రాత్రి పది దాటింది. జోరున వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ నదులుగా మారుతున్నాయి. పెట్రోలింగ్ వ్యానొకటి రోడ్లపై వున్న నీటిని చిమ్ముకుంటూ "చికెన్ బిరియాని" హోటల్ ముందు ఆగింది. హోటల్ ముందు ఒక కుక్క తన తోకని రెండు కాళ్ళ మధ్యలోకి తోసి చలిని అడ్డుకునే ప్రయత్నం చేస్తు... పొడిగా వున్న ప్రదేశాన్ని వెతుక్కుంటుంది. విసురుగా ఆగిన వ్యాన్ శబ్దానికి కుక్క కంగారుగా ప్రక్కకి వెళ్ళింది.
ఒకరిద్దరు కస్టమర్లు మినహా హోటల్ ఖాళీగానే వుంది. పెట్రోలింగ్ వ్యానులోంచి బొజ్జ పెరిగిన కానిస్టేబుల్ దిగాడు. హోటల్ లో వున్న పదిహేనేళ్ళ కుర్రాడు "ఏమిటి స్సార్ పార్శిలా, తింటారా" అడిగాడు. "రెండు బిర్యాని" పార్శిల్ చెప్పి కుక్క పక్కన నిలబడ్డాడు కానిస్టేబుల్ జేబులో నుండి సిగరెట్ తీసి.
"ఐదు నిమిషాలు సార్... కూర్చోండి" కుర్చీ చూపించాడు కుర్రాడు. 'అక్కర్లేదు' నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి గాల్లోకి గుప్పు గుప్పున పొగ వదల సాగాడు కానిస్టేబుల్. వాన పెద్దదవసాగింది.
వేడి వేడి పార్శిల్స్ కానిస్టేబుల్ చేతికిచ్చాడు. పార్శిల్స్ తీసుకుని "సార్ కి రెండు థమ్సప్ ఇవ్వు" అన్నాడు కానిస్టేబుల్. వ్యాన్ లో కూర్చుని ఉన్న ఎస్సై కానిస్టేబుల్ ప్రభు భక్తికి తన పెదవులని చెవుల దాకా సాగతీసి నవ్వాడు. "థమ్సప్, బిర్యాని, పార్సిల్స్" తీసుకుని వెళుతున్న కానిస్టేబుల్ ను "సార్... డబ్బులు" అన్నాడు హోటల్ కుర్రాడు.
సిగరెట్ ని కిందపడేసి బూటు కాలితో నలిపేస్తూ "ఏరా... కొత్తా మీ అన్న లేడా... వాడికి తెల్సు మేము డబ్బులు ఇవ్వాలో వద్దో" అని గీరగా సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాడు.
"అన్నకి లెక్క చెప్పాల్సార్" రెట్టించాడు కుర్రాడు. బిర్యాని పార్శిల్స్ వ్యానులో పెట్టి వెనక్కి వచ్చాడు కానిస్టేబుల్. "ఏరా ఇప్పుడు టైం ఎంతయ్యింది. ఎన్ని గంటలకి హోటల్ మూసెయ్యాలి. బోడి మూడొందల కోసం కక్కుర్తి పడితే... స్టేషన్ చుట్టూ తిరగలేక మానసికంగా, ఆర్ధికంగా దెబ్బ తింటావ్..." అంటూ బండ బూతులు తిట్టాడు కానిస్టేబుల్. "అది కాద్సార్" అంటూ ఏదో చెప్పబోయాడు హోటల్ కుర్రాడు. "ఏరా... నీ... చెప్పితే అర్ధం కాదా" అని కాలుతో కుర్రాడిని ఒక తన్ను తన్నాడు కానిస్టేబుల్.
పడుకోవడానికి పొడి ప్రదేశం వెతుక్కుంటున్న కుక్క ఈ గందర గోళానికి 'కుయ్య్' మంటూ ప్రక్కకు వెళ్ళింది. కానిస్టేబుల్ తన్నిన తన్నుకి హోటల్ కుర్రాడు మెలికలు తిరిగి పోసాగాడు.
కానిస్టేబుల్ కాలు ఎత్తి మళ్ళీ తన్నబోయాడు. ఇంతలో హోటల్ యజమాని రవి వచ్చి "సార్... సార్..." అంటూ ఆపాడు. రవిని చూడగానే కానిస్టేబుల్ "రవీ... ఎవడ్రా వీడు నన్నే డబ్బులు అడుగుతున్నాడు" అన్నాడు పైకెత్తిన కాలు దించి.
"మా వూరోడే సార్... తెలీదు... కొత్త కుర్రాడు. పైగా మీ లాంటోళ్ళు ఇంకా కొత్త..." అంటూ భాదతో మెలికలు తిరిగిపోతున్న కుర్రాడిని పైకి లేపాడు రవి.
"నువ్వు ఎక్కడికి వెళ్ళావ్" ముక్కు ఎగబీలుస్తూ అడిగాడు కానిస్టేబుల్.
"ప్రక్క సందులో పార్టి వుంటే బిర్యాని పార్శిల్స్ ఇచ్చి వస్తున్నాను సార్" అన్నాడు రవి. "సరే నే వెళుతున్నా" అంటూ కానిస్టేబుల్ వ్యాను ఎక్కబోతూ వెనక్కి వచ్చి కుర్రాడి వైపు వేలు చూపిస్తూ "బిడ్డా... నరికేస్తా..." "జాగ్రత్తగా వుండు" అంటూ వ్యాను వైపుకు వెళ్ళబోయాడు.
ఇందాకట్నుంచి దూరం నుంచి ఈ తతంగాన్ని గమనిస్తున్న కుక్క "భౌ" మంటూ పెద్దపులిలా కానిస్టేబుల్ మీదకు దూసుకు వచ్చింది. పళ్ళు బయటకు పెట్టి భయంకరంగా మొరగసాగింది.
దాన్ని చూసి కానిస్టేబుల్ వికారంగా మొఖం పెట్టి గుట్కా పాకెట్ చింపి నోట్లో పోస్కుని "థూ... నీయమ్మా... మమ్మల్ని చూసి కాదే అరవాలి... దొంగల్ని చూసి అరవాలే... నీకు దొంగలెవరో... పోలీసోళ్ళు ఎవరో తెల్వనట్టుంది" అంటూ వ్యానెక్కాడు. లోపల కానిస్టేబుల్ వీరంగాన్ని చిద్విలాసంగా తిలకిస్తున్న ఎస్సై ఇప్పుడు వాడు చేసిన కామెడికి పెదవుల్ని చెవుల దాకా సాగదీసి మళ్ళీ నవ్వాడు. వ్యాను బయలుదేరింది. కుక్క అరుస్తూనే వుంది. కుక్కకు తెలుసు ఎవరిని చూసి అరవాలనే విషయం.