కవిసైన్యం - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

kavisainyam

కోసలదేశపు మహారాజు ఫణిభూపతికి కళలంటే ప్రాణం. కళాకారులంటే పంచప్రాణాలు. నిండు రాజసభలో వారి కళాకౌశలాన్ని మనసారా ఆస్వాదించి తగురీతిన భూరి బహుమానాలతో సత్కరించేవాడు. అప్పటికే ఆయన ఆస్థానంలో మహా మహా కవులు, కళాకారులు కొలువుతీరారు. నిత్యం వారి ప్రసంగాలతో, సాహిత్యగోష్ఠులతో, కవితాపఠనాలతో, చర్చలతో సభ సకలజనరంజకంగా కళ కళ్లాడేది.

ఇదిలా ఉండగా ఒకనాడు శంకరం అనే పండితుడు "మహారాజా, అందంగా తీర్చిదిద్దిన ఏ పుష్పగుచ్ఛంలోనైనా మరో వర్ణశోభిత, సౌగంధిక, సంపూర్ణ వికసిత పుష్పాన్ని అమరిస్తే అది మరింత పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది తప్ప అనవసరం అనిపించుకోదు. అలాగే సకలకళావల్లభులు, ఉద్ధండపండితులు, కవులు, కళాకారులతో మీ సభ ఇప్పటికే నిండుదనాన్ని సంతరించుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనదేశ శివారు గ్రామమైన దేవరపల్లిలో సుధాముడు అనే కవి ఉన్నాడు. అతడు ఎప్పుడో తప్ప కవిత్వం చెప్పడు. చెప్పాడంటే అది వీనుల గుండా ప్రవహించే ఓ రసప్రవాహమే! అంతేకాక ఆ కవితలు కర్తవ్యప్రభోధకంగా ఉండి వినేవాళ్ల మనసుల్ని కట్టిపడేస్తాయి. సుధాముడు మీ కొలువులో ఉంటే సభ మరింత శోభిస్తుంది"అన్నాడు.

మహారాజు వెంటనే తన భటుల్ని పిలిచి ‘రేపటికల్లా సుధాముడిని సకల లాంఛనాలతో సభకు తీసుకు రావాలని’ ఆజ్ఞాపించాడు.

మరుసటిరోజు తన ముందు మిక్కిలి వినయంగా నుంచున్న ఆ కవీశ్వరుణ్ని ఆపాదమస్తకం శ్రద్ధగా గమనించాడు. అతనిలోని ప్రతిభ అద్భుతమైన ప్రకాశంతో ముఖంలో స్పష్టంగా గోచరిస్తోంది.

సుధాముడు చెప్పిన రెండు సందర్భోచిత కవితలు మహారాజు మనసుని ఆహ్లాదపరచడమే కాకుండా, అశేష సభికుల హర్షధ్వనాలు అందుకున్నాయి. అటువంటివి వారు అంతకు ముందు వినలేదు.

రాజు వెంటనే ఆసనం దిగి సుధాముడి దగ్గరకి వెళ్లి గాఢాలింగనం చేసుకుని తన కొలువులో రత్నంలా భాసిల్లమని కోరాడు.

అప్పుడాకవి "మహారాజా, ప్రకృతిని, రమణి రమణీయతను తమ వాక్చాతుర్యంతో కొనియాడడానికి ఇప్పటికే మీ కొలువులో కవులు కొల్లలుగా ఉన్నారు. కాని నేను కవినయింది మరో ఉద్దేశంతో. అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరకి వస్తాను. క్షమించి సెలవిప్పించండి"అన్నాడు.

తన అభ్యర్ధనని ఆ కవి తిరస్కరించినందుకు మహారాజుకు చాలా కోపం వచ్చింది. అయినా అది పైకి కనిపించనీయకుండా వెళ్లమన్నట్టుగా తల ఊపాడు.

కొంతకాలం తర్వాత కోసలదేశం మీదకి శతృదేశం యుద్ధం ప్రకటించింది. దాన్ని ఎదుర్కొనే శక్తి ఏ కొశానా లేదు కోసల దేశానికి.

మహారాజు ‘తగిన ఆయుధ సంపత్తి, సైనిక శక్తీ లేని తాము యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలా’ అని తన అనుచరగణంతో సమాలోచనలు జరుపుతుండగా వచ్చాడు కవి సుధాముడు.

"మహరాజా, నన్ను మీ కొలువులో చేర్చుకోండి. నా అవసరం ఈ దేశానికి ఇప్పుడు పడింది"అన్నాడు.

‘అసలే యుద్ధం హడావుడిలో ఉంటే ఇప్పుడొచ్చి ఈ కవి తన కొలువులో చేరతానంటాడేమిటి?’ మనసులో విసుగ్గా అనుకుని, అదేం పట్టించుకునేంత పెద్ద విషయం కానట్టు తల ఊపి, తన సమ్మతిని తెలిపి, మళ్లీ వ్యూహరచనలో మునిగిపోయాడు.

సుధాముడు మహారాజు కొలువులో కుదిరిపోయాడు.

మరుసటిరోజునుంచీ సైనికుల్లో, ప్రజల్లో తన కవితలతో దేశభక్తిని పురిగొల్పాడు. మాతృదేశాన్ని రక్షించుకునే తరుణం ఇదేనని, రక్తం సల సల మరిగేలా పదాలను పేర్చి శతృవుల గుండెలను చీల్చి చెండాడే మృగరాజుల్లా, మానసికంగా సన్నద్ధులను చేసి ముందుకురికించాడు.

రాజ్యంలోని చిన్నపిల్లాడిని సైతం విల్లంబులు, కత్తులు పట్టుకుని యుద్ధభూమివైపు ఉరకలెత్తించాడు కవి. కవిసైన్యం శతృదేశపు సైనికులను కకావికలు చేసింది. కోసలదేశపు పౌరుల దేశభక్తి బలం ముందు శతృదేశం వెల తెలబోయింది. యుద్ధంలో విజయం కోసలదేశాన్నే వరించింది. సుధాముడే లేకపోతే యుద్ధంలో గెలుపు సాద్యమయ్యేదే కాదు. కవిత్వం ఆయుధాల కన్నాపదునైనది, బలమయినదీ అని అప్పుడే మహారాజుకి తెలిసింది. ఇతర కవులు మనసుని రంజింపజేస్తె, సమయానికి వచ్చిన సుధాముడు పౌరుల మనసులో దేశ రక్షణ బాధ్యత పాదుగొలిపి, దేశం పరువు కాపాడాడు, కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశాడు.

మహారాజు ఆనందబాష్పాలతో ఆ కవి కాళ్లు కడిగాడు.

మరిన్ని కథలు

Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు
Mosapoyina Raju
మోసపోయిన రాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు