ఈ పయనం ఎందాకో... - వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి

ee payanam endaako telugu story

సుబ్బయ్యశెట్టి మధ్యాహ్ణం దుకాణం నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ వీధి లోంచి వెలుతూ సందు తిరిగాడు.ఆ వీధి లో వుంటున్న రంగనాథం అరుగు బయట కూర్చున్నాడు. అతను సుబ్బయ్యశెట్టి ని చూసి "ఏంటండి... సుబ్బయ్యశెట్టి గారు, ఈ నెల సరుకులు ఇంకా పంపించలేదు." అని అడిగాడు. సుబ్బయ్య శెట్టి ఏదో సమాధానం చెప్పేలోగానే లోపలినుంచి రంగనాథం కొడుకు చెబుతూ

"నేనే పంపించొద్దాన్నాను,నాన్నా" అన్నాడు.

"ఏరా..ఎందుకు?" అడిగాడు రంగనాథం.

"ఏమీ లేదు నాన్నా, నాకు ప్రతీ నెలా మా కంపెనీ లో సొడెక్సో కూపన్లు ఇస్తారు, వాటిని ఉపయోగించి మన ఇంటికి సరిపడా కిరాణా సామాన్లు తెచ్చుకోవచ్చు. ఆ కూపన్లు మన సుబ్బయ్యశెట్టి గారి దుకాణంలో చెల్లవు. అందుకనే ఇక నుంచి సరుకులు పంపించొద్దాన్నాను." చెప్పాడు.

" అలా ఎలాగరా, శెట్టి గారు మనకి ముప్పయి సంవత్సరాల నుంచి సరుకులు ఇస్తున్నారు. ఇప్పుడు సడన్‌ గా మనం మానేస్తే ఆయనకి ఇబ్బంది కదా". అన్నాడు.

"నాన్నా రోజులు మారాయి, వాటితో పాటే మనం కూడా మారాలి. మొహమాటాల కోసం అనవసరంగా డబ్బులు వృధా చేయలేం కదా." అన్నాడు.

ఈ తంతంతా గమనిస్తున్న సుబ్బయ్యశెట్టి మాట్లాడుతూ "సరే లెండి, రంగనాథం గారు, మీ లాంటి ఖాతాలు వదులుకోవడం మాకు కూడా ఇష్టం వుండదు. కానీ ఏం చేస్తాం చెప్పండి, కాలంతో ప్రయాణం చేయవలసిన వాళ్ళమే కదా అందరం." అని చెప్పి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

మరికొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళి జోసఫ్‌ గారింటికి వెళ్ళాడు. గుమ్మం లో నిలబడ్డ శెట్టి గారిని చూసి లోపలికి రమ్మని కూర్చోమన్నాడు జోసఫ్‌. అతనితో మాట్లాడుతూ

"ఏంటి శెట్టి గారు, ఇలా వచ్చారు...?" అని అడిగాడు.

"ఏం లేదండి, ఈ నెల సరుకులు లిస్టు ఇస్తే, మా కుర్రాడి చేత సామాన్లు పంపిస్తాను." అడిగాడు సుబ్బయ్య శెట్టి.

"ఏమీ అనుకోకండి శెట్టి గారు, మొన్ననే బిగ్‌ బజార్‌ లో ఏవో ఆఫర్లు ఇస్తున్నారని మా ఆవిడ వెళ్ళి చాలా సామాన్లు తీసుకువచ్చేసింది. అయినా నాకు కొంచెం అగ్గిపెట్టెలు, బ్లేడ్లు కావాలి. నేను సాయంకాలం అటుగా వచ్చినప్పుడు వచ్చి తీసుకుంటాను." చెప్పాడు.

సుబ్బయ్యశెట్టి కి పచ్చి వెలక్కాయ తిన్నట్టుంది. ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో వున్నాడు.

"సరే... సార్‌... వస్తాను..." అంటూ దిగాలుగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.

నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు సుబ్బయ్యశెట్టి. ఇంట్లో కి వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసి అలా మంచం మీద నడుం వాల్చాడు. కాస్త మగతగా వుండడంతో నిద్ర లోకి జారుకున్నాడు. కొంతసేపటికి షాపు లో పని చేసే గోవిందు వచ్చాడు. షాప్‌ తాళాలు తీసుకు వెళదామని వచ్చానని చెప్పాడు. అతన్ని కూర్చోమన్నాడు శెట్టి.

బీరువా లోంచి కొత్త బట్టలు తీసాడు. దాంతో పాటు కొంత డబ్బుని కూడా జతచేసి గోవిందుకి ఇచ్చాడు. గోవిందుకి ఇదంతా ఆశ్చర్యంగా వుంది.

"ఏంటి శెట్టి గారు ఇదంతా..." అన్నాడు అనుమానం తో కూడిన ఆశ్చర్యంతో.

"ఏమీ లేదు, గోవిందు, ఇంతకాలం షాపులో నమ్మకం గా పనిచేసావు. నీలాంటి వాడికి ఏమి ఇచ్చినా తక్కువే." అన్నాడు.

"ఏదో శెట్టి గారు, అది మీ అభిమానం." అన్నాడు గోవిందు.

"అదే గోవిందు, ప్రస్తుతం వ్యాపారం ఇది వరకటి లా లేదు. నగరం లో అనేక చోట్ల అనేక షాపింగ్‌ మాల్స్‌ వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడే పెద్ద, పెద్ద సంస్థలు సూది నుంచి సూదంటు రాయి వరకు అమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన లాంటి దుకాణాల్లో కొనేదెవ్వరు చెప్పు. అందుకనే ఇకనుంచి నువ్వు పనిలోకి రానక్కరలేదు." అన్నాడు భాధతో నిండిన స్వరంతో.

"అదేటి శెట్టి గారు అలా అంటారు. నేను ఏం తప్పు చేసాను. ఇరవై ఏళ్ళ నించి మీ దగ్గరే పని చేస్తున్నాను. మీ షాపుని నా సొంత ఇంటిలా కాపాడుకుంటూ వచ్చాను. ఏ రోజైనా ఒక పూతిక పుల్ల అయినా పోయిందా. ఇప్పుడు మీరు ఇలా హటాత్తుగా బయటికి పొమ్మంటే ఎక్కడికి పోతాను బాబు. ఏం చెయ్యడానికి నాకు పెద్దగా సదువు కూడా లేదని మీకు తెలుసు కదా." అన్నాడు భాదగా.

"గోవిందు, నేను చెప్పింది నీ మంచికే. ఉంటుందో, ఊడుతుందో తెలియని నా దుకాణం లో పని చేయడం వల్ల ఏంటి లాభం? ఇప్పుడనేక బహుళ అంతస్తుల దుకాణాలు వచ్చాయి. నీకు ఎక్కడో దగ్గర పని దొరకకపోదు. నేను కూడా నాకు తెలిసిన వాళ్లకు చెబుతాను. అర్థం చేసుకో." అన్నాడు అభ్యర్థనగా.

ఇక చేసేది ఏమీ లేక, నిస్సహాయంగా వెళిపోయాడు గోవిందు.

భారంగా అడుగులు వేసుకుంటూ షాపు కు వెళ్లాడు సుబ్బయ్య శెట్టి. ఇంతలో ఎనిమిది సంవత్సరాల పాప వచ్చి" అంకుల్‌ డెయిరీ మిల్క్‌ వుందా" అని అడిగింది.

"లేదమ్మా, ఇది బాగుంటుంది. తీసుకో." అని మరో రకం చాక్లెట్‌ తీసి ఇచ్చాడు.

"వద్దు... అంకుల్‌. ఇలాంటి రేఫర్‌ లేనివి తినకూడదని చెప్పింది మా అమ్మ." అంది.

సుబ్బయ్య నోటి వెంట మాట రాలేదు. ఈ లోగా అక్కడికి సుబ్బయ్య కి తెలిసిన డీలర్‌ ఒకాయన వచ్చాడు.

"ఏంటి సార్‌... దుకాణం అంతా ఖాళీ గా కనిపిస్తోంది." అన్నాడు.

"ఏం చెప్పమంటావు... రంజన్‌ జీ నీకు తెలియనిదా ఇదంతా. ఎఫ్‌.డి.ఐ దెబ్బకి మా దుకాణాలు మూతపడ్డం తప్ప ఇంక వేరే దిక్కు కనబడ్డం లేదు. ఈ రొజుల్లో అందరూ పెద్ద, పెద్ద సూపర్‌ మార్కెట్‌ లలో కొనుక్కోవడానికి అలవాటు పడ్డారు. అలాంటప్పుడు నా లాంటి చిన్న, చిన్న కిరాణా దుకాణాల్లో కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న నాలాంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టయింది. అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఏ రోజైనా చిన్న చేప పెద్ద చేప నోట్లో పడవలసిందే." అన్నాడు భారంగా.

"అందరి పరిస్థితీ అలాగే వుంది శెట్టి గారు. పెద్ద చేపల దెబ్బకి చిన్న చేపలు విలవిల్లాడడం తప్పించి మరో మార్గం కనిపించడం లేదు. ఇంతకు ముందు మాకు ఎంతో భారీగా ఆర్డర్లిచ్చిన వాల్లు కూడా ఇప్పుడు కనీసం మినిమం ఆర్డర్లు కూడా ఇవ్వడం మానేసారు. అందుకనే నేను కూడా ఈ డీలర్‌ షిప్‌ మానేద్దామనుకుంటున్నాను." అన్నాడు.

ఈ లోగా అక్కడికి జానకమ్మ గారు వచ్చారు.

ఆవిడ ని చూసి నవ్వుతూ "ఏంటమ్మా , ఈ మధ్య బొత్తిగా కొట్టు కి రావడం మానేసారు. వూరికి గాని వెళ్ళారా ఏమిటి?" అని అడిగాడు సుబ్బయ్య.

"లేదండి. ఈ మధ్య మా అమ్మాయికి పెళ్ళయింది కదా! మా అల్లుడు డిఫెన్స్‌ లో పని చేస్తాడు. వాళ్ళకి కేంటీన్‌ లో అన్ని సామాన్ల మీద మంచి రాయితీ లభిస్తుంది. అందుకని అక్కడ నించే తెచ్చుకొంటున్నాం." అంది.

మరో సారి నెత్తిమీద పిడుగు పడినట్టయింది సుబ్బయ్య శెట్టికి. ఉన్న నెలవారీ ఖాతాలన్నీ ఏదో కారణంతో ఇలా తప్పిపోతే ఇక దీని మీద బతకడం కష్టం అనిపించింది.

జానకమ్మ ఏదో ముక్తసరిగా రెండు చిన్న వస్తువులు తీసుకొని అక్కడ నించి వెళ్ళిపోయింది.

ఇంతలో డీలర్‌ కల్పించుకొని "మీరు ఏమీ అనుకోకపోతే ఒకమాట చెబుదామనుకుంటున్నాను. నేను ఎలాగూ ఈ డీలర్‌ షిప్‌ మానేసి, ఓ సాఫ్ట్వేర్‌ కంపెనీలో కేంటీన్‌ కాంట్రాక్ట్‌ తీసుకుందామనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు అక్కడ లెక్కలు చూడ్డానికి రండి. మిమ్మల్ని గౌరవంగా చూస్తాను." అన్నాడు.

"నువ్వు చెప్పినదాంట్లో తప్పులేదు రంజిత్‌ భాయ్‌. ఇప్పుడు పరిస్థితులు అలా వున్నాయి. ఒకప్పుడు దుకాణం యజమానులు గా వున్నవాళ్ళు, ఇప్పుడు వేరే దుకాణాల్లో కూలీలు గా బతుకుతున్నారు. నా చేత్తో ఎంతోమందికి పని ఇచ్చిన నేను, నాకే ఏ పనీ లేని స్థితికి చేరాను. ఇది పురోభివృద్ధో, తిరోభివృద్ధో అర్థం కావడం లేదు. పాత ఒక రోత, కొత్త ఒక వింత. ఇది ఈనాటి విషయం కాదు కదా. సర్లే పనిలో పనిగా దుకాణం కూడా అమ్మకం పెడతాను. ఎవరైనా దొరుకుతారేమే చూడు..." అన్నాడు కళ్ళ నించి కారుతున్న నీటిని తుడుచుకుంటూ... ఈ పయనం ఎందాకో అర్థకావడం లేదు... అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు.

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.