జ్ఞాపకాల సాక్షిగా - శిరీషా చింతా

jnaapakaala saakshigaa

"నాన్నా.. ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉండి ఉంటారు కదూ.

మీరు నన్ను క్షమించాలి నాన్నా.. మీరెంత ధైర్యం చెప్పినా రామ్ లేని ఈ లోకంలో బ్రతకడం నా వల్ల కావట్లేదు.

ఎంత మర్చిపోదామనుకున్నా, నా చుట్టూ ఉన్న ప్రతీదీ నాకు రామ్ లేడన్న నిజాన్నే గుర్తు చేస్తుంది.

ఇదివరకట్లా చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపించట్లేదు.

సినిమాలు చూసి రిలాక్స్ అయ్యే అలవాటు ఇప్పుడు లేదు తెలుసా? రామ్‌తో సినిమాలు చూసిన క్షణాలే గుర్తొస్తున్నాయి. చిన్నపిల్లల్ని చూస్తే ఇదివరకటి సంతోషం లేదు. పిల్లల కోసం మేము కన్న కలలే గుర్తొస్తున్నాయి.

అందుకే, ఇక ఇలా జీవచ్చవంలా బ్రతకలేక ఈ నిర్ణయం తీసుకున్నాను.

మీరు ఈ ఈ-మెయిల్ చదివేసరికి బహుశా నేను ఉండకపోవచ్చు.

కానీ, నేనెందుకిలా చేశానో మీకు చెప్పి వెళ్ళడం నా కనీస బాధ్యత కదా.

రాత్రంతా నిద్రపోలేదు నాన్నా.. తల పగిలిపోతుంది. ఈ నరకం నుంచి త్వరగా రామ్ దగ్గరకి వెళ్ళిపోవాలని ఉంది. గుర్తుందా నాన్నా?
మూడు సంవత్సరాల తర్వాత అమెరికా నుండి ఇండియా వచ్చామన్న మా ఆనందాన్ని ఇంకా ఇల్లు కూడా చేరకముందే యాక్సిడెంట్ మింగేసి ఈరోజుకి సరిగ్గా సంవత్సరమయింది. ఇక నా వల్ల కావట్లేదు నాన్నా..

అక్కడ ఉండలేక మళ్ళీ యు.ఎస్. వచ్చేస్తూ మీకు మాట ఇచ్చాను ధైర్యంగా ఉంటానని. కానీ, మాట తప్పుతున్నాను. క్షమించండి. అమ్మని మీరే ఓదార్చాలి.

మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే కూతురిగా పుట్టాలని ఆశిస్తూ.. మీ మహతి."

****

హైదరాబాద్. సమయం రాత్రి పదకొండు దాటింది.

రాఘవరావు గారికి ఎంతకీ నిద్రపట్టకపోవడంతో హాల్లో పచార్లు చేస్తున్నారు.

"ఇక లాభం లేదు. ఏదైనా సినిమా చూడాలి." అనుకుని కంప్యూటర్ ఆన్ చేసారు.

ఆయనకీ, ఆయన ఒక్కగానొక్క కూతురు మహతికీ మంచి సినిమాలే మనసుకి మందు.

"మహతి ఏం చేస్తోందో? ఆఫీస్‌లో ఉండి ఉంటుంది." అనుకుంటూ ఉండగా, మహతి నుంచే ఈ-మెయిల్ రావడంతో ఆయన మొహంలో చిరునవ్వు విరిసింది.

అది మాయం అవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు.

దిగ్గున లేచి, " ఏం చెయ్యాలి?" అనుకుంటూ కంగారుగా అటూ, ఇటూ తిరగసాగారు.

"ఫోన్ చేద్దాం. ఇప్పుడేగా మెయిల్ వచ్చింది." అనుకున్న ఆయనకి నిరాశే ఎదురయ్యింది.

మహతి మొబైల్ ఆఫ్ చేసి ఉంది. లాండ్ లైన్ ఎంతకీ లిఫ్ట్ చెయ్యలేదు.

ఆయనకి కంగారు ఎక్కువయ్యింది. కుర్చీలో కూలబడిపోయారు. కళ్ళ వెంబడి నీళ్లు ధారల్లా కారిపోతున్నాయి.

"ఎలా కాపాడుకోవాలి నా బంగారు తల్లిని?"

"మహతి ఫ్రెండ్ గీతకి ఫోన్ చేస్తే?"

ఇక ఆలస్యం చేయలేదు ఆయన. వణుకుతున్న చేతులతో నంబర్ డయల్ చేసారు. ఆఫీస్‌లో ఉందేమో, మూడు సార్లు ప్రయత్నించినా గీత లిఫ్ట్ చెయ్యలేదు.

ఆయనకి కంగారు మరింత పెరిగింది.

భార్యని లేపుదామని వెళ్ళబోతూ,

"అమ్మో వద్దు.. ఈ విషయం విని జానకి తట్టుకోలేదు. తనకి ఏదన్నా అయితే ఇద్దరినీ కాపాడుకునే సమయం నాకు ఉండదు."

ఏం చెయ్యాలో పాలుపోక మహత్ లాండ్ లైన్‌కి ఫోన్ చేసి వాయిస్ మెయిల్ ఇవ్వసాగారు.

"మహతీ.. ఆగమ్మా! నువ్వు లేకుండా అమ్మా, నేనూ ఉండగలమా తల్లీ?" ఆయన గొంతు పూడుకుపోయింది.

"మహతీ.. రామ్ ఈ నిర్ణయాన్ని హర్షిస్తాడా? నీకు తెలీదా అతని మనసు? తను ఈ లోకంలో ఉన్నా, లేకున్నా తన ప్రేమ మారదు కదా!
అతని ఆత్మశాంతి కోసమైనా ఆగు తల్లీ.."

ఆయనకి క్రమేణా ఆశ క్షీణించడం మొదలుపెట్టింది.

అయినా, వణుకుతున్న గొంతుతో మాట్లాడుతూనే ఉన్నారు.

"నీ చుట్టూ ఉన్న ప్రతీదీ నీకు రామ్ లేడన్న విషయాన్ని గుర్తుచేయడం లేదురా.. రామ్‌ని గుర్తుచేస్తున్నాయి.

జ్ఞాపకాలు కూడా ఆనందాన్నిచ్చేవే మహతీ. మనిషి ఒంటరితనాన్ని తీర్చగల మహత్తు వాటికుంది.

గత కొన్నేళ్ళుగా నా ఒంటరితనాన్ని తీరుస్తున్నవి జ్ఞాపకాలే మహతీ.. నీ జ్ఞాపకాలు.

నువ్వు పుట్టినప్పటినుంచీ నాకు వేరే ప్రపంచమే లేదు. నువ్వూ, నేనూ ఫ్రెండ్స్ అని నువ్వు నీ ఫ్రెండ్స్‌కి గొప్పగా చెప్పినప్పుడల్లా నేనెంత పొంగిపోయేవాడినో తెలుసా?”

నీళ్లు నిండిన ఆయన కళ్లలో ఒక మెరుపు మెరిసి మాయమయింది.

"రామ్‌ని ప్రేమించానని నువ్వు చెప్పినప్పుడు నేను చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించలేదు, రామ్ ఎలాంటి వాడో, నిన్నెలా చూసుకుంటాడో అనే ఆలోచించాను. రామ్‌ని కలిసాక నా భయాలన్నీ పటాపంచలైపోయాయి. నీ ఎంపిక చూసి గర్వం కలిగింది.

రామ్ నాయనమ్మగారి అనారోగ్యం కారణంగా ఇలా చదువు అవ్వగానే అలా నీ పెళ్లి అయిపోయి, నువ్వు అమెరికా వెళ్లిపోయినప్పుడు నన్నెంత ఒంటరితనం ఆవహించిందో తెలుసా?

సినిమాలు చూడడం తగ్గించేసాను. హాస్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది."

ఒక్క క్షణం ఆయన్ని నిశ్శబ్దం ఆవరించింది.

"నువ్వు బెంగ పడకూడదని నేను బయటపడలేదు. నువ్వు సంతోషంగా ఉన్నావు, అదే చాలు అనుకున్నాను. కానీ, నాలో మెల్లగా మార్పు వచ్చింది.

నా బాధ గురించి నీకు తెలియనంతమాత్రాన నేను అలాగే బెంగపడుతూ ఉండిపోకూడదు.

నీ మనసు నాకు తెలీదా? నేను ఒంటరితనం అనుభవిస్తున్నానని తెలిస్తే అది నిన్నెంత బాధిస్తుందో నాకు తెలుసుగా.

అందుకే నీకోసం మళ్లీ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాను.

అది ఒక్కరోజులో నెరవేరలేదు. మెల్లగా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

మనిద్దరం చూసిన పాతసినిమాల జ్ఞాపకాలు, ఏదయినా జోక్ చెప్పుకుని పగలబడి నవ్వుకుని మీ అమ్మని ఏడిపించిన జ్ఞాపకాలు.. ఇవన్నీ నాకు ఒంటరితనాన్నివ్వలేదు మహతీ! స్వాంతననిచ్చాయి. సంతోషాన్నిచ్చాయి.

రామ్ జ్ఞాపకాలు కూడా నీకు అలానే స్వాంతననిస్తాయి మహతీ..

తనకోసమయినా ఆగు తల్లీ.. ప్లీజ్.."

రాఘవరావుగారు దుఃఖం ఆపుకోలేక ఫోన్ కట్ చేశారు.

****

తన ఫ్లాట్‌లో ఒకమూల కూలబడి, మూతపడిపోతున్న రెప్పల్ని అతికష్టం మీద ఆపుతూ వింటున్న మహతికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.

తన ప్రపంచంలో తను పడిపోయి, తనే ప్రపంచంగా బ్రతికే తండ్రిని బాధపెట్టినా కూడా.. తన ఆనందం కోసమే ఆయన తిరిగి ఆనందంగా ఉండడం నేర్చుకున్నాడన్న నిజం ఆ కూతురికి పశ్చాత్తాపం కలిగించింది.

తన జ్ఞాపకాలే నేస్తంగా బ్రతుకుతున్న తండ్రి ప్రేమ, ఆమెకి ప్రేమ అంటే ఏమిటో తెలియజేసింది.

"రామ్ మీద ప్రేమ ఉంటే నేను చావకూడదు. బ్రతకాలి. అవును. రామ్ జ్ఞాపకాల సాక్షిగా అమ్మానాన్నల కోసం బ్రతకాలి." బ్రతకాలన్న కోరిక ఇచ్చిన బలంతో ఫోన్ దగ్గరకి చేరుకుని తండ్రికి డయల్ చేసింది.

గోడకి జారబడి, స్థాణువులా పడి ఉన్న రాఘవరావుగారు ఫోన్లో కూతురి నంబర్ చూడగానే నమ్మలేనట్టుగా చూస్తూ, ఒక్కసారిగా వచ్చిన ఆనందంతో లిఫ్ట్ చేసారు.

"మహతీ.. ఎలా ఉన్నావమ్మా?"

ఏడుపూ, నవ్వూ కలగలిసిన తండ్రి గొంతు వినగానే వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి,

"అయాం సారీ నాన్నా.." అతి కష్టం మీద చెప్పింది మహతి.

"మహతీ.. యాంబులెన్స్‌కి ఫోన్ చెయ్యరా.. ఇది కరెక్ట్ కాదు. దేవుడా.. నా బంగారు తల్లిని కాపాడు!"

"నాన్నా.. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. క్షమిస్తారు కదూ?"

"అవేం మాటలురా? యాంబులెన్స్‌కి ఫోన్ చెయ్యమ్మా!"

"ఇప్పుడే చేస్తాను నాన్నా.. మీరు భయపడకండి. నాకు నమ్మకం ఉంది, నేను బ్రతుకుతాను!"

****

మరిన్ని కథలు

Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు