మధ్యాన్న భోజనం - పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ

madhyanna bhojanam

అప్పల్నాయుడు భోజనప్రియుడు. అతను ఆనందపురం మండలంలో విద్యా శాఖాధికారిగా పనిచేస్తున్నాడు. భోజనప్రియుడు. అందువల్ల రోజూ విందుభోజనాలు చేయడానికి అవకాశాలు కలిగించు కుంటుంటాడు. అతని భార్య తాయారమ్మ ఉదయాన్నే లేచి వంటచేసి కేరేజి కట్టి భర్తకు అందించాలని ఎంతో ఉబలాటపడేది. అప్పల్నాయుడు కేరేజీని కట్టే అవకాశాన్ని భార్యకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఆమె ఏమైనా అంటే " రోజూ రాత్రి భోజనం నువ్వు వండినదే తింటున్నాను. మళ్ళీ మధ్యాహ్నం కూడానా" అంటుంటాడు. అటువంటప్పుడు తాయారమ్మ ఏమీ మాట్లాడదు. " రాత్రిపూట మీరు తింటున్న కూరలు మధ్యాహ్నం మేము తినగా మిగిలినవే లెండి" అందామని అనుకుంటుంది. కానీ భయంతో ఆ మాటల్ని నోట్లోనే ఉంచేసుకుంటుంది.

అప్పల్నాయుడు ఆషామాషీ వ్యక్తి కాదు. పాఠశాలల్లో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అతనికి మాత్రం రోజూ ఎవరో ఒకరు భోజనాన్ని అందించవలసిందే. పాతికేళ్ళ సర్వీసులో ఉపాధ్యాయుల లోటు పాట్లు ఔపోసన పట్టిన వ్యక్తి. రోజూ ఉదయం పదిగంటల నుంచి భోజనానికి వెతుకులాట మొదలు పెడతాడు. ఏ స్కూలుకు వెళ్ళాలా ఎవరికి ఇండెంటు ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. ఒకోసారి ముందుగానే ఇండెంటు ఇచ్చి మధ్యాహ్న భోజనానికి ఆయా స్కూళ్ళకు వెళుతుంటాడు. అతనికంటే ముందుగా అతని దగ్గర ఆఫీసులో పనిచేసే వ్యక్తి వెళ్లి భోజనానికి సంబంధించిన మెనూ తెలియజేస్తుంటాడు. అప్పల్నాయుడు బడికి వచ్చాడంటే భోజనం పెట్టవలసిందేనని ఆ మండలంలో ఉపాధ్యాయులు ఫిక్సు అయిపోయారు. ఈ విషయం చాలా సాధారణమైనదిగా అందరూ భావిస్తుంటారు.

కొత్తగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు ఎంఈఓ సార్ తన పాటశాలకు వచ్చారని ఒకసారి చాలా హడావుడి పడిపోయాడు. పిల్లల కోసం బడిలో తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని పళ్ళెంలో పెట్టి నిండుగా సాంబారు పోసి తన కేరేజీతో తెచ్చుకున్న ఆవకాయ ముక్కని పక్కన పెట్టి పళ్ళెం అందించాడు. అప్పల్నాయుడు "ఏమిటిది" అంటూ కళ్ళతోనే ప్రశ్నించాడు.

"ఏదో... తమరి ఆకలి తీర్చాలని..." అంటూ గొణిగాడు.

అప్పల్నాయుడు అంతెత్తు లేచాడు.

"మర్యాద తెలీదా? స్కూలు ఇన్ స్పెక్టర్ని అనుకున్నావా? మున్సిపాల్టీ గుమస్తాననుకున్నావా? రేషను బియ్యంతో అన్నం... పిల్లల కంచంలో వడ్డింపూ... తమాషాగా ఉందా" అంటూ రెచ్చిపోయాడు.

పాఠశాలలో అన్ని రికార్డులూ సక్రమంగా ఉన్నా బాగోలేవని అడ్డంగా రాసేశాడు. అడిగినవాటికి పిల్లలు జవాబులు చెప్పినా... "బడి పిల్లలంతా దద్దమ్మలు... వేస్టు ఫెలోస్..." అంటూ విజిట్ బుక్కులో రిమార్కులు పచ్చఇంకుతో రాసి విసవిసా వెళ్లిపోయాడు.

అప్పల్నాయుడి వైఖరికి ఆ ఉపాధ్యాయుడికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఉగ్రుడైపోయిన ఎంఈఓ ని ప్రసన్నం చేసుకోవడానికి మంచి భోజనం పెట్టించే అవకాశం మళ్ళీ రావాలని దేవుడ్ని మొక్కుకున్నాడు.

జరిగిన అవమానాన్ని అప్పల్నాయుడు ఆరోజు రాత్రి తన భార్య తాయారమ్మతో చెప్పుకుని ఎంతో బాధపడిపోయాడు. తన సర్వీసులో ఎప్పుడూ ఇలా జరగలేదని తెగ ఇదైపోయాడు.

"రేపట్నించి కేరేజీని కట్టేసేదా!"

"కేరేజీ భోజనం కోసమా ఇదంతా చెబుతున్నాను... నోర్మూయ్..." భార్యను గసురుకున్నాడు. అప్పల్నాయుడి లో ఉక్రోషం లావాలా ఎగజిమ్మింది. "బడి సెలవుల్లోనూ... ఆదివారాల్లోనూ మధ్యాహ్నం ఇంటిదగ్గరే తింటున్నాను కదా" తాయారమ్మ బాధ పడిందేమోనని అప్పల్నాయుడు అనునయించాడు.

శివప్రసాద్ ఆ మండలంలో సీనియరు ఉపాధ్యాయుడు. అతని సర్వీసులో ఎప్పుడూ కేరేజీ పట్టుకుని బడికి వెళ్ళలేదు. రోజూ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజన పధకంలో భోజనాన్ని చేస్తుంటాడు. వంటవారు కూడా అతని కోసం రోజూ ఏదో ఒక కూరని సిద్ధం చేస్తుంటారు.

----# # # # # -----

శివప్రసాద్ మండలాఫీసుకి ఎప్పుడు వచ్చినా... " ఏరోజు మీ స్కూలుకి రావాలి" అని మండల విద్యాశాఖాధికారి అప్పల్నాయుడు అడిగేవాడు.

"ఎప్పుడైనా పర్వాలేదు.. మీరు మా అధికారి కదా!" అనేవాడు శివప్రసాద్.

"అయ్యగారు ఎప్పుడొచ్చినా మీరే భోజనాలు ఏర్పాటు చేయాలి" అటెండరు చెప్పాడు.

శివప్రసాద్ కి ఎంఈఓ అప్పల్నాయుడి సంగతి బాగా తెలుసు. 'తను కేరేజి తీసుకుని వెళ్ళడు. అతనికోసం స్పెషలుగా కేరేజి తీసుకుని వెళ్ళాలి కాబోలు...' శివప్రసాద్ లో ఆలోచనలు... అప్పల్నాయుడు శివప్రసాద్ వైపు ఆశగా చూశాడు. శివప్రసాద్ ఒక వెర్రి నవ్వు నవ్వాడు.
ఆ తర్వాత నెమ్మదిగా... సార్! తమరు మా స్కూలుకి తప్పకుండా రావాలి. ఆరోజు ఎప్పుడనేది నేనే చెబుతాను..." శివప్రసాద్ చెప్పాడు.

----# # # # # -----


ఆ రోజు రానే వచ్చింది.

అప్పల్నాయుడు అటెండర్ తో కలిసి శివప్రసాద్ స్కూలుకి బయలుదేరాడు. పిల్లల్ని ప్రశ్నలు అడగడం... పాటశాల రికార్డులు పరిశీలించడం చకచకా జరిగిపోయాయి. గుమగుమ లాడుతున్న మసాల వాసన ముక్కు పుటాలను తాకింది. అప్పల్నాయుడు ఆశగా తలతిప్పాడు. ఎవరో కుర్రవాడు పెద్ద స్టీలుకేరేజీని పక్క గదిలో పెట్టాడు. మరో పావుగంట తర్వాత ఇద్దరు గ్రామస్తులు చేత్తో గిన్నెలు, విస్తరాకులు ఇతర సామాన్లు తీసుకుని వచ్చి పక్కగదిలో సర్దారు. శివప్రసాద్ భోజన ఏర్పాట్లకు అప్పల్నాయుడి నోట్లో జల ఊరింది. ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాడని... సీనియరు ఉపాధ్యాయుడైనందున మర్యాద బాగా తెలిసిన వాడని అనుకున్నాడు. బడిగంట కొట్టారు.
భోజనాల కోసం పిల్లలు పరుగులు తీశారు, శివప్రసాద్ ఇద్దరు పిల్లల్ని పక్కగదిలోకి పంపించి భోజనం ఏర్పాట్లు చూడమని పురమాయించాడు. తాను కూడా వెళ్లి టేబుల్ పై అన్నీ సర్ది ఎంఈఓ ని పిలిచాడు. విందు భోజనం మొదలైంది. నలుగురు మనుషులకు సరిపడా కోడిమాంసం స్టీలు బక్కెట్టులో నిండుగా ఉంది. ఇతర పదార్ధాలు కూడా సర్ది ఉంచారు. శివప్రసాద్ కోరికోరి వడ్డించాడు.

"మాష్టారూ! మీరు తినలేదు" అప్పల్నాయుడు మర్యాద కోసం అడిగాడు.

"ఈరోజు ఉపవాసం... ఏమీ తినను..."

"మా కోసం ఇన్ని ఏర్పాట్లు చేశారా!"

"పర్వాలేదు సార్! ఏదో నాతృప్తి..."

సంతృప్తిగా భోజనాలు ముగిసాయి. అప్పల్నాయుడు ఆఫీసుకి బయలుదేరాడు. శివప్రసాద్ ఉత్సాహంగా వీడ్కోలు పలికాడు. ఊరిచివర మట్టిరోడ్డు దాటుతుండగా ఒక వ్యక్తి ఉరుకులు పరుగులతో వచ్చి అప్పల్నాయుడి స్కూటర్ని అడ్డగించాడు. ఆ వ్యక్తి గోచి కట్టుకుని ఉన్నాడు
కల్లుగీసే సామాగ్రి అతని చేతిలో ఉంది. స్కూటరుని ఆపి ఆశ్చర్యపోతూ... "ఏం!" అంటూ అప్పల్నాయుడు ప్రశ్నించాడు.

"దండాలు బాబూ! మీలాంటి పెద్దోళ్లు మా ఊరు వచ్చారు. భోజనాలు చేశారు. మా జీవుడు శాంతిస్తాడు..." అన్నాడు.

" జీవుడు ఎవరు... సంతోషం ఏమిటి!" అప్పల్నాయుడు ఆశ్చర్యంగా అడిగాడు.

" మా అయ్య తాటిచెట్టు మీంచి జారిపడి సచ్చిపోయాడు. ఈ రోజు దినవారం... భోజనాలు పెట్టాం... మీలాంటి పెద్దోళ్లు వస్తారని మా మేష్టారు గారు మాంసం కూర పంపించమన్నారు.

ఆఫీసరుబాబులు మా లాంటి పేదోళ్ల సావు భోజనాలు తినడం మా అదృష్టం... గాల్లో కలిసిపోయిన మా అయ్య ఆత్మ శాంతిస్తుంది"
... గీత కార్మికుని మాటలు వింటుంటే అప్పల్నాయుడికి కడుపులో దేవేసినట్లయింది. బళ్ళున వాంతి చేసుకోవాలన్నట్లు... కిందపడి దొర్లాలనిపించినట్లు అయింది. కడుపులో కదలికలు మొదలయ్యాయి. మనసులో రకరకాల ఫీలింగులు కలిగాయి.

----# # # # # -----


"రేపట్నించి మధ్యాహ్నం పూట భోజనానికి కేరేజీ సర్ధు... ఆఫీసుకి తీసుకుని వెళతాను..." అప్పల్నాయుడు ఆరోజు రాత్రి భార్యతో చెప్పాడు.
ఎందుకో... ఏమిటో తెలియకపోయినా... "అలాగే" అంది తాయారమ్మ.

మరిన్ని కథలు

Kokku pandi
కొక్కుపంది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి
Chaitanya sravanthi
చైతవ్య స్రవంతి
- బి.రాజ్యలక్ష్మి
Kurukshetra sangramam.3
కురుక్షేత్ర సంగ్రామం.3.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.2
కురుక్షేత్ర సంగ్రామం.2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.1
కురుక్షేత్ర ససంగ్రామం.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు