మనస్విని - డా. పి.కె. జయలక్ష్మి

manaswini telugu story

మనస్విని మౌనంగా నిట్టూర్చింది. ఒంటరితనం ఎంత భయంకరమో ఇప్పుడు అర్ధమౌతోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఏం సాధించింది? ఎవరికోసం సాధించాలని ఆశపడింది? తలచుకుంటే వేదనే తప్ప ఏం మిగిలింది? తనకంటూ ఎవర్నీ మిగుల్చుకోలేకపోయింది. అసలు? జీవితమంతా తన చుట్టూ గిరిగీసుకొనే బ్రతికింది. రకరకాల అనుమానాలతో అందర్నీ శత్రువులుగానే పరిగణిస్తూ మూడొంతుల జీవితాన్ని చేతులారా నరకం చేసుకుంది. ఒక్కసారిగా ఆమె మనసు గతంలోకి జారింది.

**** **** **** ****

చిన్నప్పటినుంచి తల్లితండ్రులు, అన్నగారు మనస్వినిని “నీకంటే అందగత్తె మరొకరులేరు, ఉండబోరు” అని విపరీతంగా ఆకాశానికి ఎత్తేయటం ఆమెలో అహం పెరగడానికి కారణమైంది. సహజంగానే తను చాలా అందగత్తె మంచి రంగు, రూపం. తల్లికి కూతురి అందం పట్ల ఎనలేని గర్వం. తాను సాధారణంగా ఉండటంతో కూతురు అందంగా ఉండేసరికి ఆమెకు చెప్పలేనంత గొప్పగా ఉండేది. అలాగే తండ్రి, అన్న ఆమె స్నేహితురాళ్లతో పోలిస్తూ వారిని కించపరచటం, మనస్వినిని ఆకాశానికి ఎత్తేయటం చేసేసరికి తానొక ‘విశ్వసుందరి’ అన్న భావం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. చదువులో ఏకాగ్రత అంతంత మాత్రమే! ఏకాగ్రత అంతా అందం మీద, షోకుల మీద ఉంటే చదువు మీద మనసేలా పెడుతుంది? క్లాస్ లో కూడా ఎవరితో స్నేహంగా ఉండేది కాదు. తన అందానికి సరిజోడి కాని, వాళ్ళతో మాట్లాడటం వేస్ట్ అని తన భావన. పెద్దయ్యేకొద్దీ ఈ భావం మరింత బలపడిందే తప్ప తరగలేదు. దాంతోఅందం కూడా మరింతగా పెరిగింది మనస్వినికి. “ఎవరైనా మీఅన్నకి చదువులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది నువ్వేమిటమ్మా ఇలా? అంటే “నాలా తనేం అందంగా ఉన్నాడేంటి?’’ అనేది పెంకిగా. తన మన లేకుండా ఎవర్నైనా సరే అందంగా లేకపోతే చాలా తిరస్కారంగా, హేళనగా మాట్లాడేది.

పెళ్లి కూడా తన కంటే కాస్త తక్కువ స్థాయి అందగాణ్ణే ఏరికోరి చేసుకుంది. వినయ్ సంస్కార వంతుడు, నెమ్మదస్తుడు, బాగా చదువుకున్నవాడు. మనస్విని అందాన్ని ఆరాధించి వెంటపడి ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్న ధైర్యవంతుడు. అతని తల్లితండ్రులు అందంగా లేకపోవటం వాళ్ళదురదృష్టం. కోడలి అందాన్ని ప్రతి రోజు పొగుడుతూ ఉండాలని వారికి తెలియక పోవడం మరీ దురదృష్టం. అంతే అదే వేరు కాపురానికి దారితీసింది. పుట్టింట్లో వదిన, అత్తింట్లో తోడికోడళ్ళు, ఆడబడుచులు, అత్తగారు ఎవరూ తన కాలిగోటికి పోలరని చాలా మిడిసిపడ్తూ ఉండేది. వేరింట కాపురంలో కూడా కనీసం ఇరుగుపొరుగు వారితో కాని, ఇంటిలో పని మనుషులతో గాని సయోధ్యగా ఉండేది కాదు. దీనికి తోడు పెళ్లై 5 సంవత్సరాలు అయినా కడుపు పండక పోవటం. అయిన వాళ్ళెవరూ తొంగి చూడకపోవటమే కాదు హాయిగా పిల్లాపాపలతో కాపురం చేస్కోవడం మరింత కడుపు మంటని రగిల్చాయి. అభద్రత, సుపీరియార్టీ భావాలతో ఎవరితోనూ కలవలేక, మనసువిప్పి మాట్లాడలేక, అందరూ తనని చూసి ఈర్ష్య పడుతున్నారని, దిష్టి పెడుతున్నారని ఒకటే మధన పడిపోతూ భర్తకి తీవ్రమైన అసహనాన్ని, ఒత్తిడిని కల్గచేసేది. అత్తగారింటికి భర్తని కూడా వెళ్లనిచ్చేది కాదు వాళ్ళు వచ్చినా హద్దు ఆపు లేకుండా మాట్లాడుతూ ఊదరగొట్టి వెళ్లగొట్టేసేది.

అందం పిచ్చితో అస్తమానం అందాల పోటీలని, ఫాషన్ షో లని తిరుగుతూ ఉండేది. వివిధ సంస్థల నుంచి ఎన్నోసార్లు అందాలరాణి బిరుదులు, అవార్డులు, ఆమెని వరించాయి, పొగడ్తలు, సన్మానాలు ఈవిడకి ప్రాధాన్యాలుగా మారాయి. కాలం గడుస్తున్నకొద్దీ ‘పిల్లలు’లేరన్న బాధ తనని కలచి వేయసాగింది. తనకి లేరన్న బాధ కంటే బంధువులందరికీ ఉన్నారన్న బాధ ఎక్కువగా ఉండేది. ఆ విషయంలో వెనకపడి పోయానన్న దుఃఖం లావాలా పొంగేది మనస్వినిలో. ఒక శుభ ముహూర్తాన ట్రీట్మెంట్స్ ఫలించి లక్షణమైన కొడుకుని విలక్షణంగా ప్రసవించింది మనస్విని. తన ప్రతిరూపంగా అందంగా పుట్టిన అభిరాంని చూసుకొని తెగ మురిసిపోయింది. వినయ్ ఆడపని, మగపని అంతా తల్లిలా తానే స్వయంగా చూసుకున్నాడు. మనస్విని ఇంక సగటు ఆడదానిలా, తల్లిలా రూపాంతరం చెందుతుందని అందరూ ఆశపడ్డారు.

ఏదైనా పొందలేనపుడు దాని మీద ఉన్న ఆశ, ఆసక్తి అది పొందాక ఉండదు. మనస్విని విషయం లో అలానే జరిగింది. పిల్లవాడ్ని కనడం అయితే కనింది కానీ, వాడు ఏడ్చినా, అల్లరి చేసినా చాలా విసుగుపడేది. కాస్త లేట్ వయసులో పుట్టాడని ఒక పక్క, మిగిలిన వారిపిల్లలు అప్పుడే పెద్దవాళ్లై పోయారని మరో పక్క ఉక్రోషంగా ఉండేది. అన్నింట్లో అందరికంటే తాను వేరుగా, ప్రత్యేకంగా ఉండాలని మొదట్నుంచి తపన ఎక్కువగా ఉండేది మనస్వినికి. అన్న వదిన పెద్ద చదువులు చదివి మంచి వుద్యోగాల్లో స్థిరపడ్డం, వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని అందిరావటం ఇంకా మధనానికి కారణమయ్యాయి.

ఫలితంగా పసివాడు రెండేళ్లకే కేర్ సెంటర్ పాలయ్యాడు. అందంలోనే కాదు చదువులోకూడ తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకోవాలని ఎమ్.ఏ డిగ్రీ కూడా కష్ట నష్టాల కోర్చి సాధించింది. ఒకసారి అందాల పోటీలో విజేతగా నిలిచినపుడు ప్రెస్ వాళ్ళ ఇంటర్వ్యూ లో “ఒక స్త్రీగా, మాతృమూర్తిగా మీ ఆశయాలేమిటి”? అని అడిగిన ప్రశ్నకి సమాధాన మిచ్చింది ఇలా... “ఒక స్త్రీ గా అందంలో, కీర్తి ప్రతిష్ఠల్లో, చదువులో, ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక మాతృ మూర్తిగా అంటారా? అందరి తల్లుల్లా నేను మామూలు సగటు తల్లిని కాదు. “ఏ తల్లి తన పిల్లలకి ఇవ్వలేని బహుమతి నా కొడుక్కి ఇస్తున్నా”... అంటూ ఒక క్షణం ఆగింది. “ఏంటి? కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నారా? లేక మీకంటే బాగా చదివించాలని ఆశ పడుతున్నారా? లేక అన్నిట్లో మీకు ధీటుగా బాబు ని తయారు చేస్తారా? అన్న ప్రశ్నలకు నవ్వుతూ కాదు కాదంటూ తల తిప్పేసింది. “పోనీ మీరే చెప్పండి” అన్నారంతా. గొంతు సవరించుకుంటూ ఠీవీగా అందరి వైపూ చూస్తూ గర్వంగా చెప్పింది మనస్విని. “మా అబ్బాయి పెద్దవాడయ్యాక తన తల్లి ఎంత గొప్పదో, ఎంత ఘనచరిత్ర కల్గినదో తెలుసుకునేలా నేను సాధించిన పలు టైటిల్స్ అవార్డులు సన్మాన పత్రాలు ,మొదలైన వాటితో... నా ప్రొఫైల్ తయారు చేస్తున్నా. అందరి తల్లుల్లా సామాన్యమైన తల్లి కాదు,’’… మా అమ్మ చాలా అసాధారణమైనది అని వాడు గర్వపడేలా ఇప్పట్నుంచి అన్నీ సమకూర్చుకుంటున్నాను. ఇదే వాడికి నేనిచ్చే అద్భుతమైన బహుమతి.”

అప్పుడే భర్త ఆఫీసు నుంచి వస్తూ దార్లో కేర్ సెంటర్ నుంచి జ్వరంతో వేలాడిపోతున్న కొడుకుని భుజాన వేసుకుని నీరసంగా ఇంటికి వచ్చాడు. ప్రెస్ వాళ్ళు బుగ్గలు నొక్కుకున్నంత పని చేశారు. ఎవరైనా పిల్లలకి ఏమిద్దామా, ఎంత బాగా చదివించుకుందామా అని ఆలోచిస్తారు. కానీ లేక లేక లేటు వయసులో పుట్టిన కొడుకు 20 సంవత్సరాల తర్వాత తన తల్లి గొప్పతనాన్ని గుర్తించాలని ఆరాటపడుతున్నఈ తల్లిని చూసి వాళ్ళు నివ్వెరపోక ఏం చేస్తారు?

**** **** **** ****

కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మనస్విని కొడుకు అభిరామ్ చిన్ననాటి స్నేహితురాలు, సహాధ్యాయి అయిన మైథిలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తను మంచి సంస్కారవంతురాలు, సహనశీలి. దానికి తోడు వినయ్, అభిరామ్ లు అత్తగారి మనస్తత్వం చెప్పి ఉండడంతో మనస్వినిని అర్ధం చేసుకోవడం కష్టమనిపించలేదు మైథిలికి. పెళ్ళైన కొన్ని రోజులకే అభిరామ్ కి కెనడా లో పెద్ద ఉద్యోగం రావటంతో భార్యా సమేతంగా వెళ్లిపోయాడు.

మూడేళ్ళకే వినయ్ హార్ట్ ఎటాక్ తో మరణించాడన్న విషయం తెలిసి హుటాహుటిన అభిరామ్ భార్యతో ఇండియా వచ్చాడు. అభిరామ్ ని వినయ్ తల్లిగా, తండ్రిగా, సంరక్షకుడిగా కళ్ళల్లో పెట్టుకొని పెంచాడు. వృద్ధాప్యం, ఒంటరితనం, అణగారిన అహం… మనస్వినికి ఇప్పుడు వదల్లేని కవచాలు. భర్త ఎడబాటు బాధిస్తున్నా పైకి గంభీరంగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ వారం రోజుల్లో కొడుకు కెనడా ప్రయాణం. ఒక రోజు సాయంత్రం అభిరామ్ ఎవర్నో ఇంటికి తీసుకువచ్చి కొలతలు ,లెక్కలు వేయించడంచూసి ఆసక్తిగా అడిగింది. "అమ్మా, కెనడా వెళ్ళే లోపే ఇంటి విషయం సెటిల్ చేసేద్దామనుకుంటున్నా!! సాయంత్రం బయటకి వెళ్ళాలి రెడీగా వుండు’’ అన్నాడు ముక్తసరిగా. తన కెనడా ప్రయాణానికి, ఇంటిని సెటిల్ చేయాల్సిన పనేంటో? మనసులో గొణుక్కుంది మనస్విని.

సాయంత్రం కొడుకు తీసుకువెళ్ళిన ఆ ప్రదేశం చూసి కంగారు పడింది. అది చిన్నపిల్లల దగ్గరనుంచి, వృధ్ధుల వరకు, బీద, గొప్ప, ఆడ, మగ తారతమ్యం లేకుండా అనాధలను అక్కున చేర్చుకునే సేవానిలయం. సెక్రటరీ తో ఏదో మాట్లాడిన అభిరామ్ వెనక్కి కారు దగ్గిరకి వచ్చి “అమ్మా ఒకసారి రా’’ అంటూ మనస్విని జవాబుకు ఎదురు చూడకుండా వేగంగా ముందుకు నడిచాడు. సెక్రెటరీ హోంలో అన్ని రూములు చూపిస్తూ వాటిలో ఉంటున్న వారిని పరిచయం చేస్తూ ఏవో చెప్పుకుపోతున్నాడు. తల్లి తండ్రులు ఎవరో తెలియని పిల్లలు, చీకటి తప్పులకు జన్మించి అనాధలైన పిల్లలు, వికలాంగులు, జబ్బువాతపడి నిరాదరణకు లోనైన పిల్లలు, సంతానముండి కూడా వారి ప్రేమాప్యాయతలకు నోచుకోని తల్లిదండ్రులు... సంపాదనలేని, పోషణ కరువైన తల్లితండ్రులు, నా అన్న వాళ్ళులేని వృద్ధులు, మమతానురాగాలకి తపించే పెద్దవాళ్ళు, రోగిష్టి వాళ్ళు ఇలా ఎంత మందికో ఆశ్రయమిస్తున్న ఆ సేవానిలయాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. కాసేపట్లోనే మనస్వినికి అర్ధమైంది కొడుకు ఎందుకు తీసుకువచ్చి ఉంటాడో ఇక్కడికి.

‘మీలాంటి గొప్పవాళ్లు ఇచ్చే డొనేషన్స్ తో ఇలా హొమ్ ని నడుపుతున్నాము సార్! ఇక్కడ ప్రత్యేక వసతి సౌలభ్యం కూడా ఉంటుంది ఎవరైనా నెలనెలా డబ్బులు పంపిస్తే వారి బంధువులకి ప్రత్యేకమైన సేవలు ఇవ్వబడతాయి. అలాంటి వాళ్ళూ ఉంటారు. అటు చూడండి. విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లితండ్రులని ఇక్కడ వదిలి వెళతారు. ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతారు. పిల్లల దగ్గర లేమన్న బాధ తెలియకుండా మేం జాగ్రత్తగా చూస్కుంటాము” అని హొమ్ సెక్రెటరీ అభిరామ్ కి చెబుతున్నాడు. “అమ్మా ఒకసారి ఇలారా!” అని కొడుకు పిలుస్తున్నా మనస్వినికి ఏమీ వినిపించడం లేదు. గబగబా కార్ దగ్గరకి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తోంటే అభిరామ్ సెక్రెటరీ చేతిలో పెద్ద నోట్ల కట్ట ఉంచుతూ ఏదో చెప్పడం కనిపించి నిలువెల్లా వణికి పోయింది. అంటే తనని ఇక్కడ పడేసి వాడు తన దారిన తాను కెనడా వెళ్లిపోతాడా!? ఆమె చెవుల్లో హోరు మొదలైంది.

ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు ఎవరితో మాట్లాడాలన్పించడం లేదు. ఎవరికోసం తాను ప్రాకులాడిందో వాడికే తను అక్కరలేదు ఇప్పుడు. తన తల్లి గొప్పతనాన్ని నల్గురికీ చెప్పుకొని, వాడు ఎంతో గర్వపడతాడని తనని ఎంతో మెచ్చుకుంటాడని ఎన్ని కలలుకందో? ఇంటిని కూడా అమ్మకం పెట్టేశాడు ఒకపక్క. వినయ్ ఉంటే ఇలా జరిగేదా అసలు? భర్త తనని ఎంత అపురూపంగా చూసుకున్నాడు? ఆ హోమ్ లో ఒంటరిగా బతుకు వెళ్ళదీయాల్సిందేనా? అన్నగారు, ఆడబడుచులు, బావగార్లు తమ పిల్లల దగ్గర హాయిగా కాలం వెళ్ళబుచ్చుతుంటే తాను మాత్రం...?

“నేను వెళ్లనురా హోంకి” అంటే వాడేమంటాడు?? “నీతో కెనడా వస్తానురా అభీ” అంటే రానిస్తాడా? చిన్నప్పుడు వాడి ఆలన పాలన తాను ఏం సరిగ్గా చూసిందని? ఎప్పుడూ తన అందాల పోటీలు, సన్మానాలు, చదువుల పందాలు, అందరికంటే పైన ఉండాలనే తాపత్రయాలు... వీటితో కన్నబిడ్డని ఎంత నిర్లక్ష్యం చేసింది తలుచుకుంటే ఆమె గుండెల్లోంచి దుఃఖం లావాలా తన్నుకు వచ్చింది. చిన్నతనంలో వాడ్ని కేర్ సెంటర్ పాలు చేసా, తల్లిగా నేను వాడికేమీ న్యాయం చేయలేదు. పెద్దయ్యాక హాస్టల్ వాణ్ణి అక్కున చేర్చుకుంది. నేను తల్లిగా ఓడిపోయాను. నాకిదే సరైన శిక్ష. ఇలాగే అవ్వాలి... నన్ను క్షమించరా బాబూ! అహంకారంతో నీ బాల్యాన్ని నిన్ను ఎంజాయ్ చెయ్యనివ్వలేదు. నిన్ను నాలాగే బంధనాల్లో బంధించేసాను. నా పాపానికి నిష్కృతి లేదు”. కళ్ళవెంట ధారాపాతంగా నీళ్ళు కారిపోతుంటే మూగగా రోదించసాగింది.

“అమ్మా, అమ్మా, ఎక్కడున్నావ్? ఇదిగో ఇటు చూడు నీకేం తెచ్చానో!” అభిరామ్ మాటలతో వులిక్కిపడి గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది మనస్విని. కన్నీరు కొడుకు కంట పడకుండా లేని నవ్వు తెచ్చుకుంటూ లేచి నుంచుంది. అభిరామ్ చేతిలో చక్కని ఫోటో ఫ్రేమ్. వినయ్, తాను, అభిరామ్ ముగ్గురు కలిసి తమ స్వీట్ హొమ్ బ్యాక్ డ్రాప్ తో తీయించుకున్న ఫోటో. ‘ఓహొ! హొమ్ కి వెళ్లిపోతున్నానుగా, వీడ్కోలు కానుక అన్నమాట’ అనుకుంది మనసులో! “అమ్మా రేపే బయలుదేరాలి మంచి రోజు కూడా! నీ సామాన్లు అవీ సర్దడం మొదలు పెట్టాలి”. అభిరామ్ మాట పూర్తి అయిందో లేదో మనస్విని బావురుమంది. అభిరామ్ నిశ్చేష్టుడై చూడ సాగాడు.’’ ఏంటమ్మా ఏమైంది??

“నాకు తెల్సు నేను తల్లి గా నీ పట్ల ఏమీ బాధ్యత గా ప్రవర్తించలేదు. కానీ నాకళ్ళు తెరుచుకునేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని నీతో వస్తానని అడగగలను?? నేను నీ కోసం ఏం చేశానసలు?’ అయినా సరే నాకు హొమ్ లో చేరాలని లేదురా, నీతో వచ్చేస్తాను’’ ’వెక్కుతూ అంది మనస్విని?”

“హోమ్ ఏంటమ్మా? నువ్వు మాతో కెనడా వస్తోంటే?” ఆశ్చర్యంగా అడిగాడు అభిరామ్. సంభ్రమంగా చూసింది మనస్విని “నిజమా! నా మీద నీకు కోపం లేదా? నిజంగా నన్ను నీతో తీసుకువెళతావా కెనడా? మరి ఇంటి విషయం సెటిల్ చేయాలన్నావు... దేనికి? ఆ హోం కి ఎందుకెళ్ళాం? వాళ్ళకి డబ్బుకూడా ఇచ్చావు! నేను చూశాలే!”

చిన్న పిల్లలా అడుగుతున్న తల్లిని మురిపెంగా చూస్తూ “ఓ అదా? మన ఇంటిని నాన్నగారి కోర్కె మేరకు ‘‘మనస్విని మహల్’’ పేరుతో వృద్ధుల సంరక్షణాలయంగా తీర్చి దిద్దాలని...! ఆ విషయంలో హొమ్ వాళ్ళని ఒకసారి సంప్రదిద్దామని అక్కడికి వెళ్ళాను. అంతే కాదు అక్కడి పిల్లల చదువు నిమిత్తం మూడు లక్షల రూపాయలు డొనేట్ చేశాను అదే నువ్వు చూసింది”. నిరుత్తురాలై చూస్తూ ఉండిపోయింది మనస్విని. ఆమె కంటి వెంట దుఃఖాశ్రువులు!...

“నిజంగా నన్ను హోమ్ లో పెట్టవు కదా?” అమాయకంగా అడుగుతున్న తల్లిని నవ్వుతూ ప్రేమగా దగ్గరకి తీసుకుంటూ “నీకలాంటి ఆలోచన ఎందుకొచ్చిందమ్మా?, నేను నిన్ను హొమ్ లో పెడతానని ఎలా అనుకున్నావ్? నువ్వు నా బంగారు తల్లివి. మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ ఉండదు. అవును నిజం... నువ్వు ఎప్పుడూ నాకు అద్భుతంగా అనిపిస్తావు. నువ్వేం చేసినా నాకోసమే కదమ్మా చేసింది. ఎప్పుడూ నిన్ను దూరం చేసుకోను. ఇప్పుడు నువ్వు నా కూతురివి కూడా!, నువ్వెప్పుడూ మాతోనే ఉంటావు తెలిసిందా’’? అన్నాడు తల్లి నుదుటిని ముద్దాడుతూ. మైథిలి నవ్వుతూ చూస్తోంది ఇద్దరినీ.

పిల్లల్ని ప్రేమించడం అంటే బ్యాంక్ లో డబ్బు దాచుకున్నట్లే. పిల్లల పట్ల చూపించిన ప్రేమ అవసరమైన అవసాన దశలో వడ్డీతో సహా తిరిగి మన దగ్గరకి వస్తుంది. తల్లి గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించక పోయినా, తండ్రి లక్షణాలని, ప్రేమించే మనసుని పుణికిపుచ్చుకున్న అభిరామ్ కొడుకుగా తన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాడు. ‘చెడ్డకొడుకు ఉండచ్చుగాని చెడ్డతల్లి ఉండదు’ అన్నాడు రామాయణంలో శ్రీరాముడు. ఇప్పుడు చూస్తే “చెడ్డ తల్లి ఉంటుంది కాని ‘కుపుత్రా న భవతి” అంటాడేమో! తన ప్రియపుత్రుడి అందమైన బాల్యాన్ని తాను రసవత్తరంగా, స్మరణీయంగా తీర్చి దిద్దలేకపోయినా తనకి మాత్రం వృద్ధాప్యం శాపం కాకుండా కమ్మని వరంగా మార్చి ఆసరాగా నిలబడుతున్న కొడుకు, కోడల్ని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది మనసు మారిన మనస్విని.

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.