నిల్చుని కొంటారో, లేక నల్ల బజార్లో కొని చూస్తారో మీ యిష్టం! అదేమిటి అలా నిశ్శబ్దం వహించారు? నా మాటలు మీకు రుచించ లేదా?”
సమాధానంగా చప్పట్ల దరువులతో సభా మందిరం దద్దరిల్లి పోయింది. వేదిక మీదనున్నవారందరూ దిగి తమ ఆసనల్లో కూర్చున్నారు. నేపథ్యంలో ఆ పాట వినబడ్తూండగా రంగ స్థల కళాకారులు నృత్యం చేశారు. నాయిక, నాయకుడు ఒకరి నొకరు చూసుకొంటూ కాస్తగా పెదవి విరిచారు. వెయ్యి ముక్కలుగా తీసి, అద్భుతంగా జోడించిన తెర మీది నృత్యాల్ని ఆదరించే ప్రేక్షకులకి ఈ కళా కారుల నృత్యం అంతగా రుచించ లేదు. అయితే నాయికా, నాయకులు కూడా తాము పెదవి విరచడంలో అర్థం లేదని గ్రహించలేదు.

“వీరి నృత్యమే యింత పసందుగా ఉంటే, తెర మీద మీ ప్రియతమ నాయికా నాయకుల నృత్యం యింకెంతటి పులకింతలు కలిగిస్తుందో ఊహించుకోండి. ఊహా గానాలెందుకు, చూసి తరించండి! రుచి చూపించిన ఈ కళాకారులకి హర్ష ధ్వానాలతో అభినందనలు తెలియజేయండి!”

చాలామంది అరచేతులు అంటించారు కాని ధ్వనులు మట్టుకు వినబడలేదు!
“యిక రెండవ పాట స్వయంగా ‘దేవీమణిచక్రి’ గారే విడుదల చేస్తారు. పాట నేపథ్యంలో వినపడ్తుంది. అదే సమయంలో దర్శకుడు ‘వినాశీనుపూరీ’ సంగీత దర్శకుణ్ణి పుష్ప గుచ్చంతో, దుశ్శాలువతో సత్క రిస్తారు.” అందమైన పాట వరస కోసమూ, గౌరవ ప్రదమైన సత్కారం కోసమూ కలిపి చప్పట్లు కొట్టించింది ఉశిఝాసు.

మూడో పాటని నిర్మాత నిరంజన్, నాలుగో పాటని దర్శకుడు ‘వినాశీనుపూరీ’, అయిదో పాటని ఆ సినిమాకి మరోలా జీవం పోశారన్న హాస్యబ్రహ్మ ‘నారాయణానందాలీ’, ఆరో పాటని నాయికా నాయకులు సంయుక్తంగానూ విడుదల చేశారు. పాట విడుదలకీ, పాట విడుదలకీ మధ్య పరస్పర ప్రశంశలూ, స్వోత్కర్షలూ పుష్కలంగా చోటు చేసుకొన్నాయి. ఒక్కొక్క పొగడ్తకీ, స్వోత్కర్షకీ చెప్పీ, అడిగీ చప్పట్ల పర్వం కొనసాగించింది ఉశిఝాసు.

చివరగా ఇంగ్లీష్ లో మాట్లాడబోయి తెలుగులోకి జారిన నాయకుదూ, ‘నాకు తెలుగు రాదు. అయినా ప్రయత్నిస్తాను!” అన్న ఒక్క వాక్యం తెలుగులో ముద్దుగా అని, వెంటనే తనకి వచ్చిన రీతిలో యింగ్లీష్ లోకి మారి నాయికా, ‘ప్రేక్షకులే తమకి సర్వస్వం, వారే తమకి ఆరాధ్య దేవతలు’ అంటూ ఉపన్యాసాలు ముగించారు. వారిరువురూ మాట్లాడుతోన్నంత సేపూ ప్రాంగణమంతా చప్పట్లతో కాకుండా ఈలలతోటీ, కేకలతోటీ నిండి పోయింది. ఉశిఝాసు తెలివిగా మౌనం వహించింది. తర్వాత ఉశిఝాసు అందరికీ, అందరి తరఫునా, పేరు పేరునా ధన్యవాదాలర్పించింది. మొదటి పిలుపులో వేదిక నెక్కి వెనక వరసలో కూర్చున్న గీత రచయితకీ, నేపథ్య గాయకులకీ, రంగస్థల కళాకారుల ప్రదర్శనల తర్వాతా, పాటల విడుదల సమయంలోనూ మళ్ళీ పిలుపు రాలేదు. వాళ్ళు నాలుగైదు సార్లు ఆశా భావంతో ఉశిఝాసు వైపు చూశారు. ‘ నేనేం చేయ గలను? మాట నాది కాని, సభా నిర్వహణ కార్యక్రమం రాసిచ్చింది వారే!” అన్నట్టు కళ్ళ తోటే సముదాయించింది.

‘నేపథ్య వాయిద్యాల ఘోషలో గీతంలోని సాహిత్యపు సొంపులు కాని, గాయకుల నైపుణ్యం గాని సినీ ప్రేక్షకుల అవగాహనకు ఎలానూ రావు! కనబడేదల్లా ఎదల పొంగులూ, నాభి లోయులూ, నడుము కదలికలూ, జఘనాల మీద దరువులూ, ఒంటి చేతి పోరాటాలు,రెండర్థాల మాటలూ తప్ప మరేమీ మీ కావు! సరేలే దీనికింత చింతించాలా?” అని గేయ రచయితలూ, నేపథ్య గాయకులూ తమ్ము తాము సమాధాన పరచుకొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉశిఝాసు వీలైనంతగా కరతాళికల జల్లులు కురిపించి యిల్లు చేరింది.

భర్తా, కొడుకూ టీవీ కి అతుక్కుపోయి కూర్చుని మరేదో పాటల పోటీ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఓ సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. టీవీలోంచి కరతాళ ధ్వనులు వినవస్తున్నాయి. తల్లిని చూడగానే, ‘మమ్మీ! యింతవరకూ నీ ప్రోగ్రాం చూశాం. అదిరిందనుకో!” అన్నాడు పదేళ్ళ కొడుకు.

“అలా అనేసి ఊరుకుంటే కుదరదు! చప్పట్లు కొట్టాలి!” అన్నాడు భర్త.

“చప్పట్లూ, గిప్పట్లూ అంటే చేతులు విరగ్గొడ్తాను! నోరు మూసుక్కూర్చోండి!” అంది ఉశిఝాసు తిక్కతిక్కగా. కలపబోయిన భర్త చేతులు మధ్యలోనే భయం భయంగా ఆగిపోయాయి! టీవీ కేసి చూస్తూ ‘గాన గంధర్వుడికే పాట్లు తప్పటల్లేడు. నేనెంత?” అనుకొంటూ సోఫాలో కూలబడింది.

స్పందించి చేసే కరతాళ ధ్వనులకీ, సభా మర్యాదకోసం చేయించే కరతాళ ధ్వనులకీ అంతరముంటుంది. అయితే స్పందనా, సభా మర్యాదా-రెండూ తెలియని ప్రేక్షకులున్నంత కాలం- వ్యాఖ్యాతలకు చెప్పి చప్పట్లు కొట్టించే తలనొప్పి తగ్గదు!

ముక్తాయింపు: యింత గొడవెందుకు? ఆంగ్ల హాస్య టీవీ ప్రదర్శనల్లోలాగా కళా మందిరాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు కృత్రిమ కరతాళ ధ్వనులు ఏర్పాటుచేస్తే పోతుందిగా?

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి